7 Feb 2012

అణు విద్యుత్‌ .. ఏదీ విశ్వసనీయత...?

అణు విద్యుత్‌ .. ఏదీ విశ్వసనీయత...?

అణువిద్యుదుత్పత్తి అణు విజ్ఞానంతో బాటు రక్షణ విషయాలతో ఇమిడి ఉంది. ఫలితంగా, అణు విద్యుదుత్పత్తి రంగాన్ని 'పవిత్రమైన రంగం'గా పరిగణిస్తూ దీని మంచిచెడ్డలపై ఇప్పటివరకూ మన దేశంలో వివరమైన చర్చ జరగలేదు. కానీ, భారత-అమెరికా అణు ఒప్పందం తర్వాత అణు విజ్ఞాన వినియోగంలో రక్షణ, పౌర అంశాలు వేర్వేరుగా పరిగణింపబడుతున్నాయి. ఈ నేపథ్యంలో అణు విద్యుదుత్పత్తిని మనదేశంలో భారీగా పెంచడానికి ఒప్పందాల్ని చేసుకుంది. చేసుకుంటుంది. భారత-అమెరికా అణు ఒప్పందం మన దేశ విధానంపై ఎన్నో దుష్ప్రభావాలు కలిగి ఉందనే విమర్శ ఓవైపు ఉండనే ఉంది. ఈ నేపథ్యంలో భూకంపం, సునామీ వల్ల జపాన్‌లో ఫుకిషిమా అణువిద్యుత్‌ కేంద్రంలో భారీగా జరిగిన నష్టం అసలు అణు విద్యుదుత్పత్తిపై ఆధారపడటం ఏమేర ఔచిత్యమనే చర్చ అంతర్జాతీయంగానే ముందుకొచ్చింది. కానీ, అణువిద్యుత్‌ కేంద్రాలు మనదేశంలో జపాన్‌లోలాగా భారీ భూకంపాలకు, సునామీలకు గురికావనీ, సురక్షితమనీ, రక్షణ వ్యవస్థను పునఃపరిశీలిస్తున్నామనీ, పటిష్టపరుస్తామనీ ప్రభుత్వం హామీనిస్తుంది. దీని కొనసాగింపుగా అన్ని ఆందోళనలను పక్కనబెట్టి జైతాపూర్‌ వద్ద అణువిద్యుత్‌ పార్క్‌ను నిర్మించాలని అంతిమ నిర్ణయం తీసుకుంది. దీంతో దేశ ప్రజలు, ముఖ్యంగా స్థానికులు ఎంతో ఆందోళనకు గురవుతున్నారు. 'అసలు ఇదంతా ఎవరి ప్రయోజనం కోసం' అనే ప్రశ్నను లేపుతుంది. ఈ నేపథ్యంలో అసలు అణువిద్యుత్‌ ఏమేర విశ్వసనీయత కలిగి ఉంది? అనే విశ్లేషణతో ఈవారం మీముందుకొచ్చింది 'విజ్ఞానవీచిక'.
తరుగుతున్న ముడిచమురు, ఇంధన బొగ్గు నిల్వల నేపథ్యంలో అణు విద్యుత్‌ దీర్ఘకాల అవసరాలను తీర్చగలదని, చౌకైనదని, సురక్షితమైనదని ప్రచారం జరుగుతూ వచ్చింది. పర్యావరణపరంగా ఇది తక్కువ హాని కలిగిస్తుందని, గ్రీన్‌ హౌస్‌ వాయువుల విడుదల, భూగోళం వేడెక్కడాన్ని నియంత్రిస్తుందని కూడా ప్రచా రం చేయబడింది. మొదట పెట్టుబడి ఎక్కువైనా, అణువిద్యుత్‌ దీర్ఘకాలంలో చౌకైనదని ప్రచారం చేశారు. పైగా అణువిద్యుత్‌ రియాక్టర్ల వల్ల జరిగే ప్రమాదాలు మిగతా ఇంధన ప్రమాదాలకన్నా చాలా తక్కువని, ప్రాణ నష్టం నామమాత్రమని కూడా ప్రచారం జరిగింది. కానీ, ఫుకుషిమా అణు ప్రమాదం తర్వాత జరుగుతున్న చర్చలు అణువిద్యుత్‌కు అనుకూలంగా చేస్తున్న వాదనలన్నీ తప్పని తేల్చుతు న్నాయి. ముఖ్యంగా ఫుకుషిమా ప్రమాదం తీవ్ర భూకంపం (రిచర్టర్‌ స్కేల్‌పై తీవ్రత 9.1), సునామీ వల్లే జరిగిందని, ఇటువంటి పరిస్థితులు భారత దేశపు అణు రియాక్టర్ల ప్రాంతంలో లేవని ప్రభుత్వం చెపుతుంది. అయితే, ఎంతోకాలంగా కొన సాగుతున్న నిర్మాణ, నిర్వహణ లోపాలు కూడా ఇప్పటి ప్రమాదతీవ్రతకు కారణమనే అంశాన్ని వీరు దాస్తున్నారు. ఇంతవరకు జరిగిన 37 అతి పెద్ద ప్రమాదాలకు డిజైన్‌, నిర్మాణ లోపాలు, మానవ వైఫల్యాలు ప్రధాన కారణాలని తేలింది. ఉగ్రవాద చర్యలు, ఆర్థిక విద్రోహచర్యలు అణు రియాక్టర్ల ప్రమాదావకాశాల్ని (రిస్క్‌) పెంచు తున్నాయి. అణుబాంబుల వినియోగ ప్రమాదాన్ని పెంచుతున్నాయి. ఒకసారి ప్రమాదం జరిగిన తర్వాత కలిగే దుష్ప్రభావాలను నియంత్రించడం తేలికకాదని, ఎంతో ఖర్చుతో కూడినదని ఫుకుషిమా అనుభవాలు తెలుపుతున్నాయి.
అధిక పెట్టుబడి...
దిగుమతి చేసుకునే అణువిద్యుత్‌ రియాక్టర్ల నిర్మాణానికి ప్రతి మెగావాట్‌కు దాదాపు రూ.21కోట్లు ఖర్చవుతుందని ఇప్పటి అంచనాలు తెలుపుతున్నాయి. ఈ పెట్టుబడిలో వాడిన అణు ఇంధన నిల్వ ఖర్చు, ఉత్పత్తికి పనికిరాని రియాక్టర్లను మూసివేయడానికి (డి కమిషన్‌) అయ్యే ఖర్చు, ప్రత్యేక రక్షణ ఏర్పాటుకయ్యే ఖర్చు చేర్చలేదు. డి కమిషన్‌ ఖర్చు మొత్తం రియాక్టర్ల నిర్మాణ ఖర్చులో సగం లేదా మూడో వంతు మధ్య ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇదే స్వదేశంలో అణు రియా క్టర్‌ను నిర్మించడానికి మెగావాట్‌ సామర్థ్యానికి రూ.8-9 కోట్ల మధ్యనే అవుతుంది. ఒత్తిడిగల భారజల వినియోగ రియాక్టర్ల నిర్మాణ సామర్థ్యం ఇంధన నిల్వకనుకూ లంగా ఉన్నాయి. థర్మల్‌ విద్యుత్‌ కర్మాగారాల నిర్మాణానికి మెగావాట్‌కు రూ.ఐదు కోట్లు మాత్రమే ఖర్చవుతుంది. ఇక జల విద్యుత్‌ కర్మాగారాల నిర్మాణఖర్చు చాలా తక్కువగా ఉంటుంది. ఒకో అణువిద్యుత్‌ నిర్మాణానికి దాదాపు రూ.రెండులక్షల కోట్లు ఖర్చవుతుందట.
పర్యావరణం సురక్షితమా?..
బొగ్గు, ముడిచమురు ఇంధనాల్లా కాక, అణువిద్యుత్తు పర్యావరణపరంగా సుర క్షితమైందని, భూగోళాన్ని వేడెక్కించే గ్రీన్‌హౌస్‌ వాయువుల విడుదల దాదాపు ఉండదని, అణు విద్యుత్‌ సమర్థకులు చెపుతున్నారు. కానీ, వాస్తవమేంటంటే అణు విద్యుదుత్పత్తికి వినియోగించే యురేనియం ఖనిజ సేకరణ, ప్రాసెసింగ్‌లో, ప్రాజెక్టు నిర్మాణ, నిర్వహణలో భూగోళాన్ని వేడెక్కించే వాయువులు విడుదలవుతుంటాయి. ఈ సందర్భంగా వచ్చే దుమ్మూ ధూళీ వాతావరణాన్ని కలుషితం చేస్తాయి. అందు వల్ల, అణు విద్యుత్‌ పర్యావరణానికి పూర్తిగా సురక్షితమని చెప్పడం వాస్తవం కాదు.
ప్రమాదాల ఖర్చు...
ప్రమాదం జరిగినప్పుడు ఆ వెంటనే కలిగే దుష్ప్రభావాల నుండి రక్షించడానికి అయ్యే ఖర్చుతోబాటు, రియాక్టర్‌ను మూసివేసిన తర్వాత కూడా దీర్ఘకాలం (50-100 ఏళ్ల వరకూ) ఖర్చు అవుతూనే ఉంటుంది. ఫుకుషిమా ప్రమాదం వల్ల కలిగిన ఆర్థిక నష్టం ఇప్పటికీ అంచనాలకు అందటం లేదు. ప్రమాదం జరిగినప్పుడు కర్మాగారంలో కార్మికులే కాక, 20-30 కి.మీ. పరిధిలో ఉన్న జీవరాశులన్నీ రేడియో థార్మిక దుష్ప్రభావాలను ఎదుర్కొన్నాయి. వీటికీ, పర్యావరణానికీ కలిగే నష్టం ఇప్పట్లో అంచనాలకందవు. మన రాజ్యాంగం, సుప్రీం కోర్టు తీర్పుల ప్రకారం కాలుష్యానికి బాధ్యులైన వారే నష్టాల్ని భరించాలి. కానీ, దీనికి విరుద్ధంగా మన అణు విద్యుత్‌ పరిహార చట్టం (న్యూక్లియర్‌ లైబులిటీ యాక్ట్‌) రూపొందించబడింది.

ప్రమాదం జరిగినప్పుడు నిర్వహకుల నష్టపరిహారం గరిష్టంగా రూ.1500 కోట్లు. ఈ పరిమితిని దాటినప్పుడు ప్రభుత్వం అదనపు ఖర్చును భరిస్తుంది. కానీ మొత్తం ఖర్చు రూ.2500 కోట్లకు మించకూడదు. తయారీదారులు డిజైన్‌ లోపాలున్నప్పుడు మాత్రమే నష్టపరిహారాన్ని ఈ పరిమితులకు లోబడి భరించాలి. దీనర్థం అణువిద్యుత్‌ లాభాలు వచ్చినంతకాలం యాజమాన్యం లబ్ధి పొందుతుంది. పెద్ద ప్రమాదాలు జరిగినప్పుడు నష్టాల్ని మాత్రం ప్రభుత్వమే అంటే ప్రజలే భరించాల్సి ఉంటుంది. 'లాభాల ప్రయివేటీకరణ, నష్టాల జాతీయకరణ' అంటే ఇదే.
ప్రత్యామ్నాయ వనరులు..
తరుగుతున్న బొగ్గు, ముడిచమురు, ఇంధన నిల్వల నేపథ్యంలో ఎక్కువ ఖర్చు-ప్రమాదాలతో కూడిన అణువిద్యుత్‌కు ప్రత్యామ్నాయ వనరు ఏమిటి? అనే సమస్య ముందుకు వస్తుంది. ఇప్పటి సాంకేతికస్థితిలో సౌరశక్తి అని చెప్పవచ్చు. దీన్ని వినియోగిస్తూ జీవ ఇంధన తయారీ ఒక మార్గం కాగా, 'ఫొటో వోల్టెక్‌ సెల్స్‌' ద్వారా విద్యుత్‌గా మార్చి వినియోగించడం మరో మార్గం. సౌరశక్తిని కేంద్రీకరింప జేసి వేడిగా మారుస్తూ వినియోగించడం మరో పద్ధతి. సౌరశక్తి వినియోగంపై పరిశోధనలు ఉధృతం చేస్తే దీనికయ్యే ఖర్చు అణువిద్యుత్‌ కన్నా తక్కువగా ఉంటుందనీ, పర్యావరణ రీత్యా సురక్షితమైందని నిపుణులు చెపుతున్నారు.
స్వతంత్ర పర్యవేక్షణ వ్యవస్థ...
రక్షణ కోణంలో అణు రియాక్టర్ల డిజైన్‌, నిర్మాణం, నిర్వహణలను సమర్థవంతంగా పర్యవేక్షించే వ్యవస్థ అవసరం. ఇప్పుడు ఇది ప్రభుత్వానికే చెందిన భారత అణు విభాగం కింద పనిచేస్తుంది. ఈ విభాగ ఆధ్వర్యంలోనే అణు రియాక్టర్ల నిర్మాణ, నిర్వహణ వ్యవస్థ, విద్యుదుత్పత్తి కూడా కొనసాగుతుంది. ఫలితంగా, పర్యవేక్షణా సంస్థ డిజైన్‌, నిర్మాణ, నిర్వహణ లోపాల్ని నిస్పక్షపాతంగా ఎత్తి చూపలేకపోతుంది. దీనిపనిలో పారదర్శకత కూడా లేదు. చాలా లోపభూయిష్టంగా ఉంది. ఫుకుషిమా ప్రమాదంలో నిర్వహణ కంపెనీ తగు జాగ్రత్తలు తీసుకోకుండా ఎన్నో లోపాల్ని కొనసాగిస్తూ వచ్చిందని తేలింది. ఈ నేపథ్యంలో మన దేశంలో పర్యవేక్షణ సంస్థను రాజ్యాంగబద్ధంగా, నేరుగా పార్లమెంటుకే నివేదించే సంస్థగా (కాగ్‌ ఆడిట్‌ సంస్థలాగా) చట్టబద్ధమైన ఏర్పాటు చేయాలి. అప్పుడే అణువిద్యుత్‌ రక్షణపై విశ్వసనీయత కొంతమేరకైనా ఉంటుంది.
ఆంధ్రప్రదేశ్‌లో..
శ్రీకాకుళం జిల్లాలో కొవ్వాడ సముద్ర తీర ప్రాంతంలో 9,564మెగావాట్ల సామర్థ్యం గల అణువిద్యుత్‌ పార్క్‌ను ఏర్పాటు చేయాలనేది ప్రతిపాదన. ఇది శ్రీకాకుళానికి 24కి.మీ. దూరంలో ఉంది. దీన్ని నాలుగేళ్లలో పూర్తిచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 1594 మె.వా. సామర్థ్యం గల ఆరు యూనిట్లతో దీన్ని నిర్మించనున్నారు. మొదటి రియాక్టర్‌ 2012కి పూర్తిచేయాలని ప్రభుత్వం సంకల్పించింది. ఇక్కడా ప్రజలు వ్యతిరేకిస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇదేకాక, గుంటూరు జిల్లా నిజాంపట్నం దగ్గర ఆరు వేల మెగావాట్లతో మరో పార్క్‌. కడపజిల్లా పులివెందుల దగ్గర 1400 మెగావాట్లతో (2100కు పెంచవచ్చు) ఇంకొక పార్క్‌ నిర్మించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. అంటే, రాష్ట్రంలో మొత్తం 17 వేల మెగావాట్ల అణువిద్యుత్‌ సామర్థ్యంగల రియాక్టర్లు మూడుచోట్ల రానున్నాయి.
మీకు తెలుసా?
* మన దేశంలో థర్మల్‌, జల, పునరుపయోగించే ఇంధన వనరుల తర్వాత అణువిద్యుత్‌ నాల్గవ అతిపెద్ద వనరు.
* 2010 నాటికి ఆరుచోట్ల 20 అణువిద్యుత్‌ కర్మాగారాల నుంచి 4,780 మెగావాట్ల అణు విద్యుదుత్పత్తి అవుతుంది. ఉత్పత్తి సామర్ధ్యం దాదాపు 80 శాతం. నిర్మాణ సామర్థ్యం ఆరువేల మెగావాట్లు.
* 2,720 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యంతో మరో ఐదు కర్మాగారాలు నిర్మాణంలో ఉన్నాయి. ఇవి ఒత్తిడి గల భారజలం (హెవీవాటర్‌)తో పనిచేసే రియాక్టర్లు.
* కొత్తగా దిగుమతి చేసుకునే రియాక్టర్లన్నీ మామూలు నీటితో చల్లబరిచే రియాక్టర్లు. వీటి వల్ల ప్రమాదావకాశాలు ఎక్కువ. వీటి నిర్మాణంలో, నిర్వహణలో మన అనుభవం తక్కువ.
* థోరియం ఇంధనంగా పనిచేసే ఫాస్ట్‌ బ్రీడర్‌ రియాక్టర్ల తయారీ, నిర్వహణలో (ప్రపంచంలోనే) మన దేశానిదే అగ్రస్థానం. మన యురేనియం నిల్వలు అతి స్వల్పం. ఫలితంగా దిగుమతుల ద్వారా యురేనియం అవసరాల్ని తీర్చుకోవాల్సి వస్తుంది.
* మార్చి, 2010 నాటికి మాత్రం కడప బేసిన్‌ దక్షిణ ప్రాంతంలో తుమ్మాలపల్లి చుట్టుపక్కల ప్రపంచంలోనే 20వ అతిపెద్ద యురేనియం నిల్వలున్నట్లు కనుగొన్నారు.
* 2032 నాటికి విద్యుత్‌ అవసరాల్లో తొమ్మిది శాతాన్ని (64వేల మెగావాట్ల అణువిద్యుత్‌) అణువిద్యుత్‌ ద్వారా తీర్చుకోవా లని మన దేశం భావిస్తుంది. 2010లో ఇది 4.2 శాతం మాత్రమే.
* 2020 నాటికి అణువిద్యుత్‌ స్థాపకశక్తి 25 వేల మెగావాట్లకు పెరుగుతుందని అంచనా.
* ఇంతవరకు మన దేశంలో ఎనిమిది అణువిద్యుత్‌ ప్రమాదాలు జరిగాయి. దానిలో అతిపెద్దది కల్పక్కంలోని అణు రియాక్టర్‌లో (తమిళనాడు)1987 మే 4న సంభవించింది. ఇంధన రాడ్లను మార్చే సమయంలో రియాక్టర్లలో పగుళ్లు ఏర్ప డ్డాయి. ఫలితంగా, రెండేళ్లు విద్యుదుత్పత్తి ఆపేయాల్సి వచ్చింది.
* ఇటీవల 2002 అక్టోబర్‌ 22న కల్పక్కం వద్ద మళ్ళీ ప్రమాదం జరిగింది.
* అదృష్టం కొద్దీ ఇటీవల వచ్చిన సునామీ అణురియాక్టర్లను నష్టపర్చలేదు.
* తక్కువ స్థాయిలో రేడియోథార్మిక శక్తి కలిగించే హానిని చూపు, స్పర్శలతో వెంటనే తెలుసుకోలేం. గణనీయంగా నష్టపోయిన తర్వాతే గుర్తించగలం.

No comments: