27 Feb 2012

జ్వరం మీటరుతో జర జాగ్రత్త


ఇది వరకు జ్వరం చూసుకోవాలంటే డాక్టరు దగ్గరికి పరుగెత్తాల్సి వచ్చేది. కాని ఇప్పుడు ఇంట్లోనే ధర్మామీటరు పెట్టుకుని జ్వర తీవ్రతను తెలుసుకుంటున్నారు. ఇంతవరకు బాగానే ఉంది కాని ధర్మామీటరు పొరపాటున చేయిజారి కిందపడితేనే ఇబ్బంది. ఎందుకంటే ఇందులో ఉండే మెర్క్యురీ అంటే పాదరసం పర్యావరణంతో పాటు మీ ఆరోగ్యానికి కూడా చేటు తెచ్చి పెడుతుంది అంటున్నారు నిపుణులు. ఒకవేళ పొరపాటున మీ చేతి నుంచి ధర్మామీటరు జారి కింద పడి పగిలిపోతే ఏమి చేయాలో, ఏమి చేయకూడదో కూడా చెప్తున్నారు వాళ్లు.

చేయకూడనివి... * చీపురు లేదా వాక్యూమ్ క్లీనర్‌లతో శుభ్రం చేయకూడదు. * పాదరసం పడిన నేలపై నడవకూడదు. ఒకవేళ కాలికి ఉన్న చెప్పులకు పాదరసం అంటుకుంటే ఆ చెప్పులు వెంటనే వదిలేయాలి. * పాదరసాన్ని డ్రైయినేజిలో పోయొద్దు. అలా పోస్తే డ్రెయిన్ మూసుకుపోతుంది. సెప్టిక్ ట్యాంక్ కలుషితమయిపోతుంది. * పాదరసం పడిన గదిలో ఎవరినీ ఉంచొద్దు. ముఖ్యంగా పిల్లలు, పెంపుడు జంతువులు ఉంటే వెంటనే గది బయటకు పంపి గది మూసేయాలి. పాదరసం అంటిన బట్టల్ని, వస్తువుల్ని ముట్టుకోవద్దు.

చేయాల్సినవి... మెర్క్యురీని శుభ్రం చేసే వస్తువులు కిట్‌లా లభిస్తాయి. ఒకవేళ అలా లభించకపోతే విడివిడిగా ఆ వస్తువులను మీరే కొనుక్కోవచ్చు. లాటెక్స్ గ్లౌజులు, ట్రాష్ బ్యాగ్‌లు, జిప్ లాక్ బ్యాగ్‌లు, పేపర్ టవల్, కార్డ్‌బోర్డ్, ఐడ్రాపర్, షేవింగ్ క్రీమ్, చిన్న బ్రష్, ఫ్లాష్ లైట్, సల్ఫర్ పొడి (ఇది అవసరమనుకుంటేనే) కొనండి.

శుభ్రం చేయడం ఇలా... పాదరసం పడిన వెంటనే కాకుండా పావుగంట తరువాత శుభ్రం చేయాలి. అలాగే ఆ గది తప్ప మిగతా గది తలుపులన్నీ మూసేయాలి. గాజు ముక్కల్ని గ్లౌజులు వేసుకున్న చేతులతో కాగితపు టవల్ మీదకి తీసుకోవాలి. ఈ టవల్‌ను వెంటనే జిప్ లాక్ బ్యాగ్‌లో పడేయాలి. తరువాత నేలపైన ఇంకా ముక్కలేవైనా ఉన్నాయేమో గమనించండి. ఒకవేళ కరెంటు బల్బు కాంతిలో కనిపించకపోతే గదిలో లైట్లు ఆపేసి ష్లాష్ లైట్ వెలుగులో చూడాలి. చిన్న చిన్న ముక్కలు కనిపిస్తే వాటిని ఐ డ్రాపర్‌తో తీసి తడి పేపర్ టవల్ మీద వేయాలి.

దాన్ని కూడా జిప్‌లాక్ బ్యాగ్‌లో ఉంచాలి. ఆ తరువాత కొద్దిగా షేవింగ్ క్రీమ్‌ను బ్రష్ మీద వేసి కంటికి కనిపించని చిన్న చిన్న గాజు ముక్కల్ని తీసేయాలి. శుభ్ర పరచడానికి వాడిన వస్తువులన్నిటినీ ట్రాష్‌బ్యాగ్‌లో వేయాలి. ఈ బ్యాగ్‌ను బయో హజార్డస్ వేస్ట్ మేనేజ్‌మెంట్ కంపెనీకి లేదా మునిసిపాలిటీలో వ్యర్థాల వ్యవహారాలను చూసే విభాగంలో ఇవ్వాలి. గదిని శుభ్రం చేసిన తరువాత 24 గంటల పాటు గాలి వెలుతురు వచ్చేలా ఉంచాలి. ఆ తరువాతే వాడాలి.

ఇంత శుభ్రం ఎందుకంటే... పాదరసం విడుదలయిన గాలిని పీల్చడం వల్ల ఊపిరితిత్తులు విషమయం అవుతాయి. దృష్టిలోపం, శరీర కదలికల్లో ఇబ్బంది, నరాలకు సంబంధించిన సమస్యలు వస్తాయి. ఎక్కువ మోతాదులో పాదరసాన్ని పీల్చితే చనిపోయే ప్రమాదం కూడా ఉంది. అందుకని పైన చెప్పిన జాగ్రత్తలు తీసుకోక తప్పదు. మెర్క్యురీ ధర్మామీటర్లు కాకుండా డిజిటల్ ధర్మామీటర్లు కూడా మార్కెట్లో లభిస్తున్నాయి ఈ మధ్య. వీలయితే వాటిని ఉపయోగించొచ్చు.

టైకో బ్రాహీ మ్యూరల్ • 27/02/2012
బ్రాహీ డెన్మార్మ్‌కు చెందిన ఖగోళ పరిశోధకుడు. 1546-1601 మధ్య జీవించాడితను. ఆ కాలంలో చీటికీ మాటికీ కత్తితో ద్వంద్వయుద్ధాలు చేయడం అలవాటు. అలాంటి ఒక పోటీలో బ్రాహీ ముక్కు తెగింది. అందుకని అతను కృత్రిమంగా ముక్కు తయారుచేసి అతికించుకున్నాడు. బ్రాహీ మరణం కూడా అలాగే చిత్రంగా జరిగిందంటారు. అంతకన్నా అతడిని గుర్తుంచుకోవడానికి తగిన కారణం, నక్షత్రాల గురించిన పరిశీలన. అప్పటికి అతను నక్షత్రాల గురించి ఎంతో విస్తారంగా, ఖచ్చితంగా సమాచారం సేకరించాడు. బ్రాహీ గురించిన ఈ మ్యూరల్ చిత్రం ఎంతో ప్రసిద్ధిగాంచినది. ఈ చిత్రంలో ఎక్కువభాగాన్ని మరో చిత్రం ఆక్రమించినట్టు గమనించవచ్చు. బ్రాహీ, అతనిముందు ఒక కుక్క, ఆ చిత్రంలో ముఖ్యంగా కనబడతారు. ఆ చిత్రం ఒక గోడమీద బిగించి ఉంది. అతను చెయ్యి ఎత్తినట్లు కనబడుతుంది. ఆ ఎత్తిన చేతి వెనక, అతని నక్షత్ర పరిశీలన అబ్జర్వేటరీ ఉంది. నిజమయిన బ్రాహీ బొమ్మలో కుడి పక్కన కనబడతాడు. అతను తన అసిస్టెంటును పిలుస్తున్నట్లు చూడవచ్చు. వాళ్లంతా కలిసి, చిత్రంలోని అంశాలు ఆధారంగా, నక్షత్రాల స్థానాలను, కదలికలను లెక్కించేవారట! ఈ చిత్రాన్ని కళాఖండంగానూ, ఒక పరిశోధనశాలగానూ గుర్తించవచ్చు!
కెప్లర్ విశ్వం నమూనా
జూహానెన్ కెప్లర్, జర్మనీకి చెందిన గణిత నిపుణుడు, ఖగోళ పరిశీలకుడు కూడా. అతను విశ్వం తీరును గురించి అందమయిన ఊహలు చేశాడు. చిత్రంగా న్యూటన్ తరువాత కూడా ఆ ఆలోచనలు నిలిచి కొనసాగుతున్నాయి. 1571-1630 మధ్యన జీవించిన కెప్లర్ గ్రహాల కదలికల గురించి మూడు సూత్రాలను సూచించాడు. ఈ అంశం గురించి న్యూటన్ మరెంతో పరిశోధించాడు. అయినా కెప్లర్ సూత్రాలు నిలిచే ఉన్నాయి. నిజానికి న్యూటన్ పరిశీలనలకు అవే ఆధారం అంటారు. కెప్లర్ నిజానికి భగవంతుడి సృష్టిలో ఒక క్రమం ఉందనీ, ఈవిశ్వానికి సంగీతం తీరుకు పోలిక ఉందనీ, అందులో అయస్కాంత శక్తికి భాగం ఉందనీ ఆలోచించాడు. గ్రహాల మార్గాల మధ్యన గల విశేషాలను గురించి కెప్లర్ ఏవేవో ప్రతిపాదనలు చేశాడు. వాటి ఆధారంగా విశ్వానికే ఒక నమూనాను తయారుచేశాడు. ఆలోచనలన్నీ నిలవలేదు. కానీకొన్ని సూత్రాలు మాత్రం నిజమయ్యాయి. అది సైన్సులోని పద్ధతి!
వోల్టాస్ బ్యాటరీ
ఆలెస్సాండ్రో వోల్టా ఇటలీకి చెందిన భౌతిక శాస్తవ్రేత్త. 1745-1827 మధ్య జీవించాడు. మనమిప్పుడు ఆలోచించకుండానే రకరకాల బ్యాటరీలను వాడుకుంటున్నాము. వాటిలోని, ఇతరత్రా విద్యుత్తును వోల్టులలో కొలుస్తున్నాము. సెల్ బ్యాటరీకి వోల్టా 1800లో తొలిరూపం ఇచ్చిన సంగతి మనకు పట్టదు. సైన్సు, టెక్నాలజీగా మారి ప్రజలలోకి వచ్చిన తర్వాత మామూలుగా ఇదే జరుగుతుంది! నిలువుగా వున్న గాజు కడ్డీలమీద, రెండు వేరు వేరు లోహాల బిళ్ళలను, ఒకదానిమీద మరొకటిగా మార్చి మార్చి పేర్చాడు వోల్టా. వాటి మధ్యన ఉప్పునీటిలో తడిపిన అట్టముక్కలను అమర్చాడు. కరెంటు పుడుతుందని తెలుసు. అది రుజువుచేయడానికి, వోల్టా మరెవరినీ పిలవలేదు. అడుగున ఉండే నీటి బేసిన్‌లో ఒక చెయ్యి పెట్టి, మరో చేత్తో, అన్నిటికన్నా పైనున్నమెటల్ ప్లేట్‌ను ముట్టుకున్నాడు. అవసరమనుకున్నప్పుడు, ఆ ప్లేటును నాలుకతో కూడా తగిలి చూచాడు. కరెంటు పుట్టిందని తెలిసింది. ఎన్నిసార్లు షాక్‌లు తిన్నాడో తెలియదు. అందులో అతనికి విజయం కనిపించింది తప్ప బాధ తెలియలేదు. అప్పటికే ఈల్ వంటి చేపలలో ఉన్న విద్యుత్తు గురించి తెలుసు. ల్యాబ్‌లో పుట్టించిన ఈ కృత్రిమ విద్యుత్తు కూడా అలాంటిదే అన్నాడు వోల్టా!
రోంజెన్ ఉంగరం
మరో జెర్మన్ దేశస్థుడు, భౌతిక శాస్తవ్రేత్త విల్‌హెల్మ్ రోంజెన్. 1845-1923 మధ్యన జీవించాడాయన. అతను కిరణాలను గురించి పరిశోధించాడు. అందుకు గాలిచొరని ఒక పెట్టెను తయారుచేశాడు. అందులోకి వెలుగు దూరడానికి, వెలికిరావడానికీ లేదు. కానీ, కొంత దూరంలో ఒక వెలుగుమాత్రం కనబడసాగింది. దాని సంగతి తెలుసుకోవాలని పగలు రాత్రి అనక వారం రోజుల పాటు అతను పరిశోధనశాలలోనే గడిపాడు. పద్ధతిగా పరిశీలన సాగించాడు. కొత్త కిరణాలు అతడిని ఆశ్చర్యంలో ముంచెత్తాయి. అందుకే వాటికి ఎక్స్ కిరణాలని పేరు పెట్టాడు. వాటిని పరీక్షించే ప్రయోగం కోసం భార్య ఆనా బెర్తాను పిలిచాడు. కిరణాల దారిలో చెయ్యి పెట్టమన్నాడు. ‘నా మృత్యువు నాకు కనిపించింది’ అన్నదామె. అవును మరి! ఆమె చేతి ఎముకలు కనిపించాయి. మాంసం ఉండీ లేనట్టు కనిపించింది. వాటికి మించి ఆమె చేతికి ఉన్న ఉంగరాన్ని కూడా మనం చిత్రంలో చూడవచ్చు. సైన్సు చరిత్రలో మైలురాయి వంటి ఈ చిత్రంలో ఉంగరం స్థానం ఏమిటి?
హబుల్ విజయం
అమెరికన్ అంతరిక్ష శాస్తవ్రేత్త ఎడ్విన్ హబుల్ 1889-1953 మధ్య జీవించాడు. విశ్వం గురించి సిద్ధాంతాలుచేసిన ఆల్బర్ట్ ఐన్‌స్టైన్ పరిశోధనల గురించి తీవ్రమయిన చర్చ జరిగింది. అతను విచిత్రమయిన వ్యక్తి. తన పొరపాటును ఏనాడూ ఒప్పుకోలేదు. హబుల్ మాత్రం, ఒక గెలాక్సీ మన నుంచి ఎంత దూరంగా ఉంటే, అది అంత వేగంగానూ మన నుంచి దూరంగా పోతున్నట్లు లెక్క అని రుజువు చేశాడు. విశ్వం ఒక బిందువుగా పుట్టి పెరుగుతున్నదని, క్రమంగా విస్తరిస్తున్నదనీ, ఐన్‌స్టైన్ మాత్రం అంగీకరించలేదు. హబుల్ ఆ విషయాన్ని రుజువు చేశాడు. ఐన్‌స్టైన్ కూడా అవునన్నాడు. ఇంకా కొంతమంది మాత్రం మొండివైఖరి కనబరచారు. హబుల్ పేరున ప్రయోగించిన టెలిస్కోప్, సాక్ష్యంగా ఎన్నో వివరాలను అందించింది!
సైన్సు పద్ధతికి, ఈ ప్రయోగాలు, విశేషాలు అన్ని చక్కని ఉదాహరణలుగా నిలబడతాయి. నిజం తెలుసుకునే ప్రయత్నంలో పరిశోధకులు కనబరిచిన క్రమశిక్షణ, పట్టుదల, ఉత్సాహం కనబడతాయి. ఈ పద్ధతి సైన్సును ముందుకు సాగించింది. మానవుల ప్రగతి వీలయింది. జీవితంలోనూ ఈ లక్షణాలు అలవాటయితే, అదే శాస్ర్తియ దృక్పథం

సీవీ రామన్.. నోబెల్ ప్రైజ్


 • 27/02/2012
రామన్ అనగానే అందరికీ నోబెల్ బహుమతి జ్ఞాపకం వస్తుంది. కానీ, ఆ బహుమతితో అసంతృప్తికి గురయినవారు కూడా ఉన్నారన్న విషయం చాలామందికి తెలియదు. 1913 నుంచీ రష్యాలో లాండ్ స్ట్రామ్, లాండ్స్ బెర్గ్ అనే ఇద్దరు పరిశోధకులు, రామన్ జరుపుతున్న రకం పరిశోధనలు సాగించారు. 1925లో వారి పరిశోధన క్వార్ట్జ్ అనే పదార్థంతో కొనసాగింది. రష్యాలో క్వార్ట్జ్ కావలసినంత దొరుకుతుంది. కానీ వ్యాపారులు ఈ పరిశోధకులను మోసపుచ్చి చవకబారు సరుకును అంటగట్టారు. వారికి 1928లో గానీ మంచి క్వార్ట్జ్, మంచి ఫలితాలు అందలేదు. అప్పుడుగానీ వారికి రామన్‌కు వచ్చిన లాంటి ఫలితాలు రాలేదు! వచ్చిన తర్వాత కూడా నమ్మకం కుదరక వారు తమ ఫలితాలను ప్రచురించలేదు. రామన్ తన పరిశీలనలు ప్రచురించిన తర్వాత అందరికీ, రష్యన్‌ల పరిశోధన గురించి అర్థమయింది. వాళ్లు తమ పరిశోధన ఫలితాలను ప్రచురించేలోగా విషయం మీద 16పత్రాలు వచ్చేశాయి. రామన్ ఐఫెక్ట్ పుట్టేసింది! తరువాత కూడా రష్యనులు దాన్ని రామన్ స్కాటరింగ్ అనలేదు. కానీ, కాలక్రమంలో వారికి కనువిప్పు కలిగింది. సైన్సు పద్ధతిలో సంగతిని చర్చకు పెట్టి అవుననుపించడం ముఖ్యమయిన భాగం!
1928లోనే రామన్‌కు నోబెల్ వస్తుందనుకున్నారు కానీ రాలేదు. 1929లో కూడా రాలేదు. 1930లో రామన్, తనకూ, భార్యకూ యూరపు వెళ్ళడానికని టికెట్లు కొన్నారు. ఆ తర్వాత నోబెల్ బహుమతి ప్రకటించబడింది. 1930 డిసెంబరు పదవ తేదీన స్టాక్‌హోమ్‌లో బహుమతి ప్రదానం జరిగింది. ఆ సందర్భంగా అమెరికా ప్రతినిధిగా వచ్చిన అధికారి రాసిన మాటలు అందరూ చదవదగినవి.
‘‘నోబెల్ బహుమతి గ్రహీతలందరికీ, భారతీయ విజేత, సర్ వెంకట్రామన్‌గారి మీద అందరి దృష్టి కేంద్రీకరింపబడింది. రాజుగారి చేతుల మీదుగా బహుమతి అందుకున్న తర్వాత ఆయన భావోద్వేగానికి గురవుతూ తమ స్థానానికి తిరిగి వచ్చారు. అతని కళ్లనుండి బాష్పాలు స్రవించాయి. తరువాత డిన్నర్ సందర్భంగా ఆయన చేసిన ప్రసంగం ఒక మాస్టర్ పీస్. హాలులోని అందరూ ప్రసంగం తర్వాత గొప్పగా అప్లాస్ తెలియజేశారు’’ అని అధికారి తమ దేశానికి వర్తమానం పంపారు.
‘నా సీటుకువచ్చిన తరువాత నాకు చుట్టూ, తెల్లవారి ముఖాలు మాత్రమే కనిపించాయి. వారి మధ్యలో ఒంటరిగా, నేను, కోటు, తలపాగాలతో, ఒక భారీయుడిని మిగిలాను. నా దేశం, నా ప్రజల ప్రతినిధిగా నేనున్నాననిపించింది. మహారాజుగారి నుంచి బహుమతి అందుకునే సమయాన నేను నమ్రభావానికి గురయ్యాను. నన్ను నేను తమాయించుకున్నాను. పైన చూస్తే, నా వెనుక బ్రిటీష్ జెండా కనిపించింది. దేశం పరిస్థితి మనసులో మెదిలింది. మనకొకజెండా కూడా లేదు! నా ఉద్వేగం దాంతో కట్టలు తెగింది’ అని రాసుకున్నారు రామన్!

నేడు ఖగోళ అద్భుతం


 • 27/02/2012
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 26: ఆకాశంలో సోమవారం సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత ఒకేసారి నాలుగు గ్రహాలు ఖగోళ వీక్షకులకు కనువిందు చేయనున్నాయి. భూమినుంచి చూస్తే బృహస్పతి, చంద్రుడు ఒకదానికొకటి చాలా దగ్గరగా ఉన్నట్టు కనిపిస్తాయని ప్లానెటరీ సొసైటీ ఆఫ్ ఇండియా డైరెక్టర్ ఎన్ రఘునందన్ చెప్పారు. జ్యోతిష శాస్త్ర ప్రకారం అయితే దీన్ని బృహస్పతి చంద్రుడితో కలవడంగా చెప్తారు. అయితే ఖగోళ శాస్త్ర ప్రకారం భూమినుంచి చూసినప్పుడు ఈ రెండుగ్రహాలు ఒకదానికి మరొకటి చాలా దగ్గరగా ఉన్నట్టు కనిపిస్తాయని ఆయన చెప్పారు. సోమవారం రాత్రి పది గంటల సమయంలో ఆకాశంలో పశ్చిమ దిక్కులో బృహస్పతి గ్రహాన్ని చూడవచ్చని ఆయన చెప్పారు. భూమికి సహజ ఉప గ్రహమైన చంద్రుడికి దిగువగా పశ్చిమ దిశగా శుక్రగ్రహాన్ని కూడా చూడవచ్చని ఆయన చెప్పారు. బృహస్పతి, శుక్రుడు, నెలవంక మూడూ వరసగా ఆకాశంలో పశ్చిమ వైపున సాయంకాలపు నీరెండ వెలుగులో త్రికోణాకారంలో కనిపిస్తాయని ఆయన చెప్పారు. ఇవి మూడు చాలా ప్రకాశవంతంగా ఉంటాయి గనుక నగర విద్యుద్దీపాల వెలుగులో సైతం వీటిని చూడడానికి వీలవుతుందని ఆయన చెప్పారు. సూర్యాస్తమయం తర్వాత శనిగ్రహం కూడా ఆకాశంలో తూర్పు వైపున కనిపిస్తుందని ఆయన చెప్పారు. మార్చినెల 14న శుక్రుడు, బృహస్పతికి దగ్గరవడం సంభవిస్తుందని, అప్పుడు ఈ రెండు గ్రహాలు ఆకాశంలో జంటగా, ఒకదాని పక్కన ఒకటి కనిపిస్తాయని రఘునందన్ చెప్పారు.

నేడు ఖగోళ అద్భుతం


 • 27/02/2012
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 26: ఆకాశంలో సోమవారం సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత ఒకేసారి నాలుగు గ్రహాలు ఖగోళ వీక్షకులకు కనువిందు చేయనున్నాయి. భూమినుంచి చూస్తే బృహస్పతి, చంద్రుడు ఒకదానికొకటి చాలా దగ్గరగా ఉన్నట్టు కనిపిస్తాయని ప్లానెటరీ సొసైటీ ఆఫ్ ఇండియా డైరెక్టర్ ఎన్ రఘునందన్ చెప్పారు. జ్యోతిష శాస్త్ర ప్రకారం అయితే దీన్ని బృహస్పతి చంద్రుడితో కలవడంగా చెప్తారు. అయితే ఖగోళ శాస్త్ర ప్రకారం భూమినుంచి చూసినప్పుడు ఈ రెండుగ్రహాలు ఒకదానికి మరొకటి చాలా దగ్గరగా ఉన్నట్టు కనిపిస్తాయని ఆయన చెప్పారు. సోమవారం రాత్రి పది గంటల సమయంలో ఆకాశంలో పశ్చిమ దిక్కులో బృహస్పతి గ్రహాన్ని చూడవచ్చని ఆయన చెప్పారు. భూమికి సహజ ఉప గ్రహమైన చంద్రుడికి దిగువగా పశ్చిమ దిశగా శుక్రగ్రహాన్ని కూడా చూడవచ్చని ఆయన చెప్పారు. బృహస్పతి, శుక్రుడు, నెలవంక మూడూ వరసగా ఆకాశంలో పశ్చిమ వైపున సాయంకాలపు నీరెండ వెలుగులో త్రికోణాకారంలో కనిపిస్తాయని ఆయన చెప్పారు. ఇవి మూడు చాలా ప్రకాశవంతంగా ఉంటాయి గనుక నగర విద్యుద్దీపాల వెలుగులో సైతం వీటిని చూడడానికి వీలవుతుందని ఆయన చెప్పారు. సూర్యాస్తమయం తర్వాత శనిగ్రహం కూడా ఆకాశంలో తూర్పు వైపున కనిపిస్తుందని ఆయన చెప్పారు. మార్చినెల 14న శుక్రుడు, బృహస్పతికి దగ్గరవడం సంభవిస్తుందని, అప్పుడు ఈ రెండు గ్రహాలు ఆకాశంలో జంటగా, ఒకదాని పక్కన ఒకటి కనిపిస్తాయని రఘునందన్ చెప్పారు.

22 Feb 2012

మంత్రాలూ, చింతకాయలూ


మన దేశంలో ప్రాచీనకాలం నుంచీ మంత్రాలకు చాలా ప్రాముఖ్యత ఉంది. గురూ, పండిత్‌ వగైరా పదాల్లాగే మంత్రా అనే మాట కూడా ఇంగ్లీష్‌ డిక్ష్‌నరీల్లో కెక్కింది. హిందూ దేవాలయాల్లోనూ, పూజా పునస్కారాల్లోనూ నిత్యమూ వినబడే మంత్రాలే కాక నేపాల్‌, టిబెట్‌ వంటి ప్రాంతాల్లో మంద్రస్థాయిలో బౌద్ధ అర్చకులు ఉచ్చాటన చేసేవీ, చర్చ్‌లూ, మసీదుల్లో ఉచ్చరించే పవిత్ర శబ్దాలూ అన్నీ మొత్తం మీద ఒకే రకం వైఖరికి సంకేతాలు. మనవాళ్ళకి మంత్రాలే కాక వాక్కులోనూ, శబ్దాల్లోనూ కూడా చాలా నమ్మకం ఉంది. వేద పనస కలిసి చదివేది ఇద్దరైనా ఒక్క అక్షరం కూడా, ఒక్క స్వరం కూడా పొల్లుపోకుండా శ్రద్ధగా ఉచ్చరించడం చూస్తాం. మన ప్రాచీన వాఙ్మయమంతా మౌఖికమే. మునులూ, బ్రాహ్మణులూ నోటిమాటగా శాపాలిచ్చేవారు. విశ్వామిత్రుడు రాముడి చెవిలో చెప్పినా, వేములవాడ భీమకవి కోపం వచ్చి తిట్టినా శబ్దాలకు అంతులేని శక్తి ఉందని అనుకోవడం మన సంస్కృతిలో పరిపాటి. రాలని చింతకాయలని చూపించి ఇలాంటి నమ్మకాలని ఎద్దేవా చెయ్యడం సంగతి ఎలా ఉన్నా అసలు ఇలాంటి భావనలకు మూలం ఎక్కడుందో తెలుసుకోవడం అవసరం.

సుదీర్ఘమైన మన చరిత్రలో మతం ఒక బలమైన శక్తిగా ఎదిగింది. అధికసంఖ్యాకులను అల్పసంఖ్యాక వర్గం అణచి ఉంచడానికి మతాన్ని బాగా ఉపయోగించుకుంది. మతం గురించీ, ఆధ్యాత్మిక విషయాల గురించీ అలౌకికమైన భావాలను పొందేవారికి తమ మెదళ్ళలో ఎలాంటి మార్పులు దేనివల్ల కలుగుతున్నాయో తెలుసుకోలేరు. పుస్తకాలూ, ప్రవక్తల బోధలూ, పెరిగిన వాతావరణమూ అన్నీ మనుషులను మతపరంగా లొంగదీసుకోవటానికి సిద్ధంగా ఉంచుతాయి. వీటికి తోడుగా గుళ్ళలో మోగే గంటలూ, మంత్రోచ్చారణలూ,కలిసి పాడే భజనలూ, తప్పెటలూ అన్నీ ఒకరకమైన హిప్నోసిస్‌కు గురిచేస్తాయి. ఇవన్నీ తరవాతి పరిణామాలు. మానవజాతి చరిత్రలో మొట్టమొదటిది ఒక అమాయకదశ. అతీతశక్తులను గురించి రకరకాల అపోహలు మొదలైన దశ. ఈ అపోహలకు ఎన్నో భౌతిక కారణాలుండేవి. అందులో చెవుల ద్వారా వినబడి మెదడుకు విభ్రాంతి కలిగించే శబ్దాల మాయాజాలం ఒకటి. ప్రకృతిని గురించి ఎక్కువగా తెలియని తొలి మానవులను మభ్యపెట్టే అంశాలు ఎన్నో ఉండేవి. అడవి మృగాల అరుపులూ, కూతలూ, తుఫాను గాలుల రొదలూ, ఉరుముల గర్జనా ఇలా ఒక్కొక్కొదాన్నీ పసికట్టడం వారికి అత్యవసరంగా ఉండేది. ప్రకృతిలో సహజంగా వినిపించే ఇలాంటి శబ్దాలకు అలవాటు పడ్డ తొలి మానవులకు అరుదుగా వినిపించే ప్రతిధ్వనులవంటివి అసహజంగానూ, భయం కలిగించేవిగానూ ఉండేవి. ఇవి ముఖ్యంగా కొండ కనుమల్లోనూ, గుహల్లోనూ వినిపించేవి. వీటివల్ల బెదిరిన మనుషులు వాలా ప్రభావితం అయినట్టుగా అనిపిస్తుంది.
సుమారు 30 వేల ఏళ్ళ క్రితం నుంచి 10 వేల ఏళ్ళ క్రితం దాకా జీవించిన మానవులు ఫ్రాన్స్‌ తదితర ప్రాంతాల్లోని గుహల గోడల మీద అద్భుతమైన బొమ్మలు గీశారు. వీటిలో ఎక్కువగా అప్పట్లో వారు వేటాడిన దున్నలూ, దుప్పులూ, గుర్రాలూ మొదలైనవాటి చిత్రాలు. వీటి సంగతి మొదటగా పంతొమ్మిదో శతాబ్దం చివరి రోజుల్లో తెలిసింది. ఈ బొమ్మలు గీయడానికి కారణాలేమిటో సరిగ్గా తెలియదుకాని ఇటువంటి గుహలు పూజలూ పునస్కారాలూ జరిపేందుకు తొట్టతొలి ఆలయాలుగా ఉపయోగపడ్డాయనే ప్రతిపాదనలున్నాయి. ఈ మధ్య వీటి మీద శబ్దపరమైన పరిశోధనలు జరిగాయి. వాటివల్ల ఈ గుహల్లో కొన్ని ప్రాంతాల్లో శబ్దాలు బాగా ప్రతిధ్వనిస్తాయని రుజువయింది. ఇవే కాక క్రీ.పూ. మూడు వేలఏళ్ళ నాటి స్టోన్‌హెంజ్‌ మొదలైన ఇతర ప్రాచీన ప్రార్థనాస్థలాల్లో కూడా శబ్దాలు మారుమోగుతాయని తెలిసింది. దీని ప్రాముఖ్యత ఏమిటో తెలుసుకోగోరిన పరిశోధకులు వెనకబడిన ఆదిమతెగల్లోనూ, "పురోగమించిన" కొన్ని ఆధునిక సంస్కృతుల్లోనూ ఈనాటికీ కూడా కనబడుతున్న కొన్ని తంతులూ, పూజలను బట్టి ప్రాచీన యుగంలో ఏం జరిగిందో కొంతవరకూ ఊహించగలుగుతున్నారు. గిట్టలు కలిగిన జంతువుల బొమ్మలన్నీ శబ్దాలు మారుమోగే ప్రాంతాల్లోనే ఉన్నాయి కనక బొమ్మలకూ, శబ్దాలకూ సంబంధం ఉండి ఉండాలి. అక్కడ నిలబడి చేతులతో చప్పట్లు చరిచినా, రెండు రాతి ముక్కలతో ఒకదాన్నొకటి కొట్టినా ఆ ధ్వనులు మారుమోగి సరిగ్గా పరిగెత్తే జంతువుల గిట్టల చప్పుడులాగే వినిపిస్తాయి. ఇది కనిపెట్టిన మొదటి గణాచారి ఎవడో తెలియదు కాని దీని ప్రాముఖ్యత వారికి అర్థమై ఉంటుంది. తలవని తలంపుగా ఇటువంటి గుహల సంగతి తెలిశాక అక్కడ మారుమోగిన శబ్దాలు వారికి జంతువుల కాలి గిట్టలను తలపించి ఉంటాయి. అందుకని వారుసరిగ్గా ఇటువంటి ప్రదేశాలనే ఎంచుకుని అక్కడ బొమ్మలు గీశారని అనుకోవచ్చు. గుహలో గుమిగూడి, తమకు ఆహారం అయిన, లేదా కానున్న మృగాలను తలుచుకుంటూ, సామూహికంగా తంతును నిర్వహిస్తున్నఆదిమానవులకు ఇటువంటి చప్పుళ్ళు వింతగా, మాయాజాలంగా, అతీతశక్తులను తలపించేట్టుగా ఉండి ఉంటాయి. ఇది మతానికి అతి ప్రాథమికమైన స్వరూపం. సకాలంలో తగినంత ఆహారం దొరకడం చావుబతుకుల సమస్య అని తెగలోని జనమందరికీ తెలుసు గనక ఇటువంటి ఆచారాలకు ఎంతో ప్రాముఖ్యత ఉండి ఉంటుంది.
కులపెద్దలూ, గణాచార్లూ ఇటువంటి వ్యవహారాలను ముందుండి నడిపేవారని మనం ఊహించవచ్చు. పూనకాలూ, గారడీవంటి విద్యల ద్వారా తెగలోని వారందరినీ ఈ ఆదిమ అర్చకులు ప్రభావితం చేసేవారు. వేట అప్పటివారికి చాలా ముఖ్యం కనక ఇవన్నీ వేటకు సంబంధించిన తంతులుగానే ఉండేవి. ఒకడు దుప్పి వేషమో, దున్న వేషమో వేసుకుని అభినయిస్తే మరికొందరు వాణ్ణి వేటాడినట్టు అభినయించేవారు. ఇటువంటి తంతులు ముఖ్యంగా తెగనంతటినీ ఏకం చేసేవి. కలిసి వేటాడ్డంలోనూ, కలిసికట్టుగా జీవించడంలోనూ ఉన్న లాభాల దృష్య్టా ఇవన్నీ జాతి కొనసాగడానికి తోడ్పడే సంఘటనలే. స్వయంగా వేటలో పాల్గొనలేని చిన్న కుర్రాళ్ళకు ఈ అభినయం పాఠాలు నేర్పేదేమో. తెగలోని స్త్రీలను ఆకర్షించడానికి వేట అభినయం చేస్తున్న యువకులకు అవకాశం లభించేదేమో. మొత్తం మీద తెగలోని వారిని సంఘటితం చెయ్యడానికి ఇటువంటి సమావేశాలు సహాయపడి ఉంటాయి. చీకటి గుహలో కాగడాల వెలుగులో కదులుతున్నట్టుగా అనిపించే జంతువుల బొమ్మలూ, గిట్టలను పోలిన శబ్దాలూ మరింత భ్రాంతిని కలిగించి ఉంటాయి. అలాగే ఒకే శ్రుతిలో మోగే గణాచారి గొంతు ప్రతిధ్వని వల్ల మరింత బలంగా వినిపించి ఉంటుంది. లయబద్ధంగా మోగే డప్పులూ, మళ్ళీ మళ్ళీ ఉచ్చరించే శబ్దాలూ అన్నీ ఒకరకమైన హిప్నొసిస్‌ను కలిగిస్తాయనడంలో సందేహం లేదు. అందరూ కలిసి ఇలాంటి తంతులో పాల్గొంటున్నప్పుడు ఈ వాతావరణం వారి మనసుల్లో ప్రగాఢమైన అనుభూతిని కలిగించి ఉంటుంది. ఇప్పటికీ నలుగురూ చేరి ఏ సత్యసాయిబాబా భజనలో బృందగానంగా పాడుతున్నప్పుడు పూనకం వచ్చినట్టుగా ప్రవర్తించడం మామూలే కనక ఇది ఊహించడం ఏమంత కష్టంకాదు.
నోటి వెంట మంత్రాలను ఉచ్చరించడం మొదలవక ముందే ఆటవికపూజల్లో డప్పుల మోతలు చేసేవారు. లయను అనుసరిస్తూ ఎడతెగక మోగే శబ్దాల కంపనాలు మెదడుపై ఎలాంటి ప్రభావం కలిగిస్తాయో ఆధునిక పరిశోధకులకు తెలుసు. ఇవి వింటూ ఆటవిక పూజలు చేసే గణాచారులూ, షామాన్లూ ఒక సుప్త చేతనావస్థలోకి వెళతారు. సెకండుకు నాలుగైదు సార్లు మోగే చప్పుళ్ళూ, టిబెటన్‌ బౌద్ధ శ్రమణకులు చేసే ఉచ్చాటనల వంటివన్నీ మెదడును ధ్యానసమాధివంటి స్థితిలోకి తీసుకెళ్ళగలవు. ఈ స్థితిలో మెదడును జోకొట్టే "తీటా" తరంగాలు ఉత్పన్నం అవుతాయి. సెకండుకు 4 7 కంపనాలు కలిగిన ఈ తరంగాలు నిద్రావస్థకూ, మెలకువగా ఉండటానికీ మధ్యస్థమైన భావనను కలిగిస్తాయి. ఈ స్థితిలో మనని ఎంతో గాఢంగా ప్రభావితం చేసే సంఘటనలు జరిగినట్టుగానూ, అతీంద్రియశక్తులు ఆవహించినట్టుగానూ, అస్పష్టమైన భావాలన్నిటికీ అకస్మాత్తుగా రూపం ఏర్పడినట్టుగానూ విచిత్రభావాలు కలుగుతాయి. "పరలోకం"తో సంపర్కం ఏర్పడినట్టు అనిపించడం ఈ స్థితిలోనే జరుగుతుంది. ఇంత గొప్ప "అతీత" భావనలన్నిటినీ కేవలం సెకండుకు నాలుగైదు కంపనాలు కలిగిన శబ్దాల ద్వారా సాధించవచ్చునంటే ఆశ్చర్యమే. అలాగే సెకండుకు 7-12 కంపనాలు కలిగిన ఆల్ఫా తరంగాలు ఎంతో విశ్రాంతిని కలిగిస్తాయి కాని ధ్యానంలో ఉన్నట్టుగా అనిపించదు. మనలోని పూర్తి చైతన్య స్థాయికి దిగువనుండే క్రియాత్మక వైఖరికి ఇవి దారితీయగలవట. సెకండుకు 13-40 కంపనాలు కలిగిన బీటా తరంగాల వల్ల మనస్సు బాగా కేంద్రీకృతం కావడం, దృష్టి నిశితమైనట్టుగా అనిపించడం మొదలైన ప్రభావాలు కలుగుతాయి. సెకండుకు 4 కంపనాల కన్నా తక్కువ ఉండే డెల్టా తరంగాలు గాఢమైన నిద్రకు దారితీస్తాయి. శరీరం కోలుకోవడానికి ఈ స్థితి బాగా ఉపయోగపడుతుంది. ఆల్ఫా, బీటా స్థితుల్లో ఉన్నప్పుడు అయోమయంగా అనిపించిన విషయాలన్నీ తీటా స్థితిలోకి వచ్చినప్పుడు అర్థమైపోయినట్టుగా అనిపిస్తుంది. మెదడు కణాల పొరల (మెంబ్రేన్లు) గుండా స్రవించే సోడియం, పొటాసియం పదార్థాల నిష్పత్తిని నిగ్రహించడం తీటా స్థితిలోనే సాధ్యమైనట్టుగా అనిపిస్తుంది. కంప్యూటర్‌ ద్వారా రకరకాల కంపనాలను సృష్టించి, ఏది మెదడుపై ఎటువంటి ప్రభావం కలిగిస్తుందో శాస్త్రవేత్తలు ఖచ్చితంగా అంచనా కట్టగలరు. రేడియో రిసీవర్‌ను ట్యూన్‌ చేసినట్టుగా ఒక్కొక్క ధ్వనిని బట్టి మెదడులో రకరకాల పరిణామాలు కలిగించగలరు. మెలకువ తీవ్రతరం కావడం, ఆలోచనలు కేంద్రీకృతం కావడం, విశ్రాంతిగా ఉన్న భావనలూ, దృశ్యాలు కనబడడం, విషయాలు జ్ఞప్తికి రావడం, గాఢమైన నిద్ర, నిరాసక్తమైన భావనలూ ఇలా ఎన్నెన్నో మార్పులను అనుకున్నట్టుగా కలిగించే శబ్దాలున్నాయి.
స్టీరియో హెడ్‌ఫోన్ల ద్వారా ఒక్కొక్క చెవికీ వేరు వేరు కంపనాలు కలిగిన శబ్దాలను వినిపించినప్పుడు అవి రెండూ కలిసిపోయి మూడో రకమైన శబ్దం వినిపిస్తుందని పరిశోధనల్లో తేలింది. మెదడులోని రెండు భాగాలు తమకు వినిపిస్తున్న శబ్దాలను కలిపి మరొకరకంగా అన్వయించుకుంటాయి. అనుకంపనంవల్ల మెదడులోని కణాలన్నీ ఈ మూడో శబ్దానికి రెసొనేట్‌ అవుతాయి. వాటివల్ల రకరకాల ప్రక్రియలు మొదలై, ఊహల్లో వివిధ భావనలు కలిగిస్తాయి. మెదడులో రెటిక్యులర్‌ ఆక్టివేటింగ్‌ సిస్టమ్‌ అనే వ్యవస్థ ఒకటి ఉంటుంది. మెదడు కాండంలో ఇది ఒక వలలాగా పరుచుకుని ఉంటుంది. మన చైతన్యాన్నీ, జాగ్రదావస్థనూ, ఏకాగ్రతనూ నిర్ణయించేది ఇదే. శబ్దాలవంటి బాహ్యప్రేరణలకు మనం స్పందించే పద్ధతీ, మన అవగాహనా, నమ్మకాలూ అన్నీ దీనిమీదనే ఆధారపడతాయి. శబ్దాలవల్ల మెదడు కణాల్లో కలిగే మార్పులన్నిటినీ ఈ వ్యవస్థ మామూలు మెదడు తరంగాల రూపంలోనే స్వీకరించి అన్వయించుకుంటుంది. ఈ వ్యవస్థకు సంబంధించినంతవరకూ ప్రేరణలు ఎటువంటివైనా ఒకటే. సహజంగా మెదడులో కలిగే అనుభూతికీ, కృత్రిమంగా శబ్దాలూ, దృశ్యాల మూలంగా అందే ప్రేరణలకూ గల తేడాలను ఈ వ్యవస్థ గుర్తించలేదు. ఈ వ్యవస్థ వల్ల ప్రభావితం అయే థాలమస్‌ గ్రంథీ, మెదడుపైన ఉండే కార్టెక్స్‌ పొరా వగైరాలన్నీ మెదడులో కృత్రిమంగా ఉత్పత్తి అయిన భావాలను నిజమైనవిగానే గుర్తిస్తాయి. అందుకనే మతపరమైన అతీంద్రియ, అలౌకిక భావనలు పొందినవారికి అవి ఎంతో గాఢంగానూ, తీవ్రంగానూ, స్పష్టంగానూ అనిపిస్తాయి. ఆధునిక విజ్ఞానం ఇంతగా అభివృద్ధి అయిన ఈ రోజుల్లోనే అందరూ ఇలాంటి భ్రమలకు లోనవుతున్నారంటే ఆటవికదశలోని ప్రజలుఎలా స్పందించి ఉంటారో ఊహించుకోవచ్చు.
కేవలం భౌతిక ప్రేరణలవల్ల ఇంతటి మార్పులు జరగగలవని చాలామందికి తెలియదు. అందుచేత ఆలోచనలన్నీ స్వతంత్రంగా మన మనసులో ఉత్పన్నమౌతాయని అనుకునేవారికి ఇది ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది. ఆదిమయుగంలో ఏ చీకటి గుహలోనో కళ్ళు మూసుకుని కూర్చుని, తప్పెటల మోతలు వింటూ, మంత్రాలవంటి శబ్దాలను ఉచ్చరిస్తూ, వీటివల్ల కలిగే ప్రతిధ్వనులను కూడా వింటూ ఊగుతున్న గణాచారి మెదడులో ఎన్నెన్ని విచిత్ర భావనలు కలిగేవో మనం చెప్పలేం. "ఓం" కారంలోనే సర్వమూ ఇమిడి ఉందని నమ్మబలికే ఆధునిక గణాచారులకూ ఆటవికులలూ ఏమైనా తేడా ఉందా? దొంగ స్వాముల సంగతి ప్రస్తుతానికి వదిలేసినా యాంత్రికంగా మెదడు మీద పనిచేసే శబ్దాల ప్రభావాలను గుర్తించలేక "అలౌకిక ఆనందం" పొందుతున్నామనుకునే అమాయకులను చూసి ఏమనాలి? మతపరమైన భావాలు ఉత్పన్నం కావడానికి శబ్దాలు అనేక కారణాల్లో ఒక అంశం మాత్రమే. దేవుడున్నాడని వాదించేవారికి సమాధానం చెప్పాలంటే దేవుడు లేడని వాదిస్తే సరిపోదు. వారికి ఆ అపోహ ఎప్పుడు, ఎందుకు, ఎలా కలిగిందో కూడా చెప్పాలి.
posted by Rohiniprasad Kodavatiganti at 12:54 PM
"ఇందు" గలడు, "అందు" లేడు

సంప్రదాయవాదుల లెక్కన భగవంతుడంటే విశ్వాన్ని సృష్టించినవాడు. భగవంతుడంటే మానవులకు అలవికాని శక్తులున్నవాడు. భగవంతుడి గురించి అర్థం చేసుకోవాలంటే కళ్ళు మూసుకుని ధ్యానం చెయ్యాలే తప్ప హేతువాద దృష్టితో విశ్లేషించకూడదు. భగవంతుడి ప్రస్తావన అతి ప్రాచీనమైనది కనక ఈనాటి నాస్తికుల సందేహాలకు అర్థంలేదు. ఈ ప్రతిపాదనలన్నీ తప్పుడువేనని నిరూపించవచ్చు. ఎందుకంటే దేవుళ్ళూ, దేవతలూ, అతీతశక్తుల గురించిన భావనలు ఎటువంటివో, అవన్నీ ఎప్పుడు, ఎందుకు, ఎలా తలెత్తుతాయో ఈ నాడు ఎవరైనా అర్థం చేసుకోగలిగిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ద్వారా సమాజంలోనూ, చరిత్రలోనూ, విజ్ఞానశాస్త్రపరంగానూ మతవిశ్వాసాల సంకుచితత్వాన్ని గురించి తెలుసుకోవడం కష్టమేమీ కాదు. దేవుడనేవా డున్నాడా అంటే "ఇందు"లోనే, అంటే నమ్మేవాళ్ళ మూఢనమ్మకాల్లో మాత్రమే ఉన్నాడు. మరెక్కడా లేడు. అటువంటి నమ్మకాల గురించీ, మెదడులో కలిగే గందరగోళం గురించీ కూడా ఈనాటి శాస్త్రవిజ్ఞానం వివరించగలుగుతోంది. మొత్తం మీద దేవుడున్నాడనే వాదన రానురాను బలహీనపడుతోంది. ప్రకృతి గురించి అర్థం చేసుకోగలుగుతూ, దాని మీద కొంత ఆధిపత్యాన్ని కూడా చలాయించే స్థాయికి చేరిన ఆధునిక మానవులకు ప్రకృతిలోని మిస్టరీలన్నీ క్రమంగా అవగాహనకు వస్తున్నాయి. మతాలకూ, దైవిక శక్తుల భావనకూ అసలైన మూలాలు ప్రకృతి శక్తుల పట్ల ప్రాచీనులకు ఉండిన భయాల కారణంగానే మొదలయాయి కనక ఈ పరిణామాలు ముఖ్యమైనవి. అంతా మన కర్మ అనుకోకుండా, తమ పంటలు సరిగ్గా పండకపోయినా, బావుల్లో నీళ్ళన్నీ ఎండిపోయినా చదువురాని రైతులు కూడా ఈనాడు విత్తనాల నాణ్యతనూ, భారీ పంపుసెట్లతో భూగర్భజలాలని పీల్చేసే పొరుగు భూస్వాములనూ ప్రశ్నించే స్థితిలో ఉన్నారు. దేవుడి అస్తిత్వానికి ఎదురౌతున్న సవాళ్ళెటువంటివో చూద్దాం.

మొదటిది ప్రకృతి గురించిన అవగాహన. సీదా సాదా వాతావరణ సూచనలూ, పత్రికల్లో వార్తలూ చదివితే "భవిష్యత్తును" గురించి తెలుసుకోవచ్చుననేది మామూలైంది. ఇది ఎందుకు చెప్పాలంటే ఇటువంటి "పరిశీలనలు" జరిపి, రాబోతున్న వరదలను గురించి "జోస్యం" చెప్పిన ప్రాచీన ఈజిప్ట్‌ పూజారులు ఒకప్పుడు చాలా గొప్ప శక్తులున్నవారుగా పేరుపొందారు. ఈరోజుల్లో పరిశీలనలు చాలా ఉన్నత స్థాయిలో జరుగుతున్నాయి. భౌతిక, ఖగోళ శాస్త్రాలు నిత్యమూ కొత్త విషయాలను కనిపెడుతూనే ఉన్నాయి. లోకాన్ని "సృష్టించినది" ఎవరనే చర్చ మొదలుపెట్టే ముందు అసలు లోకమంటే ఏమిటో ఆధునిక పరిశోధనల వల్ల తెలుసుకోవడం వీలవుతోంది. విశ్వాంతరాళం ఎంత పెద్దదో, బిగ్‌ బేంగ్‌ ఎప్పుడు మొదలైందో శాస్త్రవేత్తలు తెలుసుకుంటున్నారు. మన పూర్వీకులను భయపెట్టిన ఉల్కలూ, తోకచుక్కలూ, గ్రహణాల వంటి ఖగోళ సంఘటనలు ఎటువంటివో ఈ రోజుల్లో స్కూలు పిల్లలు కూడా చెప్పగలరు. ఎంతో దూరాన ఉండే నక్షత్రాలూ, వాటి గ్రహాలూ, కాంతి కిరణాలూ అన్నీ మనకు తెలిసిన భౌతిక సూత్రాలనే అనుసరిస్తాయి. భూమివంటి గ్రహాల మీద తలెత్తే జీవరాశి అంతా ఈ భౌతిక పరిణామాలకు లోబడి ఉండవలసిందే. ఏ అగ్నిపర్వతమో బద్దలై లావా ప్రవహించనారంభిస్తే పరిసరాలన్నీ మొక్కలూ, ప్రాణులతో సహా కాలి బుగ్గి అయిపోతాయి. భౌతిక, భౌగోళిక పరిస్థితులన్నీ అనుకూలిస్తే తప్ప దేవుడు "బొమ్మను చేసీ, ప్రాణము పోసీ" పెంచిన జీవాలేవీ బతకలేవు. మరొకవంక అణువులూ, పరమాణువులూ, ప్రోటాన్‌, న్యూట్రాన్‌ మొదలైన కణాల అంతర్‌ నిర్మాణమూ వగైరాల సమాచారం కూడా పోగవుతోంది. పదార్థరాశిలో నిక్షిప్తమై ఉన్న బ్రహ్మాండమైన శక్తులు గురించి కొత్త విషయాలు తెలుస్తున్నాయి. కంటికి కనబడని డార్క్‌ మేటర్‌, విశ్వమంతా ప్రసరిస్తున్న న్యూట్రినోలూ వగైరాల గురించి ఇప్పుడిప్పుడే అర్థం అవుతోంది. విశ్వంలో అక్కడక్కడా కనబడసాగిన బ్లాక్‌హోల్‌ కృష్ణబిలాలు ప్రతి గేలక్సీ కేంద్రంలోనూ ఉన్నట్టుగా పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. మన ప్రాచీనులు సృష్టి, స్థితి, లయ గురించి స్థూలంగా ఊహించి చెప్పారే తప్ప అంతరిక్షంలోని ఈ వివరాల ప్రసక్తి ఏ పవిత్ర గ్రంథంలోనూ కనబడదు. హిందూమతానికి ప్రత్యేకమైన లోపమేదీ లేకపోవచ్చుగాని, వేదాల్లో అన్నీ ఉన్నాయష అనేది తెలుగువారికి ఒక జోక్‌ అయిపోయింది. మన కేలండర్‌ బొమ్మల మీద కనిపించే దేవుళ్ళే ఇవన్నీ "సృష్టించారని" నమ్మడం ఎవరికైనా నానాటికీ కష్టం అయిపోతోంది. ఆదివారపు ఉదయం సముద్ర తీరాన చర్చికి వెళ్ళిన భక్తులంతా సునామీలో కొట్టుకుపోవడం "భగవదేచ్ఛ" అని నమ్మడం కన్నా, మనుషులతో ప్రమేయం లేకుండా, "ఉద్దేశ" రహితంగా సముద్రగర్భంలో జరిగిన ప్రక్రియల ఫలితమేనని అంగీకరించక తప్పడం లేదు. ఇదంతా కర్మ పరిపాకం అని సరిపెట్టుకోకుండా, అలాంటివి జరిగే ముందే పసికట్టే పరికరాలని అమర్చుకోవడం తెలివైన పని.
చరిత్ర, పురాతత్వ పరిశోధనలవల్ల మతభావనలు ఆటవిక దశలో మనుషులకు ఎలా అలవడ్డాయో చెప్పగలిగే ఆధారాలున్నాయి. పూజారి వర్గాలు ఎలా ఏర్పడ్డాయో, శ్రమ విభజన ఎలా మొదలైందో, సామాన్యులను పాలకవర్గాలు ఎలా అదుపులో ఉంచాయో అన్నీ చెప్పవచ్చు. వేల ఏళ్ళ క్రితం పశ్చిమ యూరప్‌లో కెల్ట్‌ జాతి ప్రజలూ, డ్రూయిడ్లూ, దక్షిణ అమెరికాలో ఇన్కాజాతివారూ,ఇలా ప్రతీ ప్రాంతంలోనూ మతం పేరుతో చిన్నపిల్లలనూ, పెద్దవారినీ కూడా ఎలా బలి ఇచ్చేవారో తెలిపే సాక్ష్యాలున్నాయి. ఇవన్నీ మతాల ఆటవిక మూలాలను సూచిస్తాయి. తరవాతి చరిత్రలో మతాలకి చెడ్డ పేరు తెచ్చే సంఘటనలకు అంతు లేదు. మధ్య యుగాల క్రూసేడ్లన్నీ రాజకీయ కుట్రల, పోరాటాల ఫలితమే. వివిధ మతాల మధ్య అనాదిగా జరుగుతున్న సంఘర్షణలు కాక నిన్నా మొన్నా కేథలిక్‌, ప్రొటెస్టంట్ల మధ్యా, ప్రస్తుతం షియా, సున్నీల మధ్యా జరుగుతున్న పోరాటాలు మతాల మీద సామాన్య ప్రజలకి ఉన్న నమ్మకాలని దెబ్బ తీస్తున్నాయి. భక్తులనబడే వీరందరూ కొట్టుకు చస్తూ ఉంటే భగవంతుడు "కళ్ళూ, చెవులూ మూసుకుని" కూర్చున్నాడని అనుకోవాలి. దేవుడి సంగతి ఎలా ఉన్నా దేవుణ్ణి నమ్మేవారు మాత్రం "కళ్ళూ, చెవులూ మూసుకుని" ధ్యానం చేసుకోక తప్పేట్టు లేదు. ఎందుకంటే మన చుట్టూ జరుగుతున్న సంఘటనల్లో మతవిశ్వాసాలని బలపరిచేది ఒక్కటి కూడా ఉన్నట్టు కనబడదు.
సంఘపరంగా మతవిశ్వాసాలు ఒకప్పుడు మనుషులను బలమైన సామూహికశక్తిగా తీర్చిదిద్దినమాట నిజమే కాని, దేవుణ్ణి పాలక వర్గాల తొత్తుగా చేసేశాక అణగారిన వర్గాలకు దేవుడు ఒరగబెట్టినదేమీ లేదు. సమాజంలో నిత్యమూ జరుగుతున్న అన్యాయాలకు అంతు లేదు. డబ్బూ, అధికారమూ ఉన్నవాడికి జరిగే "న్యాయం" అందరికీ వర్తించదు. ఎవెరినైనా తుపాకీతో కాల్చి హత్య చెయ్యబోయిన మనిషి ఏ సినిమా స్టారో అయితే అమలయే చట్టం వేరు. నిరుపేదలకూ, బడుగు ప్రజానీకానికీ రూల్సు వేరు. ఎవరి పాపమూ ఎవరినీ "కట్టి కుడుపుతున్న" దాఖలాలేవీ లేవు. దైవభీతీ, పాప భీతీ ఉండవలసినది అట్టడుగు వర్గాలకే అని అందరికీ తెలిసిపోతోంది. మతానికి ఉన్న రాజకీయ పక్షపాత వైఖరి మనకు కొత్త కాదు. మతపరమైన విషయాలన్నీ సంస్కృతిలో భాగాలైపోయాయి. చిన్న తెగలుగా జీవించినప్పుడు మనుషులను ఏకం చేసిన మతభావనలే ప్రజలను దేశాల, ప్రాంతాల, జాతులవారీగా విభజించడానికి పనికొచ్చాయి. సర్వమానవ సౌభ్రాతృత్వం లేకపోగా మతవిద్వేషాలు ఎన్నో శతాబ్దాల నుంచీ అంతులేని రక్తపాతాన్ని కలిగించాయి. రథయాత్రలూ, బాంబు దాడులూ మతం పేరుతో వివిధ వర్గాలను రెచ్చగొట్టటానికే ఉపయోగపడుతున్నాయి. పవిత్ర గ్రంథాల్లో నీతిసూత్రాలకు పరిమితం అయిన మతబోధనలన్నీ వాస్తవరూపంలో నరరూప రాక్షసులను తయారుచేస్తున్నాయి. ఏది పాపం, ఏది పుణ్యం, ఏ మతం గొప్పదో, ఎటువంటి మతహింస ప్రశంసనీయమైనదో ఏ దేవుడూ చెప్పలేడు. దేశపు సరిహద్దుకు ఇటువైపున ఉన్నవారికి పవిత్రమైన దినాలూ, ఘడియలూ అటు ఉన్నవారికి ఎందుకు వర్తించవో తెలీదు. తప్పనిసరిగా చెయ్యవలసిన పూజలూ, వ్రతాలూ, శాంతులూ, ఉపవాసాలూ, పండగలూ ఒకే దేశవాసులలోకూడా అందరూ పాటిస్తున్నట్టు కనబడదు. దేవుళ్ళ పేరుతో నడిపే ఈ హాస్యాస్పదమైన తంతులన్నీ ఆధునికతను వెక్కిరించేవిగా పరిణమిస్తున్నాయి. బలహీనులను బలవంతులు అణుస్తూ ఉంటే తక్కినవారంతా కళ్ళూ, నోరూ మూసుకుని ఉండటానికి తప్ప ఈ దైవచింతన మరెందుకూ పనికిరావటం లేదు.

జీవశాస్త్రంలో అతివేగంగా జరుగుతున్న పరిశోధనలు మతవిశ్వాసాలకు గొడ్డలి పెట్టు అవుతున్నాయి. పంతొమ్మిదో శతాబ్దంలో సేంద్రియ జీవపదార్థానికీ, రసాయన పదార్థాలకీ సంబంధం ఉందనేది మొదటగా తెలిశాక జీవకణాల సంగతులన్నీ ఒకటొకటిగా బైటపడుతూ వచ్చాయి. ఒక వంక డార్విన్‌ సిద్ధాంతాలవల్ల మనుషులకూ, తక్కిన ప్రాణులకూ ఉన్న సంబంధ బాంధవ్యాలు అవగాహనకు వచ్చాయి. జీవరాశి భూమి మీద ఎటువంటి పరిస్థితుల్లో ఆవిర్భవించిందో, అందులో ఇంతటి వైవిధ్యం ఎలా ఏర్పడిందో, జీవపరిణామాన్ని భౌతిక పరిస్థితులు ఎన్ని రకాలుగా శాసిస్తాయో అన్నీ శాస్త్రవేత్తలు తెలుసుకోగలిగారు. జన్యువుల నిర్మాణం ఎటువంటిదో, శరీరలక్షణాలను నియంత్రించే ప్రక్రియలు ఎటువంటివో తెలుసుకున్నాక కొన్ని రోగాలు రాకుండా జన్యుస్థాయిలో మార్పులు చెయ్యడం కూడా ఈనాడు సాధ్యపడుతోంది. కృత్రిమంగా రెండేసి తలలున్న కోడి పిల్లలవంటి వాటిని పుట్టించగలిగే స్థాయికి జన్యుశాస్త్రం ఎదిగింది. రోగాల వ్యాప్తిలో, చావు పుటకలలో జరిగే జీవప్రక్రియలన్నీ తేటతెల్లం అవుతున్నాయి. జీవసృష్టిలో దేవుడి ప్రమేయం ఏదీ లేదని స్పష్టమైపోతోంది.

బాహ్యప్రపంచంలోని వివిధ రంగాలనుంచి దేవుడికి స్థానభ్రంశం కలుగుతూ ఉంటే ఇక ఆస్తికులకి మిగిలిందల్లా తమ మనసులోని భావాలే. ఆధ్యాత్మిక అనుభూతులన్నీ వర్ణించడానికి వీలు కానటువంటివనీ, దేవుడి ఉనికిని నిజంగా గుర్తించగలిగినది భక్తుల మనసేననీ వారు వాదిస్తారు. సైన్సు ఈ ప్రతిపాదనని కూడా కొట్టిపారేస్తోంది. గత పది, పదిహేనేళ్ళుగా మనిషి మెదడు నిర్మాణమూ, అది పనిచేసే తీరూ నిశితమైన పరిశోధనలకు లోనవుతున్నాయి. యదార్థతతో సంబంధం లేని భావాలూ, ఆలోచనలూ ఎటువంటి నాడీ ప్రక్రియలవల్ల తలెత్తుతాయో, "అతీంద్రియ" భావనల లక్షణాలేమిటో, ఏ మనోస్థితిలో మెదడులో ఎటువంటి జీవరసాయనిక ప్రక్రియలు జరుగుతాయో అంతా శాస్త్రవేత్తలకు అర్థమౌతోంది. కృత్రిమ ప్రేరణల ద్వారా మెదడులో ఆధ్యాత్మిక భావనలు కలిగించవచ్చునని నిరూపించడంతో మతాలకు ఆధారమైన భావజాలమంతా కేవలం మెదడులోని నరాల మాయాజాలమే అనేది తెలిసిపోయింది. భక్య్తావేశానికీ, మాదక ద్రవ్యాల ప్రభావానికీ, మూర్ఛ రోగుల లక్షణాలకూ పెద్దగా తేడాలు లేవని స్పష్టమౌతున్న పరిస్థితిలో దేవుడికి మనుషుల మెదడులో కూడా స్థానం లేకుండా పోతోంది.
అయినప్పటికీ మతవిశ్వాసాలను పాలకవర్గాలు పనిగట్టుకుని ప్రోత్సహిస్తూ, సామాన్యులని మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తూనే ఉంటాయి. మతాలకి ప్రతీకలైన దేవాలయాలకూ, మసీదులకూ అంతులేని నిధులు సరఫరా అవుతూనే ఉంటాయి. మూఢవిశ్వాసాలదే రాజ్యం. ఈ వ్యవస్థలో బాగుపడుతున్న ఉన్నత వర్గాలన్నీ వీటికి వత్తాసు పలుకుతూ వెనకబడ్డవారికి "మార్గ దర్శనం" చేస్తూ ఉంటారు. గట్టిగా, ఖంగుమని మారుమోగుతున్న అబద్ధాలన్నీ నిజాలుగా చలామణి అవుతూ ఉంటాయి. అందరికీ అందుబాటులో ఉన్న విజ్ఞానాన్ని పక్కన పెట్టిన "విద్యాధికు" లందరూ దైవ భజనలు చేస్తూ కాలం గడుపుతారు. కుట్ర పబ్లిక్‌గా కొనసాగుతూనే ఉంటుంది.
చేతబడుల గురించిన నమ్మకాలూ, గ్రామదేవతలకిచ్చే బలులూ మొదలైనవన్నీ పల్లె ప్రజల మూఢవిశ్వాసాలకు ప్రతీకలని ఆధునిక ఆస్తికులకు కూడా అనిపించడం సహజం. భౌతికవాదం ప్రతిదాన్నిగురించీ "ఉన్నదున్నట్టుగా" వివరించడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. కనబడనివాటిని ఊహించుకుని సంతృప్తి చెందడమో, బెంబేలు పడడమో మనుషులకు ప్రకృతిరీత్యా అబ్బిన ఒక లక్షణం అనుకోవచ్చు. మతాలూ, మూఢనమ్మకాలూ తలెత్తడానికి కారణం అదే.

నెలల పేర్లుడా. కొడవటిగంటి రోహిణీప్రసాద్‌స్కూళ్ళు తెరిచేదెప్పుడో, పరీక్షల కెన్నాళ్ళున్నాయో, వేసవి సెలవలు ఎప్పుడొస్తాయో అన్నీ తెలుసుకోవడానికి మనం నెలలు లెక్క పెడుతూ ఉంటాం. భూమి సూర్యుడి చుట్టూ ఒకసారి తిరిగి రావడానికి ఏడాది అవుతుంది. ఒక ఏడాది అంటే 365 రోజులనుకుంటాం కాని ఖచ్చితంగా చెప్పాలంటే అది 365 రోజుల, 5 గంటల, 48 నిమిషాల, నలభై అయిదున్నర సెకండ్ల వ్యవధి. సంవత్సరానికి పన్నెండు నెలలనీ, వాటికి ఇంగ్లీషులో జనవరి, ఫిబ్రవరి వగైరా పేర్లుంటాయనీ మీకు తెలిసినదే. ఇవి కాక మనవాళ్ళు ఉగాది నుంచీ చైత్రం, వైశాఖం మొదలైన పేర్లతో 12 నెలలు లెక్క పెడుతూ ఉంటారు. టైము ఆగకుండా నడుస్తూనే ఉంటుంది కాని మన వీలును బట్టి దాన్ని నిమిషాలూ, గంటలూ, రోజులూ, నెలలూ, సంవత్సరాలుగా లెక్కపెట్టుకుంటాం. అసలీ నెలల పద్ధతి ఎప్పుడు, ఎలా మొదలైంది?

లక్షల సంవత్సరాల నుంచీ మనుషులు ఆకాశంలో సూర్యుణ్ణీ, చంద్రుణ్ణీ, నక్షత్రాలనూ గమనిస్తూనే ఉన్నారు. చంద్రబింబం నెలకొకసారి అమావాస్య రోజున కనబడకుండా పోతుందనీ ఆ తరవాత క్రమంగా పెద్దదై పౌర్ణమి నాటికల్లా పూర్తిగా కనిపిస్తుందనీ వారు తెలుసుకున్నారు. చంద్రుడి కళలను బట్టి లెక్క పెట్టేవే నెలలు. అందుకే చందమామను నెలవంక అని కూడా అంటారు. మొదట్లో ఈ పద్ధతిలోనే లెక్క పెట్టేవారు. ఎటొచ్చీ కేవలం చంద్రుడిని బట్టి పన్నెండు నెలలు లెక్క కడితే ఏడాదికి 354 రోజుల పదకొండుంబాతిక రోజులే వస్తాయి. ప్రకృతిలో రుతువుల్లోని మార్పులన్నీ సూర్యుడి గమనాన్ని బట్టే కలుగుతాయి కనక చంద్రుడి ఆధారంగా నెలలను లెక్కపెట్టే పద్ధతి సరిగ్గా అనిపించలేదు. ఆధునిక పద్ధతిలో నెలలను ఆ రకంగా లెక్కించరు. 28 నుంచి 31 రోజుల దాకా నెలల వ్యవధి రకరకాలుగా ఏర్పాటయి ఉంటుంది.

పురాతన కాలంలో ఇప్పటి ఇరాక్‌ ప్రాంతంలో విలసిల్లిన సుమేరియన్‌ నాగరికతలో ఏడాదికి 12 నెలలనీ, నెలకు 30 రోజులనీ లెక్కించేవారు. ప్రాచీన ఈజిప్ట్‌లోనూ అదే పద్ధతి ఉండేది కాని చివరలో అదనంగా 5 రోజులు చేరుస్తూ ఉండేవారు. క్రీ.పూ.238లో నాలుగేళ్ళ కొకసారి ఒక రోజును చేర్చుకోవాలనే పద్ధతిని వారు ప్రవేశపెట్టారు. లీప్‌ సంవత్సరంగా ఇప్పటికీ అది అమలులో ఉంది. క్రీ.పూ. ఏడో శతాబ్దం దాకా రోమన్‌ కేలండర్‌ పద్ధతిలో ఏడాది మార్చ్‌లో మొదలై పది నెలలపాటే కొనసాగేది. ఆ తరవాత జనవరి, ఫిబ్రవరి నెలలను చేర్చుకున్నారు. అయినప్పటికీ కొన్ని నెలలకు 29, కొన్నిటికి 30 చొప్పున రోజులుండేవి కనక అంతా తికమకగా తయారయింది. క్రీస్తు పుట్టుకకు 45 ఏళ్ళ క్రితం జూలియస్‌ సీజర్‌ అనే రోమన్‌ నేత ఈ వ్యవహారాన్ని సరిదిద్ది, ఇప్పుడు మనం పాటిస్తున్న పద్ధతిని ప్రవేశపెట్టాడు. తాను పుట్టిన తేదీని బట్టి ఆనాడు క్వింటిలిస్‌ అనే పేరున్న నెలకు తన పేరు పెట్టి జూలైగా మార్చాడు. అతని తరవాత అధికారం చేపట్టిన ఆగస్టస్‌ సీజర్‌ ఆ తరవాతి నెలను ఆగస్ట్‌గా మార్చాడు. ఈ జూలియన్‌ కేలండర్‌ లెక్కకూ, సూర్యుడి గమనానికీ 11 నిమిషాల పైగా తేడా ఉండేది. ఇది శతాబ్దాల పాటు పెరిగి కొంత గందరగోళం కలిగించింది.

పదహారో శతాబ్దంలో గ్రిగొరీ అనే రోమన్‌ మతాధికారి పోప్‌గా వ్యవహరిస్తున్నప్పుడు 1600 సంవత్సరాన్ని లీప్‌ సంవత్సరంగా నిర్ణయించాడు. ఈ గ్రిగోరియన్‌ పద్ధతిని అన్ని దేశాలూ అనుసరించడంతో ఇప్పటికీ అదే కొనసాగుతోంది. ఇందులో సంవత్సరాలన్నిటినీ ఏసు క్రీస్తు పుట్టిన సంవత్సరం నుంచీ లెక్కిస్తారు. దీనికి భిన్నంగా యూదు మతస్థులు గత 1200 ఏళ్ళుగా హీబ్రూ కేలండర్‌ను అనుసరిస్తున్నారు. వారి లెక్కన సృష్టి అనేది క్రీ.పూ.3761లో మొదలైంది. ఇస్లామ్‌ మతంలో క్రీ.శ.622 నుంచీ లెక్కిస్తారు. హిందూ పద్ధతిలో ప్రస్తుతం శాలివాహన శక సంవత్సరం 1928 నడుస్తోంది. ఇదే విక్రమ సంవత్సరం 2062 అవుతుంది.

జనవరి అనే నెల జానస్‌ అనే రోమన్‌ దేవత పేరున ప్రారంభమైంది. అలాగే ఫిబ్రవరి అనేది ఫెబ్రువా అనే రోమన్‌ దేవత వల్ల వచ్చింది. ఇందులో మొదట 29 రోజులుండేవి కాని ఇందులోంచి ఒకటి తగ్గించి ఆగస్ట్‌లో చేర్చారు. మార్చ్‌ అనేది యుద్ధాలకు అధిదేవత అయిన కుజుడి పేరుతో (మార్స్‌) ఏర్పడింది. ఏప్రిలిస్‌ అనే మాట నుంచి ఏప్రిల్‌ నెల పేరు వచ్చింది. ఇది (అపెరీరె) ప్రారంభాన్ని సూచిస్తుందని అంటారు. మేయెస్తా అనే రోమన్‌ దేవత వల్ల మే నెల పేరు వచ్చి ఉండవచ్చు. జూన్‌ అనే పేరుకు రోమన్‌ దేవత జూనో కారణమనీ, జూనియస్‌ అనే తెగ కారణమనీ రకరకాల ప్రతిపాదనలున్నాయి. పైన చెప్పినట్టుగా జూలై, ఆగస్ట్‌ నెలలకు రోమన్‌ చక్రవర్తుల పేర్లు ఆధారం. మొదట్లో సెప్టెంబర్‌ ఏడో నెలగా ఉండేది. సంస్కృతానికీ, లాటిన్‌ భాషకూ పోలికలున్నాయి. సంస్కృతంలో ఏడు, ఎనిమిది వగైరా సంఖ్యలను సప్తమ, అష్టమ, నవమ, దశమ అంటారు కనక ఈ శబ్దాలను పోలిన పేర్లుగా సెప్టెంబర్‌, అక్టోబర్‌, నవంబర్‌, డిసెంబర్‌ కనబడతాయి. మొత్తం మీద సూర్య చంద్రుల కదలికలోని తేడాలవల్ల నెలలన్నీ తలొక రకంగా రూపొందాయి. ఇది కాక నాలుగేళ్ళకొకసారి ఏడాదికి ఒక రోజు కలుపుకుంటూ ఉంటాం.

ఇంగ్లీషు నెలల పేర్లతో బాటు మనవాళ్ళు పెట్టుకున్న పేర్లు కూడా మనం మరచిపోకూడదు. వాటిని మరొక్కసారి గుర్తు చేసుకుందాం చైత్రం, వైశాఖం, జ్యేష్ఠం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వయుజం, కార్తీకం, మార్గశిరం, పుష్యం, మాఘం, ఫాల్గుణం. మీ స్నేహితులకు కూడా ఇవి నేర్పించండి.

21 Feb 2012

తేనెలూరు తెలుగు


హోం > గుంటూరు జిల్లా


నేడు అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం
అమ్మదనం నిండిన ది.. అమృతం కురిపించేది.. తేనెధారలా కమ్మనైనది..
తెలుగు భాష. మన ఆ మాతృభాష ఇప్పుడు మృతభాష అవుతోంది. ‘మమ్మీ డాడీ’
 పిలుపుల మధ్య ‘అమ్మానాన్న’లోని మాధుర్యాన్ని మరిచిపోతున్నాం.
ప్రపంచంలో తెలుగు భాష మాట్లాడేవారు 18 కోట్ల మంది ఉన్నారనే నిజం
గొప్పగా చెప్పు కొనేందుకే పరిమితమవుతోంది. ప్రభుత్వాల నిర్లక్ష్యం, తలిదండ్రుల
అలసత్వం వెరసి తెలుగు భాష పరిరక్షణలో అంతా విఫలమవుతున్నాం.
తెలుగు వెలుగులను ఆరిపోనీకుండా చూడాల్సిన బాధ్యత మనందరిదీ.
అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం నేడు. ఈ సందర్భంగా

ప్రత్యేక కథనం..
అమ్మ భాష.. అమృతం కన్నా తీయనైన భాష తెలుగు. అందుకే దానిని దేశ
భాషలందు లెస్స అని కీర్తించారు శ్రీకృష్ణదేవరాయలు. తేనె కంటే తీయనిదని
కొనియాడారో కవి. తెలుగుభాష కీర్తిని ఎందరో మహానుభావులు తమ కవితా
సంకలనాల్లో వేనోళ్లా పొగిడారు. ప్రాచీన భాషగా గుర్తింపు పొందిన తెలుగు
ఆధునికకాలంలో తన ప్రాభావాన్ని కోల్పోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయి.

గుంటూరు ఎడ్యుకేషన్, న్యూస్‌లైన్ : మాతృభాషపై మమకారం పెంచుకున్న
ఎందరో మహనీయులు తేనెలూరు తెలుగును కాపాడేందుకు శ్రమించారు.
ప్రస్తుతం తెలుగునేలపై మాతృభాష కోసం ఉద్యమం చేయాల్సిన పరిస్థితులు
ఎదురయ్యాయి. ఒక్కసారి గతంలోకి తొంగి చూస్తే మనం మాట్లాడే తెలుగుభాషలోనే
 పరిపాలన సాగాలని, అందుకు ప్రత్యేక రాష్ట్రం అవసరమని 1913లో బాపట్లలో
జరిగిన ఆంధ్ర మహాసభ తీర్మానించింది. ఉద్యమం ప్రారంభమైన 40 ఏళ్ల అనంతరం
పొట్టి శ్రీరాములు బలిదానంతో 1953లోఆంధ్రరాష్ట్రం ఆవిర్భవించింది. వావిలాల
గోపాలకృష్ణయ్య తెలుగుభాషాభివృద్ధికి చేసిన పోరాటం తెలుగు ప్రజలు
మరువలేనిది. దాని ఫలితంగా తెలుగును అధికార భాషగా గుర్తిస్తూ 1964లో
చట్టం చేశారు. అధికార భాషా సంఘం ఏర్పడినా రాజకీయ నాయకుల అలసత్వం,
అధికారుల స్వార్థం కారణంగా తెలుగుభాషకు తీరని అన్యాయం జరుగుతోందని
పలువురు ఆరోపిస్తున్నారు. పోరాటాల ఫలితంగా సాధించుకున్న ప్రభుత్వ
ఉత్తర్వులు సైతం అమలుకు నోచుకోవడం లేదు.

ఏటా ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహిస్తున్నా అధికారభాషగా తెలుగుకు
కలిగిన ప్రయోజనం శూన్యం. పాఠశాల స్థాయిలోనే భాషకు పునాది వేయాల్సిన
పరిస్థితుల్లో మాతృభాషపై విషబీజాలు నాటుతూ ఆంగ్లంపై ఎక్కడలేని మమకారం
చూపుతూ చివరికి మాతృభాషనే దూరం చేసుకునే పరిస్థితులు ఎదురవుతున్నాయి.
 ప్రపంచవ్యాప్తంగా రాణిం చేందుకు ఆంగ్ల భాష ఎంత అవసరమో, సమాజంలో
మనిషిని మనిషిగా తీర్చిదిద్దేందుకు మాతృభాష అంతకు మించిన అవసరం.
తెలుగుభాషకు జరుగుతున్న అన్యాయంపై ప్రభుత్వాలు ఇప్పటికైనా కళ్లు
తెరవాల్సిన అవసరం ఉందని భాషా ప్రియులు గగ్గోలు పెడుతున్నారు. అంతర్జాతీయ
 మాతృభాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని పలువురు భాషా ప్రియులు,
భాషోద్యమ నేతలు తమ అభిప్రాయాలు ‘న్యూస్‌లైన్’తో పంచుకున్నారు.

ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలి..
తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో ప్రత్యేక మంత్రిత్వ శాఖలున్నట్లుగా రాష్ట్రంలో తెలుగు
భాషకు మంత్రిత్వ శాఖ లేకపోవడం వల్ల తెలుగుకు సంబంధించిన సమస్యలు
ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి ఏర్పడింది. విద్యా, పరిపాలనా రంగాల్లో
తెలుగుకు ప్రభుత్వ సహకారాన్ని పొందడానికి తగిన అధికార వేదిక మంత్రిత్వ
శాఖతోనే సాధ్యమవుతుంది.
-డాక్టర్ వి.సింగారావు, కోశాధికారి, రాష్ట్ర తెలుగు భాషోద్యమ సమాఖ్య

విషబీజాలు నాటుతున్నారు..
భాషకు పునాది వేయాల్సిన విద్యాసంస్థల్లోనే తెలుగు భాషపై విద్యార్థుల మనసుల్లో
విషబీజాలు నాటుతున్నారు. ప్రాథమిక స్థాయిలో మాతృభాషలో పట్టులేని వారు
ఇతర భాషల్లోనూ రాణించలేరనే సత్యాన్ని తల్లిదండ్రులు సైతం గుర్తించాలి.
-వి.విజయ్‌కుమార్, కోశాధికారి, ఆర్‌యూపీపీ జిల్లా శాఖ

తెలుగు భాషను పరిరక్షించాలి..
ప్రపంచదేశాల్లో తెలుగు భాష మాట్లాడే ప్రజలు 18 కోట్ల మంది ఉన్నప్పటికీ రాష్ట్రంలో
దాని పరిరక్షణకు ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు శూన్యం. భాషా సంస్కృతుల
పరిరక్షణకు సభా సంఘాన్ని శాశ్వత స్థాయిలో ఏర్పాటుచేసి తెలుగు భాషను
పరిరక్షించాలి.
-పెద్దిశెట్టి భవాని, మహిళా కార్యదర్శి, ఆర్‌యూపీపీ జిల్లా శాఖ

తెలుగులో మాట్లాడితే నేరమా..
ఇంగ్లిష్ మీడియం పాఠశాలల్లో తెలుగు మాట్లాడడాన్ని నేరంగా పరిగణించి
 విద్యార్థులను శిక్షించడం అలవాటుగా మారింది. వివిధ ప్రాంతాల మాండలికాలు,
 యాసలను హేళన చేస్తూ వక్రీకరిస్తున్నారు. తెలుగు భాషా సంస్కృతిపై గౌరవాన్ని
 పెంపొందించే ప్రత్యేక చట్టం తేవాలి.
-డాక్టర్ పాకనాటి సూర్యకుమారి, తెలుగు అధ్యాపకురాలు

తెలుగు బోధన తప్పనిసరి
ప్రాథమిక విద్య తెలుగులోనే బోధిస్తే పిల్లలకు భాషపై అభిమానం ఏర్పడుతుంది.
హైస్కూల్ విద్యలో సైతం తెలుగును ఒక పాఠ్యాంశంగా తప్పనిసరి చేయాలి.
ఇంటర్ మొదలు, పీజీ, సాంకేతిక వృత్తి విద్యా కోర్సుల్లోనూ తెలుగును తప్పనిసరి
చేస్తూ ప్రభుత్వం చట్టం చేయాలి.
-నాగభైరవ ఆదినారాయణ, జిల్లా అధ్యక్షుడు, తెలుగు భాషోద్యమ సమాఖ్య

నేడు అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం


హైదరాబాద్: మాతృభాషపై మమకారం పెంచుకున్న ఎందరో మహనీయులు
తేనెలూరు తెలుగును కాపాడేందుకు శ్రమించారు. ప్రస్తుతం తెలుగునేలపై
మాతృభాష కోసం ఉద్యమం చేయాల్సిన పరిస్థితులు ఎదురయ్యాయి. ఒక్కసారి
గతంలోకి తొంగి చూస్తే మనం మాట్లాడే తెలుగుభాషలోనే పరిపాలన సాగాలని,
అందుకు ప్రత్యేక రాష్ట్రం అవసరమని 1913లో బాపట్లలో జరిగిన ఆంధ్ర మహాసభ
తీర్మానించింది. ఉద్యమం ప్రారంభమైన 40 ఏళ్ల అనంతరం పొట్టి శ్రీరాములు
బలిదానంతో 1953లో ఆంధ్రరాష్ట్రం ఆవిర్భవించింది. వావిలాల గోపాలకృష్ణయ్య
తెలుగుభాషాభివృద్ధికి చేసిన పోరాటం తెలుగు ప్రజలు మరువలేనిది. దాని
ఫలితంగా తెలుగును అధికార భాషగా గుర్తిస్తూ 1964లో చట్టం చేశారు. అధికార
భాషా సంఘం ఏర్పడినా రాజకీయ నాయకుల అలసత్వం, అధికారుల స్వార్థం
కారణంగా తెలుగుభాషకు తీరని అన్యాయం జరుగుతోందని పలువురు
ఆరోపిస్తున్నారు. పోరాటాల ఫలితంగా సాధించుకున్న ప్రభుత్వ ఉత్తర్వులు
సైతం అమలుకు నోచుకోవడం లేదు.

దోమ తెరలు వాడండి ఐదు జబ్బులు నిరోధించండి


* దోమ కుట్టడం వల్ల మనం 5 ప్రమాదకర వ్యాధులకు గురవుతాం.
* అవి మలేరియా, డెంగీ జ్వరం, మెదడువాపు, చికున్‌గున్యా, బోధ వ్యాధి.
* మలేరియా, డెంగీ, మెదడువాపు వాపుతో మరణం సంభవించొచ్చు.
* చికున్‌గున్యా దీర్ఘకాలం నొప్పులతో బాధపెడుతుంది. బోధ వ్యాధి దీర్ఘకాలం వైకల్యాన్ని కలిగిస్తుంది.
* దోమ తెరలు వాడటం వల్ల మనం ఈ ఐదు వ్యాధుల నుండి రక్షణ పొందవచ్చు.
* 18వ శతాబ్దంలోనే దోమతెరలు వాడారట. ఈజిప్టు మహారాణి క్లియోపాత్ర తెరలోపలే నిదురించేదట.
* సూయజ్‌ కాల్వ నిర్మాణంలో అక్కడ పనిచేసే వారికి మలేరియా ఎక్కువగా వచ్చేదట. వారు దోమ తెరలు వాడి మలేరియాను తగ్గించుకున్నారట.
* సాధారణంగా మనం దోమతెరలు నూలు, నైలాన్‌, పాలిఎస్టర్‌ దారంతో చేస్తాం.
* ఇప్పుడు దోమల జబ్బుల నిర్మూలన కార్యక్రమంలో భాగంగా 'క్రిమి సంహారక మిలిత దోమ తెరలు' , 'చిరకాలం మన్నే క్రిమిసంహారిణి దోమతెరలు' అందుబాటులోకి వచ్చాయి. మన దేశంలో వీటిని ప్రభుత్వం ఎంపిక చేసిన ప్రాంతాలలో ఉచితంగా పంపిణీ చేస్తుంది. ఇవి దోమలను దగ్గరకు రానివ్వవవు. దోమలను చంపెస్తాయి.

గాలి కాలుష్యంతో గుండెపోటు


ఏడు రోజులపాటు కాలుష్యానికి ప్రభావితమైతే గుండెపోటు ప్రమాదం పెరుగుతుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. హానికరమైన అధిక గాలి కాలుష్య సంఘటనలు ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయని 50 ఏళ్ల నుంచి అనుమానిస్తున్నారు. తక్కువ వ్యవధి గాలి కాలుష్యానికి ప్రభావితమవడానికి, గుండె పోటు ప్రమాదానికి మధ్య ఉన్న సంబంధంపై పారిస్‌ డిస్కరట్స్‌ విశ్వవిద్యాలయానికి చెందిన హజ్‌రిజి ముస్టఫిక్‌, అతని సహచర బృందం వ్యవస్థీకృత సమీక్ష చేశారు. ప్రధానమైన గాలి కాలుష్యం కారకాలను వీరు విశ్లేషించారు. ఇందులో ఓజోన్‌, కార్బన్‌ మోనాక్సైడ్‌, నైట్రోజన్‌ డైయాక్సైడ్‌, సల్ఫర్‌ డయాక్సైడ్‌, కాలుష్యకణాల వ్యాసార్థం 10 మైక్రోమీటర్ల నుంచి 2.5 మైక్రోమీటర్ల వరకు ఉన్నాయి. ఈ అంశానికి సంబంధించిన వైద్యసాహిత్యాన్ని పరిశీలించారు. ఇందులో 34 అధ్యయనాలు విశ్లేషణ ప్రమాణానికి సరిపోయాయి. గాలి కాలుష్యంలో సి-రియాక్టివ్‌ ప్రోటీన్‌ ఉంటుంది. అధిక గాలికాలుష్యం స్థాయి ఉన్నప్పుడు గుండె కొట్టుకునే రేటు పెరగడం, తగ్గడం జరుగుతుంది. గాలి కాలుష్యం వల్ల రక్తం చిక్కదనం పెరుగుతుంది. ఇది రక్తం గడ్డకట్టడానికి, అథిరొస్క్లిరొసిస్‌కు దారితీస్తుంది. అయితే ధూమపానం, అధిక రక్తపోటు, మధుమేహం వల్ల వచ్చే గుండెపోటుతో పోలిస్తే గాలి కాలుష్యం వల్ల వచ్చే గుండెపోటు తక్కువే. తక్కువే కదా అని దీన్ని ఉపేక్షించకూడదు. ఎందుకంటే మెజారిటీ జనాభా గాలి కాలుష్యానికి ప్రభావితం అవుతున్నది. ముఖ్యంగా నగరాల్లోయువత, మధుమేహ రోగులు కాలుష్యబారినపడుతున్నారని పరిశోధకులు పేర్కొన్నారు. దీనిపై మరింత అధ్యయనాలు చేయాల్సిన అవసరం ఉందని వారు అభిప్రాయపడ్డారు.

ఖగోళ అద్భుతం


 • ఐదు గ్రహాలను వీక్షించే అవకాశం
సాధారణంగా మనం టెలిస్కోప్‌ ద్వారా తప్ప గ్రహాలను వీక్షించ లేమనే సంగతి తెలిసిందే. కాని...ఈ నెల 23 నుంచి ఖగోళ అద్భుతం ప్రారంభ మవుతోంది. రెండు వారాల పాటు కొన సాగే ఈ ఖగోళ అద్భుతం ఏమి టంటే.... బుధ, శుక్ర, అంగారక (కుజుడు), బృహస్పతి, శని గ్రహాలను నేరుగా వీక్షించవచ్చు. ఎటువంటి కళ్లద్దాలు గాని, సంబంధిత పరికరాలు గాని లేకుండానే ఈ గ్రహాలను చూడవచ్చు. అంగారక, శని గ్రహాలను ఇప్పటికే కళ్లకు సంబంధించిన పరికరాలు లేకుండా చూస్తూనే ఉన్నాం. ఇక ఈ నెల 23 నుంచి అంగాకర గ్రహాన్ని తూర్పు వైపున చూడవచ్చు. అదే సమయంలో శుక్ర గ్రహాన్ని పశ్చిమం వైపు సూర్యాస్త మయం తరువాత కూడా రాత్రి 9 గంటల వరకూ వీక్షించవచ్చు. బృహ స్పతిని శుక్రుడికి పైన రాత్రి 11 గంటల వరకూ చూడవచ్చు. ఈ వివరాలన్నీ ముంబయి లోని నెహ్రూ ప్లానిటోరియం డైరెక్టర్‌ అరవింద్‌ పరంజపే తెలిపారు. అంగార కుడు సింహ రాశిలో ఉంటాడు. సూర్యా స్తమయం తరువాత పశ్చిమాన ఈ గ్రహం కనబడుతుంది. ఎరుపు రంగులో ఉండే ఈ గ్రహాన్ని దాదాపు రాత్రంతా చూడవచ్చు. శని గ్రహాన్ని అర్థరాత్రి పూట తూర్పు వైపున చూడవచ్చు.

తెలుగుకు ఏదీ హోదా?


 • బివి ప్రసాద్
 • 21/02/2012
హైదరాబాద్, ఫిబ్రవరి 20: తెలుగు భాషకు విశిష్ట భాష హోదా కల్పించి నాలుగేళ్లు గడుస్తున్నా భాషాభివృద్ధి దిశగా నాలుగడుగులు కూడా ముందుకు పడలేదు. 2004లో తమిళ భాషకు విశిష్ట భాష హోదా కల్పించిన కేంద్ర ప్రభుత్వం తెలుగు, కన్నడ భాషలకు విశిష్ట హోదా కల్పించేందుకు నాలుగేళ్ల పోరాటం తప్పలేదు. ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవానికి ఒకరోజు ముందు ఎట్టకేలకు 2008 అక్టోబర్ 31న తెలుగు భాషకు సైతం విశిష్ట భాష హోదా కల్పించినట్టు కేంద్ర సాంస్కృతిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అయితే అప్పటికే తమిళనాడు హైకోర్టులో ఈ అంశంపై పిటిషన్ దాఖలు కావడంతో, దానిపై వచ్చే తీర్పునకు లోబడి తెలుగు భాషకు ప్రాచీన భాష హోదా కల్పించినట్టు కేంద్రం ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై రాష్ట్ర అంసెంబ్లీ 2010 మార్చి 19న ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానాన్ని చేసి కేంద్రానికి పంపించింది. ఈ తీర్మానంతో రాష్ట్ర ప్రభుత్వం చేతులు దులుపుకుంది. కేంద్రం తెలుగు భాషకు ప్రాచీన హోదా కల్పించిన నేపథ్యంలో దానికో సంస్థను, వ్యవస్థను, యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకతపై దృష్టి పెట్టకపోవడంతో, హోదా దక్కించుకుని నాలుగేళ్లు గడిచినా మనం సాధించింది శూన్యమే. ఈ మొత్తం వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి పట్టింపూ లేకపోవడంతోనే సమస్య అంతా వస్తోంది. కేంద్రం ఇచ్చింది- రాష్ట్రప్రభుత్వం ధన్యవాదాలు తెలిపింది అన్న చందంగా అసెంబ్లీ తీర్మానానికే పరిమితం కావడంతో అందరి కళ్లూ కేంద్రం ‘నిధుల’పైనే ఉన్నాయి. వాస్తవానికి ఈ కేంద్రం ఏర్పాటుకు పక్కా భవనం అనివార్యం కాగా, ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పట్టింపులేని విధంగా వ్యవహరిస్తోంది,. కనీసం పాతిక ఎకరాల భూమిని కేటాయించి తాత్కాలిక భవనాన్ని ఇస్తే తర్వాత తామే సొంతగా మంచి భవనాన్ని నిర్మిస్తామని కేంద్రం చెబుతోంది. ఈ కేంద్రం ఏర్పాటుకు అవసరమైన ప్రాథమిక వ్యవహారాలను చూసే బాధ్యతను కేంద్ర ప్రభుత్వం మైసూర్‌లోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్‌కు అప్పగించింది.
ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం తమిళంతోపాటు సంస్కృతం, పాళి, ప్రాకృతం, తమిళ భాషలకు ఈ నాలుగేళ్లలో దాదాపు 400కోట్ల రూపాయిలు పైగానే కేటాయించారు. ఈ నిధులపై ఉన్న దృష్టి భాషపై లేకపోవడంతో తెలుగుభాష అనాథగా మారింది.
ఇప్పటికే తెలుగు ప్రాచీన భాష హోదా లభించడంతో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ ఒక అధ్యయన కేంద్రాన్ని ప్రారంభించింది. మరోవైపు ఈ కేంద్రాన్ని తమ ఆధీనంలోనే ఏర్పాటు చేయాలని తెలుగు అకాడమి కోరుతుండగా, తమ ఆధీనంలోనే ఏర్పాటు చేయాలని తెలుగు యూనివర్శిటీ కోరుతోంది. ప్రాచీన భాష హోదా కల్పించిన తరుణంలో వాస్తవ పరిస్థితిని విద్యావేత్తలు అధ్యయనం చేయాల్సి ఉంది. సంప్రదాయ వాదులు, మరోపక్క ఆధునిక వాదుల మధ్య తెలుగు నలిగిపోతోంది. తెలుగు భాషా కేంద్రం తమ ప్రాంతంలోనే ఏర్పాటు కావాలని భాషావేత్తలు ఎవరికి వారే సిగపట్లకు దిగుతున్నారు. ఈక్రమంలో కేంద్ర మానవ వనరుల సహాయ మంత్రి ఆలోచన ధోరణి భిన్నంగా ఉన్నట్టు చేబుతున్నారు.
రెండు దినోత్సవాలు- పేరు గొప్ప ఊరు దిబ్బ
అంతర్జాతీయ మాతృ భాషా దినోత్సవం సదర్భంగా తెలుగు భాష గొప్పదనాన్ని విపరీతంగా చర్చించుకోవడంతోపాటు గిడుగు రామ్మూర్తి పంతులు జయంతి సందర్భంగా ఆగస్టు 29న కూడా మరోమారు తెలుగు భాషా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. కానీ భాష విషయం వచ్చే సరికి పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా ఉంది. తెలుగు విశిష్ట భాష హోదా దేవుడెరుగు, ఉన్న తెలుగు భాషకు సైతం రోజురోజుకూ తెగులు పట్టుకుంటోంది. తెలుగు విశ్వవిద్యాలయం, తెలుగు అకాడమి తమ లక్ష్యాలను నెరవేర్చడంలో ఘోరంగా విఫలం కావడంతో తెలుగుభాష విస్తృతిని పెంచుకోలేకపోయింది. అనేక శాస్త్రాలకు సంబంధించిన పదకోశాలు కాని, సమగ్రమైన సంపూర్ణమైన స్థిరమైన తెలుగు భాషా నిఘంటువే నేటికీ లేకుండా పోయింది. తెలుగు భాషాభివృద్ధి సంఘం మూలన చేరి ఏళ్లు గడుస్తున్నా దాని గురించి పట్టించుకునే నాథుడే కరవయ్యాడు.
భాషాభిమానుల ఘోష
తెలుగు భాష రక్షణ, అభివృద్ధికి ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖను వెంటనే ఏర్పాటు చేయాలని, రాష్ట్రంలో అన్నిస్థాయిల్లో అధికార భాషగా తెలుగును అమలుచేయాలని తెలుగు భాషోద్యమన సమాఖ్య గత దశాబ్దంగా కోరుతోంది. అన్ని స్కూళ్లలో మాతృభాషలోనే పాఠశాల విద్యను బోధించడాన్ని తప్పనిసరి చేయాలని, యుజి, పిజి కోర్సుల్లోనూ తెలుగును నిర్బంధం చేయాలని , ఇతర రాష్ట్రాల్లోని తెలుగు వారి విద్య, భాషా సంస్కృతుల రక్షణకు శాశ్వతస్థాయిన సంయుక్త సభాసంఘాన్ని అన్ని వనరులతో ఏర్పాటు చేయాలని సమాఖ్య నేతలు కోరుతున్నారు. విశిష్ట్భాష హోదా లభించిన నేపథ్యంలో అందుకు అవసరమైన వౌలిక వసతులు కల్పించాలని, రాష్ట్రంలో సాహిత్య అకాడమి సహా అన్ని అకాడమిలను తిరిగి నెలకోల్పాలని కోరుతున్నారు. తెలుగుభాషా సంస్కృతుల పట్ల గౌరవాన్ని ఇనుమడింప చేసేందుకు పటిష్టమైన చట్టాన్ని తీసుకురావాలని సమాఖ్య ప్రధాన కార్యదర్శి డాక్టర్ సామల రమేష్‌బాబు కోరారు.

భాషారక్షణ ప్రభుత్వ బాధ్యత కాదా?

 • -డాక్టర్ సామల రమేష్‌బాబు సెల్: 9848016136 ncharithra@gmail.com
 • 20/02/2012
మళ్ళీ యీ ఏడు అంతర్జాతీయ మాతృభాషాదినోత్సవం వచ్చింది. ప్రపంచంలోని భాషాజాతులన్నీ తమ భాషల్ని కాపాడుకోవాలని ఐక్యరాజ్యసమితి వారి విద్యాసాంస్కృతిక విభాగం- యునెస్కో-ఒక పుష్కరకాలంగా ప్రతి ఫిబ్రవరి 21న పిలుపు ఇస్తూనే ఉంది. సరిగ్గా ఆరోజున 1952లో తూర్పు పాకిస్తాన్‌లోని ప్రజలు, రచయితలు తమ మాతృభాష బెంగాలీకోసం రక్తతర్పణం చేశారు. ఆ ఉద్యమం చిలికి చిలికి, తర్వాత ఇరవైఏళ్ళకల్లా అది స్వతంత్ర దేశంగా-బంగ్లాదేశ్‌గా-ఆవిర్భవించడానికి దారితీసింది. మాతృభాషను తమ హక్కుగా స్వాభిమానసంపన్నులైన ఆ ప్రజలు భావించబట్టే అంతటి పరిణామం చోటు చేసుకుంది.
అప్పుడు ఒక చిన్న భూభాగంలో పాలకులపైన తమ భాషకోసం ప్రజలు పోరాడి సాదించిన ఘన విజయం అది. కాని, ఇప్పుడు ప్రపంచీకరణ వల్ల మాతృభాషలన్నిటికీ పెనుముప్పు ముంచుకొస్తోంది. ప్రపంచీకరణ వాహికగా ఆంగ్లభాషముందుకు దూసుకొస్తోంది. అది ఒక వరదలాగా వస్తూ చిన్నచిన్న భాషల్ని మా యం చేస్తున్నది. వేలాది చిన్నచిన్న భాషలు పాశ్చాత్యదేశాల్లో, ఆఫ్రికన్ దేశాల్లో ఆ వరదలో కొట్టుకుపోతున్నాయి. ఈ ప్రమాదాన్ని గుర్తించిన యునెస్కో సర్వప్రతినిధిసభ రెండు మూడు సార్లు సమావేశమై లోతుగా చర్చించి 12 ఏళ్ళనాడు ప్రపంచదేశాలకు ఆ పిలుపు ఇచ్చింది. ఏడాదిలో ఒకరోజును ప్రత్యేకించి రుూ విషయంలో ప్రపంచ ప్రజలను మేల్కొల్పడానికై కేటాయించింది. బెంగాలీ ప్రజలు త్యాగం చేసిన ఆ రోజును అందుకై ఎంపిక చేసింది.ఆఫ్రికాలోని రోబీ విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న గుగీవాథియాంగో అనే ఆంగ్లబోధకుడు తన మాతృభాష ‘గికురుూ’ రక్షణకోసం, అట్లాగే మరికొందరితో కలిసి ‘సావహిలీ’ వంటి తోటి చిన్న భాషల రక్షణకోసం చేసిన పోరాటం, నైజీరియాలోని ‘చెనువా అబీబీ’ చేసిన పోరాటం చిన్నవేమీకావు. ప్రపంచప్రఖ్యాత అమెరికన్ విద్యావేత్త నామ్‌చోమ్‌స్కీ చేస్తున్న పోరాటం ప్రపంచవ్యాప్తంగా మాతృభాషల రక్షణకోసం, విద్యారంగ సంస్కరణలకోసం జరుగుతున్న ఉద్యమాలకు స్ఫూర్తిదాయకంగా ఉంది. మున్ముందు ప్రపంచంలో రాగల సంఘర్షణలకు యుద్ధాలకు ‘్భష’ కూడా ఒక అంశంగా తయారయ్యే అవకాశాల్ని విజ్ఞులు త్రోసిపుచ్చడంలేదు.
ఈ ఏడాది యునెస్కో డైరెక్టర్ జనరల్ ఇరినా బొకోవా అంతర్జాతీయ మాతృభాషాదినోత్సవం సందర్భంగా ఇచ్చిన సందేశం ప్రకారం బహుళభాషల సమాజాల మనుగడ వాస్తవం అవుతున్నది. ఏ సమాజమూ బహుళబాషల మనుగడను తిరస్కరించే అవకాశంలేదు. అనేక చారిత్రక, రాజకీయ కారణాలవల్ల ఒకటికంటె ఎక్కువ భాషలు ఒక సమాజంలో మనుగడ సాగించాల్సిన పరిస్థితుల్లో కూడ మాతృభాషల రక్షణ తప్పనిసరి అవుతోంది. ఇలాంటి పరిస్థితి ఇప్పుడు మనదేశంలో త్వరత్వరగా ఏర్పడుతోంది. ప్రపంచీకరణ ప్రభావాలు ఇందుకు తోడై సమాజాల్లో భాషాపరమైన గందరగోళం నెలకొనే అవకాశం ఉంది. ప్రభుత్వాలకు స్పష్టమైన భాషావిధానం ఉండకపోతే, మాతృభాషల రక్షణకు ప్రభుత్వాలు దీక్ష వహించకపోతే, భాషా జాతుల్లో ఏర్పడే నైరాశ్యం వల్ల కాలక్రమంలో సంఘర్షణలకు, రాజకీయ పరిణామాలకు దారితీయక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది.
తెలుగుభాషాజాతి గురించీ దాని గతం, వర్తమానం, భవిష్యత్తు గురించీ లోతుగా చర్చ ఎప్పుడూ జరుగుతూనే ఉంది. కానీ, అది ఇప్పుడు వేగం అందుకొంది. కొత్త ఆలోచనలు ముందుకు తెస్తున్నారు. వేలాది సంవత్సరాల తెలుగుజాతి భాషాపరంగా ఎదుర్కొంటున్న సంక్షోభానికి ఎన్నో కారణాలేకాదు, దాని వస్తుస్థితిని పరిశీలిస్తే ఎన్నో కోణాలు కూడా మనముందు ప్రత్యక్షమవుతాయి. గతంలో కవుల సాహితీ సృజనలోనే వెల్లడైన ధోరణులు వేరు, నాటి అవసరాల వరకే వారి చూపు సాగింది. నేటి అవసరాలకు తగ్గ కొత్త ఆలోచనలు తప్పనిసరి. కొత్త పదాలను కూర్చుకోవడమూ తప్పనిసరే. అయితే ఇదంతా తెలుగు మూలాలపై ఆధారపడే జరగాలి గాని ఇతర భాషల మూల పదాలపై ఆధారపడి కాదు. భాషను స్వంతమూలాలపై ఆధారపడి ఎదిగించుకొంటేనే, ఆ భాష నిలుస్తుంది. అన్ని అవసరాలకూ తగ్గట్లుగా ప్రపంచస్థాయి భాషగా పెంచుకుంటేనే తెలుగుకు భవిష్యత్తుంటుంది. దీనికి కర్త, కర్మ క్రియ తెలుగు ప్రజలే కావాలి. వారి భాషా సాంస్కృతిక వారసత్వమే ఇందుకు ఆధారం కావాలి.
నేడు ఎదుర్కొంటున్న సంక్షోభాన్నుంచి మన మాతృభాషను రక్షించుకోవాలంటే ప్రాథమిక స్థాయినుంచి స్నాతకోత్తర విద్యదాకా, ఆపైన వృత్తి విద్యలదాకా అన్ని దశల్లోనూ తెలుగుకు గౌరవస్థానం దక్కాలి. ప్రజాజీవితంలో అన్ని దశల్లోనూ-పుట్టుకనుంచి జీవితాంతం వరకూ అన్ని అవసరాలకూ తెలుగే తెలుగు ప్రజాజీవితాన్ని వికసింపజెయ్యాలి. పరిపాలనలో, ఉద్యోగ వ్యాపారాల్లో తెలుగే రాజ్యం చెయ్యాలి. ఇందుకు తగ్గట్లుగా మన ప్రభుత్వ విధానాలుండాలి. కాని, మన ప్రభుత్వానికి తెలుగును కాపాడుకోవాలన్న ఉద్దేశం కనిపించడంలేదు. మనతోపాటే భాషా ప్రాతిపదికన ఏర్పడిన పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటకలు స్పష్టమైన భాషా విధానంతో అంకిత భావంతో ముందుకు సాగుతుంటే, మన ప్రభుత్వం మాత్రం భాషా రక్షణ తన బాధ్యతేకానట్లు వదిలివేసింది. మన పొరుగు రాష్ట్రాల్లో వారి భాషలకోసం ప్రత్యేక మంత్రిత్వశాఖలు తొలినుండీ ఉన్నాయి. మన రాష్ట్రంలో మాత్రం 60ఏళ్ళయినా ఇంతవరకూ ఎవరికి చెప్పుకోవాలో తెలియదు. 2001లో తమిళానికి మాత్రమే ప్రాచీన భాష హోదానిచ్చి, తోటి తెలుగు, కన్నడలను కేంద్రం నిర్లక్ష్యం చేస్తే తెలుగు ప్రజలు తిరగబడ్డారుగాని ప్రభుత్వానికి చీమకుట్టినట్లయినా లేదు. తప్పని పరిస్థితుల్లో తమకు రాజకీయంగా దెబ్బతగులకుండా ఉండ టం కోసం కేంద్రాన్ని బ్రతిమాలి, గుర్తింపును సాధించినా, కేంద్రం ఇప్పుడిచ్చిన లక్షలాది రూపాయలను వినియోగించుకోవడానికి కావలసిన వ్యవస్థను ఏర్పరచేందుకు కూడా మన ప్రభుత్వం ముందుకు రావడం లేదు. ఇక-ఆధునిక భాషగా తెలుగును అభివృద్ధిచేసుకోవడం సంగతి సరేసరి.
కొందరు పెద్దలు తమ ప్రసంగాల్లో ప్రజలే తెలుగును రక్షించుకోవాలని చెప్తుంటారు. నిజమే.విస్తృతమైన తెలుగు సమాజం తెలుగును రక్షించుకోగలదు. ప్రభుత్వాలు తమ బాధ్యతను విస్మరించి ఇదే రీతిగా వ్యవహరిస్తుంటే ప్రజలే ఇందుకు పూనుకుంటారు. అయితే ఇది రాజకీయాలను ప్రభావితం చేసేంత మలుపు తీసుకుంటుందా అనే ప్రశ్న ఉండనే ఉన్నది. సమాజానికి, దాని స్వాభిమానానికి దెబ్బతగిలే ఏ అంశమైనా సున్నితంగా ఉంటుంది. తెలుగు సమాజంలో భాష ఒక కీలకమైన రాజకీయాంశంగా మారేందుకు తగిన పరిణామాలు ఎప్పుడెలా వస్తాయో ఎవరూ చెప్పలేరు. పొరుగున ఉన్న రాష్ట్రాల్లో రెండవ పెద్ద భాషగా ఉన్న తెలుగు ప్రజల్లో అసంతృప్తి ఆ ప్రభుత్వాల మనుగడకు ప్రశార్థకంగా మారగల పరిస్థితులు నెలకొంటున్నాయి. అయితే, 50 ఏళ్ళ క్రితం తమిళనాడులోవున్న స్థితిలో యిప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న తెలుగు రానున్న 50 ఏళ్ళలో ప్రజా రాజకీయోద్యమాలను ప్రభావితం చెయ్యజాలదని ఎవరూ అనుకోకూడదు. ఇప్పుడు నడుస్తున్న తెలుగు భాషోద్యమం అలాంటి పరిణామశీలాన్ని పెంపొందించుకొంటే చాలు.

20 Feb 2012

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం... గ్రామీణ పేదల అభివృద్ధి...
ప్రభుత్వ విధానాల వల్ల గ్రామీణ పేదల జీవితాలు అస్థ వ్యస్థమవుతున్నాయి. గ్రామీణ చేతివృత్తిదారుల జీవితాలు విచ్ఛిన్నమవుతున్నాయి. పనుల కోసం వలసలు పోవాల్సి వస్తోంది. వీరి విద్యాస్థాయి అంతంతమాత్రమే. ఆధునిక సాంకేతిక విజ్ఞానంలో శిక్షణ ఇచ్చి.. వీరి జీవితాలను మెరుగుపర్చాల్సిన అవసరం నేడుంది. ఈ లక్ష్యంతోనే హైదరాబాద్‌కు సమీపాన ఉన్న నల్గొండజిల్లాలోని భూదాన్‌ పోచంపల్లిలో 'స్వామి రామానంద తీర్థ రూరల్‌ ఇనిస్టిట్యూట్‌' పనిచేస్తుంది. దీని కార్యక్రమాలు గ్రామీణుల వ్యవసాయాభివృద్ధికి కూడా తోడ్పడుతున్నాయి. ఈ సంస్థ కార్యక్రమాలను తెలుపుతూ.. ఈవారం 'విజ్ఞాన వీచిక' మీముందుకొచ్చింది.
శిక్షణ ద్వారా వృత్తి నైపుణ్యాన్ని పెంచుతూ గ్రామీణులను (18-50 ఏళ్ల వయస్సువారికి) సాధికారత అందించాలనే ప్రధాన లక్ష్యంతో 1995లో 'స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థ' స్థాపించబడింది. దీని కార్యక్రమాలు 2000 సంవత్సరం నుంచి పుంజుకున్నాయి. ఇంటిదగ్గరే శిక్షణ ఇవ్వాలనే ప్రధాన లక్ష్యంతో వివిధ జిల్లాల్లో స్థాపించిన 75కి పైగా విస్తరణ కేంద్రాల ద్వారా గ్రామీణ పేద లకు శిక్షణ అందించబడుతుంది. ప్రతి ఏడాది దాదాపు 17-18 వేల గ్రామీణ పేదల నైపుణ్యాన్ని ఈ సంస్థ పెంచు తోంది. ఈ విస్తరణ కేంద్రాలు ప్రధానంగా నల్గొండ, మహబూబ్‌నగర్‌, అనంతపురం, రంగారెడ్డి, నిజామా బాద్‌, వరంగల్‌, కృష్ణ, పశ్చిమగోదావరి, కరీంనగర్‌, గుంటూరు తదితర జిల్లాల్లో ఉన్నాయి.
ఇతర సంస్థల సహకారం..
ఈ సంస్థకు నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మైక్రో, స్మాల్‌, మీడియం ఎంటర్‌ప్రైజెస్‌; మినిస్ట్రీ ఆఫ్‌ న్యూ అండ్‌ రెన్యువబుల్‌ ఎనర్జీ; ఎంప్లాయిమెంట్‌ జనరేషన్‌ అండ్‌ మార్కెటింగ్‌ మిషన్‌, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం; ఇంటిగ్రిటెడ్‌ ఐసిడిఎస్‌; ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లీజింగ్‌ అండ్‌ ఫైనాన్సింగ్‌ సర్వీసెస్‌ క్లస్టర్స్‌-హైదరాబాద్‌ తదితర సంస్థలు సహకరిస్తున్నాయి.
వసతి సౌకర్యాలు..
పై శిక్షణా కార్యక్రమాలను ఉచితంగా ఇస్తారు. దూర ప్రాంతాల నుండి వచ్చిన వారికి వసతి సౌకర్యం కూడా ఉంటుంది. వీటిని ఎవరైనా స్పాన్సర్‌షిప్‌ (ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వెల్ఫేర్‌, మహిళలు, రైతులు కొన్ని స్వచ్ఛంద సంస్థలు) చేస్తే శిక్షణ, వసతి రెండూ ఉచితంగా కల్పిస్తారు. స్పాన్సర్‌ షిప్‌ లేకపోతే శిక్షణ వరకు ఉచితంగా ఇస్తారు. వసతి సౌకర్యానికి నెలకు రూ.700లు చెల్లించాల్సి ఉంటుంది.
మీకు తెలుసా..?
* స్వామి రామానంద తీర్థ స్వాతంత్య్ర సమరయోధుడు. హైదరాబాద్‌ సంస్థాన్‌ విమోచనానికి పాటుపడ్డ ముఖ్యనేతల్లో ఒకరు. వీరి అసలు పేరు వెంకటేష్‌ బాపురావు ఖడ్గేకర్‌. ఈయన అక్టోబర్‌ 3, 1903లో గుల్బర్గా జిల్లాలో జన్మించి; జనవరి 22, 1972లో మరణించారు.
స బాల గంగాధర్‌ తిలక్‌ను ఆదర్శంగా తీసుకుని, గాంధీజీ సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొన్నారు. ప్రసిద్ధ కార్మికనేత ఎస్‌ఎం జోషితో కార్మికోద్యమాల్లో పాల్గొన్నారు.
* జనవరి 14, 1930లో సన్యాసిగా మారి, స్వామి రామానంద తీర్థగా పేరును మార్చుకున్నారు.
* గ్రామీణాభివృద్ధి, గ్రామీణుల అభివృద్ధి ఒకటే కావు. కొంతమంది గ్రామీణులు అభివృద్ధి చెందితే గ్రామం అభివృద్ధి చెందినట్లు కాదు. గ్రామ సమిష్టి అవసరాల అభివృద్ధే గ్రామీణాభివృద్ధి.
* పట్టణాభివృద్ధి సాంకేతికాలు గ్రామీణా భివృద్ధికీ తోడ్పడతాయి.
* గ్రామస్థాయి నైపుణ్యంతో నిర్వహించేవి గ్రామీణ సాంకేతికాలు. మరమ్మతు సమస్యలు వచ్చినప్పుడు గ్రామస్థాయిలోనే సవరించగలగాలి.
* ఇంతవరకు దాదాపు లక్ష గ్రామీణ పేదలు స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థ శిక్షణతో లబ్ధి పొందారు.
* ఏ లక్ష్యంతో ఖర్చుపెట్టామనేది గ్రామీణా భివృద్ధిని నిర్ధారిస్తుంది. ఎంత ఖర్చు పెట్టామనేది ఆ తర్వాత స్థానాన్ని ఆక్రమిస్తుంది.
శిక్షణా కార్యక్రమాలు..
వయస్సు (18 నుండి 50 ఏళ్ల వయస్సు), లింగ భేదం లేకుండా గ్రామీణులకు వివిధ అంశాల్లో శిక్షణ ఇస్తున్నారు. వీటిల్లో కొన్ని 21 రోజులు, నెల, రెండు నెలలు, మూడు నెలలు శిక్షణ పొందే కోర్సులు ఉన్నాయి. ఇక్కడ శిక్షణ పొందిన వారికి నేరుగా వివిధ కంపెనీల్లో ఉపాధి పొందేలా కూడా ఈ సంస్థ సహాయపడుతుంది. వివరాల్లోకి వెళితే...
ఐదవ తరగతి అర్హతగల వారికి...
ఎంబ్రాయిడరీలో 60 రకాలను (చేతి, మిషన్‌ ఎంబ్రాయిడరీ); జర్దోశీ (మగ్గం వర్కు) / ఆరీ ఎంబ్రాయి డరీ పనులు; కుట్టు పని; దుస్తుల తయారీ; ఆధునిక నైపుణ్యం కలిగిన దుస్తుల తయారీ; కుండలపై, చీరలపై పెయింటింగ్‌ చేయడం; రంగుల అద్దకం (బాతిక్‌ డిజై నింగ్‌); బ్లాక్‌ ప్రింటింగ్‌; టై అండ్‌ డై; క్విల్ట్‌లు (ప్యాచ్‌ వర్క్‌); అందమైన బ్యాగుల తయారీ (25 రకాలు); జ్యూట్‌ వస్తువుల తయారీ (21 రోజుల్లో) నేర్పిస్తారు; వీటి శిక్షణకు కొలతలు తెలుసుకోగలిగే పరిజ్ఞానం ఉంటే సరిపోతుంది. శిక్షణా కాలం : దాదాపు 3 నెలలు
పదవ తరగతి అర్హతగల వారికి...
ఆహారశుద్ధి, నిల్వ (ఆయా కాలాల్లో దొరికే కూరగాయలను నిల్వ చేసుకో వడం, వివిధ పద్ధతుల్లో తయారు చేయడం నేర్పిస్తారు. ఉదా: ఒరుగులు, వడియాలు, చల్ల మిరపకాయలు, జామ్‌లు, జ్యూస్‌లు (ఒక నెల); వ్యక్తిత్వ వికాసం, పరిశ్రమ, చిన్న చిన్న వృత్తులను స్వయంగా నిర్వహించగలిగే చొరవను (ఎంటర్‌ప్రైన్యూర్‌) పెంచే శిక్షణ. వ్యక్తిత్వ వికాసం ద్వారా ప్రచార, మార్కెటింగ్‌ నైపుణ్యాల అభివృద్ధి, సౌరశక్తి వినియోగంలో నైపుణ్యాన్ని (ఉదా: సౌరశక్తితో లైట్‌ ఛార్జింగ్‌ చేయడం; నీటిని వేడిచేయడం తదితరాలు) పెంపొందిస్తారు.
ఙ పదవ తరగతి పాస్‌ / ఫెయిల్‌ అయిన వారికి...
ఎలక్ట్రికల్‌ వర్క్స్‌ (మోటార్‌ రివైండింగ్‌, గృహానికి ఎలక్ట్రికల్‌ వైరింగ్‌, ఎలక్ట్రికల్‌ వస్తువుల మరమ్మతు); ఎలక్ట్రానిక్‌ వస్తువుల (టివి, రేడియో, మిక్సీ, సెల్‌ఫోన్స్‌) మరమ్మతులో శిక్షణ. సెల్‌ఫోన్‌ రిపేరింగ్‌; ఆటోమొబైల్‌ (2 / 3 / 4 చక్రాల వాహనాల మరమ్మతు) మెకానిజం.
ఇంటర్‌ అర్హతగల వారికి...
కంప్యూటర్‌ కోర్సులు; ఎంఎస్‌ ఆఫీస్‌, డిటిపి, డేటా ఎంట్రీ ఆపరేటర్‌, కంప్యూటర్‌ ఎకౌంటింగ్‌; కంప్యూటర్‌ హార్డ్‌వేర్‌ కోర్సులు. శిక్షణాకాలం: రెండు నెలలు. వ్యక్తిత్వ వికాసం; ఎంటర్‌ ప్రెన్యూర్‌ డెవలప్‌మెంటు కోర్సుల శిక్షణాకాలం: 2 వారాలు.
పై అంశాలతో పాటు కారు డ్రైవింగ్‌ను కూడా ఈ సంస్థ విస్తరణ కేంద్రాల్లో నేర్పిస్తున్నారు.
కొత్త కోర్సులు..
నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ రూరల్‌ ఇనిస్టిట్యూట్‌, న్యూఢిల్లీ సహకారంతో వ్యవసాయానికి సంబంధించిన (ఫామ్‌ మిషనరీ) అన్ని పరికరాల వాడకం, మరమ్మతులో శిక్షణ ఇస్తున్నారు. ప్రధానంగా గ్రామీణ రైతులకు ఇది ఎంత గానో ప్రయోజనం చేకూరుస్తుంది. అర్హత: పదవ తరగతి పాస్‌ / ఫెయిల్‌.
కొన్ని సూచనలు..
* గ్రామీణుల అభివృద్ధే లక్ష్యంగా ఈ సంస్థ పనిచేస్తుంది. సంస్థ కార్యక్రమాలన్నీ గ్రామీణ పేదల నైపుణ్యాన్ని పెంచి, వారి జీవితాలను స్థిరపర్చేందుకు తోడ్పడుతుంది. ఇది ఆహ్వానించదగినది. కానీ, దీనికితోడు గ్రామీణులందరినీ సమిష్టిగా వేధించే సమస్యలు కూడా ఎన్నో ఉన్నాయి. వీరి కోసం కూడా అభివృద్ధి కార్యక్రమాల్ని రూపొందించాలి.
* విత్తన ఉత్పత్తి శిక్షణ, పట్టణ వ్యర్థ పదార్థాలతో భూ జీవ సంబంధాల పునరుద్ధరణ (ఎరువు రూపంలో); గ్రామీణ పారిశుధ్య వ్యర్థ పదార్థాల యాజమాన్యం తదితర అంశాలపై శిక్షణా కార్యక్రమాలు గ్రామీణాభివృద్ధికి ఎంతో అవసరం.
* గ్రామీణ వృత్తులు క్షీణించాయి. ఆధునిక విజ్ఞానంతో వీరి వృత్తుల్ని మెరుగుపరిచి, విస్తరింపజేయాల్సి (డైవర్స్‌ఫై) ఉంది. దీనికి సంబంధించిన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉంది. వీటిని ఉపయోగించి, గ్రామీణ వృత్తులను పునరుజ్జీవింపచేయాల్సి ఉంది.
* రైతుల ఆదాయాల్ని పెంచి, వారి కుటుంబసభ్యులకు పని కల్పించడానికి గ్రామాల్లో రైతుస్థాయిలోనే శుద్ధికార్యక్రమాలను చేపట్టాలని ప్రభుత్వం చెపుతోంది. అయితే, దీనికనుగుణంగా ప్రయోగాత్మకంగానైనా ప్రారంభించగల కార్యకలాపాలను, పరిశ్రమలను గుర్తించి, స్థాపనకు అనుగుణమైన ఎస్టేట్‌లను ఏర్పాటు చేయాలి. దీనికోసం నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఫర్‌ మైక్రో స్మాల్‌ అండ్‌ మీడియం ఎంటర్‌ప్రైజెస్‌; మినిస్ట్రీ ఆఫ్‌ అగ్రో ప్రాసెసింగ్‌ ఇండిస్టీస్‌ సహకారంతో ఈ ఎస్టేట్‌లను ఏర్పరచాలి. ఈ అనుభవాలను ఇతర గ్రామాలకూ విస్తరించాల్సిన అవసరం ఉంది.
* ఈ సంస్థ విస్తరణ కేంద్రాలను అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేయాలి.
* జనవిజ్ఞాన వేదిక వంటి ప్రజా విజ్ఞానశాస్త్ర సంస్థల సమన్వయ, సహకారాలతో గ్రామీణాభివృద్ధికి కృషి చేయాలి.
* దీనికి అనుగుణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవసరమైన సహకారాన్ని అందించాలి.
శిక్షణా పద్ధతులు..
కింది పద్ధతులతో శిక్షణ ఇస్తారు.
* ఆధునిక యంత్రాలు, సాంకేతిక ప్రక్రియ లతో స్వయంగా నేర్చుకొనే ప్రత్యక్ష శిక్షణ.
* దృశ్య, శ్రవణ పద్ధతుల ద్వారా.
* వ్యక్తిగత పర్యవేక్షణ, పరీక్షల ద్వారా కీలక శిక్షణ.
* హెచ్‌ఐవి, ఎయిడ్స్‌, ఆరోగ్య, వ్యక్తిగత, సామాజిక పరిశుభ్రతల గురించి అవగాహన కలిగించడం.
* పరిశ్రమ, చిన్న చిన్న వృత్తులను స్వయంగా నిర్వహించగలిగే చొరవను పెంచే (ఎంటర్‌ప్రెన్యూర్‌) శిక్షణ.
* వ్యక్తిత్వ వికాసం ద్వారా ప్రచార, మార్కెటింగ్‌ నైపుణ్యాల అభివృద్ధి.
* సామాజిక అభివృద్ధి, స్వయం సహాయబృందాల గురించిన విజ్ఞానాన్ని అందించడం.
వివరాలకు సంప్రదించాల్సిన చిరునామా:
స్వామి రామానంద తీర్థ రూరల్‌ ఇనిస్టిట్యూట్‌, జాలాపూర్‌ (గ్రా), భూదాన్‌ పోచంపల్లి (మ),నల్గొండ జిల్లా - 508284, ఫోన్‌:08685 - 222552/205076
వెబ్‌సైట్‌:www.srtri.com: Email:srtri@rediffmail.com

