21 Feb 2012

తెలుగుకు ఏదీ హోదా?


  • బివి ప్రసాద్
  • 21/02/2012
హైదరాబాద్, ఫిబ్రవరి 20: తెలుగు భాషకు విశిష్ట భాష హోదా కల్పించి నాలుగేళ్లు గడుస్తున్నా భాషాభివృద్ధి దిశగా నాలుగడుగులు కూడా ముందుకు పడలేదు. 2004లో తమిళ భాషకు విశిష్ట భాష హోదా కల్పించిన కేంద్ర ప్రభుత్వం తెలుగు, కన్నడ భాషలకు విశిష్ట హోదా కల్పించేందుకు నాలుగేళ్ల పోరాటం తప్పలేదు. ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవానికి ఒకరోజు ముందు ఎట్టకేలకు 2008 అక్టోబర్ 31న తెలుగు భాషకు సైతం విశిష్ట భాష హోదా కల్పించినట్టు కేంద్ర సాంస్కృతిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అయితే అప్పటికే తమిళనాడు హైకోర్టులో ఈ అంశంపై పిటిషన్ దాఖలు కావడంతో, దానిపై వచ్చే తీర్పునకు లోబడి తెలుగు భాషకు ప్రాచీన భాష హోదా కల్పించినట్టు కేంద్రం ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై రాష్ట్ర అంసెంబ్లీ 2010 మార్చి 19న ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానాన్ని చేసి కేంద్రానికి పంపించింది. ఈ తీర్మానంతో రాష్ట్ర ప్రభుత్వం చేతులు దులుపుకుంది. కేంద్రం తెలుగు భాషకు ప్రాచీన హోదా కల్పించిన నేపథ్యంలో దానికో సంస్థను, వ్యవస్థను, యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకతపై దృష్టి పెట్టకపోవడంతో, హోదా దక్కించుకుని నాలుగేళ్లు గడిచినా మనం సాధించింది శూన్యమే. ఈ మొత్తం వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి పట్టింపూ లేకపోవడంతోనే సమస్య అంతా వస్తోంది. కేంద్రం ఇచ్చింది- రాష్ట్రప్రభుత్వం ధన్యవాదాలు తెలిపింది అన్న చందంగా అసెంబ్లీ తీర్మానానికే పరిమితం కావడంతో అందరి కళ్లూ కేంద్రం ‘నిధుల’పైనే ఉన్నాయి. వాస్తవానికి ఈ కేంద్రం ఏర్పాటుకు పక్కా భవనం అనివార్యం కాగా, ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పట్టింపులేని విధంగా వ్యవహరిస్తోంది,. కనీసం పాతిక ఎకరాల భూమిని కేటాయించి తాత్కాలిక భవనాన్ని ఇస్తే తర్వాత తామే సొంతగా మంచి భవనాన్ని నిర్మిస్తామని కేంద్రం చెబుతోంది. ఈ కేంద్రం ఏర్పాటుకు అవసరమైన ప్రాథమిక వ్యవహారాలను చూసే బాధ్యతను కేంద్ర ప్రభుత్వం మైసూర్‌లోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్‌కు అప్పగించింది.
ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం తమిళంతోపాటు సంస్కృతం, పాళి, ప్రాకృతం, తమిళ భాషలకు ఈ నాలుగేళ్లలో దాదాపు 400కోట్ల రూపాయిలు పైగానే కేటాయించారు. ఈ నిధులపై ఉన్న దృష్టి భాషపై లేకపోవడంతో తెలుగుభాష అనాథగా మారింది.
ఇప్పటికే తెలుగు ప్రాచీన భాష హోదా లభించడంతో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ ఒక అధ్యయన కేంద్రాన్ని ప్రారంభించింది. మరోవైపు ఈ కేంద్రాన్ని తమ ఆధీనంలోనే ఏర్పాటు చేయాలని తెలుగు అకాడమి కోరుతుండగా, తమ ఆధీనంలోనే ఏర్పాటు చేయాలని తెలుగు యూనివర్శిటీ కోరుతోంది. ప్రాచీన భాష హోదా కల్పించిన తరుణంలో వాస్తవ పరిస్థితిని విద్యావేత్తలు అధ్యయనం చేయాల్సి ఉంది. సంప్రదాయ వాదులు, మరోపక్క ఆధునిక వాదుల మధ్య తెలుగు నలిగిపోతోంది. తెలుగు భాషా కేంద్రం తమ ప్రాంతంలోనే ఏర్పాటు కావాలని భాషావేత్తలు ఎవరికి వారే సిగపట్లకు దిగుతున్నారు. ఈక్రమంలో కేంద్ర మానవ వనరుల సహాయ మంత్రి ఆలోచన ధోరణి భిన్నంగా ఉన్నట్టు చేబుతున్నారు.
రెండు దినోత్సవాలు- పేరు గొప్ప ఊరు దిబ్బ
అంతర్జాతీయ మాతృ భాషా దినోత్సవం సదర్భంగా తెలుగు భాష గొప్పదనాన్ని విపరీతంగా చర్చించుకోవడంతోపాటు గిడుగు రామ్మూర్తి పంతులు జయంతి సందర్భంగా ఆగస్టు 29న కూడా మరోమారు తెలుగు భాషా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. కానీ భాష విషయం వచ్చే సరికి పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా ఉంది. తెలుగు విశిష్ట భాష హోదా దేవుడెరుగు, ఉన్న తెలుగు భాషకు సైతం రోజురోజుకూ తెగులు పట్టుకుంటోంది. తెలుగు విశ్వవిద్యాలయం, తెలుగు అకాడమి తమ లక్ష్యాలను నెరవేర్చడంలో ఘోరంగా విఫలం కావడంతో తెలుగుభాష విస్తృతిని పెంచుకోలేకపోయింది. అనేక శాస్త్రాలకు సంబంధించిన పదకోశాలు కాని, సమగ్రమైన సంపూర్ణమైన స్థిరమైన తెలుగు భాషా నిఘంటువే నేటికీ లేకుండా పోయింది. తెలుగు భాషాభివృద్ధి సంఘం మూలన చేరి ఏళ్లు గడుస్తున్నా దాని గురించి పట్టించుకునే నాథుడే కరవయ్యాడు.
భాషాభిమానుల ఘోష
తెలుగు భాష రక్షణ, అభివృద్ధికి ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖను వెంటనే ఏర్పాటు చేయాలని, రాష్ట్రంలో అన్నిస్థాయిల్లో అధికార భాషగా తెలుగును అమలుచేయాలని తెలుగు భాషోద్యమన సమాఖ్య గత దశాబ్దంగా కోరుతోంది. అన్ని స్కూళ్లలో మాతృభాషలోనే పాఠశాల విద్యను బోధించడాన్ని తప్పనిసరి చేయాలని, యుజి, పిజి కోర్సుల్లోనూ తెలుగును నిర్బంధం చేయాలని , ఇతర రాష్ట్రాల్లోని తెలుగు వారి విద్య, భాషా సంస్కృతుల రక్షణకు శాశ్వతస్థాయిన సంయుక్త సభాసంఘాన్ని అన్ని వనరులతో ఏర్పాటు చేయాలని సమాఖ్య నేతలు కోరుతున్నారు. విశిష్ట్భాష హోదా లభించిన నేపథ్యంలో అందుకు అవసరమైన వౌలిక వసతులు కల్పించాలని, రాష్ట్రంలో సాహిత్య అకాడమి సహా అన్ని అకాడమిలను తిరిగి నెలకోల్పాలని కోరుతున్నారు. తెలుగుభాషా సంస్కృతుల పట్ల గౌరవాన్ని ఇనుమడింప చేసేందుకు పటిష్టమైన చట్టాన్ని తీసుకురావాలని సమాఖ్య ప్రధాన కార్యదర్శి డాక్టర్ సామల రమేష్‌బాబు కోరారు.

No comments: