22 Feb 2012

మంత్రాలూ, చింతకాయలూ


మన దేశంలో ప్రాచీనకాలం నుంచీ మంత్రాలకు చాలా ప్రాముఖ్యత ఉంది. గురూ, పండిత్‌ వగైరా పదాల్లాగే మంత్రా అనే మాట కూడా ఇంగ్లీష్‌ డిక్ష్‌నరీల్లో కెక్కింది. హిందూ దేవాలయాల్లోనూ, పూజా పునస్కారాల్లోనూ నిత్యమూ వినబడే మంత్రాలే కాక నేపాల్‌, టిబెట్‌ వంటి ప్రాంతాల్లో మంద్రస్థాయిలో బౌద్ధ అర్చకులు ఉచ్చాటన చేసేవీ, చర్చ్‌లూ, మసీదుల్లో ఉచ్చరించే పవిత్ర శబ్దాలూ అన్నీ మొత్తం మీద ఒకే రకం వైఖరికి సంకేతాలు. మనవాళ్ళకి మంత్రాలే కాక వాక్కులోనూ, శబ్దాల్లోనూ కూడా చాలా నమ్మకం ఉంది. వేద పనస కలిసి చదివేది ఇద్దరైనా ఒక్క అక్షరం కూడా, ఒక్క స్వరం కూడా పొల్లుపోకుండా శ్రద్ధగా ఉచ్చరించడం చూస్తాం. మన ప్రాచీన వాఙ్మయమంతా మౌఖికమే. మునులూ, బ్రాహ్మణులూ నోటిమాటగా శాపాలిచ్చేవారు. విశ్వామిత్రుడు రాముడి చెవిలో చెప్పినా, వేములవాడ భీమకవి కోపం వచ్చి తిట్టినా శబ్దాలకు అంతులేని శక్తి ఉందని అనుకోవడం మన సంస్కృతిలో పరిపాటి. రాలని చింతకాయలని చూపించి ఇలాంటి నమ్మకాలని ఎద్దేవా చెయ్యడం సంగతి ఎలా ఉన్నా అసలు ఇలాంటి భావనలకు మూలం ఎక్కడుందో తెలుసుకోవడం అవసరం.

సుదీర్ఘమైన మన చరిత్రలో మతం ఒక బలమైన శక్తిగా ఎదిగింది. అధికసంఖ్యాకులను అల్పసంఖ్యాక వర్గం అణచి ఉంచడానికి మతాన్ని బాగా ఉపయోగించుకుంది. మతం గురించీ, ఆధ్యాత్మిక విషయాల గురించీ అలౌకికమైన భావాలను పొందేవారికి తమ మెదళ్ళలో ఎలాంటి మార్పులు దేనివల్ల కలుగుతున్నాయో తెలుసుకోలేరు. పుస్తకాలూ, ప్రవక్తల బోధలూ, పెరిగిన వాతావరణమూ అన్నీ మనుషులను మతపరంగా లొంగదీసుకోవటానికి సిద్ధంగా ఉంచుతాయి. వీటికి తోడుగా గుళ్ళలో మోగే గంటలూ, మంత్రోచ్చారణలూ,కలిసి పాడే భజనలూ, తప్పెటలూ అన్నీ ఒకరకమైన హిప్నోసిస్‌కు గురిచేస్తాయి. ఇవన్నీ తరవాతి పరిణామాలు. మానవజాతి చరిత్రలో మొట్టమొదటిది ఒక అమాయకదశ. అతీతశక్తులను గురించి రకరకాల అపోహలు మొదలైన దశ. ఈ అపోహలకు ఎన్నో భౌతిక కారణాలుండేవి. అందులో చెవుల ద్వారా వినబడి మెదడుకు విభ్రాంతి కలిగించే శబ్దాల మాయాజాలం ఒకటి. ప్రకృతిని గురించి ఎక్కువగా తెలియని తొలి మానవులను మభ్యపెట్టే అంశాలు ఎన్నో ఉండేవి. అడవి మృగాల అరుపులూ, కూతలూ, తుఫాను గాలుల రొదలూ, ఉరుముల గర్జనా ఇలా ఒక్కొక్కొదాన్నీ పసికట్టడం వారికి అత్యవసరంగా ఉండేది. ప్రకృతిలో సహజంగా వినిపించే ఇలాంటి శబ్దాలకు అలవాటు పడ్డ తొలి మానవులకు అరుదుగా వినిపించే ప్రతిధ్వనులవంటివి అసహజంగానూ, భయం కలిగించేవిగానూ ఉండేవి. ఇవి ముఖ్యంగా కొండ కనుమల్లోనూ, గుహల్లోనూ వినిపించేవి. వీటివల్ల బెదిరిన మనుషులు వాలా ప్రభావితం అయినట్టుగా అనిపిస్తుంది.
సుమారు 30 వేల ఏళ్ళ క్రితం నుంచి 10 వేల ఏళ్ళ క్రితం దాకా జీవించిన మానవులు ఫ్రాన్స్‌ తదితర ప్రాంతాల్లోని గుహల గోడల మీద అద్భుతమైన బొమ్మలు గీశారు. వీటిలో ఎక్కువగా అప్పట్లో వారు వేటాడిన దున్నలూ, దుప్పులూ, గుర్రాలూ మొదలైనవాటి చిత్రాలు. వీటి సంగతి మొదటగా పంతొమ్మిదో శతాబ్దం చివరి రోజుల్లో తెలిసింది. ఈ బొమ్మలు గీయడానికి కారణాలేమిటో సరిగ్గా తెలియదుకాని ఇటువంటి గుహలు పూజలూ పునస్కారాలూ జరిపేందుకు తొట్టతొలి ఆలయాలుగా ఉపయోగపడ్డాయనే ప్రతిపాదనలున్నాయి. ఈ మధ్య వీటి మీద శబ్దపరమైన పరిశోధనలు జరిగాయి. వాటివల్ల ఈ గుహల్లో కొన్ని ప్రాంతాల్లో శబ్దాలు బాగా ప్రతిధ్వనిస్తాయని రుజువయింది. ఇవే కాక క్రీ.పూ. మూడు వేలఏళ్ళ నాటి స్టోన్‌హెంజ్‌ మొదలైన ఇతర ప్రాచీన ప్రార్థనాస్థలాల్లో కూడా శబ్దాలు మారుమోగుతాయని తెలిసింది. దీని ప్రాముఖ్యత ఏమిటో తెలుసుకోగోరిన పరిశోధకులు వెనకబడిన ఆదిమతెగల్లోనూ, "పురోగమించిన" కొన్ని ఆధునిక సంస్కృతుల్లోనూ ఈనాటికీ కూడా కనబడుతున్న కొన్ని తంతులూ, పూజలను బట్టి ప్రాచీన యుగంలో ఏం జరిగిందో కొంతవరకూ ఊహించగలుగుతున్నారు. గిట్టలు కలిగిన జంతువుల బొమ్మలన్నీ శబ్దాలు మారుమోగే ప్రాంతాల్లోనే ఉన్నాయి కనక బొమ్మలకూ, శబ్దాలకూ సంబంధం ఉండి ఉండాలి. అక్కడ నిలబడి చేతులతో చప్పట్లు చరిచినా, రెండు రాతి ముక్కలతో ఒకదాన్నొకటి కొట్టినా ఆ ధ్వనులు మారుమోగి సరిగ్గా పరిగెత్తే జంతువుల గిట్టల చప్పుడులాగే వినిపిస్తాయి. ఇది కనిపెట్టిన మొదటి గణాచారి ఎవడో తెలియదు కాని దీని ప్రాముఖ్యత వారికి అర్థమై ఉంటుంది. తలవని తలంపుగా ఇటువంటి గుహల సంగతి తెలిశాక అక్కడ మారుమోగిన శబ్దాలు వారికి జంతువుల కాలి గిట్టలను తలపించి ఉంటాయి. అందుకని వారుసరిగ్గా ఇటువంటి ప్రదేశాలనే ఎంచుకుని అక్కడ బొమ్మలు గీశారని అనుకోవచ్చు. గుహలో గుమిగూడి, తమకు ఆహారం అయిన, లేదా కానున్న మృగాలను తలుచుకుంటూ, సామూహికంగా తంతును నిర్వహిస్తున్నఆదిమానవులకు ఇటువంటి చప్పుళ్ళు వింతగా, మాయాజాలంగా, అతీతశక్తులను తలపించేట్టుగా ఉండి ఉంటాయి. ఇది మతానికి అతి ప్రాథమికమైన స్వరూపం. సకాలంలో తగినంత ఆహారం దొరకడం చావుబతుకుల సమస్య అని తెగలోని జనమందరికీ తెలుసు గనక ఇటువంటి ఆచారాలకు ఎంతో ప్రాముఖ్యత ఉండి ఉంటుంది.
కులపెద్దలూ, గణాచార్లూ ఇటువంటి వ్యవహారాలను ముందుండి నడిపేవారని మనం ఊహించవచ్చు. పూనకాలూ, గారడీవంటి విద్యల ద్వారా తెగలోని వారందరినీ ఈ ఆదిమ అర్చకులు ప్రభావితం చేసేవారు. వేట అప్పటివారికి చాలా ముఖ్యం కనక ఇవన్నీ వేటకు సంబంధించిన తంతులుగానే ఉండేవి. ఒకడు దుప్పి వేషమో, దున్న వేషమో వేసుకుని అభినయిస్తే మరికొందరు వాణ్ణి వేటాడినట్టు అభినయించేవారు. ఇటువంటి తంతులు ముఖ్యంగా తెగనంతటినీ ఏకం చేసేవి. కలిసి వేటాడ్డంలోనూ, కలిసికట్టుగా జీవించడంలోనూ ఉన్న లాభాల దృష్య్టా ఇవన్నీ జాతి కొనసాగడానికి తోడ్పడే సంఘటనలే. స్వయంగా వేటలో పాల్గొనలేని చిన్న కుర్రాళ్ళకు ఈ అభినయం పాఠాలు నేర్పేదేమో. తెగలోని స్త్రీలను ఆకర్షించడానికి వేట అభినయం చేస్తున్న యువకులకు అవకాశం లభించేదేమో. మొత్తం మీద తెగలోని వారిని సంఘటితం చెయ్యడానికి ఇటువంటి సమావేశాలు సహాయపడి ఉంటాయి. చీకటి గుహలో కాగడాల వెలుగులో కదులుతున్నట్టుగా అనిపించే జంతువుల బొమ్మలూ, గిట్టలను పోలిన శబ్దాలూ మరింత భ్రాంతిని కలిగించి ఉంటాయి. అలాగే ఒకే శ్రుతిలో మోగే గణాచారి గొంతు ప్రతిధ్వని వల్ల మరింత బలంగా వినిపించి ఉంటుంది. లయబద్ధంగా మోగే డప్పులూ, మళ్ళీ మళ్ళీ ఉచ్చరించే శబ్దాలూ అన్నీ ఒకరకమైన హిప్నొసిస్‌ను కలిగిస్తాయనడంలో సందేహం లేదు. అందరూ కలిసి ఇలాంటి తంతులో పాల్గొంటున్నప్పుడు ఈ వాతావరణం వారి మనసుల్లో ప్రగాఢమైన అనుభూతిని కలిగించి ఉంటుంది. ఇప్పటికీ నలుగురూ చేరి ఏ సత్యసాయిబాబా భజనలో బృందగానంగా పాడుతున్నప్పుడు పూనకం వచ్చినట్టుగా ప్రవర్తించడం మామూలే కనక ఇది ఊహించడం ఏమంత కష్టంకాదు.
నోటి వెంట మంత్రాలను ఉచ్చరించడం మొదలవక ముందే ఆటవికపూజల్లో డప్పుల మోతలు చేసేవారు. లయను అనుసరిస్తూ ఎడతెగక మోగే శబ్దాల కంపనాలు మెదడుపై ఎలాంటి ప్రభావం కలిగిస్తాయో ఆధునిక పరిశోధకులకు తెలుసు. ఇవి వింటూ ఆటవిక పూజలు చేసే గణాచారులూ, షామాన్లూ ఒక సుప్త చేతనావస్థలోకి వెళతారు. సెకండుకు నాలుగైదు సార్లు మోగే చప్పుళ్ళూ, టిబెటన్‌ బౌద్ధ శ్రమణకులు చేసే ఉచ్చాటనల వంటివన్నీ మెదడును ధ్యానసమాధివంటి స్థితిలోకి తీసుకెళ్ళగలవు. ఈ స్థితిలో మెదడును జోకొట్టే "తీటా" తరంగాలు ఉత్పన్నం అవుతాయి. సెకండుకు 4 7 కంపనాలు కలిగిన ఈ తరంగాలు నిద్రావస్థకూ, మెలకువగా ఉండటానికీ మధ్యస్థమైన భావనను కలిగిస్తాయి. ఈ స్థితిలో మనని ఎంతో గాఢంగా ప్రభావితం చేసే సంఘటనలు జరిగినట్టుగానూ, అతీంద్రియశక్తులు ఆవహించినట్టుగానూ, అస్పష్టమైన భావాలన్నిటికీ అకస్మాత్తుగా రూపం ఏర్పడినట్టుగానూ విచిత్రభావాలు కలుగుతాయి. "పరలోకం"తో సంపర్కం ఏర్పడినట్టు అనిపించడం ఈ స్థితిలోనే జరుగుతుంది. ఇంత గొప్ప "అతీత" భావనలన్నిటినీ కేవలం సెకండుకు నాలుగైదు కంపనాలు కలిగిన శబ్దాల ద్వారా సాధించవచ్చునంటే ఆశ్చర్యమే. అలాగే సెకండుకు 7-12 కంపనాలు కలిగిన ఆల్ఫా తరంగాలు ఎంతో విశ్రాంతిని కలిగిస్తాయి కాని ధ్యానంలో ఉన్నట్టుగా అనిపించదు. మనలోని పూర్తి చైతన్య స్థాయికి దిగువనుండే క్రియాత్మక వైఖరికి ఇవి దారితీయగలవట. సెకండుకు 13-40 కంపనాలు కలిగిన బీటా తరంగాల వల్ల మనస్సు బాగా కేంద్రీకృతం కావడం, దృష్టి నిశితమైనట్టుగా అనిపించడం మొదలైన ప్రభావాలు కలుగుతాయి. సెకండుకు 4 కంపనాల కన్నా తక్కువ ఉండే డెల్టా తరంగాలు గాఢమైన నిద్రకు దారితీస్తాయి. శరీరం కోలుకోవడానికి ఈ స్థితి బాగా ఉపయోగపడుతుంది. ఆల్ఫా, బీటా స్థితుల్లో ఉన్నప్పుడు అయోమయంగా అనిపించిన విషయాలన్నీ తీటా స్థితిలోకి వచ్చినప్పుడు అర్థమైపోయినట్టుగా అనిపిస్తుంది. మెదడు కణాల పొరల (మెంబ్రేన్లు) గుండా స్రవించే సోడియం, పొటాసియం పదార్థాల నిష్పత్తిని నిగ్రహించడం తీటా స్థితిలోనే సాధ్యమైనట్టుగా అనిపిస్తుంది. కంప్యూటర్‌ ద్వారా రకరకాల కంపనాలను సృష్టించి, ఏది మెదడుపై ఎటువంటి ప్రభావం కలిగిస్తుందో శాస్త్రవేత్తలు ఖచ్చితంగా అంచనా కట్టగలరు. రేడియో రిసీవర్‌ను ట్యూన్‌ చేసినట్టుగా ఒక్కొక్క ధ్వనిని బట్టి మెదడులో రకరకాల పరిణామాలు కలిగించగలరు. మెలకువ తీవ్రతరం కావడం, ఆలోచనలు కేంద్రీకృతం కావడం, విశ్రాంతిగా ఉన్న భావనలూ, దృశ్యాలు కనబడడం, విషయాలు జ్ఞప్తికి రావడం, గాఢమైన నిద్ర, నిరాసక్తమైన భావనలూ ఇలా ఎన్నెన్నో మార్పులను అనుకున్నట్టుగా కలిగించే శబ్దాలున్నాయి.
స్టీరియో హెడ్‌ఫోన్ల ద్వారా ఒక్కొక్క చెవికీ వేరు వేరు కంపనాలు కలిగిన శబ్దాలను వినిపించినప్పుడు అవి రెండూ కలిసిపోయి మూడో రకమైన శబ్దం వినిపిస్తుందని పరిశోధనల్లో తేలింది. మెదడులోని రెండు భాగాలు తమకు వినిపిస్తున్న శబ్దాలను కలిపి మరొకరకంగా అన్వయించుకుంటాయి. అనుకంపనంవల్ల మెదడులోని కణాలన్నీ ఈ మూడో శబ్దానికి రెసొనేట్‌ అవుతాయి. వాటివల్ల రకరకాల ప్రక్రియలు మొదలై, ఊహల్లో వివిధ భావనలు కలిగిస్తాయి. మెదడులో రెటిక్యులర్‌ ఆక్టివేటింగ్‌ సిస్టమ్‌ అనే వ్యవస్థ ఒకటి ఉంటుంది. మెదడు కాండంలో ఇది ఒక వలలాగా పరుచుకుని ఉంటుంది. మన చైతన్యాన్నీ, జాగ్రదావస్థనూ, ఏకాగ్రతనూ నిర్ణయించేది ఇదే. శబ్దాలవంటి బాహ్యప్రేరణలకు మనం స్పందించే పద్ధతీ, మన అవగాహనా, నమ్మకాలూ అన్నీ దీనిమీదనే ఆధారపడతాయి. శబ్దాలవల్ల మెదడు కణాల్లో కలిగే మార్పులన్నిటినీ ఈ వ్యవస్థ మామూలు మెదడు తరంగాల రూపంలోనే స్వీకరించి అన్వయించుకుంటుంది. ఈ వ్యవస్థకు సంబంధించినంతవరకూ ప్రేరణలు ఎటువంటివైనా ఒకటే. సహజంగా మెదడులో కలిగే అనుభూతికీ, కృత్రిమంగా శబ్దాలూ, దృశ్యాల మూలంగా అందే ప్రేరణలకూ గల తేడాలను ఈ వ్యవస్థ గుర్తించలేదు. ఈ వ్యవస్థ వల్ల ప్రభావితం అయే థాలమస్‌ గ్రంథీ, మెదడుపైన ఉండే కార్టెక్స్‌ పొరా వగైరాలన్నీ మెదడులో కృత్రిమంగా ఉత్పత్తి అయిన భావాలను నిజమైనవిగానే గుర్తిస్తాయి. అందుకనే మతపరమైన అతీంద్రియ, అలౌకిక భావనలు పొందినవారికి అవి ఎంతో గాఢంగానూ, తీవ్రంగానూ, స్పష్టంగానూ అనిపిస్తాయి. ఆధునిక విజ్ఞానం ఇంతగా అభివృద్ధి అయిన ఈ రోజుల్లోనే అందరూ ఇలాంటి భ్రమలకు లోనవుతున్నారంటే ఆటవికదశలోని ప్రజలుఎలా స్పందించి ఉంటారో ఊహించుకోవచ్చు.
కేవలం భౌతిక ప్రేరణలవల్ల ఇంతటి మార్పులు జరగగలవని చాలామందికి తెలియదు. అందుచేత ఆలోచనలన్నీ స్వతంత్రంగా మన మనసులో ఉత్పన్నమౌతాయని అనుకునేవారికి ఇది ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది. ఆదిమయుగంలో ఏ చీకటి గుహలోనో కళ్ళు మూసుకుని కూర్చుని, తప్పెటల మోతలు వింటూ, మంత్రాలవంటి శబ్దాలను ఉచ్చరిస్తూ, వీటివల్ల కలిగే ప్రతిధ్వనులను కూడా వింటూ ఊగుతున్న గణాచారి మెదడులో ఎన్నెన్ని విచిత్ర భావనలు కలిగేవో మనం చెప్పలేం. "ఓం" కారంలోనే సర్వమూ ఇమిడి ఉందని నమ్మబలికే ఆధునిక గణాచారులకూ ఆటవికులలూ ఏమైనా తేడా ఉందా? దొంగ స్వాముల సంగతి ప్రస్తుతానికి వదిలేసినా యాంత్రికంగా మెదడు మీద పనిచేసే శబ్దాల ప్రభావాలను గుర్తించలేక "అలౌకిక ఆనందం" పొందుతున్నామనుకునే అమాయకులను చూసి ఏమనాలి? మతపరమైన భావాలు ఉత్పన్నం కావడానికి శబ్దాలు అనేక కారణాల్లో ఒక అంశం మాత్రమే. దేవుడున్నాడని వాదించేవారికి సమాధానం చెప్పాలంటే దేవుడు లేడని వాదిస్తే సరిపోదు. వారికి ఆ అపోహ ఎప్పుడు, ఎందుకు, ఎలా కలిగిందో కూడా చెప్పాలి.
posted by Rohiniprasad Kodavatiganti at 12:54 PM

No comments: