17 Feb 2012

మొక్కలూ మాట్లాడుకుంటాయి!


మొక్కలూ మాట్లాడుకుంటాయి!

మొక్కలలో స్పందనలు ఉంటాయని చాలాకాలం క్రితమే 'జగదీశ్‌ చంద్రబోస్‌' ప్రపంచానికి చూపించాడు. ప్రస్తుతం మొక్కలు పరస్పరం సంభాషించుకుంటాయని నిరూపించడమే కాకుండా, వాటిని ఏకంగా కెమెరాలో బంధించారు బ్రిటిష్‌ శాస్త్ర వేత్తలు. కాబేజి మొక్కలతో అధ్యయనం చేస్తూ, ఒక మొక్క ఆకును కత్తిరించిన వెంటనే, రాబోయే ప్రమాదం గురించి ఆ మొక్క తోటి మొక్కలను హెచ్చరించడాన్ని గుర్తిం చారు. ఈ అధ్యయనంలో కాబేజి మొక్క జన్యువులను మార్పు చేశారు. ఆకును తుంచినపుడు అందులో నుండి ఒక రకమైన వాయువు విడుదలవుతుంది. ఈ వాయువును కెమెరాతో చిత్రీకరించేందుకు వీలుగా వారు మిణుగురు పురుగుల కాంతికి కారణమైన 'లూసిఫరేజ్‌' అనే ఒక ఎంజైమ్‌ను ఉత్పత్తిజేసే డిఎన్‌ఏను మొక్క డిఎన్‌ఏలో ఇమిడ్చారు. ఆకును కత్తిరించిన వెంటనే మిథైల్‌ జాస్మోనేట్‌ అనే వాయువు విడుదలై, పక్క మొక్కలకి హెచ్చరికను జారీ చేసింది. వెంటనే తోటిమొక్కలు విషపూరితమైన రసాయనా లను తమ ఆకులపైకి పంపించాయి. ఇదంతా సహజ వాతా వరణంలో గొంగళి పురుగులు, ఇతర కీటకాలు ఆకులను తినేయ కుండా నిరోధించడానికి ఉపయోగపడుతుందని శాస్త్రజ్ఞులు భావిస్తున్నారు. ఇంతకాలం మొక్కలలో అసలు జీవం లేనట్టే మనం వ్యవహరించేవాళ్ళం. ఇకపై వాటికీ ప్రత్యేక భాషా, అనుభూతులూ.. వగైరాలు ఉంటాయని ఇపుడు అర్థంచేసుకోవాల్సి వస్తుంది. అయితే, మొక్కలలో (ఆ మాటకొస్తే అన్ని జీవులలో) సహజంగా పోటీతత్త్వం ఉంటుంది. అటువంటి పరిస్థితులలో మొక్కలు తోటి వాటికి ఎందుకు సహాయం చేస్తాయో తెలుసుకోవాల్సి ఉంది. మనకీ అటువంటి మంచి గుణం ఉంటే బావుండు కదూ!

No comments: