- నేడు నికోలస్ కోపర్నికస్ జయంతి
చిన్నారులూ..! 'విశ్వంలో ఏం జరుగుతుందో..? ఈ భూమి మీద ఇంతమందిమి ఉన్నాం మరి ఇది కుంగిపోదా..?' అని ఇలాంటివే చాలా సందేహాలు మీ బుజ్జి బుర్రల్లో మెదులుతూనే ఉంటాయి. అలాంటి జిజ్ఞాసతోనే ఈ పక్క చిత్రంలో కనిపిస్తున్న 'నికోలస్ కోపర్నికస్' గొప్ప నిజాన్ని కనిపెట్టాడు. ఇప్పుడు మీలో ఎవర్ని అడిగినా 'సూర్యుని చుట్టూ భూమి తిరుగుతుంద'ని ఠక్కున చెప్పేస్తారు. కానీ దీన్ని నిరూపించడానికి ఎన్నో ఆటంకాలను ఎదుర్కొన్నాడు కోపర్నికస్. ఎన్నో ప్రయోగాలు చేశాడు. అందుకు గణిత, ఖగోళశాస్త్రాల్ని మదించాడు. చివరకు భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతున్నాడనే కన్నా సూర్యుని చుట్టూ భూమి తిరుగుతుందని అను కుంటేనే రాత్రీ పగలుకూ, మారుతున్న ఋతువులకూ కారణాలు సులభంగా అర్థమవుతాయ న్నాడు. అంతేకాదు ఆ వాస్తవాన్ని లెక్కలతో సహా నిరూపించాడు. తన పరిశోధనాసారం ప్రపంచానికి ఎలా ఉపయోగపడిందో ఆయనైతే చూడలేకపోయాడు. కానీ మనం మాత్రం ఆ వాస్తవాన్ని గ్రహించి, మరింత ముందుకుపోతున్నాం. ఈ నిజాన్ని అంగీకరించడానికి నాటి మత వాదులు ఏమాత్రం ఇష్టపడలేదు. కానీ నేడు అదే వాస్తవమైంది. సైన్స్ ఏదైనా ప్రయోగాత్మకంగా రుజువైనవే వాస్తవమని నమ్ముతుంది. ప్రయోగాత్మకంగా ఋజువు చేయడం అంత ఆషామాషీ కాదు. అందుకెంతో కృషి చేయాలి. అంత మేధోమథనం చేశాడు గనుకే 'నికోలస్ కోపర్నికస్' ఖగోళ పితామహుడయ్యాడు. మరి ఆయన గురించి తెలుసుకుందామే..!
'నికోలస్ కోపర్నికస్' 1473, ఫిబ్రవరి 19న జన్మించాడు. తండ్రి రాగి వ్యాపారం చేసేవాడు. నలుగురి పిల్లల్లో 'కోపర్నికస్' ఆఖరివాడు. 'కోపర్నికస్'కు పదేళ్లప్పుడే తల్లీతండ్రీ ఇద్దరూ మరణించారు. మేనమామ 'లుకాస్ వాజెన్‌రోడ్' పెంచి పెద్దచేశాడు. ఆయన గొప్ప విద్యావేత్త. న్యాయశాస్త్రంలో 'బోలాగ్నా' యూనివర్శిటీ నుండి డాక్టరేట్ పొందాడు. 'పర్మియా'లో బిషప్ కూడా. సామాజిక హోదా, డబ్బుకు లోటు లేకపోవడంతో తెలివైన 'కోపర్నికస్'ను బాగా చది వేందుకు ప్రోత్సహించాడు. 'కోపర్నికస్' 'క్రాకౌ' యూని వర్శిటీలో రెండేళ్లు చదువుకున్నాడు. ఆ తర్వాత 'ఫ్రంబర్క్' చర్చిలో మతాధికారిగా ఉద్యోగం వచ్చింది. చర్చిలో ఎక్కువ సమయం ఉండాల్సిన అవసరం లేకపోవడంతో మరో 12 సంవత్సరాలు చదువు కొనసాగించాడు.
యూరప్‌లో 15వ శతాబ్ది ఆరంభం నాటికి కొత్త మార్గాలు, ప్రాంతాల అన్వేషణ ముమ్మరంగా మొదలైంది. కొందరు అప్పటికే కొత్త ప్రాంతాలను అన్వేషించారు. రాజులు, ప్రభువుల పాలన పోయే దిశగా సమాజంలో మార్పు జరుగుతోంది. మేధోమథనం ఆరంభమైంది. ఇది 'కోపర్నికస్'లోనూ ప్రారంభమైంది. ముద్రణ పద్ధతి అమల్లోకి రావడంతో పుస్తకాలూ అందుబాటులోకి వచ్చాయి. కనపడిన ప్రతి పుస్తకాన్నీ 'కోపర్నికస్' చదివేవాడు. గణిత, ఖగోళశాస్త్రాలపై ఎక్కడ ఉపన్యాసాలున్నా హాజరయ్యేవాడు.
ఈ కొత్త భావాలకు అప్పట్లో ఇటలీ కేంద్రంగా ఉండేది. క్రమంగా ఆ భావాలు ఇతర దేశాలకూ వ్యాపించాయి. 1496లో 'బోలోగ్నా' యూనివర్శిటీలో 'కోపర్నికస్' చేరాడు. ఆ తర్వాత 'పడువా', 'ఫెరార' యూనివర్శిటీల్లో చదివాడు. 'జీవితం, కళ, తత్వ శాస్త్రాల'పై తమ తమ అభిప్రాయాలను లేఖల రూపంలో రాసి, వాటినే పంచేవారు. వాటిని 'కోపర్నికస్' ఆసాంతం చదివేవాడు. న్యాయశాస్త్రాన్ని చదువుతున్నా ఆయన ధ్యాసంతా 'ఖగోళ, గణితశాస్త్రాల'పైనే ఉండేది. ఆయన 'గ్రీకు భాషను, వైద్యం, తత్వశాస్త్రం, రోమన్ చట్టాన్ని' కూడా అధ్యయనం చేశాడు. 'బోలోగ్నా' యూనివర్శిటీ లోనే ప్రముఖ ఖగోళశాస్త్రవేత్తలు 'డోవినికో', 'డానొవోరా' పరిచయమయ్యారు. 'డానొవోరా' సహకారంతో ఖగోళ పరిశోధనల్లో కిటుకులు తెలుసుకున్నాడు. 'కోపర్నికస్' అన్వేషణకు ఇక్కడే పునాది పడింది. విమర్శనాత్మకంగా విషయాల్ని పరిశీలించే అలవాటు 'కోపర్నికస్'కు చిన్న ప్పటి నుండీ ఉంది. 'టాలెమీ' సిద్ధాంతాల్లో వాస్తవాన్ని అనుమానించటమే కాక, ప్రత్యామ్నాయం కోసమూ అన్వేషించాడు.
న్యాయశాస్త్రంలో 1503లో డాక్టరేట్ పొంది, 'ఫ్రంబర్గ్' వెళ్లాడు. ఈలోపు మేనమామ అస్వస్థతకు గురైతే 1506-12 వరకూ అక్కడే ఉన్నాడు. ఈ ఆరేళ్లల్లో ఎన్నో ఆలోచనలు చేశాడు. 'టాలెమి' ప్రతిపాదనల్ని వందలసార్లు పరిశీలించాడు. చివరికి 'సూర్యకేంద్ర సిద్ధాంతాన్ని' చిత్తుగా తయారుచేశాడు. 1514లో ఈ విషయాన్ని మిత్రులు కొందరికి అందజేశాడు. అదే తర్వాత 'ఆన్ ద రివెల్యూషన్ ఆఫ్ ద సెలెస్ట్రియల్ స్పియర్స్' గ్రంథంలో వివరించాడు.
'ఫ్రంబర్గ్' నుంచి తిరిగొచ్చాక ఇంటి పైకప్పు మీద ప్రయోగశాలను ఏర్పాటు చేసుకుని, ఖగోళ పరిశోధన లు జరిపాడు. తన ప్రతిపాదనల్నే పదేపదే తార్కికంగా పరిశీలించాడు. చివరికి తన సిద్ధాంతమే వాస్తవాన్ని ప్రతిబింబిస్తోందనే నిర్ణయానికి వచ్చాడు. సూర్యుడితో పాటు ఇతరగ్రహాలు భూమి చుట్టూ తిరుగుతున్నట్లు అరిస్టాటిల్, టాలెమి ఎందుకు భావించారో 'కోపర్నికస్' కు అర్థమైంది. భూమి నిర్దిష్ట కక్ష్యలో 24 గంటలకోసారి తనచుట్టూ తాను తిరగటంతో సూర్యుడూ, ఇతర గ్రహాలూ భూమి చుట్టూ తిరుగుతున్నట్లు వారు భ్రమించారని నిర్ణయానికొచ్చాడు. ఒక్క చంద్రుడే భూమి చుట్టూ తిరుగుతున్నాడని ఆయన ప్రతిపా దించాడు. అంగారకుడు, బృహస్పతి, శని గ్రహాలు భూమి కంటే దూరంగా సూర్యుడి చుట్టూ తిరుగుతున్నాయని చెప్పాడు. దీనికి ఆకర్షితుడైన జర్మనీ గణితశాస్త్రవేత్త 'రెటికస్' 1539లో 'కోపర్నికస్'ని చూడటానికి 'ప్రంబర్గ్'కి వెళ్లాడు. 'రెంటికన్' ఎంత బతిమాలినా వాటిని ప్రచురించటానికి 'కోపర్నికస్' అంగీకరించలేదు. చివరికి 1540లో 'కోపర్నికస్' సిద్ధాంతాన్ని 'రెటికస్' స్వయంగా ప్రచురించాడు. ఆ పుస్తకం వెలుగులోకి వచ్చినరోజే 1543, మే 24న 'కోపర్నికస్' మరణించాడు. మిత్రులు ఆ పుస్తక ప్రతిని ఒకదాన్ని ఆయన చితిపై పెట్టారంట! ఏమైనా 'విజ్ఞానశాస్త్రం'లో ఇదే అంతిమం అనేదేమీ ఉండదు. నిరంతర ప్రయోగాత్మక ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుంది. అదే విజ్ఞానశాస్త్ర పురోగమనం తీరు..!
మరి ఇంత గొప్ప విషయాన్ని కనిపెట్టిన
'నికోలస్ కోపర్నికస్'కు జేజేలు చెప్పేద్దామే..
No comments:
Post a Comment