అయస్కాంతం షాక్ ఎందుకు కొట్టదు?
షాక్ కొట్టాలంటే శక్తి శరీరంగుండా ప్రవహించాలి. ఆ ప్రవాహ తీవ్రతలో మన శరీరపు సహజ జీవ భౌతికచర్యలు (Physiological activities), అపభ్రంశం (imbalance) కావాలి. శక్తి ఎన్నోరూపాల్లో ఉంటుంది. ఉదాహరణకు 'కాంతి' కూడా శక్తి రూపమే. మనం ఎండలో నిల్చుంటే మనకు షాక్ కొట్టడం లేదు కదా? అలాగే ఉష్ణశక్తి కూడా శక్తి రూపమే. కానీ వేడి వస్తువును పట్టుకొంటే అక్కడికక్కడ చర్రుమంటుందిగానీ విద్యుత్షాక్లాగా షాక్ కొట్టదు కదా! అలాగే గాలిలో పవన చలనశక్తి (wind energy) ఉంది. ఈదురుగాలిలో నిల్చుంటే పడిపోతామేమోగానీ విద్యుత్ షాక్లాగా షాక్ కొట్టదు కదా? అసలు విషయం ఏమిటంటే రెండు వేర్వేరు బిందువుల (ఉదాహరణకు చేయి, కాలు లేదా ఎడమ చేయి, కుడిచేయి లేదా ఎడమ కాలు, కుడి కాలు మొదలైనవి) మధ్య శక్తి వ్యత్యాసం (energy gradient) ఉందనుకుందాం.
దీన్నే పొటెన్షియల్ భేదము లేదా శక్మ భేదం (potential difference) అంటారు. శక్తి ఎల్లప్పుడు అధిక పొటెన్షియల్ స్థానం నుంచి అల్ప పొటెన్షియల్ స్థానం వైపు వెళ్లడానికి ప్రయత్నిస్తుంది. మరోమాటలో చెప్పాలంటే ఆ తేడాను రూపుమార్పి సమానత్వపు సంపత్తిని తీసుకురావడానికి ప్రకృతి ప్రయత్నిస్తుంది. అందుకే కమ్యూనిస్టులు వర్గ సమాజం పోయి సమసమాజం రావడం ఖాయమన్న ఆశావాదంతో కృషి చేస్తారు. అది వేరే విషయం. శక్మ భేదం ఉన్నంత మాత్రాన అన్ని వస్తువుల గుండా శక్తి ప్రవాహం జరగదు. మానవ శరీరంలో బాగా ప్రవహించగలిగేది విద్యుత్ ప్రవాహం. ఆ ప్రవాహ తీవ్రత ఆ రెండు బిందువుల మధ్య ఉన్న శక్మ భేదపు స్థాయిని బట్టి అనులోమానుపాతం (proportional) గా ఉంటుంది. అంటే, శక్మ భేదం ఎక్కువగా ఉంటే ఎక్కువ విద్యుత్ ప్రవాహం (electrical current) ఉంటుందన్న మాట. విద్యుత్ ప్రవాహం అంటేనే ఎలక్ట్రాన్ల ప్రవాహం. ఆ విధంగా ఎలక్ట్రాన్లు శరీరంలో ప్రవహిస్తే శరీరంలో ఉన్న నాడీ సంబంధాలు, శ్వాసక్రియ, ఎంజైము చర్యలు, ఆక్సిజన్ సరఫరా మొదలయినవి అపభ్రంశం చెందుతాయి. ఎందుకంటే ఇవన్నీ విద్యుద్రసాయనిక (electrochemical) ప్రక్రియలు.
ఈ ప్రక్రియలలో ఎలక్ట్రాన్లు ఒక క్రమపద్ధతిలో స్థానాలు మారుతూ జీవాన్ని నడిపిస్తుంటాయి. అంటే ఎలక్ట్రాను బదిలీ (electron transfer) చర్యలే జీవమనే నాటకంలో ప్రధానఘట్టాలు, దృశ్యాలు, డైలాగులు. అలాంటి ఎలక్ట్రాను బదిలీ చర్యలలోకి బయటి ఎలక్ట్రాన్లు దూరితే అపభ్రంశం చెంది, క్రమత్వం పోయి మరణం సంభవిస్తుంది. దీన్నే విద్యుత్ షాక్ అంటాము. పిడుగు పడ్డప్పుడు జరిగే చర్య కూడా ఇలాంటిదే.
అయితే, అయస్కాంత ధృవాన్ని ఒక చేత్తో, నేలను మరో చేత్తో లేదా కాలితో తాకామనుకొందాం. అయస్కాంత ధృవాని (magnetic pole) కీ నేలకూ మధ్య అయస్కాంతత్వపు శక్మ భేదం ఉందనడంలో సందేహం లేదు. కానీ ఆ శక్మ బేధం వల్ల శరీరంలో ఏవిధమైన శక్తి ప్రవాహం జరగదు. ఏ పరమాణువులూ (atoms), ఏ ప్రాథమిక కణాలూ (fundamental particles), ఏ అణువులూ (molecules) ఒక బిందువు నుంచి మరో బిందువు వైపు చలనం చెందవు. కాబట్టి సహజసిద్ధమైన జీవ ప్రక్రియలకు విఘాతం (disturbance) ఏమీ కలగదు. అందువల్లే మనం అయస్కాంత ధృవాల్ని పట్టుకొంటే షాక్ కొట్టదు. ఇక్కడో విషయం గుర్తించాలి. కదిలే అయస్కాంతం చుట్టూ విద్యుత్తీగను ఉంచినట్లయితే అందులో విద్యుత్ ప్రవహిస్తుంది. డైనమోలు, విద్యుదుత్పత్తి (generation) స్థావరాల్లో జరిగే తతంగం అదే! కాబట్టి తిరుగుతున్న అయస్కాంత ధృవాల దగ్గర విద్యుత్ శక్మం ఏర్పడి షాక్ కొట్టగలదు. అయితే అయస్కాంత ధృవాల బలము, తిరిగే వేగమూ చాలా ఎక్కువగా ఉండాలి.
చనిపోబోతున్న వ్యక్తికి నీరు తాపిస్తే తొందరగా ఎందుకు చనిపోతాడు? - పై పాఠకుడే.
చనిపోబోతున్న వ్యక్తి చనిపోబోయే పరిస్థితికి దప్పికో, వడదెబ్బో, ఆయాసమో, నిర్జలీకరణమో (dehydration) అయితే నీరు తాపిస్తే చనిపోయేబదులు చావు నుంచి బయటపడి బతికే అవకాశముంది. కాబట్టి చనిపోబోతున్న వ్యక్తులకు నీరు తాగిస్తేనే మంచిది. పై కారణాలు ఏమీ కాకుండా మరేదో కారణాల వల్ల చనిపోబోతున్నా నీరు తాపిస్తే తొందరగా మరణిస్తారనుకోవడం కేవలం అశాస్త్రీయం. శ్వాసక్రియలో లయ తప్పడం వల్ల మరణానికి చేరువవుతున్న సందర్భంలో నీరు తాపితే అవి పొరపాటున ఊపిరితిత్తులలోకి వెళితే ప్రమాదం. కానీ అది చాలా అరుదైన విషయం. నీరు తాపడం మంచిది. డాక్టరు సలహా మరీ మంచిది.
భూమి ఎపుడు వినాశనం అవుతుందో లెక్కించగలమా? - ఎం.అజరుకుమార్, వరంగల్.
తనంత తానుగా వినాశనం (destruction) అయ్యే లక్షణం ఏదీ భూమికి లేదు. కానీ సామ్రాజ్యవాదులు, యుద్ధకాంక్షాపరులు తమ వద్ద ఉన్న అణుబాంబుల్ని, హైడ్రోజన్ బాంబుల్ని ప్రపంచదేశాల మీద ప్రయోగిస్తే భూమి చాలామటుకు నువ్వన్న రూపంలో వినాశనం ఏరోజైనా చెందే ప్రమాదం ఉంది. అలా జరగకుండా ప్రపంచ శాంతి కాముకులు ఎపుడూ కాపాడతారని అనుకొందాం. అలాంటపుడు భూమి వినాశనం ఏమీ కాదు. కానీ భూమికి శాశ్వతత్వం కూడా లేదు. ఒకరోజు అది అంతరిస్తుంది. సూర్యుడు ఓ నక్షత్రం. తనలో ఉన్న హైడ్రోజన్ కేంద్రక సంలీన (nuclear fusion) ఇంధనం అయిపోయే సమయంలో క్రమంగా తన ఘనపరిమాణాన్ని పెంచుకొంటూ కొన్ని లక్షల కోట్ల సంవత్సరాల తర్వాత భూమిని తనలో ఇముడ్చుకొంటూ పెరుగుతుంది. ఆ తర్వాత మళ్లీ కుంచించుకుపోయి తన తుది రూపమైన శ్వేత కుబ్జ (white dwarf) గా మారుతుందని అంచనా!
No comments:
Post a Comment