బిటి పత్తి .. ఆకాంక్షలు .. అనుభవాలు..
బిటి పత్తి వల్ల సస్యరక్షణ మందుల వాడకం తగ్గుతుందని, స్ప్రే చేయాల్సిన శ్రమ తగ్గిపోతుందని, ఉత్పత్తి పెరుగుతుందని, తద్వారా ఉత్పత్తి, ఉత్పాదకత పెరుగుతుందని, రైతుల ఆదాయం పెరుగుతుందని వీటిని ప్రవేశపెట్టిన 'మహికో-మోన్‌శాంటో' కంపెనీ ప్రచారం చేసింది. రైతులు దీన్నే ఆశించారు. కానీ రైతుల అనుభవాలు దీనికి విరుద్ధంగా ఉన్నాయి.
అనుభవాలు..
మన రాష్ట్రంలో 2002-03లో 9,310 ఎకరాలతో ప్రారంభమైన బిటి పత్తి సేద్యం 2010-11 నాటికి 44.87 లక్షల ఎకరాలకు పెరిగింది. మొత్తం సేద్యమయ్యే 45.43 లక్షల ఎకరాల్లో 98.9 శాతం బిటి పత్తే. ఈ కాలంలో దూది ఉత్పత్తి 10.87 లక్షల బేళ్లు (170 కిలోలవి) నుండి 57.81 లక్షల బేళ్లకు పెరిగింది. దూది ఉత్పాదకత ఈ కాలంలో ఎకరానికి 85 కిలోల నుండి 218.3 కిలోలకు పెరిగింది. ఇదంతా బిటి సాంకేతికం వల్లే సాధ్యమైందని బయో టెక్నాలజీ లాబీ చెపుతోంది. కాటన్ కార్పొరేషన్ సమీక్ష దీనికి విరుద్ధంగా ఉంది.
రాష్ట్రంలో బిటి జన్యువు కలిగిన ఎంఇసిహెచ్ 162, 12, 164 హైబ్రీడ్ రకాలు 2002-03లో మొదట ప్రవేశపెట్టబడ్డాయి. ఇవి అప్పటికే సేద్యం చేయబడుతున్న 'బన్నీ, బ్రహ్మ' రకాలకన్నా దిగుబడి తక్కువగా ఇస్తుండటంతో వీటివల్ల రైతులు ఎంతో నష్టపోయారు. పరిహారం చెల్లించాలని ఆందోళన చేశారు. బ్రహ్మ, బన్నీ రకాల్లో బిటి జన్యువుల్ని ప్రవేశపెట్టిన తర్వాత మాత్రమే (2005-06) బిటి పత్తి రాష్ట్రంలో నిలదొక్కుకుంది. పత్తి దిగుబడి ఆ తర్వాత మొత్తం మీద పెరిగింది. స్వతహాగా దిగుబడి పెంచే స్వభావం బిటి సాంకేతికానికి లేదని ఈ ధోరణి తెలియజేస్తుంది. బిటి జన్యువులు పెట్టిన రకాల సామర్థ్యం మీద ఉత్పత్తి ప్రధానంగా ఆధారపడి ఉంటుందని కూడా ఇది సూచిస్తుంది. అప్పటి నుండే బిటి విస్తీర్ణం పెరిగింది. బిటి సాంకేతికం దిగుబడిని పెంచు తుందనే కంపెనీ వాదన తప్పని ఇది నిరూపిస్తుంది.
ఇతర విత్తన కంపెనీలను కొనేయటం (లేదా) నియం త్రించే మేర షేర్లను సంపాదించడంతో బిటి పత్తి (మోన్ శాంటో-బోల్‌గార్డ్) రాష్ట్రం మొత్తం వ్యాపింపజేయడానికి, 98.9 శాతం మేర విస్తరింపచేయడానికి సాధ్యమైంది. తద్వారా పత్తి సేద్యం పై మహికో మోన్‌శాంటో గుత్తాధిపత్యాన్ని సంపాదించింది. ఇప్పుడు రైతులు బిటియేతర రకాల్ని వేయాలన్నా విత్తనాలు దొరకని దుస్థితి. అందువల్ల, బిటి విస్తీర్ణం పెరగడమే బిటి సాంకేతిక పరిజ్ఞాన సామర్థ్యానికి సాక్ష్యమని, మరోసాక్ష్యం అవసరంలేదని కంపెనీచేసే వాదన అసంబద్ధమైంది.
ఉత్పాదకత...
బిటి దూది దిగుబడి 2010-11లో ఎకరానికి 218.3 కిలోలు కాగా, బిటియేతర దిగుబడి 367.8 కిలోలు. 2002-10 మధ్య కాలంలో వార్షిక బిటి, బిటియేతర దూది దిగుబడి వివరాలను పరిశీలిస్తే ఈ ధోరణి కనిపిస్తుంది. (వివరాలు ఇవ్వడం లేదు.) బిటి పత్తి దిగుబడి (2009-10లో తప్ప) అటూ ఇటూ కొద్ది తేడాతో బిటియేతర పత్తితో సమానంగా ఉంది. 2010-11లో బిటి పత్తి దిగుబడి (218.3 కిలోలు), బిటియేతర పత్తి (367.8 కిలోలు) కన్నా చాలా తక్కువగా ఉంది. కాటన్ కార్పొరేషన్ గణాంకాల ప్రకారం 2009-10లో బిటి దూది దిగుబడి ఎకరానికి 238.4 కిలోలు. ఈ గణాంకాలు 2010-11లో బాగా తగ్గిన బిటి ఉత్పాదకతను తెలుపుతుంది. 2010-11లో పెరిగిన వర్షపాతం, వర్షపాతంలో తీవ్ర హెచ్చుతగ్గులు దీనికి కారణంగా భావించవచ్చు. బిటి కన్నా బిటియేతర హైబ్రీడ్ రకాలు వాతావరణ ఒడిదుడుకులను సమర్థవంతంగా తట్టుకోగలవని ఈ ధోరణి తెలియజేస్తుంది.
వ్యవసాయోత్పత్తుల ఖర్చులు, ధరల కమిషన్ 2009-10 నివేదిక ప్రకారం (పేరా-2.102) తమిళనాడులో బిటి విస్తీర్ణం మొత్తం పత్తి విస్తీర్ణంలో 32శాతమే కాగా, సగటు ఎకరా దూది దిగుబడి 390.8 కిలోలు. ఇది ప్రపంచ సగటు దిగుబడి కన్నా (293.6 కిలోలు) చాలా ఎక్కువ. కానీ, ఇదే సంవత్సరం ఆంధ్రప్రదేశ్‌లో బిటి విస్తీర్ణం మొత్తం పత్తి విస్తీర్ణంలో 95 శాతం అయినప్పటికీ, రాష్ట్ర సగటు దిగుబడి 246.7 కిలోలు మాత్రమే అని ఈ నివేదిక తెలిపింది. ఈ సగటు దూది దిగుబడి ధోరణులు మొత్తం మీద అధిక దిగుబడికి 'బిటి సాంకేతికం తప్పనిసరి' అనే వాదన సరైంది కాదని నిర్ధారిస్తోంది. ఇతర రాష్ట్రాల గురించి కూడా నివేదికలో ఇదే ధోరణి కనిపించింది.
సాంకేతిక లోపాలు..
రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏ బిటి పత్తిరకాన్ని విడుదల చేయలేదు. బిటి రకాలపై కొన్ని ప్రయోగాలు చేసింది. రైతుల చేలల్లో బిటి సేద్యాన్ని పర్యవేక్షించి, వీటి అనుభవాల ఆధారంగా 2011-12 వ్యవసాయ పంచాంగం ద్వారా కొన్ని సూచనలను రైతులకు అందించింది. వీటిలో కొన్ని:
* గతంలో (బిటియేతరలో) తక్కువస్థాయిలో ఉన్న పిండినల్లి ఉధృతి బిటిలో పెరిగింది. ప్రతికూల పరిస్థితుల్లో బిటి రకాల్లో సాధారణ పరిస్థితులు పునరుద్ధరించినపుడు చిగురించే శక్తి తక్కువగా ఉంది.
* బిటితో పాటు బిటియేతర ఎరపంట లేకపోతే పురుగులు నిరోధకశక్తి పెంచుకోవచ్చు.
* బిటి పత్తిలో మొక్క ఎదుగుదల తక్కువ. మొక్కల సంఖ్యను పెంచాల్సి ఉంటుంది.
* రసం పీల్చు పురుగుల నివారణలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి. అవసరాన్ని బట్టి కీటకనాశక స్ప్రేలను పెంచాలి.
* బిటి రకాల్లో పోషకలోపాలు అధికంగా రావచ్చు. ఈ లోపాల్ని గుర్తిస్తూ నివారణ చర్యలు తీసుకోవాలి.
* బిటి పత్తిలో పండాకు తెగులు పక్వానికి రాకుండా ఆకులు రాలిపోవడం ఎక్కువగా గమనించబడింది. వీటి నివారణకు చర్యలు తీసుకోవాలి.
ఈ సూచనలన్నీ బిటి పత్తి సాంకేతిక లోపాలకు నిర్ద్వంద్వ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి.
సేద్య విస్తరణ కారణాలు..
బిటి విస్తరణకు అసలు కారణాలను భారత కాటన్ కార్పొరేషన్ 2009-10 నివేదికలో వివరించింది. మిగతా పంటలకన్నా పత్తికి మంచి ధర లభించడం ఒక కారణంగా ఇది వివరించింది. దీని వివరాలను పరిశీలిద్దాం.. ఉదా: ఎస్-8 రకంలో 2006-07, 07-08, 08-09, 09-10, 10-11 సంవత్సరాల్లో సగటు క్వింటాలు పత్తి ధర వరుసగా రూ.2,286, 2,613, 3,850, 3,226, 4,394కు పెరిగింది. ఇదే ధోరణి మిగతారకాల్లో కూడా కొనసాగింది. అందువల్ల, రాష్ట్రంలో 2006-11 మధ్యకాలంలో విస్తీర్ణం 24.2 నుండి 46.75 లక్షల ఎకరాలకు, ఉత్పత్తి 21.78 నుండి 57.81 లక్షల బేళ్లకు పెరిగింది. అనుకూలంగా ఉన్న పత్తి ధరలు ఇతర పంటల నుండి పెట్టుబడులను ఆకర్షించాయి. (40వ యాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్ సందర్భంగా కాటన్ కార్పొరేషన్ 27 ఆగస్టు 2010న విడుదల చేసిన ప్రెస్‌నోట్). అనుకూల ధరలు ఈ పైరుపై యాజమాన్య కేంద్రీకరణను పెంచింది. ఇవన్నీ పత్తి ఉత్పాదకత పెరుగుదలకు దోహదపడ్డాయి.
దుష్ప్రభావాలు..
* ప్రభుత్వ పరిశోధన, విస్తరణ, మార్కెట్ సేవల మద్దతు నిర్వీర్యం.
* గుత్తాధిపత్య ఆవిర్భావం, ప్రపంచీకరణకు సుగమ మార్గం.
* విత్తన ఎంపిక, కొనుగోలు, సేద్య సాంకేతికం, ధర, అమ్మకాలలో హరించిన రైతు స్వేచ్ఛ.
* చేలో పనిచేసే వారికి అలర్జీ, చర్మ, శ్వాసకోశ వ్యాధులు.
* ఆకులు తినే జీవాలకు, పశువులకు అనారోగ్యం లేదా చనిపోవడం.
* భూసారం క్షీణించి, ఆ తర్వాత తగ్గిన పంట దిగుబడి.
* పత్తి తీత కష్టతరం.
* చేలో పనిచేసే మహిళలకు గర్భస్రావాలు, పశువుల్లో ప్రత్యుత్పత్తి సమస్యలు.
అత్యుత్తమమా..?
సస్యరక్షణ కోసం అందుబాటులో ఉన్న అత్యుత్తమ సాంకేతిక పరిజ్ఞానం సమగ్ర సస్యరక్షణ అని భారత వ్యవసాయ పరిశోధనా మండలి గుర్తించింది. ఈ పద్ధతిలో పురుగుల ఉధృతి (సమస్య) అధికంగా, నష్టదాయకంగా ఉన్నప్పుడు మాత్రమే, అదీ చివరి ఆయుధంగా, సస్యరక్షణ మందు వినియోగాన్ని సూచిస్తున్నారు. కానీ, బిటి ప్రక్రియలో చీడపీడల ఉధృతి, అవసరంతో నిమిత్తం లేకుండా మొక్కల్లో నిరంతరం అంతర్గతంగా విషపదార్థం ఉత్పత్తి అవుతూనే ఉంటుంది. ఈ విషం మొక్కల అన్ని భాగాల్లో విస్తరిస్తుంది. ఇది వాతావరణంలో విషపదార్థాల పరిమాణాన్ని అధికం చేస్తుంది. అందువల్ల, బిటి ప్రక్రియలో నిరోధక శక్తి ఆవిర్భావం సర్వసామాన్యం.
ఇప్పుడు మోన్‌శాంటో కంపెనీనే బోల్‌గార్డ్-1 రకంలో పింక్ బోల్‌వర్మ్‌లకు నిరోధకశక్తి కొన్ని ప్రాంతాల్లో వచ్చిందని ఒప్పుకుంటుంది. ప్రత్యామ్నాయంగా బోల్‌గార్డ్-2 విత్తనరకాలను వాడాలని సూచిస్తుంది. దీనితోపాటు కాయతొలుచు పురుగుల ఉధృతాన్ని గమనిస్తూ సస్యరక్షణ మందులను కాయతొలుచు పురుగులకు కూడా స్ప్రే చేయా లని సూచిస్తే మరి బిటి సాంకేతిక అసలు లక్ష్యం ఏమౌ తుంది? బిటి సాంకేతికంలో స్థిరత్వం లేదని కూడా ఈ పరిణామాలు తెలుపుతున్నాయి. మన రాష్ట్రంలో ఈ నిరోధక శక్తి ఎప్పుడో వచ్చిందని స్వచ్ఛంద సంస్థలు తెలిపాయి. దీనిని కంపెనీ నిర్ధారించకున్నా, బోల్‌గార్డ్-2 రకాల్ని సరఫరా చేస్తుంది. కీటక ఉధృతాన్ని బట్టి మందుల్ని స్ప్రే చేయమని చెప్తోంది. ఇది అసలు బిటి రకాల ఉద్దేశ్యాన్నే ప్రశ్నిస్తోంది.
రాష్ట్రంలో ఇపుడు 280కి పైగా గుర్తించబడిన బిటి హైబ్రిడ్ రకాలను వివిధ కంపెనీలు అమ్ముతున్నాయి. వీటిలో ఏ ప్రాంతానికి ఏ రకం అత్యుత్తమమని ఎవరూ చెప్పలేకపో తున్నారు. ఈ విషయంలో రైతులకు సలహాలు ఇవ్వడంలో వ్యవసాయ శాఖ నిస్సహాయ స్థితిలో పడింది. మౌనం వహి స్తుంది. కేవలం కంపెనీ ప్రచార ఉధృతం ఆధారంగా రైతులు వేసే రకాల్ని ఎంపిక చేసుకోవాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో పత్తి సేద్యంలో బిటి అత్యుత్తమ, శ్రేష్ఠమైన సాంకేతికాన్ని అందిస్తుందని భావించలేం.
రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో 2006-08 ప్రాంతంలో చేసిన ప్రయోగాల్లో బిటి పత్తి సేద్యం కన్నా సమగ్ర సస్యరక్షణతో బిటియేతర హైబ్రిడ్ పత్తి సేద్యం వల్ల సస్యరక్షణ మందుల వాడకం సగానికిపైగా (హెక్టారుకు 8725 నుండి 4000 మిల్లీలీటర్లకు) తగ్గుతుందని, రైతులకు నికర లాభం పెరుగుతుందని (హెక్టారుకు రూ.2465) నిర్ధారించింది. (రమేష్‌బాబు తదితరులు 2009లో సస్యరక్షణపై రూపొందిం చిన ఐసిఏఆర్ ట్రైనింగ్ మాన్యువల్ పేజీ 139-140). కారణా లు ఏమైనప్పటికీ, వ్యవసాయ విశ్వవిద్యాలయం ఈ ఫలితా లను రైతులకు అందించడం లేదు. ఫలితంగా పత్తి రైతులకు అత్యుత్తమ సాంకేతిక పరిజ్ఞానం అందడం లేదు. నికర ఆదా యాల్ని కోల్పోతున్నారు. ప్రభుత్వ విస్తరణ సేవలు బలహీన పడుతూ అదే సమయంలో ప్రైవేట్ కంపెనీలు, వ్యాపారస్తుల విస్తరణ సేవలు బలపడటమే దీనికి ప్రధాన కారణం.
లోపాల్ని కప్పిపుచ్చుతున్న మార్కెట్ ధరలు..
ఈ సంవత్సరం అంతర్జాతీయంగా దూది ఉత్పత్తి తగ్గడం వల్ల ధరలు అనూహ్యంగా పెరిగాయి. 2010 మార్చి చివరలో దేశీయ రకం పత్తి ధర క్వింటాలుకు రూ.2,750 కాగా, 2011 సంవత్సరం ఇదే కాలంలో రూ.5,840కి పెరిగింది. ఇదేవిధంగా ఎస్6 రకం రూ.3,325 నుండి రూ.6,850కి పెరిగింది. (కాటన్ కార్పొరేషన్ ధరల సమాచారం). ఇలా రెట్టింపుకు పైగా పెరిగిన ధరల వల్ల 2010-11లో పత్తి దిగుబడి తగ్గినా రెట్టింపుకు పైగా ధర పెరగడంతో బిటి పత్తి రైతులు సంతోషంగా ఉన్నారు. మిగతా పంటలతో పోల్చినపుడు పత్తి ధరలు అనుకూలంగా ఉండటంతో, బిటి సాంకేతిక సామర్థ్యంతో సంబంధం లేకుండా బిటి పత్తి సేద్యం 2011-12లో విస్తరిస్తుందని వ్యవసాయ శాఖ చెపుతుంది. దాదాపు 50 లక్షల ఎకరాల్లో బిటి పత్తి సేద్యం విస్తరిస్తుందని అంచనా వేస్తుంది. సాంకేతిక ఎంపికలో మార్కెట్ ధరల ప్రభావం గణనీయంగా ఉంటుందని ఈ అనుభవం చెపుతోంది. ప్రపంచ మార్కెట్ 'స్వేచ్ఛ' పేరుతో పనిచేస్తున్నప్పటికీ అంతర్జాతీయ ఫైనాన్స్ పెట్టుబడి గుప్పిట్లో అత్యంత నియంత్రిత ధోరణితో మార్కెట్ పనిచేస్తుందని గమనంలో ఉంచుకోవాలి. మన రాష్ట్రంలో బిటి పత్తి ఇప్పటికే 98.8 శాతం విస్తరించి ఉంది. బిటియేతర విత్తనాలు కూడా మార్కెట్‌లో లభ్యం కావడంలేదు. రైతులకు ప్రత్యామ్నాయం కూడా లేదు. ఇక రైతులు స్వచ్ఛందంగా ఎంపిక చేసుకునే అవకాశం ఎక్కడుంది?
గమనిక: ఈ పేజీపై మీ స్పందనలను 9490098903కి ఫోను చేసి తెలియజేయండి.
No comments:
Post a Comment