సైన్స్‌సైట్ -- వైద్య చికిత్సలో కిరణాలు • 19/02/2012
 •   |  
 • సి.వి.సర్వేశ్వర శర్మ
నోబెల్ బహుమతి గ్రహీత సి.వి.రామన్ 1928లో ఒక బలహీనమైన వికిరణాన్ని
 కనుగొన్నారు. దానినే రామన్ వికిరణం అంటారు. ఆనాటి నుండి ఈ రామన్
 వికిరణం భౌతిక, రసాయన ప్రయోగాల్లో ఎంతో ఉపయోగపడుతోంది.
ఇప్పుడు అమెరికాలోని శాస్తవ్రేత్తలు ఈ రామన్ స్పెక్ట్రో స్కోపిని ఉపయోగించి
గుండె ధమనుల్లో వున్న ప్లేక్స్ (రక్త ప్రవాహాన్ని నిరోధించే పదార్థాలు) రసాయనిక
తత్త్వాన్ని అంచనా వేయగలిగారు. ధమనుల్లో ప్లేక్స్ పేరుకుపోయిన కొలది
రక్తప్రవాహం మందగిస్తుంది. హృదయ ధమనుల్లో ప్లేక్స్ ఒకే స్థాయిలో ఉండవు.
ఒకచోట ఎక్కువగాను, మరొకచోట తక్కువగాను ఉంటాయి. ప్లేక్స్ వల్ల అప్పుడప్పుడు
 గుండె నొప్పి రావడం, ధమనుల గోడలు చిట్లడం జరుగుతుంది. ఒక్కొక్కసారి రక్తం
గడ్డ కట్టే ప్రమాదం కూడా ఉంటుంది. ప్రమాదకరమైన ఈ ప్లేక్స్ రకరకాల రసాయనాలు
కలిసి ఏర్పడతాయి. ప్లేక్స్‌లోని రసాయనాలు తెలుసుకోగలిగితే, అవి ధమనుల గోడలు
చీలుస్తాయా లేదా అనే విషయాన్ని, వాటిని తొలగించడానికి కావలసిన చికిత్సా
విధానాన్ని నిర్ధారించవచ్చు. రోగి మరణించాక గాని ధమనుల్లో ఇరుక్కున్న ప్లేక్స్
రసాయనిక తత్త్వాన్ని పసిగట్టడం సాధ్యమయ్యేది కాదు. ధమనిలో ప్లేక్స్ ఉన్న
చోటుకి చొచ్చుకొని వెళ్లి కావలసిన సమాచారాన్ని అందించే పరికరాలు కరువయ్యాయి.
ఇలాంటి చోటనే రామన్ కిరణాలు అక్కరకు వస్తున్నాయని అమెరికన్ శాస్తవ్రేత్తలు ప్రకటించారు.
విశే్లషణ ఒక రసాయనిక పదార్థం నుండి వచ్చే కాంతిని విశే్లషించి ఆ పదార్థాన్ని
నిర్ధారించడం స్పెక్ట్రోస్కోపితో సాధ్యం. ఒక రసాయన పదార్థం మీదికి లేజర్ కాంతిని
ప్రసారం చేసినపుడు అందులోని అణువులు కాంతిని గ్రహించి, తిరిగి పరావర్తనం
చెందేలా చేస్తాయి. ముందు ప్రసరింపజేసిన కాంతి తరంగాల వేవ్‌లెంగ్త్‌కు, రసాయనిక
పదార్థం నుండి వెనుదిరిగి వచ్చిన కాంతి తరంగాల వేవ్‌లెంగ్త్‌కు తేడా ఉంటుంది.
ఈ పరావర్తన కాంతి వర్ణ పటాన్ని గమనిస్తే ఆ పదార్థంలోని రసాయన మూలకాలు
తెలుసుకోవచ్చునని రామన్ సిద్ధాంతం. ఈ సిద్ధాంతాన్ని ఎన్నో ఏళ్లుగా రసాయన
శాస్తవ్రేత్తలు ఉపయోగిస్తున్నారు. ఈ సిద్ధాంతం హృద్రోగ చికిత్సలో సైతం కీలకమవుతోంది.
పరిశోధకులు ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకున్నవారి పాత గుండె ధమనులను పరీక్షించారు.
తరువాత దశలో ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించుకుంటున్న వారి ధమనుల్లో ప్లేక్స్‌ను
రామన్ స్పెక్రోస్కోపి ద్వారా పరిశీలించారు. గుండె జబ్బులతో బాధపడుతున్న మిగిలిన
వారికి మరో విధానాన్ని అనుసరించారు. మూత్రనాళిక గుండా ఆప్టిక్ ఫైబర్‌ను ధమనుల్లో
సమస్యవున్న ప్రదేశానికి పంపిస్తారు. బయట నుండి లేజర్ కాంతిని ఆప్టిక్ ఫైబర్ మీదకు
ప్రసరింపజేస్తారు. పరావర్తనం చెందిన కిరణాలను మూత్రనాళికలో మరొక వైపునున్న
 డిటెక్టర్ పరిశీలిస్తుంది. బలహీనమైన రామన్ వికిరణాల సంకేతాలను పసిగట్టే సున్నితమైన
డిటెక్టర్‌ను తయారుచేయడం వంటి చిన్నచిన్న సమస్యలు ఇంకా అధిగమించాల్సి ఉంటుంది.
ప్రోటాన్ కిరణాలు అణు భౌతిక పరిశోధనలో ఉపయోగించే ప్రోటాన్ కిరణాలు వివిధ రకాల
కేన్సర్లను సమర్థవంతంగా తగ్గిస్తున్నట్లు అమెరికా పరిశోధకులు వెల్లడించారు. ఈ కిరణాలు
కేన్సర్ కణితి సమీపంలోని కణజాలానికి ఎటువంటి హాని కల్గించవు. ప్రోస్టేట్, ఎముక, కంటి
కేన్సర్ చికిత్సలో ఇప్పటివరకు రేడియో ధార్మిక వికిరణాలను ఉపయోగిస్తున్నారు.
ఈ వ్యాధులను ప్రోటీన్ కిరణాలతో చికిత్స చేసినపుడు మరింత ఉత్తమమైన ఫలితాలు
లభించాయని అమెరికన్ వైద్య పరిశోధకులు చెబుతున్నారు. కేన్సర్ కణితి గుండా ఒకే స్థాయిలో
వికిరణ డోస్ పంపుతారు. అదే సమయంలో కణితి  పరిసరాల్లోని ఆరోగ్యవంతమైన కణజాలం
దెబ్బతినకుండా చూసేందుకు జీరో డోస్‌లో రేడియో ధార్మిక వికిరణాలను పంపుతారు.రేడియేషన్
థెరపీలో ఉపయోగించే ఫోటాన్ కిరణాలు శరీరం గుండా ప్రయాణించే సమయంలో కొంత శక్తిని
కోల్పోతాయి. అంతేగాక కిరణాలు శరీరంలోకి ప్రవేశించవలసిన చోట చర్మంపై అత్యధికంగా
కేంద్రీకృతమవుతాయి. శరీరం మందాన్నిబట్టి లోనికి ప్రవేశించాల్సిన కిరణాల్లో కొన్నింటి శక్తి
క్షీణిస్తుందని పరిశోధకులు గమనించారు. కేన్సర్‌కు గురైన ప్రోస్టేట్ గ్రంథిని శస్తచ్రికిత్స ద్వారా
తొలగించినపుడు కలిగిన ఫలితమే ప్రోటాన్ కిరణాల చికిత్సలో కూడా లభించడం
విశేషమంటున్నారు ఈ వైద్య పరిశోధకులు.

19 Feb 2012

ఖగోళశాస్త్ర పితామహుడు..! • నేడు నికోలస్‌ కోపర్నికస్‌ జయంతి
చిన్నారులూ..! 'విశ్వంలో ఏం జరుగుతుందో..? ఈ భూమి మీద ఇంతమందిమి ఉన్నాం మరి ఇది కుంగిపోదా..?' అని ఇలాంటివే చాలా సందేహాలు మీ బుజ్జి బుర్రల్లో మెదులుతూనే ఉంటాయి. అలాంటి జిజ్ఞాసతోనే ఈ పక్క చిత్రంలో కనిపిస్తున్న 'నికోలస్‌ కోపర్నికస్‌' గొప్ప నిజాన్ని కనిపెట్టాడు. ఇప్పుడు మీలో ఎవర్ని అడిగినా 'సూర్యుని చుట్టూ భూమి తిరుగుతుంద'ని ఠక్కున చెప్పేస్తారు. కానీ దీన్ని నిరూపించడానికి ఎన్నో ఆటంకాలను ఎదుర్కొన్నాడు కోపర్నికస్‌. ఎన్నో ప్రయోగాలు చేశాడు. అందుకు గణిత, ఖగోళశాస్త్రాల్ని మదించాడు. చివరకు భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతున్నాడనే కన్నా సూర్యుని చుట్టూ భూమి తిరుగుతుందని అను కుంటేనే రాత్రీ పగలుకూ, మారుతున్న ఋతువులకూ కారణాలు సులభంగా అర్థమవుతాయ న్నాడు. అంతేకాదు ఆ వాస్తవాన్ని లెక్కలతో సహా నిరూపించాడు. తన పరిశోధనాసారం ప్రపంచానికి ఎలా ఉపయోగపడిందో ఆయనైతే చూడలేకపోయాడు. కానీ మనం మాత్రం ఆ వాస్తవాన్ని గ్రహించి, మరింత ముందుకుపోతున్నాం. ఈ నిజాన్ని అంగీకరించడానికి నాటి మత వాదులు ఏమాత్రం ఇష్టపడలేదు. కానీ నేడు అదే వాస్తవమైంది. సైన్స్‌ ఏదైనా ప్రయోగాత్మకంగా రుజువైనవే వాస్తవమని నమ్ముతుంది. ప్రయోగాత్మకంగా ఋజువు చేయడం అంత ఆషామాషీ కాదు. అందుకెంతో కృషి చేయాలి. అంత మేధోమథనం చేశాడు గనుకే 'నికోలస్‌ కోపర్నికస్‌' ఖగోళ పితామహుడయ్యాడు. మరి ఆయన గురించి తెలుసుకుందామే..!
'నికోలస్‌ కోపర్నికస్‌' 1473, ఫిబ్రవరి 19న జన్మించాడు. తండ్రి రాగి వ్యాపారం చేసేవాడు. నలుగురి పిల్లల్లో 'కోపర్నికస్‌' ఆఖరివాడు. 'కోపర్నికస్‌'కు పదేళ్లప్పుడే తల్లీతండ్రీ ఇద్దరూ మరణించారు. మేనమామ 'లుకాస్‌ వాజెన్‌రోడ్‌' పెంచి పెద్దచేశాడు. ఆయన గొప్ప విద్యావేత్త. న్యాయశాస్త్రంలో 'బోలాగ్నా' యూనివర్శిటీ నుండి డాక్టరేట్‌ పొందాడు. 'పర్మియా'లో బిషప్‌ కూడా. సామాజిక హోదా, డబ్బుకు లోటు లేకపోవడంతో తెలివైన 'కోపర్నికస్‌'ను బాగా చది వేందుకు ప్రోత్సహించాడు. 'కోపర్నికస్‌' 'క్రాకౌ' యూని వర్శిటీలో రెండేళ్లు చదువుకున్నాడు. ఆ తర్వాత 'ఫ్రంబర్క్‌' చర్చిలో మతాధికారిగా ఉద్యోగం వచ్చింది. చర్చిలో ఎక్కువ సమయం ఉండాల్సిన అవసరం లేకపోవడంతో మరో 12 సంవత్సరాలు చదువు కొనసాగించాడు.
యూరప్‌లో 15వ శతాబ్ది ఆరంభం నాటికి కొత్త మార్గాలు, ప్రాంతాల అన్వేషణ ముమ్మరంగా మొదలైంది. కొందరు అప్పటికే కొత్త ప్రాంతాలను అన్వేషించారు. రాజులు, ప్రభువుల పాలన పోయే దిశగా సమాజంలో మార్పు జరుగుతోంది. మేధోమథనం ఆరంభమైంది. ఇది 'కోపర్నికస్‌'లోనూ ప్రారంభమైంది. ముద్రణ పద్ధతి అమల్లోకి రావడంతో పుస్తకాలూ అందుబాటులోకి వచ్చాయి. కనపడిన ప్రతి పుస్తకాన్నీ 'కోపర్నికస్‌' చదివేవాడు. గణిత, ఖగోళశాస్త్రాలపై ఎక్కడ ఉపన్యాసాలున్నా హాజరయ్యేవాడు.
ఈ కొత్త భావాలకు అప్పట్లో ఇటలీ కేంద్రంగా ఉండేది. క్రమంగా ఆ భావాలు ఇతర దేశాలకూ వ్యాపించాయి. 1496లో 'బోలోగ్నా' యూనివర్శిటీలో 'కోపర్నికస్‌' చేరాడు. ఆ తర్వాత 'పడువా', 'ఫెరార' యూనివర్శిటీల్లో చదివాడు. 'జీవితం, కళ, తత్వ శాస్త్రాల'పై తమ తమ అభిప్రాయాలను లేఖల రూపంలో రాసి, వాటినే పంచేవారు. వాటిని 'కోపర్నికస్‌' ఆసాంతం చదివేవాడు. న్యాయశాస్త్రాన్ని చదువుతున్నా ఆయన ధ్యాసంతా 'ఖగోళ, గణితశాస్త్రాల'పైనే ఉండేది. ఆయన 'గ్రీకు భాషను, వైద్యం, తత్వశాస్త్రం, రోమన్‌ చట్టాన్ని' కూడా అధ్యయనం చేశాడు. 'బోలోగ్నా' యూనివర్శిటీ లోనే ప్రముఖ ఖగోళశాస్త్రవేత్తలు 'డోవినికో', 'డానొవోరా' పరిచయమయ్యారు. 'డానొవోరా' సహకారంతో ఖగోళ పరిశోధనల్లో కిటుకులు తెలుసుకున్నాడు. 'కోపర్నికస్‌' అన్వేషణకు ఇక్కడే పునాది పడింది. విమర్శనాత్మకంగా విషయాల్ని పరిశీలించే అలవాటు 'కోపర్నికస్‌'కు చిన్న ప్పటి నుండీ ఉంది. 'టాలెమీ' సిద్ధాంతాల్లో వాస్తవాన్ని అనుమానించటమే కాక, ప్రత్యామ్నాయం కోసమూ అన్వేషించాడు.
న్యాయశాస్త్రంలో 1503లో డాక్టరేట్‌ పొంది, 'ఫ్రంబర్గ్‌' వెళ్లాడు. ఈలోపు మేనమామ అస్వస్థతకు గురైతే 1506-12 వరకూ అక్కడే ఉన్నాడు. ఈ ఆరేళ్లల్లో ఎన్నో ఆలోచనలు చేశాడు. 'టాలెమి' ప్రతిపాదనల్ని వందలసార్లు పరిశీలించాడు. చివరికి 'సూర్యకేంద్ర సిద్ధాంతాన్ని' చిత్తుగా తయారుచేశాడు. 1514లో ఈ విషయాన్ని మిత్రులు కొందరికి అందజేశాడు. అదే తర్వాత 'ఆన్‌ ద రివెల్యూషన్‌ ఆఫ్‌ ద సెలెస్ట్రియల్‌ స్పియర్స్‌' గ్రంథంలో వివరించాడు.
'ఫ్రంబర్గ్‌' నుంచి తిరిగొచ్చాక ఇంటి పైకప్పు మీద ప్రయోగశాలను ఏర్పాటు చేసుకుని, ఖగోళ పరిశోధన లు జరిపాడు. తన ప్రతిపాదనల్నే పదేపదే తార్కికంగా పరిశీలించాడు. చివరికి తన సిద్ధాంతమే వాస్తవాన్ని ప్రతిబింబిస్తోందనే నిర్ణయానికి వచ్చాడు. సూర్యుడితో పాటు ఇతరగ్రహాలు భూమి చుట్టూ తిరుగుతున్నట్లు అరిస్టాటిల్‌, టాలెమి ఎందుకు భావించారో 'కోపర్నికస్‌' కు అర్థమైంది. భూమి నిర్దిష్ట కక్ష్యలో 24 గంటలకోసారి తనచుట్టూ తాను తిరగటంతో సూర్యుడూ, ఇతర గ్రహాలూ భూమి చుట్టూ తిరుగుతున్నట్లు వారు భ్రమించారని నిర్ణయానికొచ్చాడు. ఒక్క చంద్రుడే భూమి చుట్టూ తిరుగుతున్నాడని ఆయన ప్రతిపా దించాడు. అంగారకుడు, బృహస్పతి, శని గ్రహాలు భూమి కంటే దూరంగా సూర్యుడి చుట్టూ తిరుగుతున్నాయని చెప్పాడు. దీనికి ఆకర్షితుడైన జర్మనీ గణితశాస్త్రవేత్త 'రెటికస్‌' 1539లో 'కోపర్నికస్‌'ని చూడటానికి 'ప్రంబర్గ్‌'కి వెళ్లాడు. 'రెంటికన్‌' ఎంత బతిమాలినా వాటిని ప్రచురించటానికి 'కోపర్నికస్‌' అంగీకరించలేదు. చివరికి 1540లో 'కోపర్నికస్‌' సిద్ధాంతాన్ని 'రెటికస్‌' స్వయంగా ప్రచురించాడు. ఆ పుస్తకం వెలుగులోకి వచ్చినరోజే 1543, మే 24న 'కోపర్నికస్‌' మరణించాడు. మిత్రులు ఆ పుస్తక ప్రతిని ఒకదాన్ని ఆయన చితిపై పెట్టారంట! ఏమైనా 'విజ్ఞానశాస్త్రం'లో ఇదే అంతిమం అనేదేమీ ఉండదు. నిరంతర ప్రయోగాత్మక ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుంది. అదే విజ్ఞానశాస్త్ర పురోగమనం తీరు..!
మరి ఇంత గొప్ప విషయాన్ని కనిపెట్టిన
'నికోలస్‌ కోపర్నికస్‌'కు జేజేలు చెప్పేద్దామే..