వేదవ్యాస్ సంఖ్యాశాస్త్రం..
-
విశ్వాసాలు.. వాస్తవాలు...95
ఇక సంఖ్యాశాస్త్రానికి సంబంధించి ఆయన తన పుస్తకం 21, 22, 23 పేజీలలో ఎంత అశాస్త్రీయ విషయం చెప్పారో ఆయన ఇచ్చిన ఉదాహరణను పరిశీలిస్తే అర్థమవుతుంది.
''ఉదా: హిట్లరు జన్మదినం 20-4-1889.
పై సంఖ్యలోనే, అంటే ఈయన పుట్టిన సంఖ్యలోని అంకెలలోనే, ఆయనకు జరగనున్న భవిష్యత్తు అంతా ఇమిడి ఉంది. అదెలాగంటే, అన్నీ కూడితే
1889 = 1+8+8+9 26 = వస్తుంది.
అంటే 26వ సంవత్సరంలో ఒక అతి ముఖ్య సంఘటన జరుగుతుందన్న సూచన. దాన్ని కూడితే 1889+26 = 1915. 1915లో మొదటి ప్రపంచయుద్ధం మొదలు.''
ఇదేమి లెక్క? పుట్టిన రోజు, నెల సంఖ్యలను పరిగణనలోకి తీసుకోకుండా సంవత్సరాన్ని మాత్రమే తీసుకొని లెక్కకట్టడం, అదేమి సంఖ్యాశాస్త్రం? పైగా సంవత్సరంలోని అంకెలు కూడి, ఆ అంకెకు 1889 కూడితే మొదటి ప్రపంచయుద్ధం మొదలును సూచిస్తుందట. అంటే 1889లో పుట్టిన లక్షలాదిమంది మొదటి ప్రపంచయుద్ధానికి సూచికలన్నమాట. వేదవ్యాస్ సంఖ్యాశాస్త్ర పరిజ్ఞానాన్ని ఇంకొంచెం ముందుకు వెళ్ళి పరిశీలిద్దాం.
''1915 లోని అంకెలను కూడితే 1+9+1+5 = 16 వస్తుంది.
1915+16 = 1931 నాజీ పార్టీ స్థాపించిన సంవత్సరం వస్తుంది.
1+9+3+1 = 14
1931+14 = 1945 హిట్లర్ మరణం.
పై లెక్కల ప్రకారం చూస్తే హిట్లరు జీవితంలోనూ, ప్రపంచ చరిత్రలోనూ అతి ముఖ్యమైన సంఘటనలు - అతను జన్మించిన 1889లోని అంకెల నుంచే ఏర్పడుతున్నాయి.''
అంటే 1889లో హిట్లరు పుట్టినపుడే 1945లో మరణిస్తాడని సంఖ్యాశాస్త్రం వివరిస్తోందని వేదవ్యాస్ మనల్ని నమ్మమంటున్నారు. 1889లో పుట్టిన వారందరూ 1945లోనే ఎందుకు మరణించలేదో?.. ఆయన, ఆయన సంఖ్యాశాస్త్రమే వివరించాలి. చాలా ఆసక్తికరమైన మరో అంశమేమంటే 1889లో పండిత జవహర్ లాల్ నెహ్రూ జన్మించారు. మరి ఆయన 'శాంతిదూత'గా ఎందుకు పేరు తెచ్చుకున్నారో?.. 1945లో ఎందుకు చనిపోలేదో?.. ఆయనే వివరించాలి.
ప్రస్తుతం ఈ సంఖ్యాశాస్త్రం ప్రజల జేబుల్ని ఎంతగా లూటీ చేస్తున్నదంటే ఈ సంఖ్యా శాస్త్రజ్ఞులు స్టార్ (నక్షత్ర) హోటళ్ళలోనే బస చేస్తున్నారు. వీరి ఆదాయం రోజుకు పదివేల రూపాయల పైచిలుకే ఉంటోంది. (వార్త 20.10.03), వీరు తెలుగు వారికి కూడా పేర్లలోని ఇంగ్లీషు అక్షరాలను మార్చుకొమ్మని సూచనలిస్తారు. తెలుగు వారిని ఇంగ్లీషు అక్షరాలు ఎలా ప్రభావితం చేస్తాయో వారే తెలియజేయాలి.
ఇదీ సంఖ్యా శాస్త్రజ్ఞుల 'శాస్త్రం' బండారం!
కె.ఎల్.కాంతారావు, జన విజ్ఞాన వేదిక.
No comments:
Post a Comment