27 Feb 2012

నేడు ఖగోళ అద్భుతం


  • 27/02/2012
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 26: ఆకాశంలో సోమవారం సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత ఒకేసారి నాలుగు గ్రహాలు ఖగోళ వీక్షకులకు కనువిందు చేయనున్నాయి. భూమినుంచి చూస్తే బృహస్పతి, చంద్రుడు ఒకదానికొకటి చాలా దగ్గరగా ఉన్నట్టు కనిపిస్తాయని ప్లానెటరీ సొసైటీ ఆఫ్ ఇండియా డైరెక్టర్ ఎన్ రఘునందన్ చెప్పారు. జ్యోతిష శాస్త్ర ప్రకారం అయితే దీన్ని బృహస్పతి చంద్రుడితో కలవడంగా చెప్తారు. అయితే ఖగోళ శాస్త్ర ప్రకారం భూమినుంచి చూసినప్పుడు ఈ రెండుగ్రహాలు ఒకదానికి మరొకటి చాలా దగ్గరగా ఉన్నట్టు కనిపిస్తాయని ఆయన చెప్పారు. సోమవారం రాత్రి పది గంటల సమయంలో ఆకాశంలో పశ్చిమ దిక్కులో బృహస్పతి గ్రహాన్ని చూడవచ్చని ఆయన చెప్పారు. భూమికి సహజ ఉప గ్రహమైన చంద్రుడికి దిగువగా పశ్చిమ దిశగా శుక్రగ్రహాన్ని కూడా చూడవచ్చని ఆయన చెప్పారు. బృహస్పతి, శుక్రుడు, నెలవంక మూడూ వరసగా ఆకాశంలో పశ్చిమ వైపున సాయంకాలపు నీరెండ వెలుగులో త్రికోణాకారంలో కనిపిస్తాయని ఆయన చెప్పారు. ఇవి మూడు చాలా ప్రకాశవంతంగా ఉంటాయి గనుక నగర విద్యుద్దీపాల వెలుగులో సైతం వీటిని చూడడానికి వీలవుతుందని ఆయన చెప్పారు. సూర్యాస్తమయం తర్వాత శనిగ్రహం కూడా ఆకాశంలో తూర్పు వైపున కనిపిస్తుందని ఆయన చెప్పారు. మార్చినెల 14న శుక్రుడు, బృహస్పతికి దగ్గరవడం సంభవిస్తుందని, అప్పుడు ఈ రెండు గ్రహాలు ఆకాశంలో జంటగా, ఒకదాని పక్కన ఒకటి కనిపిస్తాయని రఘునందన్ చెప్పారు.

No comments: