సమయపాలనతోనే సదవకాశాలు
మీరు ఉద్యోగ వేటలో ఉన్నారా? ఇంటర్వ్యూల్లో నెగ్గలేకపోతున్నారా? అయినా నిరాశ చెందకండి. ప్రతి ఓటమి ద్వారా గుణపాఠం నేర్చుకోండి. మళ్లీ ప్రయత్నించండి. ఆ పట్టుదలే, ఆ అన్వేషణే మిమ్మల్ని విజయం వైపు నడిపిస్తుంది. ఎలాంటి బాధ్యతలోనూ లేమని, సమయ పాలన అవసరం లేదని మీకనిపిస్తోందా? అయితే మీ ఆలోచన మార్చుకోవాల్సిందే. ఉద్యోగులైనా, ఉద్యోగార్థులైనా ఎంతో విలువైన సమయాన్ని పాటించాల్సిందే. లేకపోతే వెనుకబడతారు. మరొకరు ముందుకు దూసుకెళ్తారు. అందుకే ఎప్పుడూ ముందువరుసలో ఉండడానికి ప్రయత్నించాలి. లేకపోతే చాలా నష్టపోతారు. మీరు ప్రముఖ సంస్థలో ఇంటర్వ్యూకు వెళ్లాల్సివుంటే... సమయంలోగా వెళ్లకపోతే ఆ అవకాశం మిస్సవుతుంది. వేరొకరి సొంతమౌతుంది. ఇంటర్వ్యూకే ఆలస్యంగా వచ్చిన వారు. ఇక ఉద్యోగంలో క్రమశిక్షణగా ఏం మెలుగుతారనే నెగెటివ్ ఫీలింగ్ కూడా మిమ్మల్ని ఇంటర్వ్యూచేసే వారికి కలిగే అవకాశం లేకపోలేదు. అందుకే కచ్చితమైన సమయాన్ని పాటించండి.
ఈరోజుల్లో విస్తృత పరిచయాలూ, నెట్‌వర్కూ లేకపోయినా నష్టమే. మారిన పరిస్థితుల్లో, బిజీలైఫ్‌లో ఒకరి గురించి ఇంకొకరు ప్రత్యేకించి తెలుసుకునేందుకు ఎవరూ ఆసక్తి కనబర్చట్లేదు. అందుకు మీ గురించి మీరే చెప్పుకోవాలి. మీ ప్రయత్నం మీరే చేయాలి. ముందు మిమ్మల్ని మీరు సరిదిద్దుకోండి. ఫోన్‌కాల్, ఇ మెయిల్, మార్నింగ్‌వాక్, వీకెండ్స్ ఇలా ఏ విధంగానైనా మీ పరిచయాలు పెంచుకోండి. ఎవరివల్ల ఏ ప్రయోజనమైనా చేకూరొచ్చు. కొందరి రిఫరెన్సువల్ల మంచి అవకాశం దొరకొచ్చు. పరిచయస్తుల ద్వారా ఎక్కడెక్కడ ఎలాంటి అవకాశాలున్నాయో సమాచారం లభించవచ్చు. వారే ఏదైనా ఉద్యోగ అవకాశం ఇచ్చే స్థితిలో ఉండొచ్చు. ఇలా ఏ ఒక్క అవకాశం సద్వినియోగం చేసుకోవాలన్నా మీక్కావలసింది పరిచయాలూ, నెట్‌వర్కూ. అందుకే మీరెప్పుడూ నలుగురి దృష్టిలో పడాలి. నలుగురి దృష్టిని ఆకర్షించాలి. అదో సదవకాశానికి దారి తీస్తుంది.
మీరు ఓ సంస్థలో ఉద్యోగానికి ప్రయత్నిస్తారు. ఇంటర్వ్యూకు రమ్మంటే పోతారు. సరే మీ బయోడేటా ఇవ్వండనో, లేకపోతే సర్టిఫికెట్స్ జిరాక్సు ఇవ్వండనో ఆఫీసర్ అడిగితే మీరేం చేస్తారు? అయ్యో... ప్రస్తుతం తీసుకు రాలేదనో, ఇంట్లో ఉన్నాయనో, తర్వాత ఇస్తామనో చెప్తారా? అలా అయితే అంది వచ్చిన అవకాశం చేజారొచ్చు. మరుసటి రోజు మీ రెజ్యూమ్ వచ్చేవరకూ ఆ అవకాశం మరొకరు కొట్టేయొచ్చు. అప్పుడు 'ఛ బ్యాడ్ లక్' అని తలపట్టుకునే కంటే.... ముందే సరైన జాగ్రత్తలు తీసుకుంటే... ఇలాంటి ఇబ్బందులేవీ ఉండవు.
ఎలాగూ ఉద్యోగాన్వేషణలో ఉంటారు కదా! అందుకే ఏ సంస్థకెళ్లినా, ఏ కంపెనీకెళ్లినా, ఏ ఆఫీసుకెళ్లినా మీ వెంట ఓ ఫైల్ తీస్కెళ్లండి. అందులో మీ సర్టిఫికెట్లూ, (ఒరిజినల్, జిరాక్స్), బయోడేటా, రెజ్యూమ్, ఇతర అర్హతా పత్రాలు పెట్టుకోవడం మర్చిపోకండి. ఏదైనా అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రావచ్చు. వారు వెంటనే వివరాలు అడగొచ్చు. దగ్గరే ఉంటాయి కాబట్టి మీ బయోడేటా వివరాలు వెంటనే సమర్పించవచ్చు. అందుకే సిద్ధంగా ఉండండి.
వారంరోజుల క్రితం దరఖాస్తు చేశాను. ఇంతవరకూ ఏ విషయమూ తెల్పలేదు. ఇంతకీ ఉద్యోగమిస్తారో లేదో అని గొణుక్కుంటే లాభం లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అసలే పోటాపోటీ. అందుకోసం మీరే చొరవ చూపండి. ఏ పత్రికలోనో, నెట్‌లోనో ప్రకటన చూసి దరఖాస్తు చేసుకుంటే సరిపోదు. ఆ తర్వాత ఫాలోఅప్ కూడా ఉండాలి. దరఖాస్తుకు సమాధానం తెలియజేయండని సంబంధిత సంస్థను సంప్రదించండి. లేకపోతే ఫోన్ చేసి కనుక్కోండి. ఈ మెయిల్ ద్వారా అడగండి. ఏదో ఒకటి తెల్సుకుంటే మరో ప్రయత్నానికి ఉపక్రమించవచ్చు.
ఏదైనా సాధించాలనుకున్నప్పుడు అందుకు తగిన నైపుణ్యమూ, అర్హతా మీలో ఉందో లేదో ఒకసారి పరిశీలించుకోండి. లేకపోతే అలవర్చుకోండి. అర్హతకు సరిపోయే ఉద్యోగానికైనా ప్రయత్నించండి. అంతేగానీ... అందని ఆకాశానికి నిచ్చెనలేసినట్లు, అందిరాని అవకాశాలకోసం సమయం వృథా చేయకండి.
ఎంతో కాలంగా ప్రయత్నించిన ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకెళ్లారు. అక్కడ మీరు సెలెక్టు కాలేదు. కానీ... మీకదే సంస్థలో, అదే ఉద్యోగం చేయాలని ఉంటుంది. ఏం చేస్తారు?! అవకాశం చేజారిపోయిందని ఏడుస్తూ కూర్చుంటారా? కృంగి కృశించి పోతారా? అలా అయితే ఇంకే ప్రయత్నంలోనూ సఫలం కాలేరు. విఫలం కావడానికి కారణమేంటో తెల్సుకోండి. పొరపాటును చక్కదిద్దుకోండి. ఓటమి ద్వారా గుణపాఠం నేర్చుకోండి. పరిస్థితులన్నీ అనుకూలంగా ఉంటే ఎవరైనా సర్దుకుపోతారు. అందులో గొప్పదనమేమీ లేదు. ప్రతికూల పరిస్థితుల్ని ఎదురీదగలిగిన వారే నిజమైన విజేతలు. అందుకే ఆటంకాల అవధులు అధిగమిస్తూ. లక్ష్యాల బాటలో కొత్తకొత్త మార్గాలు అన్వేషిస్తూ ముందుకు సాగాలి.
No comments:
Post a Comment