7 Feb 2012

వివేకానందుని ఆవేదన నిజం కాబోతోందా?

వివేకానందుని ఆవేదన నిజం కాబోతోందా?

  • విశ్వాసాలు.. వాస్తవాలు...73
ఇటీవల ఆర్‌.కె.పథక్‌, ఆర్‌.ఎ.రామ్‌ రచించిన 'వైదిక వ్యవసాయం'పై ఆంగ్ల పుస్తకాన్ని చదివాను. దీనిని భారత వ్యవసాయ పరిశోధనా మండలికి చెందిన 'సెంట్రల్‌ ఇనిస్టిట్యూట్‌ ఫర్‌ సబ్‌ట్రాపికల్‌ హార్టీకల్చర్‌ (సి.ఇ.ఎస్‌.హెచ్‌.)' ప్రచురించింది. దీని ద్వారా జాతీయ వనరులు వృధా అయ్యేలా వ్యవసాయంలో కొన్ని అశాస్త్రీయ అంశాలు అనుసరించమని సూచించబడింది. వీటిని పరిశీలిద్దాం.
పేరుకు ఇది 'వైదిక వ్యవసాయంపై కరదీపిక'. అయినా, నాలుగు వేదాలలో ఎక్కడా ఈ పుస్తకంలో ఉటంకించిన విషయాలు లేవు. వ్యవసాయా నికి సంబంధించిన ఈ వివరాలు వేదాలలో ఎక్కడా పేర్కొనబడలేదు. ఇక ఆ పుస్తకంలోని అశాస్త్రీయ అంశాలు: విత్తనాలు చల్లడానికీ, మొక్కలు నాటడానికీ కొన్ని దినాలు మంచివనీ, కొన్ని దినాలు చెడ్డవనీ పేర్కొనడం జరిగింది. మంచిదినాలలో నాటిన మొక్కలకు లభించే శక్తి చెడ్డదినాలలో నాటిన మొక్కలకు ఉండదని పేర్కొనబడింది (పేజి 3). ఇంకా వివరంగా 2004 జనవరిలో 1, 11, 12, 15, 20, 28 తేదీలలో విత్తనాలు చల్లాలని చెప్పబడింది (పేజి 46). అలాగే, మిగిలిన నెలలో 4, 5 రోజులు మంచిరోజులని చెప్పడం జరిగింది.

ఇది సైన్సు నిరూపించినదానికి విరుద్ధం కాదా? మెట్ట పంటల్ని వానలు పడ్డ మరుసటి రోజు రైతులు విత్తుతారు. అలా కాకుండా, పుస్తకరచయితలు పేర్కొన్న రోజులకు ముందురోజున వానలు కురియకపోయినా, విత్తనాలు నాటితే ఏమౌతుంది? విత్తనాలు మొలకెత్తవు. కొద్దిగా పదునుండి మొలకెత్తితే పైరు బతికి పెరగదు. రైతు భయంకరంగా నష్టపోతాడు. ఇక మాగాణిలో నాట్ల సీజనులో నెలకు 5, 6 రోజులే మంచివని, ఆ రోజుల్లోనే నాట్లు వేస్తే రైతులకు కూలీలు అందుబాటులో ఉంటారా? ఇది రైతులకు నష్టం కాదా? నెలలో కొన్ని (ఆరు) రోజులే పనిదొరికి, మిగిలిన రోజులలో పనిదొరకక, వ్యవసాయకూలీలు విపరీతంగా బాధపడరా?

అంతేకాదు.. 'కొన్ని మొక్కలు కొన్ని రాశులతో ముడిబడి ఉంటాయి. అవి పెద్దస్థాయిలోనూ, సూక్ష్మస్థాయిలోనూ పోషక పదార్థాలను కలిగి ఉండటాన్ని ప్రభావితం చేస్తాయి' అని కూడా వివరించబడింది (పేజి 15). దానిని వివరిస్తూ ఒక పట్టిక (పట్టిక-5) ఇవ్వడం జరిగింది. ఉదా: ఓక్‌ చెట్టు యొక్క బెరడు పులిసినందున ఏర్పడిన ఎరువుపై చంద్రుడి ప్రభావం ఉంటుందట. డాండిలియన్‌ పూవు పైభాగాన్ని పులియబెడితే, దానితో గురుగ్రహానికి సంబంధముంటుందట (పేజి 16). నిరూపించలేని ఇలాంటి అశాస్త్రీయ విషయాలు చెప్పడం ప్రజలను వక్రమార్గం పట్టించడం కాదా?
అలాగే, 27వ పేజీలో ప్రొ|| బి.సి.బీగాడ్‌ అనే ఇటలీ శాస్త్రవేత్త అప్పుడే వేసిన ఆవుపేడ మలేరియా, టి.బి.వ్యాధులను కల్గించే బాక్టీరియాను చంపు తుందని రుజువు చేశారని తెలపడం జరిగింది. ఈ విషయాన్ని పరిశీలిద్దాం.

ఆంధ్రప్రదేశ్‌లో, ఆదిలాబాద్‌ జిల్లాలో దాదాపు అన్ని తండాలలోను ఆవుల పెంపకం ప్రధానవృత్తి. అక్కడ ఇంటింటా, అప్పుడే వేసిన ఆవుపేడ కుప్పలు ఎప్పుడూ ఉంటాయి. అయినా ఆ తండాల ప్రజలు ప్రతి సంవత్సరం వందలాదిగా మలేరియా, టి.బి.లతో చచ్చిపోతున్నారు. ఎందుకని?
అలాగే, జపాన్‌లో అణు ధూళి నుండి కాపాడుకోవడానికి ఆవుపేడను వాడుతున్నారని మరో అశాస్త్రీయ అంశం చెప్పబడింది. ఇటీవల జపాన్‌లో ఫుకుషిమాలో జరిగిన అణు విద్యుత్‌ కర్మాగారాల ప్రమాదంలో వెలువడిన అణుధూళి నుండి రక్షణకు జపాన్‌లోని ఏ శాస్త్రవేత్తా ఆవుపేడను వాడమని చెప్పినట్లు ఏ సైన్స్‌ పత్రికా రాయలేదు. ఏ వార్తా పత్రికా తెలపలేదు. ఇలా ఇటాలియన్‌ శాస్త్రవేత్తల పేర్లనూ, జపాన్‌దేశంలో అమలు చేస్తున్నారనే వదంతులను, శాస్త్ర విజ్ఞానం పేరుతో ప్రచురించడం తీవ్ర గర్హనీయం. ఇలా శాస్త్ర విజ్ఞానం పేర జరిగే అశాస్త్రీయ ప్రచారాన్ని ఒకసారి పరిశీలిద్దాం.

'ఆవు నెయ్యిని బియ్యంతో తగులబెడితే ఆక్సిజన్‌ తయారౌతుంది (పేజీ 34). ఏ వస్తువునైనా, ఎప్పుడు, ఎక్కడ తగలబెట్టినా ఆక్సిజన్‌ ఖర్చై, కార్బన్‌మోనాక్సైడు, కార్బన్‌ డై ఆక్సైడ్‌లు విడుదలై, వాతావరణాన్ని కలుషితం చేస్తాయి. ఆవునెయ్యి, బియ్యం దానికి మినహాయింపులు కావు. ఇలాంటి భయంకర అశాస్త్రీయ ప్రచారాలను ఏమత సంస్థ అయినా చేస్తే, వారి అమాయకత్వానికి నవ్వుకుంటాం. కానీ, భారత వ్యవసాయ పరిశోధనా మండలికి చెందిన ఒక సంస్థ ఇలాంటి అశాస్త్రీయ విషయాలను ప్రచురించడం ఎలాంటి విజ్ఞానానికి దోహదపడుతుంది? పరిశోధనా మండలి విశ్వసనీయత దెబ్బతినదా?

ఇక జాతి వనరుల వృధా విషయం పరిశీలిద్దాం. 10 కేజీల ఆవుపేడతో అరకేజి తేనె, పావుకేజి ఆవు నెయ్యి కలిపి, ఆ మిశ్రమాన్ని 500 లీటర్ల నీళ్ళతో కలిపి ఒక హెక్టారు (రెండున్నర ఎకరాలు) పొలంలో చల్లితే 'భూమి సంస్కారం' జరుగుతుందట (పేజి 35). భారతదేశంలోని కోట్లాది ఎకరాల భూమిని సంస్కరించడానికి లక్షలాది గ్రాముల ఆవునెయ్యి, తేనెలను వృధా చేయవలసి ఉంటుంది. మానవుల, జంతువుల మలమూత్రాలతో సారవంతమయ్యే పంట పొలాలలో, నెయ్యి, తేనె పోయమనడం ఎలాంటి చర్యగా భావించాలి?
ఈ పుస్తకం ముందుమాటలోనే ఈ పుస్తకంలో తెలిపిన ఎన్నో అంశాలను నిరూపించాల్సిన అవసరం ఉందని భారత వ్యవసాయ పరిశోధనా మండలి ఉన్నతాధికారి, శాస్త్రజ్ఞులు తెలిపారు. మరి ఇలాంటి ప్రచురణ అదీ ఎంతో బాధ్యతగల భారత వ్యవసాయ పరిశోధనా మండలి సంస్థ ఎలా అంగీకరించింది? ఏ ప్రయోజనాల్ని ఆశించి, ఈ ప్రచురణ చేయబడింది?

ఇలాంటి విషయాలను చదువుతుంటే స్వామి వివేకానందుని ప్రవచనం గుర్తుకు వస్తోంది. 'భారతదేశంలో ప్రజలు అన్నం తిని కుడి చేతిని మూడుసార్లు కడుక్కుంటే ఏం ఫలితం వస్తుంది? నాలుగుసార్లు కడుక్కుంటే ఏం ఫలితం వస్తుంది? పుక్కిలించి ఐదు సార్లు ఉమ్మివేస్తే శుభమా? అశుభమా? ఆరుసార్లు ఉమ్మివేస్తే శుభమా? అశుభమా? ఇలాంటి అశాస్త్రీయ, వ్యర్థ విషయాలతో గత వెయ్యి సంవత్సరాలలో కొన్ని వేల టన్నుల సాహిత్యాన్ని వెలువరించారు. ఇది ఇలాగే కొనసాగితే భారతీయులందరూ పిచ్చాసుపత్రిలో చేరవలసి ఉంటుంది.' ఇదీ స్వామీజీ ఆవేదన. పై పుస్తకంలోని విషయాలు చదువుతుంటే ఈ ఆవేదన నిజం కాబోతోందా? అని అనిపిస్తుంది.
కె.ఎల్‌.కాంతారావు, జన విజ్ఞాన వేదిక.

1 comment:

Anonymous said...

em maatlaaduthunnaavayya.nuvvu bhaaratheeyudivena?bhaaratheeyudante ela unduli?nuvvu bharatheeyudivi kaavaalante vellu..nee thala lo edo maamsapu mudda undi--adhe BRAIN antare..adi..elli daanni theeyinchuko.appudu nuvvu nijamayina bharatheeyudivi