12 Feb 2012

ఓజోన్‌ పొర అని దేనినంటారు? అది నాశనమయితే ఏమవుతుంది?

ఓజోన్‌ పొర అని దేనినంటారు? అది నాశనమయితే ఏమవుతుంది?

ప్రొ|| ఎ. రామచంద్రయ్య
శాస్త్ర ప్రచార విభాగం
జన విజ్ఞాన వేదిక

ఓజోన్‌ పొర అని దేనినంటారు?
ఓజోన్‌ పొరకు రంధ్రాలు పడడం అంటే ఏమిటి?
ఏ కారణాల వల్ల ఓజోన్‌ పొరకు రంధ్రాలు పడతాయి?
ఓజోన్‌పొర నాశనమయితే ఏం జరుగుతుంది?

- ఆర్‌. మమత, కె.శ్రీనివాస్‌, ఎ.నర్సయ్య, జిల్లా పరిషత్‌ సెకండరీ పాఠశాల, అజరునగర్‌, భూపాలపల్లి, వరంగల్‌జిల్లా.
వాతావరణ శాస్త్ర అధ్యయనం ప్రకారం భూ వాతావరణాన్ని ఐదు ప్రధాన పొరలుగా విభజిస్తారు. నేల నుంచి సుమారు 20 కి.మీ. వరకు విస్తరించిన పొరను 'ట్రోపోస్ఫియర్‌' అంటాము. ట్రోపోస్ఫియర్‌ పైభాగాన సుమారు 30 కి.మీ. మందాన అంటే నేల నుంచి సుమారు 50 కి.మీ. ఎత్తు వరకు ఉన్న పొరను 'స్ట్రాటోస్ఫియర్‌' అంటారు. మనం మాట్లాడుకుంటున్న ఓజోన్‌ పొర ఉండేదీ ఇక్కడే! ఆ తర్వాత 35 కి.మీ. మందాన అంటే భూమి నుంచి సుమారు 85 కి.మీ. వరకు విస్తరించి ఉన్న వాతావరణ పొరను 'మీసోస్ఫియర్‌' అంటారు. మీసోస్ఫియర్‌కు పైభాగాన సుమారు 600 కి.మీ. మందాన అంటే నేల నుంచి సుమారు 700 కి.మీ. వరకూ విస్తరించి ఉన్న పొరను 'థóర్మోస్ఫియర్‌' అంటాము. ఆ పైభాగాన దాదాపు 10 వేల కి.మీ. వరకూ విస్తరించిన వాతావరణ భాగాన్ని 'ఎక్సోస్ఫియర్‌' అంటాము. ఇక ఆ పైభాగాన ఉన్నదంతా 'అంతరిక్షం' (space).

స్ట్రాటోస్ఫియర్‌ పొరలో గాలిలోని ఆక్సిజన్‌(O2) అణువులు ఓజోన్‌(O3) అణువులుగా మారుతుంటాయి. అయితే ఆక్సిజన్‌ అణువులు ఓజోన్‌ అణువులుగా మారాలంటే అతి నీలలోహిత కిరణాలు(ultraviolet rays) కావాలి. సూర్యకాంతిలో దృశ్యకాంతి (visible light)తో పాటు ఎంతో తీవ్రతతో అతినీలలోహిత కాంతి, పరారుణ కాంతి(infrared light) కూడా కలిసి ఉంటుంది. అయితే అందులో అతి నీలలోహిత కాంతి బాగా శక్తివంతమైంది. కాబట్టి జీవజాతులకు ప్రమాదకరమైంది కూడా. అలాంటి ప్రమాదకర అతినీలలోహిత కాంతిని ఆక్సిజన్‌ అణువులు శోషించుకోవడం ద్వారా ఓజోన్‌ అణువులుగా మారతాయి. అంటే ఓజోన్‌ ఏర్పడ్డం వల్ల అతినీలలోహిత కాంతి భూమి వైపు చేరే మోతాదు గణనీయంగా తగ్గిపోతుంది. అదే సమయంలో ఓజోన్‌ కూడా తిరిగి ఆక్సిజన్‌గా వియోగం చెందుతుంది. అందుకోసం కూడా తన ఉద్దీపన (activation)కొరకై అతి నీలలోహిత కాంతి అవసరం; అంటే ఓజోన్‌ తయారీలోలాగానే దాని విఘటనం (dissociation) లో కూడా అతి నీలలోహిత కాంతి ఖర్చవుతుంది. అంటే సూర్యుని కాంతిలోని ప్రమాదకర అతినీలలోహిత కాంతిని ఓజోన్‌ తన ఉత్పత్తి ప్రక్రియలోనూ, తన విఘటన ప్రక్రియలోనూ ఉపయోగించుకుంటోందన్నమాట. మరో మాటలో చెప్పాలంటే ఓజోన్‌ ఉనికి భూమి మీద ఉన్న జీవ జాలానికి డాలు (shield) లేదా కవచంలాగా ఉపయోగపడ్తుంది.

అయితే ఓజోన్‌ తయారీకన్నా నికర విఘటన వేగం తక్కువ ఉండడం వల్ల ఎప్పుడూ కొంత ఓజోన్‌ స్ట్రాటోస్ఫియర్‌లో ఉంటుంది. అంటే అధిక మోతాదులో అతినీలలోహిత కాంతి సూర్యుని నుంచి వచ్చినా బఫర్‌లాగా అది అదనపు సాయం చేస్తుందన్నమాట. అటువంటి ఓజోన్‌ పొరను గతిక ఓజోన్‌పొర (dynamic ozone layer) ) అంటారు. దీన్ని మనం డాబా మీదున్న నీళ్ళట్యాంకు ద్వారా పోల్చుకుందాం. ఉదాహరణకు నీళ్లట్యాంకులోకి కొంచెం బావి నుంచి నీటిని పంపు చేశామనుకుందాం. ట్యాంకు నిండకముందే బాత్‌రూముల్లో నూ, వంటగదుల్లోనూ నీళ్లను వాడడం ప్రారంభించామనుకొందాము. నీళ్లను వాడే వేగం, నీళ్లను పైకి పంపే వేగం ఒక్కటే అయితే ట్యాంకులో నీటి మట్టం మారకుండా ఉంటుంది. కానీ అవి స్థిరంగా ఉన్న నీళ్లు కాదు. గతిలో ఉన్న నీళ్లు. అంటే నీళ్లు వస్తున్నాయి, వచ్చినవి, వెళుతున్నాయి, కొన్ని నిలిచే ఉంటున్నాయి. ఈ విధంగా పాత ఓజోన్‌ పోతుంటే కొత్త ఓజోన్‌ ఏర్పడుతూ ఉంటుంది. ఎల్లప్పుడూ కొంత ఓజోన్‌ ఉంటుంది. దీన్నే మనం ఓజోన్‌పొర అంటాము. ఈ ఓజోన్‌ పొర తనకున్న సహజ మందాన్ని ఏదైనా కారణం వల్ల పోగొట్టుకొన్నా, లేదా పూర్తిగా వినాశనం చెందినా ఓజోన్‌ పొరకు చిల్లు (hole) ఏర్పడింది అంటాము.

అంతేగానీ ఓజోన్‌ పొరకు చిల్లుపడడం అంటే బట్టల్ని ఎలుకలు కొట్టడం ద్వారా చిల్లుపడ్డట్టుగానూ, రేకులో మేకు దించితే ఏర్పడే చిల్లులాగానూ ఊహించుకోకూడదు. ఓజోన్‌ తరిగిపోయే క్రమంలో ఏర్పడేది ఆక్సిజన్‌(O2) అణువులు, ఆక్సిజన్‌ నవజాత(O) పరమాణువులు. ఇవి తిరిగి ఓజోన్‌గా మారగలవు. అయితే ఓజోన్‌ విఘటనం ఈ విధంగా కాకుండా ఇతర మార్గాల్లో ధ్వంసం అయితే O2 అణువులు, O పరమాణువులు ఏర్పడవు. అంటే వరి పంట వేశాముకానీ గింజలు రాలేదనుకోండి. అపుడు తర్వాత పంటకు ధాన్యం ఉండదు కదా! అలాగే ఓజోన్‌ను ఇతర మార్గాల ద్వారా ఖర్చుచేస్తే తిరిగి అది ఓజోన్‌గా మారే దారుల్ని మూసేసినట్టే! ఆ ఇతర మార్గాలే ఇప్పుడు మనల్ని, ప్రపంచ వాతావరణ శ్రేయోభిలాషుల్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి. మనం మితిమీరిన స్థాయిలో ఇంధనాల్ని వాడడం వల్ల నత్రజని ఆక్సైడ్‌లు వాతావరణంలో పేరుకుపోతాయి. మితిమీరిన మోతాదులో ఎయిర్‌కండిషనర్లు, రిఫ్రిజిరేటర్లు వాడితే అందులో ఉపయోగించే ఫ్రి˜యాన్‌ వంటి ఫ్లోరీన్‌ సంబంధిత వాయువుల పరిమాణం గాలిలో ఎక్కువ అవుతుంది.

టైర్లు, రబ్బర్లు, ఇతర ఆధునిక ప్లాస్టిక్కుల వాడడం వల్లనూ, వాటిని కాల్చినపుడు క్లోరీన్‌ సంబంధిత సేంద్రియ పదార్థాలు వాతావరణంలో పెరుగుతాయి. ఇలా నత్రజని, సల్ఫర్‌ ఆక్సైడ్‌లు, క్లోరోఫ్లోరో కార్బన్‌ పదార్థాలు ఎక్కువయితే వాతావరణంలో మునుపెన్నడూ జరగని విధంగా రసాయనిక చర్యలు జరుగుతాయి. అందులో ప్రధానమైనవి స్వేచ్ఛా ప్రాతిపదికలు(free radicals) అనబడే రసాయనిక శకలాలు. వీటిలో ఒంటరి ఎలక్ట్రాన్లు ఉండడం వల్ల చాలా తీవ్రమైన రసాయనిక క్రియాశీలత (chemical reactivity) తో ఉంటాయి. పైగా వీటికి అయ స్కాంతతత్వం ఉంటుంది. భూమి ధృవాల దగ్గర ఎక్కువ అయస్కాంత క్షేత్రం ఉండడం వల్ల కాలంగడిచే కొద్దీ అవి అక్కడికి వెళ్లి తిష్టవేస్తాయి. వీటికి ఓజోన్‌తో చర్య జరిపే లక్షణం ఉంది. అంటే కూసే గాడిదలు మేసే గాడిదల్ని చెడగొట్టినట్లు తన మానాన తాను ఆక్సిజన్నుంచి ఏర్పడుతూ, మళ్లీ ఆక్సిజన్‌ను ఇస్తూ ఉన్న ఓజోన్‌ మీద ఈ అవాంఛనీయ కాలుష్య పదార్థాలు పక్కదారి పట్టి స్తాయి. దీంతో ఇక బయటపడని పరిస్థితి వస్తుంది. అంటే ఓజోన్‌ పొర పలచనవుతుంది. ఇక అతి నీలలోహిత కాంతి సరాసరి భూమిని చేరడం వల్ల విపత్తులు సంభవిస్తాయి.
అతి నీలలోహిత కాంతి వల్ల పంటలు దెబ్బతింటాయి.

చర్మవ్యాధులు, చర్మకాన్సర్‌ వస్తుంది. వాతావరణం వేడెక్కు తుంది. ధృవప్రాంతాల (polar regions) లో ఓజోన్‌పొర బాగా పలుచబడడం వల్ల సూర్యకాంతి అంతకుముందు కన్నా ఎక్కువ మోతాదుల్లో ధృవాల నేలను చేరుతుంది. అక్కడ అందాక తక్కువ సూర్యకాంతి చేరడం వల్ల, ఉష్ణోగ్రత తక్కువ ఉండడం వల్ల నీరు గడ్డకట్టి మంచుమైదానాల్లాగా (glaciers) గా, మంచు పర్వతాల్లా (ice bergs) గా కుదురుగా ఒకచోట నీరు ఉండడం వల్ల సముద్ర మట్టాలు సజావుగా, ప్రకృతి సిద్ధంగా, మనకు, తీర ప్రాంత జీవనానికి అనువుగా ఉన్నాయి. కానీ ధృవాల దగ్గర ఓజోన్‌ పొర సన్నగిల్లడం (దీన్నే ఓజోన్‌ పొరకు రంధ్రంగా భావిస్తాము) వల్ల సూర్యకాంతి అంతకన్నా ఎక్కువగా మంచుకొండల్ని చేరి వాటిని కరిగిస్తుంది. అంటే అంతవరకూ పైవైపునకు రాశిలాగా, కొండల్లాగా ఉన్న గడ్డనీరు కరిగి కిందికి పడుతుంది. కాబట్టి సముద్రంలో ద్రవపు నీటి ప్రమాణం పెరిగి, తీరాలు మునిగిపోతాయి. సముద్రతీర గ్రామాలు, అడవులు, జీవజాతులు జలసమాధి అవుతాయి. ఇంతటి ఆందోళనకర విపత్తులు నేడున్నాయి. ఆ పరిస్థితులు క్రమేపీ తీవ్రరూపం దాల్చనున్న తరుణంలో గత నెల 6వ తేదీ నుంచి 18వ తేదీ వరకు డెన్మార్క్‌ రాజధాని కోపెన్‌హాగెన్‌లో COP 15 (15th Conference of Partners) అనే పేరుతో శిఖరాగ్ర సమావేశాలు జరిగాయి. అందరూ ముక్తకంఠంతో అమెరికా వంటి అగ్రరాజ్యాల అరాచ కత్వాన్ని ప్రశ్నించాయి. కానీ తన పోకడలను మార్చు కోవడానికి అగ్రదేశాలు సిద్ధంగా ఉన్నట్టు లేవు.

No comments: