16 Feb 2012

ప్రజా విజ్ఞానం .. ఆకాంక్షలు .. అనుభవాలు


ప్రజా విజ్ఞానం .. ఆకాంక్షలు .. అనుభవాలు

మానవ నాగరికాభివృద్ధిలో శాస్త్ర, సాంకేతిక విజ్ఞానం ఎంతో కీలకపాత్ర పోషించింది. యుద్ధాల జయాపజయాలలో, ఓడిన సమాజాల్ని, ప్రజల్ని బానిసలుగా మార్చుకోవడంలో, దోపిడీలో ఇది ఎంతో ప్రాధాన్యత కలిగి ఉంది. ఈ నేపథ్యంలో స్వాతంత్య్రానంతరం మొదటి ప్రధాని నెహ్రూ, బాబా, భట్నాగర్‌ వంటి శాస్త్రజ్ఞులు దేశాభివృద్ధికి, స్వావలంబనకు విజ్ఞానశాస్త్రంపై అపార విశ్వాసాన్ని ఉంచి, అభివృద్ధిపై కేంద్రీకరించారు. సామాన్యుల సమస్యలను పరిష్కరించడంలో ఈ విజ్ఞాన పాత్రను, ప్రాధాన్యతను ప్రజలందరిచే గుర్తింప చేయడానికి, నిత్యజీవితంలో శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకుని, ఆధునిక భారత నిర్మాణంలో అందరికీ భాగస్వామ్యం కలిగించాలనే ప్రధాన లక్ష్యంతో 'ప్రజాసైన్స్‌' ఉద్యమం ప్రారంభమైంది. కొద్దిమంది శాస్త్రజ్ఞులతో ఈ ఉద్యమం 1950 దశకంలోనే ఆరంభమైంది. ప్రజలందరికీ అర్థమయ్యే స్థానిక భాషల్లో విజ్ఞానాన్ని అందించే ప్రయత్నంతో ఈ ఉద్యమం రూపుదిద్దుకొంది. కేరళ శాస్త్ర, సాహిత్య పరిషత్‌ సహా 26 విజ్ఞానశాస్త్ర సంఘాలు 1987లో 'భారత జ్ఞాన విజ్ఞాన జాతా' పేరుతో సైన్సు విజ్ఞానాన్ని సామాన్యుల్లోకి తెచ్చే బృహత్‌ విజ్ఞాన, సాంస్కృతిక కళారూపాల కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. అంతిమంగా ఈ కృషి కేరళలోని కొచ్చి దగ్గర 'అఖిలభారత ప్రజాసైన్స్‌ నెట్‌వర్క్‌' ఏర్పాటుకు దారితీసింది. దీనిలో భాగంగా 'జనవిజ్ఞాన వేదిక', ఆంధ్రప్రదేశ్‌ ఫిబ్రవరి 28న 1988లో విజయవాడలో ప్రారంభమైంది. దీని రజితోత్సవాలు ఈ నెల 26-28 తేదీల్లో మహాసభలతో ప్రారంభమవుతున్నాయి. ఈ సందర్భంలో 'ప్రజావిజ్ఞాన ప్రస్థానాన్ని, అది ఎదుర్కొంటున్న సవాళ్ల'ను సంక్షిప్తంగా.. మూడు భాగాల్లో 'విజ్ఞానవీచిక' విశ్లేషిస్తోంది. అందులో మొదటిభాగం ఇది.
లక్ష్యాలు...
ఫిబ్రవరి 28, 1988లో 'జనవిజ్ఞాన వేదిక' ఈ కింది లక్ష్యాలతో ఏర్పడింది.
* విజ్ఞానశాస్త్రాన్ని ప్రచారం చేయడం. అందరిలో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడం.
* విజ్ఞానశాస్త్ర ప్రచారం ద్వారా మూఢవిశ్వాసాలను, ఛాందసభావాల్ని తొలగించడం.
* ప్రజలెదుర్కొంటున్న మౌలిక సమస్యల కారణాలను గుర్తించి, పరిష్కార మార్గాలను చూపెట్టడం.
* శాస్త్ర విజ్ఞాన లాభాలను ధనికులతో పాటు పేదలకూ అందేలా కృషి చేయడం.
* విజ్ఞాన సముపార్జనను ప్రోత్సహించడం, జాతీయ సమగ్రతకు, స్వావలంబనకు, సామాజికాభివృద్ధికి, సాంస్కృతిక వికాసానికి కృషి చేయడం.
* ప్రజా సంక్షేమాన్ని కేంద్రబిందువుగా చేసుకొని, వైవిధ్యభరితమైన పరిశోధనలను ప్రోత్సహించడం.
* పై లక్ష్యాలకు అనుగుణంగా వివిధ కార్యక్రమాల్ని రూపొందించి, అమలు చేయడం.
తరతరాలుగా నిరూపితమవుతున్న అంశాల జ్ఞానాన్ని క్రోడీకరిస్తూ, వివిధ విజ్ఞానాంశాల మధ్యగల అంతర సంబంధాలను విడమర్చి చెప్పేదే విజ్ఞానశాస్త్రం. ఈ విజ్ఞానం నేరుగా కాక, దీని ఆధారంగా రూపొందిన సాంకేతికాల ద్వారా వినియోగంలోకి వస్తుంది. దీని ఫలితాలు, ప్రభావం ఎంపికచేసి, వినియోగిస్తున్న యజమాని, ఆధిపత్యం వహిస్తున్న వారి స్వభావంపై ఆధారపడి ఉంటుంది. దీంతో విజ్ఞాన ఫలితాలు అందరికీ ఒకేవిధంగా ఉపయోగపడటం లేదు.
ఈ విజ్ఞానాన్ని ఏ కొద్దిమందో లేదా శాస్త్రజ్ఞులు మాత్రమే రూపొందించింది కాదు. ప్రపంచ మానవాళి సంయుక్తంగా సమకూర్చిన జ్ఞానమిది. ఇది ఉత్సుకతను, అనురక్తిని కలిగించే కళ అయినప్పటికీ కేవలం ఆనందం, అనుభూతులకు మాత్రమే ఉపయోగపడేది కాదు. దీంతో ప్రకృతిపై పోరాడుతూ మానవుడు తన జీవితాన్ని మెరుగుపరుచుకున్నాడు. ఈ విజ్ఞానం మానవ వికాసానికే కాక, వినాశనానికీ (యుద్ధ సమయంలో) ఉపయోగపడింది. ప్రకృతినీ క్షీణింపజేస్తుంది. ఇది అందరికీ ఉపయోగపడాలనే బలమైన కాంక్షతో 'ప్రజాసైన్స్‌ ఉద్యమం' రూపుదిద్దుకుంది.
ప్రజా విజ్ఞానం..
అందరికీ అందుబాటులో ఉంటూ ఉపయోగపడే విజ్ఞానమే ప్రజా విజ్ఞానం. ఉదా: నాణ్యమైన తాగే మంచినీరు దాదాపు 80 శాతం రోగాల్ని నివారిస్తుంది. నీటిని కాచి, చల్లార్చి, వడపోసి తాగితే ఈ జబ్బుల్ని నివారించవచ్చు. ఈ సాంకేతిక విజ్ఞానం అందరికీ అందుబాటులో ఉంటుంది. అందువల్ల ఈ విజ్ఞానం 'ప్రజా విజ్ఞానం'. దీనికి బదులుగా మినరల్‌ వాటర్‌ను గ్రామగ్రామాన 'రివర్స్‌ ఆస్మోసిస్‌' సాంకేతిక పరిజ్ఞానంతో 'రక్షిత మంచినీటి'గా గ్రామీణులకు సరఫరా చేయాలని అప్పటి రాజశేఖరరెడ్డి ప్రభుత్వం ప్రతిపాదించింది. అందుకు ప్రజలు అంగీకరించలేదు. ఇది నీటిని వ్యాపారీకరించడానికి, కంపెనీలకు లాభాల్ని చేకూర్చేందుకు దోహదపడే విజ్ఞానం. మెజారిటీగా ఉన్న పేదలు, ముఖ్యంగా సుదూర ప్రాంతాల్లో ఉన్న గిరిజనులు నీటిని కొని, తాగలేరు. అందువల్ల ఇదొకరకం వ్యాపార విజ్ఞానం.
శాస్త్రీయ దృక్పథం..
నిత్యజీవితంలో ఎన్నో పరిణామాల్ని చూస్తుంటాం. ప్రతీ పరిణామానికీ కొన్ని కారణాలుంటాయి. ఈ కారణాలను గుర్తించడం, గుర్తించాలనే కాంక్ష కలిగి ఉండటం శాస్త్రీయ దృక్పథం. ఈ పరిణామాలకు లేక మార్పులకు ఏ మానవాతీత అద్భుతశక్తుల ప్రమేయాన్ని విజ్ఞానశాస్త్రం అంగీకరించదు. కేవలం నిరూపితం అయిన లేదా కాగల అంశాలను పరిగణనలోకి తీసుకుంటుంది. కొత్త ఆవిష్కరణలతో ఇదివరకే తెలిసిన విజ్ఞానాన్ని మార్చుకోవాల్సి వస్తే ఒక్క క్షణమైనా తటపటాయించదు.
మన రాజ్యాంగం ఆర్టికల్‌ 51ఎ(హెచ్‌) ద్వారా శాస్త్రీయ దృక్పథాన్ని కలిగి ఉండే ప్రాథమిక బాధ్యతను పౌరులందరిపై పెట్టింది. మానవత్వ విలువలనూ, పరిశోధన తత్వాన్ని, సంస్కరణ గుణాలనూ అభివృద్ధిపర్చుకోవాలనే బాధ్యతను కూడా పౌరులపై ఉంచింది. కానీ రాజ్యాంగబద్ధంగా ఉంటామని, ఎన్నికై అధికారం చేపట్టిన వారు, ఇతరులు దీనికనుగుణంగా నడుచుకోవడం లేదు. ఇది మన సమాజంలోని ద్వంద్వ విలువల్ని ప్రతిబింబిస్తుంది.
ఆరోగ్య కార్యక్రమం..
ప్రజలకు అవసరమైన ఆరోగ్య విధానాల కోసం, రక్షణ కోసం కృషి చేస్తోంది. ఆరోగ్య సమస్యలపై అధ్యయనాలు చేస్తుంది. గిరిజన తదితర ప్రాంతాల్లోని ప్రజల ఆరోగ్యం పట్ల ప్రత్యేకశ్రద్ధ వహిస్తూ వారికి వైద్యసేవలను అందించేందుకు పలు కార్యక్రమాలను చేపడుతోంది. 'జన శ్వాస్త్య అభియాన్‌' ప్రజా వైద్యంలో భాగంగా ఉంటూ ప్రత్యామ్నాయ ఆరోగ్య విధానాల కోసం కృషి చేస్తోంది. రాష్ట్రంలో మద్య నిషేధం కోసం కూడా పెద్దఎత్తున కార్యక్రమాల్ని నిర్వహించింది. దీనికి అక్షరాస్యతా ఉద్యమం ఎంతగానో తోడ్పడింది. ఆరోగ్య, సాంకేతికాలను ఉపయోగించుకుంటూ ప్రజల్ని దోచుకోవడాన్ని వ్యతిరేకిస్తుంది. శీతలపానీయాలు వంటి బహుళజాతి కంపెనీల ఉత్పత్తుల వల్ల ప్రజారోగ్యం ఏవిధంగా దెబ్బతింటుందో వివరిస్తూ విస్తృత ప్రచార కార్యక్రమాల్ని నిర్వహించింది. ఉబ్బసం నివారణకు 'చేపమందు' వంటి అశాస్త్రీయ వైద్యవిధానం గురించి ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించి, కొంతమేర విజయం సాధించింది. ఎదిగిన ఆడపిల్లల్లో ఆరోగ్య పరిరక్షణ విషయంలో ఎన్నో అవగాహనా కార్యక్రమాల్ని నిర్వహించింది. గర్భాశయ ముఖద్వార కాన్యర్‌కు సంబంధించి మన దేశంలో జరుగుతున్న వ్యాక్సిన్‌ అనధికార ప్రయోగాల్ని వ్యతిరేకించింది. వనితా కళా జాతాలను నిర్వహించింది. వివక్షను ఆదిలోనే పెంచే లింగ నిర్ధారణ పరీక్షలను వ్యతిరేకిస్తూ ప్రచారాన్నీ చేపట్టింది.
పర్యావరణం..
పర్యావరణానుకూల విధానాల కోసం కృషి చేస్తోంది. విచక్షణా రహితంగా ప్రకృతి వనరుల వినియోగాన్ని, విచ్ఛిన్నానికి వ్యతిరేకంగా, వివిధ రసాయనాల వాడకం, ఎరువులు, సస్యరక్షణ మందులకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తోంది. సామాన్యులపై భారాలు మోపుతూ జాతీయ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉండే బహుళజాతి కంపెనీల లాభాలకు వ్యతిరేకంగా అనేక ప్రచార కార్యక్రమాలను చేపట్టింది. ప్రజా సంక్షేమం, పర్యావరణ సుస్థిరతకు లోబడే విధంగా పారిశ్రామికీ కరణను, ఆటోమేషిన్‌ సాంకేతిక విజ్ఞానాన్ని ప్రోత్సహిస్తోంది.
సాంస్కృతిక వారసత్వం..
మన సంస్కృతి వారసత్వాన్ని, ప్రజా కళారూపాల్ని పరిరక్షిస్తూ సాంప్రదాయ సాంకేతిక విజ్ఞానాన్ని, భాషను, జీవన విధానాన్ని, విలువల్ని ప్రోత్సహించే విధంగా జనవిజ్ఞానవేదిక ప్రచారం చేస్తోంది. జుగుప్సను కలిగించే విదేశీ సంస్కృతిని వ్యతిరేకిస్తోంది. ప్రజా విజ్ఞానం ఆధారంగా ఎన్నో కొత్త కళారూపాల్ని రూపొందించి, ప్రచారంలో పెట్టింది.
అభివృద్ధి కార్యక్రమాలు..
సమయానుకూలంగా ముందుకొస్తున్న అభివృద్ధి సమస్యలపై అధ్యయనం చేసి, ప్రజా చైతన్య కార్యక్రమాలను నిర్వహించింది. 'ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి సమస్యలు - అసమానతలు' అనే అంశంపై 'సుందరయ్య విజ్ఞానకేంద్రం'తో సంయుక్తంగా అధ్యయనం చేశారు. వివిధ స్థాయిలో అభివృద్ధి-అసమానతలకు గల కారణాలను గుర్తించారు. స్థానిక వనరుల ఆధారంగా ప్రత్యామ్నాయ అభివృద్ధి ప్రణాళికను తయారుచేశారు.
అనుభవాలు..
ప్రజా విజ్ఞాన కార్యక్రమాలకు ప్రజలు స్పందిస్తున్నారు. సంబంధిత ప్రభుత్వ సంస్థలు సహకరిస్తున్నాయి. బాణామతి, చేతబడి, దెయ్యం వంటి సమస్యలు ముందు కొచ్చినప్పుడు నేరుగా జనవిజ్ఞానవేదికను సంప్రదించి చైతన్య కార్యక్రమాలను నిర్వ హించేందుకు దోహదపడుతున్నాయి. అయితే, ఈ మూఢవిశ్వాసాలు బలంగా ఇమిడి ఉన్నప్పుడు (ఉదా: చేపమందు) సాంప్రదాయవాదుల నుండి కొంత వ్యతిరేకతా వస్తుంది. జనవిజ్ఞానవేదిక నాయకులు ముగ్గురు, ఉపాధ్యాయ ఉద్యమ నాయకులు ఐదుగురు శాసనమండలికి ఎన్నికయ్యారు. దీంతో రాష్ట్రాభివృద్ధిలో జోక్యం చేసుకునే అవకాశాలూ, బాధ్యతలూ మరింత పెరిగాయి.

No comments: