VISITING PLACES


గోల్కొండ కోట

మన రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో తప్పనిసరిగా చూడాల్సిన ప్రదేశాలలో గోల్కొండ కోట ఒకటి. కుతుబ్‌ షాహి రాజుల పరిపాలనకు సాక్షీభూతంగా నిలిచిన ఈ కట్టడాన్ని చూడడం ఓ అద్భుతానుభవం. నాటి రాజుల ఆయుధాగారాలు, ధాన్యశాలలు, స్నాన శాలలు, వంటశాలలు మొదలుకొని ఆశ్వశాలలు, నూనె నిల్వ చేసే గది...ఓV్‌ా! వర్ణించడం కష్టం. ఆరోజుల్లోనే (క్రీశ1518) వేడినీటి శాలలు, చప్పట్లు కొడితే అల్లంత దూరాన వినిపించే సౌకర్యం వంటివి ఆశ్చర్యచకితులను చేస్తాయి. మరి ఆ వివరాలేంటో చూద్దామా!
గోల్కొండ కోట గోడ చాలా గట్టిగా, ఎత్తుగా, పెద్ద రాతి బండలతో కట్టినది. దీని విస్తీర్ణము దాదాపు 5మైళ్ళు. ఈ కోటకు 9 తలుపులు, 52 కిటికీలు, 48 మార్గములు వున్నాయి. ఈ కోట గోడకు లోపలి వైపున పెద్ద కందకము వుంది.
కోట ద్వారములు: కోటకు మొత్తం తొమ్మిది (తలుపులు) ద్వారాలున్నాయి. ఫతే దర్వాజ, మోతి దర్వాజ, కొత్తకోట దర్వాజ, జమాలి దర్వాజ, బంజారి దర్వాజ, పటాంచెరు దర్వాజ, మక్కా దర్వాజ డబుల్‌, బొదిలి దర్వాజ, బహిమని దర్వాజా. వీటిలో 1,2,3,4,5,7 ప్రయాణీకుల సౌకర్యార్థము తెరచి వుంటాయి. మిగిలిన వాటిని మూసివేశారు.

కోట బురుజులు: ఈ కోటకు మొత్తం 87 బురుజులున్నాయి. వీటిలో పెట్లా బురుజు, మూసా బురుజు, మజ్‌నూ బురుజు ప్రసిద్ధి గాంచినవి. పెట్లా బురుజు కోటకు ఉత్తర పడమర మూలగా వుంటుంది. దీని మీద అలంగిరీ జయమునుకు గుర్తుగా ఫిరంగి అమర్చబడి ఉంది. ఇది 16 అడుగులు పొడవు ఉంటుంది. ఒక మణుగు (165 పౌండ్ల బరువు గల) ఫిరంగి గుళ్ళు ఉంచే వీలుంది. ఇది చూడ్డానికి చాలా అందంగా వుంటుంది. కోటకు దక్షిణముగా మూసా బురుజు ఉంది. 1666 సంవత్సరములో (1977 హిజ్రి) కమాండర్‌ మూసా ఖాన్‌ ఆధిపత్యములో ధర్మాచారి అనే మేస్త్రీ దీన్ని నిర్మించాడు. దీని మీదుగా ''మీరాన్‌'' అను ప్రసిద్ధిగాంచిన సైన్యాధిపతి హతుడౌతాడు. అతని స్థానంలో''మూసా ఖాన్‌'' నియమితుడవుతాడు. బురుజు మీద ఫిరంగి అమర్చి వుంటుంది. ఇది కూడా పెట్లా బురుజు ఫిరంగి మాదిరిగా దాడిచేయడానికి వీలుగా ఉంటుంది.
కఠోరా హౌస్‌: ఇది కోటలోని 'బాలాహిసార్‌' కు ఉత్తర దిశగా నిర్మితమై ఉన్నది. ఇది 200 గజముల పొడవు, అదే వెడల్పులో, 5 గజముల లోతుగా నిర్మించిన నీటిని నిలువచేసే స్థలం. దీనిని ఒక చెరువు నుండి వచ్చే నీటితో నింపేవారు. దీనికి పడమర దిశలో ఉన్న గేటు దగ్గర శబ్దం చేస్తే అది అన్ని వైపులకు ప్రతిధ్వనిస్తుంది. ఈ నీటి హౌస్‌ను రాజులు, మరి కొందరు ప్రముఖులు వినోద స్థలముగా ఉపయోగించేవారు.
ఆయిల్‌ స్టోర్‌ హౌస్‌: ఇది నూనె దాచి ఉంచే కట్టడం. ఇది 30 అడుగుల పొడవు, 15 అడుగుల వెడల్పు, 10 అడుగుల లోతున ఒకే రాతితో మలచబడినది. దీనిలో 12,000 గ్యాలన్ల నూనె నిల్వచేసి, సప్లయి చేసేవారు.
ధాన్‌ కోట లేక గోడౌన్‌: ఇది ఆహార ధాన్యములను దాచి ఉంచే స్థలము. దీనిని యుద్ధ సమయములలో బయటి రాజ్యముల నుండి తెప్పించి నిలువ చేసేవారు.
జమా-ఎ-మసీద్‌: ఈ ప్రార్థనా మందిరము కోటలోని బాలాహిసార్‌ ద్వారమునకు ఎదురుగా తూర్పు దిశగా ఉంది. దీనిని ఒకటవ సుల్తాన్‌ కులీ కుతుబ్‌ షా కట్టించాడు. దీని ద్వారము మీద చరిత్ర ప్రసిద్ధిగాంచిన అరబిక్‌ భాషలో రాసిన చెక్కడము వుంది.

బాలాహిసార్‌: ఇది 15 మైళ్ళ విస్తీర్ణముతో కొండల మీద నిర్మించపబడినది. ఇక్కడ చాలా కట్టడములున్నాయి. వాటిలో కుతుబ్‌షా భవనములు, దర్బార్‌ ఎ-ఆల్‌ అనే జనరల్‌ అసెంబ్లీ హాల్‌ (విధాన సభ), దర్బార్‌ -ఎ-ఖాన్‌ అనే ముఖ్యమైన విధాన మండపములున్నాయి. ఇంకా నూతులు, మందుగుండు సామాను దాచి ఉంచు గది, ఆయుధ కర్మాగారం, మసీదులు, దేవాలయాలు, భక్త రామదాసును బంధించిన జైలు, నీటి రిజర్వాయరు, పెద్ద తోట, స్నాన గదులు, తుపాకులు, మందు గుండు సామాను దాచి ఉంచు గది, కుడివైపు దర్బార్‌-ఎ-ఆమ్‌ అనే అసెంబ్లీ హాలుకు పోవుటకు మార్గము... ఎడమవైపు రాజభవనము నిర్మింపబడినది.
కర్టెయిన్‌ వాల్‌: యుద్ధ సమయములలో శత్రువుల పోకడలను గమనించుటకు వీలుగా బాలాహిసార్‌ ద్వారముల కెదురుగా నిర్మింపబడిన తెరవంటి గోడ. బాలాహిసార్‌ గేటుకు వెలుపలి భాగములో ఒక రంధ్రము ఉంటుంది. యుద్ధ సమయములో శత్రువు గేటు ద్వారా ఏనుగులతో తోయించే సమయంలో దీని నుండి కాగుతున్న నూనెను కాని, కరిగిన లోహమునుకాని పోసేవారు.వైబ్రేషన్‌: బాలాహిసార్‌ గేటు మధ్యభాగంలో మెట్లకు ఎదురుగా నిల్చొని చప్పట్లు కొడితే... తిరిగి బాలాహిసార్‌ ఎత్తయిన భాగము నుండి మారుమోగుతుంది.
కుతుబ్‌షా రాజుల స్నానము: బాలాహిసార్‌ గేటు నుండి లోనికి ప్రవేశించేటపుడు కుడి చేతి వైపు ఈ స్నానముల గది వుంది. కొంచెము నగీనా తోటకు కుడి చేతి వైపు పక్కన వేడి నీళ్ళు... చన్నీళ్ళు వచ్చేలా నేల మార్గమున గొట్టములను అమర్చి కట్టినది. ఈ కుళాయిలను చెరువు నుండి నింపేవారు. ఈ నీటిని అతి ముఖ్యమైన సందర్భములలో ఉపయోగించేవారు. ఎవరయినా రాజ వంశస్తులు దివంగతులైనపుడు ఇక్కడ వేడి నీటితో స్నానము చేయించి శవపేటికను ఉత్తరపు ద్వారము నుండి బయటకు తీసుకెళ్లేవారు.
నగీనా బాగ్‌: తోటకు దక్షిణముగా ఆర్కులలో రాజకుమారులు, రాజకుమార్తెలు ఊగేందుకు ఊయలలు అమర్చబడి ఉన్నవి. ఇప్పటికీ వాటి గుర్తుగా ఆర్కులోని రాళ్ళలో రంధ్రములు కన్పిస్తాయి. నగీనా గార్డెన్‌ నుండి వెళ్ళే సన్నని మార్గంలో ఎడమ చేతివైపు ఒక కట్టడము వుంది. ఇది రక్షకభటుల కోసం నిర్మించిన భవనము. కుతుబ్‌షా వంశపు రాజులలో ఏడవవాడు, ఆఖరివాడు అయిన అబ్దుల్‌ హసన్‌ తానీషా పరిపాలనలో, రక్షక భటులకోసం కట్టబడిన భవన మార్గములోనే ఆయన మంత్రివర్యులైన అక్కన్న మాదన్నల కోసం నిర్మించిన కార్యాలయ భవనం వుంది.
బడీ బౌలి: బాలాహిసార్‌ మెట్లకు కుడిపక్కగా ఒక పెద్ద బావి వుంది. దీనిని బడీ బౌలి అని పిలిచేవారు. ఈ బావిలో ఒక మూల రాయి వుంది. అది వేసవి కాలములో నీరు కిందపడడానికి ఉపయోగపడేది. ఈ బావికి దగ్గరలో రెండు వరండాలున్న ఒక భవనముంది. దీనిలో రాజులు కూర్చొని ప్రకృతి సౌందర్యమును తిలకించేవారు.
డ్రగ్‌ ట్యాంక్‌ కాలువ: బడి బౌలికి కొద్ది దూరంలో మెట్లకిందుగా పారే ఒక కాలువ వుండేది. ఇది డ్రగ్‌ చెరువు కోటకు 5 మైళ్ళ దూరంలో వుంది. కోటలో ఉన్న తోటలకు, చేలకు ఈ కాలువ ద్వారానే నీరును మళ్ళించేవారు, పంటలు పండించేవారు. భక్త రామదాసు చెరసాల: మనము ఈనాడు వింటున్న రామదాసే ఆనాటి కంచర్ల గోపన్న. 1674వ సంవత్సరములో అబుల్‌ హసన్‌ తానీషా ''గోల్కొండను పరిపాలించే కాలములో'' భద్రాచలము తాలూకాకు తహశీల్దారుగా ఉండేవాడు. ఈయన మంత్రివర్యులైన మాదన్నకు మేనల్లుడు. ఈయన భద్రాచలం రామచంద్రునికి దేవాలయాన్ని కట్టించాడు. ఈయన జైలు శిక్షసమయములో ఆయన స్వహస్తములతో ''హనుమంతుని విగ్రహములను, నవగ్రహములను'' తయారుచేశాడు. పై రాతి మీద రామలక్ష్మణులను కూడా తయారుచేశాడు. ఇది ఆయనకు చెరసాలలో పూజా మందిరం. శ్రీరామనవమి సందర్భంగా ఇప్పటికీ భద్రాచలం వచ్చిన యాత్రికులు శ్రీరామదాసు జైలును చూడ్డానికి గోల్కొండ కోటకు వస్తుంటారు.
ఇబ్రహీం కుతుబ్‌ షా మసీదు: ఇది ఇబ్రాహీమ్‌ కులికుతుబ్‌షా కాలము నాటిది. కొన్ని మెట్ల తరువాత ఈ మసీదుకు తూర్పుగా ఒక అర్ధ వలయాకారము వుంది. దీని నుండి గోల్కొండ కోట మొత్తం చూడొచ్చు. హైదరాబాదు నగర భవనములు కూడా చూడొచ్చు.
ఎల్లమ్మ దేవి: అక్కన్న మాదన్న మరియు అబ్దుల్‌ హసన్‌ తానీషా కాలములో కట్టినదీ దుర్గాదేవి లేక మహాకాళి అమ్మవారి మందిరం. ఇక్కడ ప్రతి ఆషాఢ మాసములో జాతరలు జరుగుతాయి. జంట నగరాల నుండి అనేక మంది సందర్శకులు వస్తుంటారు.
బారాదరి: ఇది మూడు అంతస్తులలో నిర్మించబడిన రాజుగారి సభా మండపము. దీని నుండి ''గోషామహల్‌ బారాదరి హైదరాబాదు'' భూమార్గము కూడా వుంది. దీని పై అంతస్తులో రాజ సింహాసనము వుంది. దీని నుండి 30 మైళ్ళ విస్తీర్ణములో అతి సుందరము, శోభాయమానముగా కన్పిస్తుంది. ఇది సముద్ర మట్టమునకు 400 అడుగుల నుండి 2000 అడుగులుంటుంది. దీని నుండి తూర్పుగా కుతుబ్‌షా వంశపు శిథిలమైన భవనములు, లంగర్‌హౌజ్‌ చెరువు, హైదరాబాద్‌ నగరమున ముఖ్య కట్టడమైన చార్‌మినార్‌, మక్కా మసీదు, ఉస్మానియా వైద్యశాల చూడొచ్చు. తూర్పు-దక్షిణ మూలగా మీర్‌ ఆలమ్‌ చెరువు, ఫలక్‌నుమా భవనము, దక్షిణముగా మకై దర్వాజా, హిమయత్‌నగర్‌, దీనికి దక్షిణమున పడమర మూలగా తారామతి, ప్రేమామతి భవనములు, ఉస్మాన్‌ సాగర్‌ చెరువు (గండిపేట) పడమరగా వున్నాయి. తూర్పు - ఉత్తర మూలగా హుసేన్‌ సాగర్‌ చెరువు, సికింద్రాబాదు నగరము, ఉస్మానియా యూనివర్సిటీని చూడవచ్చు. ఉత్తర-పడమర మూలగా కుతుబ్‌షా రాజుల గోపురములు పెట్లాబురుజు చూడొచ్చు. ఉత్తరముగా గోల్కొండ కోట పట్టణము, హకీం పేట, బేగంపేట విమానాశ్రయాన్ని చూడొచ్చు.
నీటి సదుపాయములు: బాలాహిసార్‌కు కింద భాగమున, తూర్పు దిశగా కుతుబ్‌షా భవనమును దాటాక 800 అడుగుల ఎత్తులో నిర్మించిన 5 కొళాయిలున్నాయి. అన్నిటికంటే ఎత్తయిన కొళాయిలో పర్షియన్‌ చక్రవర్తి సహాయంతో నీటిని నింపేవారు. అక్కడి నుండి కొన్ని ప్రదేశాలకు నీటిని అందజేసేవారు.
ఆర్మరి: ఇది బాలాహిసార్‌ గేటు ప్రవేశములోనే ఎడమ వైపు నిర్మించబడిన మూడంతస్తుల భవనం. దీనిలో చిన్న చిన్న తుపాకులు, ఫిరంగి గుళ్ళు మొదలుగునవి దాచి పెట్టేవారు. దీనికి దక్షిణముగా చరిత్ర ప్రసిద్ధి చెందిన ఒక బావి వుంది. 1687 సంవత్సరంలో ఔరంగజేబు దండెత్తి తానీషాని బంధించిన గోల్కొండ కోటను ఆక్రమించిన సమయమున ఆయన భార్య, బిడ్డలు శత్రువుల నుంచి రక్షణ పొందడానికి దీనిలో దూకారని చెప్తారు.
దాద్‌ మహల్‌: రోడ్డుకు తూర్పు దిశగా దీని బాల్కనీ వుంది.. బాల్కనీ ముందు పెద్ద ఖాళీ స్థలము వుంటుంది. ఇక్కడికి ప్రజలు వచ్చి తమ కష్టసుఖాలు చెప్పుకొనేవారు. రాజు ఈ బాల్కానీలోంచి వినేవారు.
____________________________________________________________

నయాగరా సొగసులు

  • సోయగాల నయాగరా జలపాతాన్ని చూసే వరకు అనుకోం అది అంత అందమైనదని. నీరు పాలధారల్లా కనిపించడమేంటి? దాని ఒయ్యారాలు, సొగసులు చూచి మనసు పరవశించడమేంటి? అవనికి దిగివచ్చిన ఆకాశగంగలా అగుపడడమేంటి? అని తెగ ఆశ్చర్యపోయిన మనమే....'ఔను అవన్నీ నిజమే సుమా' అనుకొంటాం. జలపాతం ఉధృతిని చూచి మైమరచిపోతాం. అల్లంత దూరాన నిలబడిన మనల్ని తన చిలిపి తుంపరలతో తడిపి మరీ పలకరించే నయాగరాను మర్చిపోలేం. ఆ అద్భుతానుభూతిని జీవితాంతం నెమరువేసుకుంటూనే వుంటాం.

ప్రపంచంలో తప్పక చూడాల్సిన వాటిలో సోయగాల నయాగరా ఒకటి. ఇది ప్రపంచంలోకల్లా వెడల్పయిన జలపాతం. అమెరికా, కెనడా సరిహద్దుల్లో ప్రవహించే చిన్న నది. అసలు అక్కడికి వెళుతున్నామూ అంటేనే మనసంతా ఉద్విగతతో నిండిపోతుంది. తీరా అక్కడికెళ్లాక ... ఆ అందాలను కనులనిండా నింపుకోవడంలోనూ, ఆస్వాదించడంలోనూ మునిగిపోతాం.నయాగరా జలపాతం మొత్తం పొడవు 60 కి.మీటర్లకు మించదు. ప్రవాహ ఉధృతీ తక్కువే. మరి దీని ప్రత్యేకత ఎక్కడవుందీ? అనిపిస్తుంది. ఈ చిన్న నది సుమారు 180 అడుగుల లోతులో పడే దృశ్యం మనల్ని కట్టిపడేస్తుంది. ఆ మనోహర, మనోజ్ఞ దృశ్యం చూసినవారి తనువు పులకించిపోతుంది. కెనడావైపు సుమారు 2000 అడుగుల వెడల్పులో గుర్రపు నాడా ఆకారంలో 140 అడుగుల లోతులో జల పడుతుంది. అమెరికా వైపు జలపాతం మరింత లోతైనది. కానీ వెడల్పే తక్కువ.కెనడావైపు జలపాతం చూడాలంటే కెనడా వీసా కావాలి. అయితే గ్రీన్‌కార్డ్‌ వున్నవారికి అది అవసరం లేదు. డెట్రాయిట్‌ నుంచి నయాగరా సుమారు 300 మైళ్ల దూరం. డెట్రాయిట్‌కు దక్షిణంగా వున్న కెనడాలో అయితే ప్రపంచంలోకెల్లా అతి పెద్దదైన సీఎన్‌ టవర్‌ వుంది.
అక్కడ జలపాతం వ్యూ వున్న హోటళ్లకు గిరాకీ ఎక్కువగా వుంటుంది. అక్కడ ఏదైనా హోటల్లో గది తీసుకొని కిటికీలోంచి నయాగరా చూస్తుంటే వుంటుందీ...! ఇంక నోట మాటే రాదు. అలా చూస్తుండిపోతాం ఎంతసేపైనా. మరీ మొదటిసారి చూసేవారైతే ఇంక అంతే సంగతులు. ఇంక జలపాతం దగ్గరున్న టేబుల్‌ రాక్‌ కాంప్లెక్స్‌ చూడదగినది. అదే జలపాతానికి 20 అడుగుల దూరంలో నిలబడ్డాం అనుకోండి. నిమిషానికి 20 కోట్ల లీటర్ల నీరు 170 అడుగుల లోతుకు పడుతుంటే ఆ హోరు, వందల అడుగుల ఎత్తుకు లేచి పడే నీటి తుంపర అలలు... అసలు మాటల్లో ఎలా చెప్తాం! ఆ అందాన్ని వర్ణించడానికి ప్రపంచంలో వున్న ఏ భాషా సరిపోదేమో అనిపిస్తుంది. ఆ తుంపరలు మనల్ని తడిపేస్తుంటే వుంటుందీ...
జర్నీ బిహైండ్‌ ద హిల్స్‌ సంగతి మర్చిపోతే ఎలా! టేబుల్‌ రాక్‌ ఆఫీసులోనే టికెట్‌ తీసుకొంటే ఒక రెయిన్‌ కోట్‌ (డిస్పోజబుల్‌) ఇచ్చి లిఫ్టులో 125 అడుగులు కిందికి తీసుకెళతారు. అక్కడ అద్దాల తలుపులోంచి జలపాతాన్ని బాగా దగ్గరగా చూడొచ్చు. నీటి మట్టానికి 26 అడుగుల ఎత్తులో ఒక బాల్కనీ వుంది. మూడు వైపులా రెయిలింగ్స్‌ వుంటాయి. చల్లచల్లటి నీటి తుంపరలు అలా మొహం మీద పడి పలకరిస్తుంటే వుంటుందీ... ఆ ఆనందం మరెప్పుడూ కలగదేమో! రెయిన్‌ కోట్‌ కూడా తీసేసి తడిచిపోవాలనిపిస్తుంది.
అక్కడ భారతీయులే కాదండోరు! యూరోపియన్లు, చైనీయులు, ఆఫ్రికన్లు ... ఎంతోమంది విదేశీయులు చిన్నపిల్లల్లా కేరింతలు పెడుతూ జలపాతం తుంపర జల్లుల్లో తడిచిపోతుంటారు. తర్వాత అక్కడినుంచి టన్నెళ్ల ద్వారా అద్దం బిగించిన కిటికీ లోంచి మరింత దగ్గరగా నీటిని చూడొచ్చు. ఆ తర్వాత పైకి వచ్చి వేడివేడి కాఫీ తాగుతూ... జలపాత దృశ్యాలను చూస్తుంటే గంటలు నిమిషాల్లా గడిచిపోతాయి.
జలపాతాన్ని మరింత దగ్గరగా చూసే వీలు కూడా వుంది. అదెలా అంటారేమో! అదెలాగంటే... మెయిడ్‌ ఆఫ్‌ ది మిస్ట్‌ యాత్ర ద్వారా. అక్కడి గుర్రపు నాడా ఆకారంలో వున్న నదిభాగంలోకి తీసుకెళతారు. దీనికి కూడా ప్రత్యేకమైన టికెట్టుకొనాలి. అందరికీ రెయిన్‌ కోట్లు ఇస్తారనుకోండి. మనం ఎక్కిన బోటు పక్కగా 170 అడుగుల ఎత్తు నుంచి పడే నీటి ఉధృతి, తుంపర్లు ... పైగా మనం ఎక్కిన బోటు జలపాతానికి దగ్గరగా వెళుతూ వుంటే భయం పెరుగుతూ వుంటుంది. అయితే అదేదో సాహస యాత్రలాగా బావుంటుందిలెండి. మొహం మీద పడుతున్న తుంపరలను తుడుచుకోవడం కూడా మర్చిపోయి అలా చూస్తుండిపోతారెవరైనా. కాసేపటి తర్వాత తిరిగి బోటు మనల్ని వెనక్కి తీసుకెళ్తుంది. రాత్రిపూట జలపాతం దగ్గర ఏర్పాటు చేసిన మూడు నాలుగు రంగులు లైట్లు చూస్తే మతిపోవాల్సిందే.
వయోబేధం లేకుండా నయాగరా జలపాతం అందాలను అంతా ఆస్వాదిస్తారు. ఇక కొత్తగా పెళ్లయినవారికైతే అది స్వర్గమే అనుకోండి. ఇక్కడ చూడ్డానికి ఈ జలపాతం ఒక్కటేనా మరేం లేవా? అనుకోకండి. చాలానే వున్నాయి. మెరైన్‌ ల్యాండ్‌ అనే ప్రాంతంలో తిమింగలాలు, డాల్ఫిన్లు, సీ లయన్లు ... వంటి ఎన్నో సముద్ర జంతువులు కూడా కన్పిస్తాయి. కొన్నింటినైతే తాకొచ్చు కూడా. డాల్ఫిన్‌ షో చాలా బావుంటుంది. అక్కడ చాలా పెద్ద స్టీల్‌ రోలర్‌ కోస్టర్‌ వుంది. దాని మీద ఆడుకోడానికి పిల్లలు తెగ ఆరాటపడతారు.ఇదే కాదు. కేబుల్‌ కారులో జలపాతం చూడడం... తుంపర్లలో తడవడం కూడా గొప్ప అనుభూతి. అక్కడ 600 అడుగుల ఎత్తయిన మినోల్టా, 800 అడుగుల ఎత్తున్న స్కైలాన్‌ టవర్లమీదనుంచి కూడా జలపాతాన్ని చూడొచ్చు. స్కైలాన్‌ టవర్‌మీద రివాల్వింగ్‌ హోటల్‌ వుంది. అది తన చుట్టూ తాను తిరుగుతూ వుటుంది. అందులో కూర్చుని టిఫిన్‌ తింటూ, కాఫీ తాగుతూ జలపాతాన్ని వుంటే చాలా బావుంటుంది. బొటానికల్‌ గార్డెన్‌లో 2300 రకాల గులాబీలు పూస్తాయని చెప్తుంటారు. అక్కడి బటర్‌ఫ్లై కన్జర్వేటరీ కూడా మనల్ని కట్టిపడేస్తుంది. అందులో 2000 రకాల సీతాకోకచిలుకలు తమ రంగురంగుల రెక్కలను ఆడిస్తూ వయ్యారంగా పోతుంటే మన మనసు ఒకచోట నిలవదు సుమా! క్లింటన్‌ హిల్‌ ఏరియా దగ్గరకు వెళ్లామూ అంటే పిల్లలు వదిలి రానేరారు. ఇవేకాక రిప్లీస్‌ బిలీవ్‌ ఇట్‌ ఆర్‌ నాట్‌, రిప్లీస్‌ మూవింగ్‌ థియేటర్‌, గిన్నిస్‌ మ్యూజియం, వ్యాక్స్‌ మ్యూజియం, గుర్రపుబగ్గీ సవారీ... అన్నీ చూడాల్సినవే.
ఇక డెట్రాయిట్‌ పట్టణం ప్రత్యేకంగా చూడదగినది. ఇది డెట్రాయిట్‌ నది ఒడ్డున వుంది. తమాషా ఏంటంటే ఇక్కడ కూసింత దొంగల బెడద ఎక్కువే. కానీ మ్యూజియంలకు పేరుగాంచిన ప్రాంతం. అందుకేనేమో దీన్ని మ్యూజియంల నగరం అని కూడా పిలుస్తారు ముద్దుగా. ఇక్కడ... హెన్రీఫోర్డ్‌ మ్యూజియం, ఐమ్యాక్స్‌ థియేటర్‌ వున్న కాంప్లెక్స్‌ అద్భుతంగా వుంటాయి. వీటి తర్వాత చూడాల్సింది బెల్లీ ఐలాండ్‌. ఇది అమెరికా మొత్తంలోకి అతి పెద్ద ఐలాండ్‌ పార్కు. వెయ్యి ఎకరాల విస్త్రీర్ణంలో వున్న ఈ పార్కులో పాలరాతి లైట్‌ హౌస్‌, బీచ్‌, అన్ని రకాల ఆటలు ఆడుకొనేందుకు మైదానాలు, పూలమొక్కలు, వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు ... ఒకటేంటి...అన్నీ కనిపిస్తాయి.
మనం ఇప్పటి వరకు కెనడావైపున్న నయాగరా అందాలను మాత్రమే చెప్పుకున్నాం. ఇప్పుడు అమెరికా వైపున్న అందాలను చూద్దాం. ఇది కొంచెం దూరం ఎక్కువే అనుకోండి. న్యూయార్క్‌, న్యూజెర్సీ, మేరీల్యాండ్‌ లో వుండేవారికి దగ్గర. ఆ పక్కనే వున్న నయాగరా నదిలో చూడాల్సింది గోట్‌ ఐలాండ్‌. అమెరికన్‌ ఫాల్స్‌కు, కెనడా ఫాల్స్‌కు మధ్యలో ఈ ఐలాండ్‌ వుంది. ఇక్కడ రెండు జలపాతాలు కనిపిస్తాయి. అమెరికన్‌ ఫాల్స్‌ బ్రైడల్‌ వీల్‌ అంటారు వీటిని. లిఫ్టులో 175 అడుగులు దిగి, జలపాతానికి 25 అడుగుల దగ్గరకు వెళ్లొచ్చు. పూర్తిగా తడిచిపోతామనుకోండి. ఇక్కడ కూడా మెయిడ్‌ ఆఫ్‌ ద మిస్ట్‌ ట్రిప్‌ వుంటుంది. కాకపోతే కెనడావైపు జలపాతం చూడ్డానికి అయ్యే ఖర్చుకంటే ఇక్కడ అన్నీ రేట్లు ఎక్కువే. ఇక్కడ మరో తమాషా ఏంటంటే... హీలియం బెలూన్‌లో కూర్చుని 400 అడుగుల ఎత్తు నుంచి జలపాతం చూడొచ్చు. మరో ముఖ్యమైన విషయమేమంటే నయాగరా హిస్టరీ మ్యూజియంలో డయానా, మదర్‌ థెరిస్సా వంటి ప్రముఖుల బొమ్మలు వుంటాయి. వీటిని చూస్తుంటే బొమ్మలనుకోం. నిజంగా సదరు మనుషులే అక్కడ నిలబడినట్టు అనిపిస్తుంది.ఇవండీ నయాగరా జలపాతం ముచ్చట్లు. ఇప్పుడేమనిపిస్తోంది! ఎలాగైనా సరే... అక్కడికెళ్లి జలపాతం తుంపర్లలో తడిచిపోవాలనిపిస్తోందా!
____________________________________________________________

బృహదీశ్వరాలయ గోపురం భలేభలే

ఏ ఆలయానికి వుండే ప్రత్యేకత దానికి వుంటుంది. కాని తంజాపూరులోని బృహదీశ్వరాలయ గోపుర ప్రత్యేకత మాత్రం మరే దేవాలయానికి లేదనే చెప్పవచ్చు. గగనమధ్యంలో మార్తాండుడు తేజరిల్లిపోతున్నా ఆలయగోపురానికి బంగారుపూతలు పూస్తున్న ఈ దేవాలయ శిఖరం నీడ మాత్రం ఏ సమయంలోను నేలమీద పడదు. ఆ రోజు ఎంత ఎండకాస్తున్నా ఉదయం నుంచి సాయంకాలం వరకు ఏ వేళలోను బృహదీశ్వరాలయ గోపురం నీడ మాత్రం భూమి మీద పడదు. ఈ వింతకు కారణమేమిటో, ఆనాటి వాస్తుశిల్పులు ఈ విశేషాన్ని ఎలా సాధించగలిగారో ఈ నాటికీ కొరుకుడు పడక పెద్ద పెద్ద ఇంజినీర్లు సైతం తికమకపడిపోతున్నారు.
తమిళనాడులోని తంజావూరు నగరంలో పది శతాబ్దాల క్రితం చోళరాజులకాలంలో బృహదీశ్వరాలయాన్ని నిర్మించారు. చోళరాజులలో సుప్రసిద్ధుడయిన రాజరాజచోళుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈ ఆలయాన్ని నిర్మింపచేశాడు. 1004వ సంవత్సరం నుంచి 1010వ సంవత్సరం వరకు ఆరు సంవత్సరాలపాటు అహోరాత్రులు శ్రమించి నిర్మించిన ఈ దేవళం అపూర్వ శిల్పకళాశోభకు ఆలయం. బృహదీశ్వరాలయ ప్రాంగణంలో చెక్కిన నేటికీ కనువిందు చేస్తున్న అనేక శిలాశాసనాల ద్వారా ఆనాటి రాజకీయ, ఆర్థిక సాంఘిక పరిస్థితులను తేటగా తెలుసుకొనవచ్చు. రాజరాజచోళుని వీరత్వం, ఆనాటి శిల్ప సంగీత, నృత్యాది కళావిశేషాలను శాసనాల వల్ల తెలుసుకోవచ్చు.

ఈ మహారాజు కాలంలో బృహదీశ్వరాలయ సమీపంలో ప్రత్యేకంగా రెండు వీధులను కళాకారులకే కేటాయించారు. దాదాపు 400 మంది సంగీత నృత్యశాస్త్రాలలో నిష్ణాతులయిన కళాకారులు ఆ వీధులలో నివసించేవారట. ద్రావిడ వాస్తు పద్ధతిలో నిర్మించిన బృహదీశ్వరాలయం ఎన్నో విశిష్టతలకు ఆలవాలమైంది. ఈ దేవాలయ ప్రాంగణం 152 మీటర్లకు పైగా పొడుగుతో 76 మీటర్లకుపైగా వెడల్పుతో సువిశాలంగా వుంటుంది. ఆలయంలోని మూలవిరాట్‌ అయిన శివమూర్తి లింగాకారంలో 12 అడుగుల ఎత్తుతో శోభిల్లుతూ వుంటాడు. ఈ స్వామిని 'బృహదీశ్వరుడు' అని 'ఆడవల్లన్‌' అనీ వివిధ నామాలతో పిలుస్తూ వుంటారు.
గోపుర విశిష్టత

ఈ ఆలయగోపురాన్ని 216 అడుగుల ఎత్తుతో 14 అంతస్థులుగా అష్టభుజాకారంలో నిర్మించారు. ఈ గోపురం పైభాగాన 25 అడుగుల ఏకశిలా కలశం వుంది. ఈ శిలాకలశం బరువు 81 టన్నులకు పై మాటగానే వుంటుంది. బ్రహ్మాండమైన ఈ శిలాకలశాన్ని గోపురం మీద ప్రతిష్టించడం ఆనాడు పెద్దసమస్యే అయిందిట. ఆలయానికి 6 కిలోమీటర్ల దూరంలో వున్న సారాపల్లం అనే గ్రామం నుంచి ఆలయగోపురం ఎత్తువరకు ఏటవాలుగా ఇసుకతిన్నెలను ఏర్పరిచి ఆ మార్గం గుండా కలశాన్ని గోపురంమీదికి చేర్చారట. ఈ బృహత్‌కార్యం నిర్వహించటానికి కొన్ని వేలమంది పనివారు అవసరమయ్యారంటారు. 
ఏకశిలాకలశం రెండువైపులా రెండు అందమైన నంది విగ్రహాలు జీవకళ ఉట్టిపడుతూ దర్శనమిస్తూ వుంటాయి. శిఖరం నీడ ఏ సమయంలోను నేలమీద పడనివిధంగా నిర్మించటం జరిగింది. గోపురానికి దక్షిణ దిక్కున గణేషుడు, బోళాశంకరుడు వగైరా శిల్పమూర్తులుండగా ఉత్తరదిక్కున వీరభధ్రుడు, అర్థనారీశ్వరుడు వగైరా కన్పిస్తాయి. తూర్పున నటరాజు అఖండనృత్యంలో మునిగిపోయి వుండగా పశ్చిమభాగాన హరిహరుడు, చంద్రశేఖరుడు... వున్నారు. వెరసి అపూర్వమైన కళాశోభతో విలసిల్లే ఈ మూర్తులన్నిటితో బృహదీశ్వరాలయ గోపురం కళలకు కాణాచిగా వెలిగిపోతూ వుంటుంది. ఈ గోపురాన్ని దక్షిణమేరుగా అభివర్ణిస్తుంటారు కూడా.

వాసికెక్కిన నంది
ఆలయప్రాంగణంలో గర్భగుడికి ఎదురుగా వున్న మండపంలో ప్రతిష్టించిన నందివిగ్రహం భారతదేశంలో వున్న రెండో పెద్దనంది విగ్రహం. 12 అడుగుల ఎత్తుతో 19కి పైగా అడుగుల వెడల్పుతోవున్న ఈ బృహత్‌ నంది తన గంభీరమైన చూపులతో జీవకళ ఉట్టిపడుతూ భక్తులను విశేషంగా ఆకర్షిస్తూ వుంటుంది. ఈ మహానంది బరువు 25 టన్నులకు పై మాటగానే వుంటుంది. ఇన్ని విశిష్టతలు కలిగిన బృహదీశ్వరాలయం తర్వాత కాలంలో వచ్చిన రాజులను కూడా ఆకర్షించింది. 13వ శతాబ్దంలో తంజావూరును పాలించిన కొనేరినాయక్‌ అనే పాండ్యరాజు ఈ ఆలయ ప్రాంగణంలోనే అమ్మవారి ఆలయాన్ని కట్టించాడు. 17వ శతాబ్దంలో మరో రాజు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారి ఆలయాన్ని నిర్మించాడు. ఈ ఆలయాలన్నీ అపూర్వమైన శిల్పకళాశోభతో విరాజిల్లుతూ భక్తులను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి! తంజావూరు వెళ్ళినవారు అవశ్యం సందర్శించుకోదగ్గ తీర్థం బృహదీశుని దేవళం!
__________________________________________________________

అణువణువునా పచ్చదనం


మెట్టుపాళయం నీలగిరి కొండలకు పాదంలాంటిది. మెట్టుపాళయంనిండా 'రోబో' ఫీవరే. ఎటుచూసినా ఆ సినిమా పోస్టర్లే! ఏమైనా ఒక వ్యక్తిపై అంతెత్తున అభిమానం పొంగిపొర్లడం, దాన్ని సంబంధిత వ్యక్తులు భరించడమూ కష్టమేనేమో! అది వికటించిందా ఇక అంతే! కుష్‌బూకు గుడి కట్టడం, దాన్ని కూలగొట్టడం మనం చూడలేదూ?! ఇక మన యాత్రకొద్దాం.
మెట్టుపాళయంనుండి ఊటీకి నేరోగేజ్‌ రైలుమార్గం వుంది. స్టీమ్‌ ఇంజన్‌ ట్రైన్‌. యావత్‌భారతదేశాన్ని ఉర్రూతలూగించిన 'ఛయ్య ఛయ్య' పాటంతా దీనిమీదనే షూట్‌ చేశారు. అలాగే సంతోషం లాంటి ఎన్నో తెలుగు సినిమాలూనూ. ఆ రైలు కేవలం మూడే పెట్టెలు. దాని ఛార్జి ఎనిమిది రూపాయలు. ముందే రిజర్వ్‌ చేయించుకుంటే 23 రూపాయలు. కొండలు, లోయలు, జలపాతాల మీదుగా ఐదున్నర గంటల ప్రయాణం. సింప్లీ సూపర్బ్‌ అన్నమాట! అటు పక్క చూడాలో, ఇటు పక్క చూడాలో తెలియని డోలాయమానం. అందాలన్నీ కళ్లలో నింపేసుకోవాలన్న తాపత్రయం. తల ఒకవైపు తిప్పితే మరోవైపు మిస్సయిపోతామేమోనన్న ఆత్రం. ఒకదాని వెనుక మరోటి, దాని వెనుక ఇంకోటి... ఇలా అనేక కొండలు, లోయల సమూహం. నీలగిరి కొండల అందాలు ఏమని వర్ణించేది? ప్రకృతికాంత నిండారా తలస్నానంచేసి కురులన్నీ విరబోసుకుని నీరెండలో ఆరబెట్టుకుంటుంటే ఎలా వుంటుంది? అచ్చం అలా వుంది అక్కడి సన్నివేశం. ఓ వైపు ఎత్తైన కొండలు, మరోవైపు లోతైన లోయలు... వీటిముందు మనమెంత? ఏదో సాధించేశామని విర్రవీగే మన అహమెంత?
ఈ కొండల్లో అంతర్లీనంగా కనిపించిందేమిటంటే స్వేచ్ఛ! అవును! స్వేచ్ఛే! ప్రతి చెట్టు తనకు నచ్చిన రీతిలో, తనకు తోచిన దిశవైపు హాయిగా, ఆనందంగా విస్తరించింది. దాన్ని అడ్డుకునేవారూ, అదుపు చేసేవారూ లేరు. ఈ ఆకృతిలోనే పెరగాలనే ఆంక్షలు లేవు. ఆ ఆనందం ప్రతి ఆకులోనూ, పువ్వులోనూ కనిపించింది. అందుకేనేమో మనం పెంచుకునే కుండీల్లోని మొక్కల్లో ఈ జీవం కనిపించదు. ఎంత పోషణ చేసినా సరే! బహుశా మనిషైనా అంతేనేమో! మనం ఎంతో ఖరీదుపెట్టి కొనుక్కునే మొక్కలెన్నో ఇక్కడ పిచ్చిమొక్కల్లా పెరిగాయి. ఇక పేరు తెలీని మొక్కలెన్నో తనువంతా విరిబాలలతో విరగబూశాయి. బలమైన వేళ్లతో విస్తరించిన చెట్లు, పొదలు, తీగలు... అక్టోబర్‌ నెల, మంచుతెరలింకా తొలగని సంజెవేళ, అబ్బ వర్ణింపశక్యం కావడంలేదు.
బతకాలన్న కోరిక ఎంత బలంగా వుండకపోతే... తన ఉనికిని చాటుకోవాలన్న ఆశ ఎంత తీవ్రంగా లేకపోతే ఆ చెట్లు ఈ బండరాళ్లను చీల్చుకుని పైపైకి ఎగబాకుతాయి?! మరి మనమెందుకు చిన్నపాటి కష్టాలకే వెన్ను చూపిస్తాం? ఎందుకు వెనుకంజ వేస్తాం? భద్రతాలేమి మనల్ని పట్టి పీడించడం వల్లేమో! ప్రపంచంలో ఏ జీవికీ లేని ఆత్మహత్య అనే దౌర్భాగ్యపు ఆలోచన మనకే ఎందుకొస్తోంది?
ఈ ఆలోచనల మధ్య కూనూరు వచ్చింది. అక్కడినుండి చిన్న చిన్న ఊళ్లు, టీ గార్డెన్స్‌ మొదలయ్యాయి. టీ ప్లాంటేషన్స్‌, మధ్య నిలువెత్తు 'సిల్వర్‌ ఓక్స్‌' వృక్షాలు. అక్కడక్కడా ఆగుతూ ఉదకమండలం.. అదే ఊటీ చేరుకున్నాం. ముదుమలై అడవులకు చేరుకునే మార్గంలో తగిలే ఊటీ పరిసరాలు ముందు చూసి... మిగిలినవి తర్వాత చూడాలనుకున్నాం. సో, ఆ దిశగా పయనించాం. దారిలో ఊటీ లేక్‌ దర్శనమిచ్చింది. పూర్వం సినిమా డ్యూయెట్లన్నీ అక్కడేగా షూటింగ్‌(ఉదా: 'అభినందన'లోని 'మంచు కురిసే వేళలో..')! కానీ ఇప్పుడది పొల్యూట్‌ అయిపోయింది. ఊటీకి సందర్శకుల తాకిడి ఎక్కువనుకుంట! మేం ముందుగా పైన్‌ ఫారెస్ట్‌ దగ్గర ఆగాం. అక్కడన్నీ ఆకాశాన్నంటే చెట్లే. మీకు 'వసంత కోకిల' సినిమాలో ఓ సన్నివేశం గుర్తుందా?! అమాయకురాలైన శ్రీదేవి కమల్‌హసన్‌ను ''ఈ చెట్లు ఇంత ఎత్తుకు ఎందుకున్నారు?'' అని రెప్పలు అల్లల్లాడించుకుంటూ అడుగుతుంది. దానికతను ''ఆకాశంలో బూజు పడుతుంది కదా! దాన్ని దులపడానికి!'' అనేస్తాడు సింపుల్‌గా! అన్నట్లు ఆ సినిమా షూటింగంతా ఊటీలోనే!
షూటింగ్‌ స్పాట్‌ అని అక్కడ ఓ ప్రదేశం వుంది. నున్నగా వున్న కొండ, చుట్టూ దట్టంగా చెట్లున్న కొండలు... టోటల్లీ సూపర్బ్‌. అది సినిమాల్లో హీరో, హీరోయిన్లు కలిసి దొర్లుకుంటూ పోతారే ఆ కొండన్నమాట! వ్యూ మాత్రం అదిరింది! సినిక్‌ బ్యూటీకి మారుపేరనుకోండి! దాన్ని ఆస్వాదించాక మెల్లగా దిగొచ్చాం. అక్కడ మొక్కజొన్న పొత్తులు ఉడకబెట్టి... ఉప్పు, కారం జల్లి వేడివేడిగా అమ్ముతున్నారు. అంత చల్లటి ప్రాంతంలో! ఇక ఊరుకుంటామా, వెంటనే వాటి పనిపట్టాం.
మెల్లగా పైకారా ఫాల్స్‌ వైపుకు మళ్లాం. దానికి చాలా దూరం నడవాలట. దారిలో మన తెలుగువాళ్లే ఎదురై ఆ జలపాతం చిన్నగా వుందని చెప్పారు. సరే లెమ్మనుకుంటూ వెనుతిరిగాం. అక్కడ ఏం కనిపించాయో తెల్సా?! పిచ్చుకలు! పిచ్చుకలా అని తేలిగ్గా తీసిపారేయకండి. పిచ్చుకలు అంతరించిపోతున్నాయని వినడం లేదూ?! మీరు పిచ్చుకల కిచకిచారావాలు విని ఎన్నాళ్లైంది చెప్పండి? పైగా ఆ పిచ్చుకలు బొద్దుగా భలే ముద్దొచ్చాయి. అడవిలో పెరగడం కదూ! ఇటీవల మన జనవాసాలలోనూ పిచ్చుకలు అక్కడక్కడ మళ్లీ కనిపిస్తున్నా అవి డైటింగ్‌ చేస్తున్న పిచ్చుకల్లా వున్నాయి. మునుపటి హుషారు లేదు.

ఇక 'చలో పైకారా లేక్‌' అన్నాం. పైకారా లేక్‌... ''ఏమని వర్ణించనూ..!'' ఒక చేయి తిరిగిన చిత్రకారుని కుంచె నుండి అలవోకగా జాలువారిన చిత్రమంటే సరిపోతుందా?! అనుమానమే! అం..త గొప్పగా వుందా సరస్సు. ప్రకృతి ఎంతో శ్రద్ధగా తీర్చిదిద్దిన ఆ రంగవల్లికను ఊపిరి బిగబట్టి కళ్లనిండా నింపుకోవడమే సరిపోయింది. అదే గొప్ప అనుకుంటే... అందులో బోటింగ్‌! అందరం జంగ్లీలో షమ్మీకపూర్‌లా 'యాహూ' అని అరిచి బోట్‌లో సెటిలైపోయాం. చుట్టూ చిక్కనైన చక్కదనమే! అణువణువునా పచ్చదనమే... అవును పచ్చదనమే..! ప్రకృతిని చూసి పరవశించే ప్రతివారూ అక్కడ తన్మయం చెందాల్సిందే! ఆ మైమరపులోనే బోటింగ్‌ పూర్తయింది.
తరువాత నీడిల్‌ రాక్‌ వ్యూ పాయింట్‌. అక్కడికి చేరేసరికి ఒకటే వాన. ఆ వానలో తడుచుకుంటూ కొండవాలు దిగాం. వెహికల్‌లోని గొడుగులు తీసుకోవాలన్న ఆలోచన కూడా రాలేదేంటో! కొంతదూరం నడిచాక ఆ పాయింట్‌కు చేరాం. వాన, మబ్బుల మధ్యగా దూరంగా మొనతేలిన కొండ... ఓ వర్ణచిత్రంలా మా గొప్ప సొగసుగా వుందిలే! చూస్తూ వుండిపోవడానికి జోరున వర్షం. ఇక తిరిగిరాక తప్పలేదు.
అన్నట్లు మొత్తం టూరంతా ప్రతిచోటా 'ప్లాస్టిక్‌ ప్రొహిబిటెడ్‌ ఏరియా' అని బోర్డులు కనిపించాయి. అది వుండబట్టే ఈమాత్రం ఈ అడవులు మనగలుగుతున్నాయి. లేకుంటేనా... 'సర్వనాశనం' అయిపోయి వుండేది. వరదలు రావడానికీ, పశువులు చనిపోవడానికీ, నేలంతా పాడైపోవడానికీ ప్లాస్టిక్‌ భూతం చేస్తున్న హాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలాగే అంతటా కొండలు, చెట్లు, పువ్వులు ఎలా పెరిగేవి అలాగే వుంచారు. చెట్లను కాపాడమని హోర్డింగులుంచారు. పువ్వు చూస్తే కోయాలనుకోవడం, కాయ చూస్తే తెంచాలనుకోవడం వరకూ ఓకే! దానివల్ల ఎలాంటి నష్టం రాదు. పర్యావరణానికి ఎలాంటి భంగమూ వాటిల్లదు. కానీ... ఆ చెట్టే నరికేస్తే, కొండే తవ్వేస్తే ఎలా? కూర్చున్న కొమ్మను నరుక్కున్న కాళిదాసు గురించి విని ఎగతాళిగా నవ్వుకున్నాం. మరి మనం చేస్తున్నదేంటో!
అలా అలా సాగుతున్న మా ప్రయాణం వున్నట్టుండి క్రమేణా దట్టంగా అల్లుకున్న వెదురు పొదల్లో సాగింది. ఎంత దట్టంగా అంటే ఆకాశం కనపడనంతగా! రోడ్డుకిరువైపులా వున్న పొదలన్నీ ఏకమైపోయి దారిని చీకటిమయం చేసేశాయి. కానీ రాదారి మాత్రం బహు రమణీయంగా వుంది. అలా వెళ్తూ వెళ్తూ దట్టమైన ముదుమలై అడవుల్లోకి అడుగుపెట్టాం. అదంతా టైగర్‌ రిజర్వ్‌ ఫారెస్ట్‌. ఎక్కడా దిగే సాహసాలు కూడదు. కేవలం అడవి అందాలను కళ్లతో జుర్రుకోవాలంతే! దారిలో ఓ అడవి ఏనుగు తన రెండు బుజ్జాయిలతో కనిపించింది. కళ్లు ఇంతింత చేసుకుని మరీ చూశాం. మెల్లగా గుడలూరు మీదుగా తెప్పకాడుకు చేరాం.
కానీ పడుకోవాలంటే చెప్పలేనంత భయం. ఎటువైపునుండి ఏ భల్లూకం వస్తుందో, ఏ పక్కనుండి అడవి జంతువు 'హల్లో' అంటుందోనని వణుకు, దడ, గగుర్పాటు. బాబోయ్!
(తెల్లవారుజామున గది తలుపులు తీయగానే ఏం కనిపించాయో తెలియాలంటే వచ్చేవారం వరకూ ఎదురుచూడక తప్పదు)
________________________________________________________

శ్రీశైల క్షేత్రంలో ఎన్ని విశేషాలో ...

శ్రీశైలక్షేత్రం కేవలం భక్తి భావాలను, ఆధ్యాత్మిక తత్త్వాన్ని మేళవింపజేసుకోవడమే కాకుండా ఎన్నో చారిత్రక విశేషాలను స్వంతం చేసుకొని మన వారసత్వ వైభవానికి ప్రతీకగా నిలుస్తోంది. అంతేకాకుండా భౌగోళిక అంశాలు, ప్రకృతి అందాలు శ్రీశైలానికి మరింత ప్రత్యేకతను సంతరించి పెట్టాయి. అందుకే శ్రీశైలాన్ని ఒక అరుదైన ప్రదేశంగా పేర్కొనవచ్చు. దట్టమైన అడవులతో, ఎత్తైన కొండలతో, అందమైన లోయలతో, గలగల పారే సహజ జలధారలతో, ఒంపుసొంపుల కృష్ణమ్మ ప్రవాహంతో, సాంస్క ృతిక వారసత్వ సంపదతో, ఆలయ కళావైభవానికి ప్రతీకగా చెప్పదగిన నిర్మాణాలతో అలరారే శ్రీశైల క్షేత్రాన్ని దర్శించి తీరవలసిందే.
శ్రీశైలానికి 8 కి.మీ. దూరంలో రోడ్డును ఆనుకొని శిఖరేశ్వరం వుంది. శ్రీశైలం కొండల్లో అతి ఎత్తైన కొండశిఖరం యిదే. దీని ఎత్తు సముద్రమట్టానికి 898 మీటర్లు (2830 అడుగులు). ఈ శిఖరేశ్వరంలో ప్రాచీనమైన వీరశంకర ఆలయం, ఆలయం పైభాగంలో ఒక రోలు, దానిలో ఒక పొత్రంపై నంది అమర్చబడివున్నాయి. భక్తులు ఆలయ పైభాగానికి వెళ్ళి, అక్కడున్న రోటిలో నువ్వులు పోసి, పొత్రాన్ని తిప్పి, నందికొమ్ములపై నుండి శ్రీశైల ప్రధానాలయాన్ని చూస్తారు. ఎత్తైన ఈ ప్రదేశం నుండి చూసినప్పుడు కనబడే శ్రీశైల దృశ్యం ఎంతో మనోహరంగా వుంటుంది.
పాలధార - పంచధార
హఠకేశ్వరానికి ఎదురుగా రోడ్డుకు యివతలి వైపున గల లోయ ప్రాంతమే పాలధార - పంచధార. ఇక్కడ ఎత్తైన ప్రదేశంలో బండరాళ్ళ నుండి, దాదాపు పక్కపక్కగా ఒకచోట ఒక జలధార, మరోచోట అయిదు జలధారలు నిరంతరం ప్రవహిస్తూనే వుంటాయి. ఈ ప్రవాహపు తీరు పర్యాటకులను మంత్రముగ్ధుల్ని చేస్తుంది.
ప్రాకార కుడ్యం - ప్రత్యేకతలు
శ్రీశైలంలోని ఆలయ ప్రాకారకుడ్యం భారతీయ శిల్పంలోనే ఒక ప్రత్యేకతను కలిగివుండి, పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తోంది. దాదాపు 2,79,300 చదరపు అడుగుల వైశాల్యం గల ప్రధాన ఆలయ ప్రాంగణం చుట్టూ సుమారు 20 అడుగుల ఎత్తు, 2121 అడుగుల పొడవుగల కోటగోడ వంటి నిర్మాణమే ప్రాకారకుడ్యంగా చెప్పబడుతోంది. 3153 రాళ్ళను వుపయోగించి నిర్మించిన ఈ ప్రాకారంలో యించుమించుగా బయటివైపుగల అన్ని రాళ్ళపై శిల్పాలు చెక్కబడ్డాయి. ఈ ప్రాకారకుడ్యంలోని ప్రతిరాయిని ఒక కళాఖండంగా పేర్కొనవచ్చు. ఈ కుడ్యం క్రీ.శ.1412 ప్రాంతంలో నిర్మించబడింది. ఈ ప్రాకార కుడ్యంపై శ్రీశైల స్థల కథలకు సంబంధించిన శిల్పాలు, పురాణాలలోని పలుగాథలకు సంబంధించిన శిల్పాలు, దేవతాశిల్పాలు, సిద్ధుల శిల్పాలు, వృక్ష, జంతు శిల్పాలు, యింకా పలు అలంకారిక శిల్పాలు, సామాజిక శిల్పాలు వున్నాయి. ఈ శిల్పాలు ఆనాటి సమాజం యొక్క ఆధ్యాత్మిక వ్యక్తిత్వం, వేషధారణ, విలాసాలు, యుద్ధరీతులు, అప్పటి నృత్యాలు, కళారీతులు మొదలైన వాటన్నిటినీ సూచిస్తూ, అప్పటి సామాజిక జీవన వైవిధ్యాన్ని సూచిస్తున్నాయి.
వీర శిరోమండపం
శ్రీశైల ప్రధానాలయంలో స్వామి వారి ఆలయం ఎదురుగా గల వీరశిరోమండపం ఎంతో చారిత్రక ప్రాశశ్యం వుంది. ఈ మండపాన్ని క్రీ.శ.1377లో రెడ్డి రాజులు నిర్మించారు. ఈ మండపంలో భక్తులు వీరావేశంతో తమ తలలను, కాళ్ళు చేతులను, నాలుకలను, కుత్తుకలను గండ కత్తెరలతో నరుక్కునేవారని, ఈ మండప నిర్మాణ సందర్భంగా వేయించిన శిలాశాసనం చెబుతోంది. ఈ సాహస కృత్యాలకే 'వీరాచారం' అని పేరు. పాల్కురికి సోమనాథుని పండితారాధ్య చరిత్రలో యిలాంటి సాహస కృత్యాలు వర్ణించబడ్డాయి. ఆలయ ప్రాకార కుడ్యంపై కూడా యిలాంటి వీరాచార శిల్పాలున్నాయి. శ్రీశైలంలో యిలాంటి సాహసకృత్యాలకు ఒక మండపమే ప్రత్యేకంగా నిర్మించబడిందంటే, శ్రీశైల సంస్కృతిలో ఈ సంప్రదాయానికి గల ప్రాధాన్యమేమిటో అర్థమవుతోంది.
ట్రైబల్‌ మ్యూజియం
శ్రీశైలంలో పర్యాటకులు తప్పకుండా చూడవలసిన వాటిలో ఈ ట్రైబల్‌ మ్యూజియం ఒకటి, గిరిజన సంస్కృతీ సంప్రదాయాల సమాహారంగా చెప్పదగిన ఈ మ్యూజియం 2003లో ఏర్పాటు చేయబడింది. ఆదిమవాసుల సంప్రదాయ విశేషాలను తెలియచెప్పే ఈ ప్రదర్శనశాల కొన్ని వేల సంవత్సరాల విశేషాలను మన కళ్ళకు కట్టినట్లుగా చూపిస్తుంది. ఈ మ్యూజియంలో ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌లో చేసిన ఆదిమవాసుల నిలువెత్తు బొమ్మలు నిజంగా వారు మన ముందున్నట్లుగా భ్రాంతిని కలుగచేస్తాయి. పామును ఆడిస్తున్న చెంచు, తప్పెట వాయిస్తున్న చెంచు, డోలు వాయిస్తున్న గిరిజనుడు, శివకథ చెబుతున్న చెంచు, వేణువు ఊదుతున్న గిరిజనుడు, శివునికి సోది చెబుతున్న ఎరుకలసాని మొదలైన మూర్తులు ఈ మ్యూజియంలో వున్నాయి. ఇక్కడ యిలాంటి మూర్తులను 20 దాకా చూడవచ్చు. ఇంకా 33 గిరిజన తెగలకు చెందిన రకరకాల వాయిద్యాలు, వారి ఆభరణాలు, వారి వివిధ వస్తువులను కూడా ఈ ప్రదర్శనశాలలో చూడవచ్చు.
అక్కమహాదేవి గుహలు
శ్రీశైలంలోని అక్కమహాదేవి గుహలు భౌగోళికంగా ఎంతో ప్రత్యేకతను కలిగి వున్నాయి. అక్క మహాదేవి గుహలను యిక్కడ పాతాళగంగ మెట్లను దిగి, దాదాపు 10 కి.మీ. నదిలో ప్రయాణించి చేరుకోవచ్చు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి అయితే 12 కి.మీ. ప్రయాణించాల్సి వుంటుంది.
పన్నెండవ శతాబ్దంలో వీరశైవ శివశరణులలో ప్రసిద్ధి చెందిన అక్కమహాదేవి ఈ గుహలలో కొంతకాలం తపస్సు చేసిన కారణంగా వీటికి అక్కమహాదేవి గుహలు అనే పేరు ఏర్పడింది.ఈ గుహల సహజ అందాలను కన్నులారా చూడవలసిందే కాని వివరించి చెప్పలేము. కుడి, ఎడమలలో రెండు ప్రవేశ ద్వారాలు గల ఈ గుహల ముందు భాగంలో స్తంభాకారంలో ఏర్పడిన శిలలను చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఎంతో కళా సౌందర్యంతో అలరారే ఈ సహజ స్తంభాలు చెయ్యి తిరిగిన శిల్పి చెక్కిన కళారూపాల్లాగా భాసిస్తాయి.ఈ గుహల కుడివైపు ప్రవేశద్వారం నుండి లోపలికి వెళితే గుహచివరను చేరవచ్చు. సహజసిద్ధంగా ఏర్పడి, సొరంగం బాగా వుండే ఈ దారి సుమారు 250 మీటర్ల పొడవుండి వంపులుగా వుంటుంది. గుహ అంచులో వేదిక లాగా వుండి, దానిపై శివలింగాకారంలో ఏర్పడిన ఒక శిల వుంది. దీన్ని సహజ శివలింగంగా పేర్కొంటారు. ఇక గుహ ఎడమభాగం కూడా కుడివైపు మాదిరిగానే సన్నగా, వంపులుగా వుండి సుమారు, 150 మీటర్ల పొడవుంటుంది. కాగా గుహల లోపలి భాగంలో వివిధ శిలాకృతులు ఎంతో విచిత్రంగా కనిపిస్తాయి.
సహజశిలాతోరణం
అక్కమహాదేవి గుహలవద్ద భూమికి సుమారు రెండువందల అడుగుల ఎత్తులో ఏర్పడిన సహజ శిలాతోరణం ఎంతో అద్భుతం. సుమారు 200 అడుగుల పొడవు, 16 అడుగుల వెడల్పు 4 అడుగుల మందంతో దీర్ఘ చతురస్రాకారంలో గల ఈ శిలాతోరణం, కింద ఎలాంటి ఆధారం లేకుండా కాంటిలివర్‌ బీమ్‌ వుంది. మన దేశంలోని పెద్ద శిలాతోరణాలలో దీన్ని ఒకటిగా చెప్పవచ్చు. అయితే దీని ఉనికి చాలా మందికి తెలియని కారణంగా యిది ప్రాచుర్యంలోకి రాలేదు. రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ పాతాళగంగ మెట్ల నుండి అక్క మహాదేవి గుహల వరకు బోటు సదుపాయాన్ని కల్పించింది. ఎంతో ప్రత్యేకంగా కన్పించే అక్క మహాదేవి గుహలు, అరుదైన అక్కడి శిలాతోరణం, దేశ, విదేశీ పర్యాటకులను బాగా ఆకట్టుకుంటాయని చెప్పడం ఏమాత్రం అతిశయోక్తికాదు.
కదళీవనం
అక్క మహాదేవి గుహలకు యించుమించు ఎదురుగా రెండవ ఒడ్డున వున్న కదళీవన రేవు నుండి కొండలనెక్కుతూ సుమారు 11 కి.మీ. ప్రయాణించి కదళీవనాన్ని చేరుకోవచ్చు. కదళీవనంలో సహజసిద్ధంగా ఏర్పడిన శిలామండపం చూపరులను సంభ్రమాశ్చర్యాలతో ముంచెత్తుతుంది. కొండ నుండి సహజసిద్ధంగా ముందుకు వచ్చిన ఒక పెద్ద శిల, కింద ఎలాంటి ఆధారం లేకుండా పైకప్పులాగా వుండి మండపం లాగా ఏర్పడింది. దాదాపు 100 మీ. పొడవు 25 మీ. వెడల్పు వున్న ఈ సహజ మండపం సుమారు వేయి మంది ఒకసారి కూర్చొనేందుకు వీలుగా వుంది. ఈ శిలామండపం అంతర్భాగమంతా గుహను పోలి వుంటుంది. మండపం పైకప్పు నుండి అక్కడక్కడ సన్నటి నీటిబొట్లు రాలిపడుతుంటాయి. మండుటెండల్లో కూడా ఈ శిలా మండపం కింద చెప్పలేనంత చల్లగా వుంటుంది. ఈ శిలామండపం పక్కనే నిరంతరం ఉబికివచ్చే నీటి ఊట చూపరులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఈ కదళీవనం పర్యాటకులకు గొప్ప అనుభూతిని కలిగించడమే కాకుండా, వారు మరో ప్రపంచంలో వున్న భావనను కలిగింపచేస్తుంది.
వైల్డ్‌ లైఫ్‌ టూరిజం
'నాగార్జునసాగర్‌-శ్రీశైలం' ప్రాజెక్ట్‌ టైగర్‌గా గుర్తించబడ్డ అభయారణ్యంలో శ్రీశైలం అటవీప్రాంతం వుండటం చేత వైల్డ్‌లైఫ్‌ టూరిజానికి యిక్కడ మంచి అవకాశాలున్నాయి. ఈ పులుల అభయారణ్యం సుమారు 3,568 చ.కి.మీ. విస్తీర్ణంలో గుంటూరు, ప్రకాశం, కర్నూలు, మహబూబ్‌నగర్‌, నల్లగొండ జిల్లాలలో విస్తరించివుంది. కృష్ణానదికి అటూ యిటూ వున్న ఈ వన్యప్రాణి సంరక్షణాలయంలో పులి, చిరుతపులి, ఎలుగుబంటి, పెద్దనక్క, చిన్ననక్క, కణితి, చుక్కలదుప్పి, నాలుగు కొమ్ముల దుప్పి, చిన్న దుప్పి, బొర్ర జింకలు ముంగిస, 150 రకాలకు పైగా కీటకాలు, పలురకాల పక్షులు వున్నాయి.
_______________________________________________________

చుట్టేద్దాం ... మూడు రాష్ట్రాల సరిహద్దులు

దసరా సెలవులు! అంటే ఫ్యామిలీ ట్రిప్‌! ఆలోచన రాగానే ఎక్కడికెళ్లాలి, ఎప్పుడెళ్లాలి, ఎన్ని రోజులెళ్లాలి... అనే ప్రశ్నలే అందరిలోనూ! పోయినసారి కర్నాటకలోని కూర్గ్‌ పరిసరాలు, శృంగేరీ, జోగ్‌ ఫాల్స్‌, బేలూరు, హలిబీడు తిరగ్గా... అటుపక్కకు బందిపూర్‌ అడవులు మిగిలాయి. వాటి పక్కగా తమిళనాడు ముదుమలై అడవులు వుండనే వున్నాయి. వాటికి సమీపంలో కేరళలోని కుమర్‌కోమ్‌, తేక్కెడి, మున్నార్‌ చూడగా మిగిలిన వయనాడ్‌ జిల్లా వుంది. కోయంబత్తూరును వారధిగా చేసుకుంటే దానిపక్కనే వున్న కర్మడాయి అడవులను కవర్‌ చేయొచ్చు. మధ్యేమార్గంగా టారుట్రైన్‌లో మమ్మల్ని తిప్పాలన్న ప్రతాపన్నయ్య ఆలోచన సాయంతో ఊటీని చుట్టేయొచ్చు. యేతావాతా చెప్పొచ్చేదేమిటంటే మేం తిరగబోయేదంతా నీలగిరి బయోస్పియర్‌లోని ఒక భాగం!
మీకిప్పటికే అర్థమై వుంటుంది. ఈ ట్రిప్‌లో ప్రకృతి తప్ప మరో ఆలోచన లేదని! అవును! కాలుష్యభరిత కాంక్రీట్‌ జంగిల్‌లో ఇగిరిపోయిన జీవితేచ్ఛ తిరిగి ఉద్భవించాలన్నా... గుండె గూటిలో తిరిగి మంచుపుష్పాలు విరియాలన్నా ప్రకృతిని మించిన 'శక్తి' మరోటి లేదు. ఇదికాక బిజీ బిజీ రొటీన్‌ లైఫ్‌నుండి అందరం తప్పుకోవాలి. కుటుంబమంతా పదిరోజులు కలిసి హాయిగా గడపాలన్న తిరుగులేని బలమైన ఆలోచన... వెరసి మూడు రాష్ట్రాల సరిహద్దుల్లో మా జాలీ టూర్‌!ఇలా అనుకున్నాక అందుకుతగ్గ ఏర్పాట్లు మొదలైపోయాయి. ప్రథమ కర్తవ్యంగా ట్రైన్‌ టికెట్ల బుకింగ్‌ అయిపోయింది. కోయంబత్తూరులో దిగిన దగ్గర్నుంచీ తిరిగి రైలెక్కేదాకా వెహికల్‌ ఏర్పాటైపోయింది. ఇక అనుకున్న ప్రాంతాల్లో చూడదగ్గవి ఏంటీ, ఎలా కవర్‌ చేయొచ్చు, ఎక్కడ వుండాలి... ఇలాంటి ప్లానింగ్‌ అంతా ఈశ్వర్‌ భుజస్కందాలమీదే! చిన్న చిన్న సూచనలు మాత్రమే మావి! ఎక్కడికక్కడ హోటల్‌ బుకింగ్స్‌ పూర్తయ్యాయి. లిస్ట్‌ రాసుకుని... పేపర్‌ ప్లేట్లు, చాకు, ఉప్పుతో సహా అవసరమైనవన్నీ ప్యాక్‌ చేసేసుకున్నాం. మీ పనులన్నీ టెన్షన్‌లేకుండా పూర్తి చేసుకోండన్న అత్తయ్య తినుబండారాల తయారీని తన నెత్తికెత్తుకున్నారు. పిల్లలు వారికి కావలసిన స్టోరీ బుక్స్‌, చాకొలెట్స్‌ తమ ట్రావెల్‌ బ్యాగ్స్‌లో సర్దుకుంటే... మీరెక్కడికి తీసుకెళ్లినా చాలు, మీతో వుండటమే మాకు ముఖ్యం అనుకున్న మామయ్య నిశ్చింతగా వున్నారు.
శ్రీనుబావవాళ్లు అనుకోకుండా డ్రాప్‌ అవడంతో వారి టికెట్లు కేన్సిల్‌ చేశాం. ముంబయినుంచి వచ్చిన హర్షతో కలిపి మేం మొత్తం తొమ్మిదిమందిమయ్యాం. మొత్తానికి నెలరోజుల ముందునుంచి చేసుకున్న ఏర్పాట్లు ఓ కొలిక్కొచ్చాయి. వారం ముందునుంచే బ్యాగేజ్‌ సర్దుకుని ఎనిమిదో తారీఖు ఎప్పుడెప్పుడు వస్తుందాని ఎదురుచూపులు సారించాం. ఎట్టకేలకు వెళ్లే రోజు విచ్చేసింది. మా అందరికీ నవ వసంతం వచ్చేసింది.సాయంత్రం ఆరింటికల్లా అందరం స్టేషన్‌కు చేరాం. అనుకున్న సమయానికే రైలొచ్చింది. ఎక్కి సామాను సర్దుకుని సెటిలయ్యాం. తరువాత వెజిటబుల్‌ బిర్యానీ, కర్డ్‌ రైస్‌ ఆరగించి నిద్రలోకి జారుకున్నాం. విజయవాడలో అత్తయ్య, మామయ్య రైలెక్కారు. పొద్దున్న మద్రాసులో మరో రైలెక్కి తెచ్చుకున్న పులిహోర తిన్నాం. రాత్రి తొమ్మిదికి కోయంబత్తూరుకు చేరాం. వెంటనే హోటల్‌ చేరి స్నానాలు కానిచ్చి భోజనానికి వెళ్లేసరికి హోటళ్లన్నీ మూసేశారు. మా దగ్గరున్న పులిహోర, బ్రెడ్‌, జామ్‌ తిని పడుకున్నాం.
పొద్దున్నే 15 సీట్ల వెహికల్‌తో డ్రైవర్‌ రాజు రెడీ! అతనికి తమిళం, మళయాళం సూపర్‌గా వచ్చు. ఇంగ్లీషు 'యస్‌, నో, ఆల్‌రైట్‌' వరకూ వచ్చు. ముక్కలు ముక్కలుగా తమిళం, ఇంగ్లీషు భాషల సాయం తీసుకుని ముప్పుతిప్పలు పడి టూర్‌ ప్లానింగ్‌ మొత్తానికి విశదీకరించగల్గాం. ప్రస్తుతానికి కోయంబత్తూరు సమీపానున్న కర్మడాయి అడవులకు తీసుకెళ్లమన్నాం. దారిలో మిరియాల పొంగల్‌ లాగించేశాం. దుమ్ముతో నిండిన కోయంబత్తూరు దాటి కర్మడాయిలోకి అడుగుపెట్టాం.
అడవితల్లి ఒక్కసారిగా బిడ్డను ఆప్యాయంగా హత్తుకున్న ఉద్విగత. అది మాటలకు అందనిది! భాషకు చిక్కనిది. అదో అనిర్వచనీయ అనుభూతి! ఆ కొండలు, అడవులు, వెనవేల సంఖ్యలో వృక్షాలు... దారంతా విరబూసిన అడవిపూలు వ్యాపింపచేసే పరిమళాలు... మంద్రంగా స్పృశించే చల్లని పవనాలు... రంగురంగుల సీతాకోకచిలుకల స్వాగత నృత్యాలు... పేరు తెలియని పక్షుల బృందగానాలు... అన్నీ ఏకమొత్తంగా ఆహ్వానిస్తోంటే మూగబోవడం మా వంతైంది. ప్రకృతికాంత నడుముచుట్టూ పెనవేసుకున్న వాల్జెడలా సాగుతున్న సన్నటి మార్గంలో వెళ్తూ మంత్రముగ్థలవడమే మేము చేసిన పని! ఇది నిజమేనా! ఇలాంటి ప్రపంచం కూడా వుందా? దుమ్మూ ధూళికి దూరంగా మనదైన ఈ భూలోకంలో ఇంకా చోటు మిగిలే వుందా అనే సంభ్రమం! ఇంతకు ముందు ఇక్కడికి రాలేకపోయామనే పశ్చాత్తాపం... ఇప్పటికైనా వచ్చామనే తన్మయత్వం... ఈ అనుభూతులన్నీ కర్మడాయిలోని పిల్లూరు డ్యామ్‌ చేరుకునేసరికి శిఖరానికంటాయి.
కర్మడాయి అడవుల ప్రోగ్రామ్‌ ముందే బుక్‌ చేసుకున్నాం. ఈ బుకింగ్‌ కేవలం వారం రోజుల ముందే చేసుకోవాలి. ప్రోగ్రామ్‌ రోజంతా. ఒక్కొక్కరికీ మూడొందలు. అదీ శనివారం, ఆదివారం మాత్రమే! అక్కడంతా ఆదివాసీలే వుంటారు. ఏర్పాట్లన్నీ వారివే. ఫారెస్ట్‌ డిపార్ట్‌మెంట్‌ చొరవతో ఆదివాసీలకు ఏర్పడ్డ జీవనాధారం అది! మేం చేరుకునే వేళకు అక్కడెవ్వరూ లేరు. ఉయ్యాలలైతే కనిపించాయి.
వెంటనే వాటినెక్కి ఊగులాడటం ప్రారంభించాం. మెల్లగా ఆదివాసీలొచ్చి కుర్చీలేశారు. కూర్చోగానే 'చుక్క కాపీ' అంటూ శొంఠి, బెల్లం కలిపిన పాలు వేయని డికాక్షిన్‌ కాఫీ ఇచ్చారు. తాగాక 'పుట్టి'లో బోటింగ్‌ వెళ్దామన్నారు. రెండు పుట్టిల్లో బయల్దేరాం. అది భవానీ నది. కొండల్లో పుట్టి ప్రవహిస్తున్న దానికి పిల్లూరు డ్యామ్‌ కట్టారు. దాంతో కొండల మధ్య మెలికలు తిరుగుతూ అదో పెద్ద జలాశయంలా మారింది. వీశమెత్తయినా చెత్తలేని, ముఖ్యంగా ప్లాస్టిక్‌ కనిపించని, స్వచ్ఛమైన నీరు నిండిన ఆ విహారం జలవిహారం మాత్రమే కాదు, వనవిహారం కూడా! వివరించలేని అలౌకిక భావనలో అన్నీ మరిచిపోయి లీనమైపోవడం తప్ప మరేమీ గుర్తుకురాలేదు. కనీసం మాటలు కూడా లేవు. ఈ చల్లని గాలి, ఈ ప్రశాంత పయనం, ఈ అడవిపూల గుభాళింపు ఈ జన్మకిది చాలు అన్నంత నిశ్చింత. ఎన్ని కోట్లిచ్చినా ఈ అనుభవం సొంతం కాదనే నిండైన సంతృప్తి. 'గుండెలనిండా ఈ గాలి పీల్చుకోండి. మళ్లీ కావాలన్నా మనకు దొరకదు' అంటున్న ఈశ్వర్‌ను మేమంతా ఫాలో అయిపోయాం.
మధ్యలో పుట్టి ప్రయాణానికి బ్రేక్‌. వెంట తెచ్చుకున్న స్నాక్స్‌ తింటూ ఆదివాసీలకూ ఇచ్చాం. తిరిగి పుట్టిలో ఊహల ఊయలలూగాం. అలా మూడు గంటలు 'ఆకులో ఆకునై... కొమ్మలో కొమ్మనై' మైమరచిపోయాక ఎక్కిన చోటికి చేరాం. 
ఒక పావుగంట రిలాక్సయ్యేసరికి వాతావరణం మారిపోయింది. పదమూడు మంది ఆదివాసీ మహిళలు తర్ఫీదైన సైన్యంలా చకచకా ఏర్పాట్లు చేసేస్తున్నారు. స్వయంగా వండిన వంటకాలను టేబుల్స్‌పై వరుసగా సర్దేశారు. మేమంతా ప్లేట్లు పట్టుకుంటే వరుసగా వడ్డన ప్రారంభించారు. పరమాన్నం, సలాడ్‌, రోటీ, కర్రీ, వెజిటబుల్‌ బిర్యానీ, పెరుగుచట్నీ వడ్డించారు. అది తిన్నాక రాగి ముద్ద, చికెన్‌ కర్రీ... తరువాత పెరుగన్నం కడుపారా తిని చేయి కడుక్కుంటుండగా అరటిపండు... మృష్టాన్నభోజనం అంటే ఇదేనా?! అదీ అడవిబిడ్డల చేతులమీదుగా..! అందుకేనా దీనికింత కమ్మదనం! భుక్తాయాసం తీరాక మరికొందరు ఆదివాసీలు వచ్చి పదండి పదండి ట్రెక్కింగ్‌కెళ్దాం అన్నారు. అక్కడ యేరు వంపులు తిరుగుతూ... రాళ్ల మధ్యగా ఒరుసుకుంటూ వేగంగా ప్రవహిస్తోంది. ఆ నది ఒడ్డునే కొండ రాళ్ల మధ్య మా ట్రెక్కింగ్‌. దారంతా ఎగుడు దిగుళ్లు, రాళ్లు రప్పలూ, పెద్ద పెద్ద వేళ్లు... అయినా ఎక్కడా అలసట తెలీలేదు. పక్కన పరవళ్లు తొక్కుతున్న సెలయేటి సౌందర్యం, కుప్పపోసిన అటవీసౌందర్యం... అవి చెప్పే ఊసులు... పిల్లగాలుల గుసగుసలు ఆస్వాదించడమే సరిపోతే ఇక అలసటకు తావెక్కడీ! గంట గడిచాక చివరి మజిలీ చేరాం. అక్కడ ఏమంత పెద్ద లోతు లేదు. తీసుకువచ్చినవాళ్లు ఇక మీ ఇష్టం వచ్చినంతసేపు ఆడుకోమన్నారు. ఇక అందరికీ పట్టరానంత సంతోషం. అప్పటిదాకా నీళ్ల వద్దకు వెళ్లొద్దని మందలించిన అత్తయ్య, మామయ్య మరి కాదనలేదు.
అలా రెండుగంటలు నీటిలో మునిగీ తేలీ లోకాన్ని మరిచిపోయాం. వజ్రంలాంటి ఆ పరవళ్ల స్వచ్ఛతకూ, నీటి ఒరవడికీ సర్వం మరిచీ స్వాంతన చెందాం. ఇక లేవండి, చీకటిపడుతోంది... మెట్టుపాళయం చేరాలి అన్నాక మరి లేవలేక... ఆ ప్రాంతాన్ని విడువలేక ఒడ్డుకొచ్చాం. ఈ స్వాంతన, ఈ చల్లని స్పర్శ మళ్లీ దొరికేనా... వెళ్లక తప్పదా... ఇక్కడే వుండిపోరాదా... ఇలాగే ప్రశాంతంగా కాలం వెళ్లబుచ్చలేమా... ఇన్ని ఆశల మధ్య ఊగిసలాటే అందరిలోనూ!అన్నీ వదిలేసి ప్రకృతిలో కలిసిపోదామన్న వెర్రి ఆవేశం... సంపాదన, స్వార్థం, మరొకరిని అధిగమించాలనే ఆరాటం, అందుకోసం నిరంతరం పోరాటం... ఇవేమీ గుర్తురాని మైకం ఇక్కడే సాధ్యం! మాటల్లో చెప్పలేని సంతృప్తి! కర్మడాయి అడవుల అనుభవం మనసు పొరల్లో అలా ముద్రించుకుపోయింది. ఇక్కడ దొరికిన ఆత్మసంతృప్తి బతికినన్నాళ్లూ గుర్తుంటుంది. ఎందుకంటే, అక్కడ ఆకు, పువ్వు, పిట్ట, గుట్ట అన్నీ నిశ్శబ్దంగా వున్నాయి. స్వేచ్ఛగా వున్నాయి. ఆదివాసీలు అంతే స్వేచ్ఛగా, స్వచ్ఛంగా వున్నారు. నిజానికి వారే నాగరికులు! ప్రకృతి మనగలిగితేనే మన మనుగడ అన్నది గుర్తించారు. దాన్ని పదిలంగా కాపాడుకుంటున్నారు. ప్రతీదాన్ని 'మనీ మైండెడ్‌'తో కొలిచే ఏ టూరిజంవారి కన్నులూ ఇటు సోకకుండా వుంటే బాగుండు! ఈ చిక్కనైన అటవీసౌందర్యం ఆదివాసీల చేతిలోనే కలకాలం కొలువుంటే బాగుండు!
మా ఆలోచనలేమీ పట్టించుకోని వాహనం రాత్రికి మెట్టుపాళయంకు చేరింది. అక్కడ ఎనిమిది దాటితే భోజనం దొరకడం కష్టమే! అక్కడనే కాదు, ప్రతిచోటా అంతే! మొత్తానికి దొరికినదేదో తిని కడుపు నింపుకున్నాం. రోజంతా వనదేవత ఒడిలో ఆడుకుని అలసిసొలసి సొక్కిపోయామేమో... మాకు తెలీకుండానే క్షణాల్లో నిద్రాదేవత ఒడిలో వాలిపోయాం
______________________________________________________

గులాబి నగరం అందాలు ... నీలి నగరం చందాలు...

రాజస్థాన్‌ అనగానే మన మదిలో అద్భుతమైన రాజభవనాలు మెదులుతాయి. చిన్నప్పుడు చదువుకొన్న చరిత్ర పాఠాలు, రాజుల విజయగాథలు, రాజపుత్ర స్త్రీల సాహసకృత్యాలు గుర్తొస్తాయి. సూర్యకిరణాలకు పుత్తడిలా మెరిసిపోయే ఇసుకతెన్నెలు, లయబద్దంగా నడిచే ఎడారిఓడలు... పల్చగా మనోఫలకంపై కదలాడతాయి. నాటి రాజుల కళాభిరుచికి, శిల్పుల నైపుణ్యానికీ నిలువెత్తు సాక్ష్యాల్లా రాజభవనాలు దర్శనమిస్తాయి. అన్నిటిలోకి గులాబినగరం, నీలి నగరం సోయగాలు మర్చిపోతామా! అవేనండీ జైపూర్‌, జోధ్‌పూర్‌ పట్టణాలు. మరి ఒళ్లుగగుర్పొడిచే చరిత్రకు సాక్ష్యంగా నిల్చిన రాజస్థాన్‌ వెళ్లొద్దామా...
'భారతదేశ చరిత్రపట్ల, సంస్కృతిపట్ల మక్కువ ఎక్కువ' అని చెప్పేవారెవరైనా సరే రాజస్థాన్‌ అందాలు వీక్షించాల్సిందే. చరిత్రలో చదివిన రాజపుత్రవీరుల వీర చరితలకు నిదర్శనాలైన అక్కడి కోటలు, కట్టడాల అందాలను ఆస్వాదించాల్సిందే.
గులాబి నగరం
జైపూర్‌ గులాబి నగరంగా పేరొందింది. అదేనండీ 'పింక్‌ సిటీ'. ఇది మన దేశంలోకల్లా అత్యంత అందమైన నగరాల్లో ఒకటి. పర్యాటకులను ప్రధానంగా ఆకర్షించేది 'సిటీ ప్యాలెస్‌'. ఆకాశాన్నంటే రాజభవనాలను చూస్తుంటే కనురెప్ప వేయడం కూడా మర్చిపోతాం. నాటి రాజుల దర్పానికి నిలువెత్తు నిదర్శనాలివి. వాటి అందాలను నోటితో వర్ణించడమంటే పెద్ద సాహసమే. చూసి తీరాల్సిందే.
ఇక్కడ హెరిటేజ్‌ హోటళ్లూ, పార్కులూ, ఉద్యానవనాలూ చాలా కనిపిస్తాయి. ఈ ఆధునిక యుగంలో అడుగడుగునా సంప్రదాయం తొంగిచూస్తుంటుంది. అలాగని ఆధునికతను అడ్డుకుంటుందని కాదు. దానికీ ఆహ్వానం పలుకుతూనే వుంటుంది. ఇప్పటికీ గుర్రపు బగ్గీలూ, ఒంటె సవారీలూ దర్శనమిస్తుంటాయి. అయితే రయ్యిమని దూసుకెళ్లే వాహనాల పక్కనుంచి వీటిమీద ప్రయాణం చేయాలంటే కూసింత సిగ్గుపడే వారూ వుంటారనుకోండి. అయితే జైపూర్‌ వెళ్లినవారు మాత్రం తప్పనిసరిగా ఒక్కసారైనా వీటిమీదెక్కి వీధుల్లో ప్రయాణించాల్సిందే. అదో అనిర్వచనీయమైన అనుభూతి మరి. చేజేతులారా వదులుకుంటామా చెప్పండి. అయితే ఒంటెమీద ఎక్కి కూర్చుని మహారాజాల్లా ఫీలయిపోయే వారూ మనకు కనిపిస్తుంటారు. 
అలా మెల్లగా వీధిలో వెళుతూ... రాజస్థానీ ప్రజలను చూస్తుంటే వుంటుందీ! నిజంగా రాజులకాలం నాటికి వెళ్లిపోతాం. ముఖ్యంగా రాజస్థానీ మహిళలు ! చేతి గాజులు మొదలుకొని, మెడలో ఆభరణాలు, వస్త్రాల వరకు అన్నీ తమ ప్రాంతీయ సంప్రదాయానికి ప్రతీకలుగా అలంకరించుకొంటారు. కళ్లు చెదిరిపోయే రంగు బట్టలు ధరించడమంటే వీరికి అమిత ఇష్టం. పురుషులూ తక్కువ కాదు. రంగురంగుల వస్త్రాలతో తలపాగాలు చుట్టుకొని మీసాలు మెలేస్తూ భలే స్టయిల్‌గా నడుస్తుంటారు. ఇక్కడ చూడాల్సిన మరో ముఖ్యమైనది మ్యూజియం. దీని ప్రవేశ ద్వారం వద్ద పాలరాతితో చేసిన రెండు పెద్ద ఏనుగులు పర్యాటకులకు స్వాగతం పలుకుతాయి. ఎంతో అపురూపమైన సంపదని ఈ మ్యూజియంలో భద్రపరిచారు. ఇందులోని నేలంతా పర్షియా, ఆఫ్ఘన్‌ కార్పెట్లతో నిండిపోయి ఉంటుంది. ఇక గోడలు అద్భుతమైన చిత్ర కళతో కళకళలాడుతుంటాయి. ఆనాటి రాజకుటుంబీకులు ధరించిన అనేక రకాలైన దుస్తులను ఇక్కడ చూడొచ్చు.
సిటీ ప్యాలెస్‌ సొగసులు...
సిటీప్యాలెస్‌ లోపలంతా తిరిగి చూస్తుంటే ఎటు వెళ్తున్నామో తెలియదు. ఓ పెద్ద పజిల్‌ లాగా ఉంటుందీ కోట. అప్పట్లో శత్రువుల దాడిని ఎదుర్కోడానికి ఇలా నిర్మించారు కాబోలు. దీని నిర్మాణంలో మొఘలుల శైలి ప్రతిబింబిస్తుంది. ఇది ఏడంతస్తుల నిర్మాణం. ఈ కోటలోని కిటికీలు, పెద్ద పెద్ద తలుపులు... వాటిపై చెక్కిన చిత్ర కళను చూస్తే 'ఎంతటి చేయి తిరిగిన శిల్పి చేశాడీ మాయ' అని అనిపించక మానదు. ఈ కోటలో ముఖ్యమైనది చంద్ర మహల్‌. ఇందులోనే రాజ కుటుంబం నివసించింది. ఈ మహల్‌ గోడలపై మహరాజా ప్రతాప్‌ జీవిత ఫట్టాలు చిత్రించారు. ఇవే కాకుండా అతను ఉపయోగించిన మార్బుల్‌ సింహాసనం, యుద్ధంలో ఉపయోగించిన ఆయుధాలు, అతని గుర్రం ధరించిన కవచం కూడా ఈ చిత్రాల్లో ఉన్నాయి.
కోట పై భాగానికి వెళ్లి నగరాన్ని చూస్తే చాలు... ఎంత అద్భుతమైన నగరమిది అని అనిపించక మానదు. చుట్టూ కనుచూపు మేరలో ఎక్కడ చూసినా గులాబీ రేకలు పరిచినట్లు కనిపిస్తుంది. ఇక్కడి భవనాలన్నీ గులాబీ రంగులోనే ఉన్నాయి. స్థానికులు దీనికి ఒక కథ చెప్తారు. జైపూర్‌ నగరాన్ని 17 శతాబ్దంలో నిర్మించారు. ఈ నగరాన్ని నిర్మించింది బెంగాల్‌కు చెందిన విద్యాధర భట్టాచార్య. అప్పట్లో ధనికులు తమ భవనాలు అందంగా కనిపించాలని, ఎంతో ఖరీదైన గులాబీ రంగు రాళ్లతో నిరించారు. వేల్స్‌ రాజైన ఏడవ ఎడ్వర్డు జైపూర్‌ను దర్శించుకుందామని వచ్చాడు. అక్కడ అతనికి గులాబీ రంగులోని భవనాలు ఎంతగానో ఆకర్షించాయి. నగరం మొత్తం ఇదే రంగులో ఉంటే ఎంత బాగుంటుందో అని అనిపించింది. వెంటనే అన్ని భవనాలకూ గులాబీ రంగు వేయాలని ఆజ్ఞాపించాడు. అప్పటి నుండి అదే విధానాన్ని కొనసాగిస్తున్నారు అక్కడి ప్రజలు. ఇప్పటికీ ఈ పద్ధతి అమల్లోనే ఉంది. ఇక్కడ ఎండలు ఎక్కువ కాబట్టి ఈనగరాన్ని 'సన్‌ సిటీ' అని కూడా అంటారు. ఈ కోటకు కిలో మీటరు దూరంలో జస్వంత్‌ తాడా ఉంది. ఇక్కడే రాజుల సమాధులు కట్టారు. ఇవన్నీ ఎంతో పలుచగా ఉన్న చలువరాయితో నిర్మించారు. ఇందులో అన్నింటికంటే పెద్దది రాణా సమాధి.
ప్యాలెస్‌ ఆఫ్‌ విండ్ప్‌

దీన్నే హవామహల్‌ అనికూడా పిలుస్తారు. 18వ శతాబ్దం ఆరంభంలో దీని నిర్మాణం జరిగింది. దీన్ని కూడా గులాబీ రంగు రాళ్లతోనే నిర్మించారు. సూర్యకాంతిలో గులాబీల పరదా కప్పుకున్నట్లున్న ఈ మహల్‌ను చూడ్డానికి రెండు కళ్లూ చాలవు. ఈ మహల్లో మొత్తం 593 కిటికీలున్నాయి. ఈ కిటికీల్లో నుండే ఆనాటి రాణివాసపు స్త్రీలు వీధుల్లో జరిగే ఉత్సవాలను, ఊరేగింపులను తిలకించేవారు. అందుకు అనువుగా దీన్ని అయిదంతస్తులుగా నిర్మించారు. ఇందులో ఎంతో విశాలంగా ఆర్చీలతో తీర్చిదిద్దిన బాల్కనీలు చూడముచ్చటగా వుంటాయి.
హవామహల్‌ సిటీ ప్యాలెస్‌ పశ్చిమాన ఉంటే, ఈశాన్య దిక్కున నహర్‌ ఘర్‌ కోట ఉంది. దీన్ని 17వ శతాబ్దంలో రెండో జైసింగ్‌ తన రాణుల కోసం నిర్మించాడు. ఇందులో భవనం మధ్యభాగం నుండి వర్తులాకారంలో గదులను నిర్మించారు.

ఇక్కడ రాజప్రాసాదాలే కాదు, ప్రకృతి దృశ్యాలూ అత్యద్భుతంగా ఉంటాయి. దేవాలయాలమీది శిల్ప కళ చూపరులను మంత్ర ముగ్దులను చేస్తుంది. రెండున్నర శతాబ్దాల క్రితం కట్టిన దేవాలయాల్లో సూర్య దేవాలయం ఒకటి. దీనికి దగ్గరల్లోనే రాతి ట్యాంకుల్లోని నీటినే సందర్శకులు తాగడానికి ఉపయోగిస్తారు. జైపూర్‌ బంగారు ఆభరాణాలకు, జాతి రాళ్లకు, ఎనామిల్‌ పెయింట్‌కు పెట్టింది పేరు. ట్రిపోలియా బజార్‌ లో అలంకరణ వస్తువులు, రాజస్థానీ దుస్తులు, ఒంటె చర్మంతో తయారు చేసిన చెప్పులు, ఆకర్షించే పాలరాతి బొమ్మలు సందర్శకులను ఇట్టే ఆకట్టుకుంటాయి.
నీలి నగరం

జైపూర్‌ తర్వాత చూడాల్సిన మరో ముఖ్యమైన ప్రదేశం జోధ్‌పూర్‌లోని ఉమెద్‌ భవన్‌ ప్యాలెస్‌. ఇక్కడి ఇళ్లన్నీ నీలిరంగుతో మెరిసిపోతుంటాయి. ఈ నగరాన్ని ఒక్కసారిగా చూస్తే... ఆకాశం దుప్పటిలా కప్పేసిందా అన్నట్లుంటుంది. దీన్ని ఉమెద్‌ సింగ్‌ 19వ శతాబ్దంలో నిర్మించాడు. ఈ ప్యాలెస్‌ను కట్టడానికి 14 సంవత్సరాలు పట్టిందట. సుమారు 26 ఎకరాల విస్తీర్ణంలో 347 పడక గదులతో దీన్ని నిర్మించారు. దీని ఎత్తు 105 అడుగులు. ఏ సమయంలోనైనా సూర్యకాంతి లోపలికి ప్రసరించేందుకు వీలుగా దీనికి అద్దాలను ఏర్పాటు చేశారు. జోధ్‌పూర్‌లో కరువు పరిస్థితులు ఎదురైనప్పుడు, ప్రజలకు ఉపాధి కల్పించడానికి దీని నిర్మాణం చేపట్టారని చెపుతారు.
ప్రస్తుతం దీన్ని మూడు భాగాలుగా చేశారు. ఒక విభాగం రాజుగారి నివాసం. రెండో విభాగంలో మ్యూజియం ఏర్పాటు చేశారు. ఇందులో రాజు, రాణి ధరించిన వస్త్రాలు, ఆభరణాలు, రాజు వేసిన చిత్రాలు, రామాయణ చిత్రాలను ఇందులో చూడొచ్చు. మూడో భాగం హోటల్‌. రాజభరణాలు రద్దు కావడంతో రాజులు ఈ భవనాన్ని హోటల్‌కు లీజుకిచ్చారు. అది 1975లో జరిగింది. రాజులు, రాణులు కదలాడిన ప్రదేశంలో, కోటలో అడుగెట్టాక మనం కూడా ఎక్కడికో వెళ్లిపోయినా ఆశ్చర్యంలేదు.
ఒకక్షణం ఊహల్లోకి ... మరుక్షణం వాస్తవంలోకి వచ్చేస్తుంటాం. మన కాళ్లు మనకు తెలీకుండానే ముందుకు కదులుతుంటాయి. కళ్ల ద్వారా అక్కడి ప్రతి అణువును, వస్తువును మనసులో ముద్రించుకుంటుంటాం. రాజుల శౌర్యానికి, కళాతృష్ణకు సాక్ష్యంగా నిలిచిన కట్టడాలను, వస్తువులను మనసారా చూసి...వచ్చేస్తుంటే ఏదో తెలీని భావం మనసులో నెలకొంటుంది. తిరిగి మన లోకంలోకి వచ్చిన భావన కలుగుతుంది.
_____________________________________________________

అతి సుందర నగరం కోపెన్‌ హాగెన్‌

వందలాది ద్వీప సముదాయం మధ్య వెలసిన సుందర నగరమిది. పాలు, పన్నీరు, వెన్న, సముద్ర ఉత్పత్తులకు పేరుగాంచిన నగరమిది. ప్రముఖ ఓడరేవు పట్టణంగా గుర్తింపు పొందింది. అటు ఆధునిక ... ఇటు చారిత్రక సాంప్రదాయాల మేలు కలయికకు పెట్టింది పేరు. ప్రతి సంవత్సరం కొంగొత్త ప్రాంతాలను తప్పక వీక్షించే పర్యాటకుల పాలిట వర ప్రసాదం. అదే కోపెన్‌హాగెన్‌. మరి ఉల్లాసాన్ని... ఉత్సాహాన్ని... ఆహ్లాదాన్ని అందించే ఆ నగర విశేషాలేంటో చూద్దామా...
ప్రపంచంలోకెల్లా ఆధునిక సౌకర్యాలు ఉన్న నగరం ఏదంటే తడుముకోకుండా చెప్పేది ఒక్కటే పేరు. ఇక్కడ ఆధునికతే కాదు సంప్రదాయాలకూ కొదవలేదు. అదే కోపెన్‌ హాగెన్‌. విలాసవంతమైన రెస్టారెంట్లు, నివాస గృహాలు... అంతేకాదు ఇక్కడి ప్రజలకి కాలుష్యమంటే ఏంటో కూడా తెలీదు. ప్రశాంత వాతావరణం, చుట్టూ పచ్చిక బయళ్లు, చల్లటి పిల్లగాలికి అలా... నడుస్తూ వెళ్తుంటే ఎంత బావుంటుందో ఒక్కసారి ఊహించుకోండి. అబ్బ వెంటనే అక్కడికి వెళ్లి విహరించాలనిపిస్తుంది కదా... అలాంటి వాతావరణంలో ఉంటే అనారోగ్యాలు, బాధలు దరిచేరవేమో అనిపిస్తుంది. అంత చక్కటి... చల్లటి... వాతావరణం కోపెన్‌ హాగెన్‌ నగరం సొంతం. కోపెన్‌ హాగెన్‌ నగరం ఉత్తర యూరప్‌లోని బాల్టిక్‌ సముద్రం మధ్య ఉంది. ఇది డెన్మార్క్‌ రాజధానిగా వుంది. ఈ నగరాన్ని 11వ శతాబ్దంలో బిషప్‌ ఓప్‌లర్‌ నిర్మించారు. ఇతని స్మారక చిహ్నం ఇప్పటికీ మనం చూడొచ్చు. ఈ నగరం పాల ఉత్పత్తులకు, సముద్ర ఉత్పత్తులకు ప్రసిద్ధి.
నేషనల్‌ గ్యాలరీ

పర్యాటకులను ఆకర్షించే వాటిలో ముఖ్యంగా చెప్పుకోదగినది నేషనల్‌ గ్యాలరీ. దీన్ని బైజెంటాయిన్‌ వాస్తుశైలిలో నిర్మించారు. ప్రాచీన డానిష్‌ చరిత్రను తెలిపే చిత్రాలెన్నింటినో ఇక్కడ చిత్రించారు. ఇంకా ప్రాచీన సంస్కృతికి సంబంధించిన ఆనాటి వస్తువులు, కళాకృతులను ఇక్కడ చూడొచ్చు. 1807 వ సంవత్సరంలో ప్రారంభించిన స్టేట్‌ మ్యూజియంలో పిల్లల కోసం ఒక ప్రత్యేక విభాగం ఉంది. అందులోని మధ్యయుగం నాటి కోటలో నడయాడడం, పురాతన వైకింగ్‌ షిప్‌లో విహరించడం, 19 శతాబ్దపు చివరి కాలంలోని తరగతి గదుల్లో కూర్చుని చదువుకోవడం... వంటివి పిల్లలు ఎంతగానో ఇష్టపడతారు. ఇక్కడి వస్తువులన్నీ పిల్లల్ని ఆ రోజుల్లోకి తీసుకెళ్తాయి.
టివోలీ గార్డెన్‌

ఎంతో విశాలమైన పార్క్‌ ఇక్కడుంది. దీనికి ప్రపంచంలోనే ఆహ్లాదకరమైనదిగా గొప్ప పేరుంది. దీన్ని 18 వ శతాబ్దంలో ఏర్పాటు చేశారు. తాత్కాలిక రాజు కార్స్‌పెంషన్‌ 17 ఎకరాల భూమిని ఈ పార్కు కోసం కేటాయించాడు. దీన్ని చిన్న పిల్లలకే కాదు అన్ని వయసుల వారికీ నచ్చే విధంగా ఏర్పాటు చేశారు. మోటర్‌తో ఏర్పాటు చేసిన రైలు పిల్లలకు ప్రత్యేకాకర్షణ. రాత్రి సమయంలో రంగు రంగుల విద్యుత్‌ దీపాల మధ్య దేదీప్యమానంగా వెలుగులు విరజిమ్ముతున్నప్పుడు ఈ పార్కును చూడడానికి రెండు కళ్లూ చాలవేమో అనిపిస్తుంది. ఇక్కడుంటే ఆకలి దప్పికలు తప్ప వేరేది గుర్తుకు రాదు. అంతగా ప్రకృతిలో లీనమైపోతాం. ఇక్కడ గడిపిన ప్రతిక్షణం జీవితాంతం గుర్తుండిపోతుంది.
స్ట్రోగేట్‌ షాపింగ్‌

నగరంలోని స్ట్రోగేట్‌ బజార్‌లో పర్యాటకులు షాపింగ్‌ చేయడానికి ఆసక్తి చూపుతారు. ఇక్కడి రోడ్లన్నీ చాలా పొడవుగా వుంటాయి. ఇందులోని ఒక రోడ్డు టౌన్‌హాల్‌ నుండి మ్యూజియం వరకు ఉంటుంది. దారి పక్కనే పాదచారులకు తినడానికి రెస్టారెంట్లు కూడా వున్నాయి. ఇక్కడ లభించని వస్తువంటూ ఉండదు. గుండు సూది మొదలు అన్ని రకాల వస్తువులూ దొరుకుతాయి. దుకాణాల ముందు రకరకాల డిస్‌ప్లే బోర్డులు కనిపిస్తాయి. క్రిస్‌మస్‌ పండుగ సమయంలో దుకాణాలను ప్రత్యేకంగా అలంకరిస్తారు. రాత్రిపూట విద్యుత్‌ దీపాలను చూసిన పర్యాటకులు మైమరిచిపోతారు.
ఆకర్షించే జలకన్య
కోపెన్‌ హాగెన్‌లో ఉన్న జలకన్య విగ్రహం చూడ్డానికి చిన్నగా ఉన్నా చూపరులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఈ విగ్రహం విచార వదనంలో ఉంటుంది. దీన్ని సముద్రం ఒడ్డున ఎత్తైన రాతిమీద ఏర్పాటు చేశారు. ఈ శిల్పం చెక్కడం వెనుక ఓ కథ ఉందని స్థానికులు చెబుతారు. 1909లో కార్ల్స్‌బర్గ్‌ బియర్‌ కంపెనీ యజమాని కుమారుడు కార్ల్‌ జేకబ్సన్‌ కోరిక మేరకు జలకన్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలన్న నిర్ణయానికొచ్చారు. ఇది ప్రసిద్ధ్ధ శిల్పి ఎడ్వర్డ్‌ ఎరిక్సన్‌ ప్రతిభకు చిహ్నంగా నిలుస్తుంది. ఎరిక్సన్‌ తన భార్యనే మోడల్‌గా పెట్టి ఈ శిల్పాన్ని చెక్కాడు. అయితే 1913లో అసంపూర్తిగానే ఈ విగ్రహాన్ని ఆపేశారు. ఎన్నోసార్లు దీన్ని పునర్నిర్మాణం తలపెట్టినా ఎప్పటికో గాని అది సఫలం కాలేదు. యూరోపియన్‌ యూనియన్‌లో టర్కీ దేశస్థుల విలీన సమయంలో జరిగిన తిరుగుబాటు దాడిలో ఈ విగ్రహం దెబ్బతిన్నది. దాంతో దీనికి బురఖా తొడిగారు.
ఆర్హస్‌ ... ఓడెన్స్‌...
ఇక్కడ చూడాల్సిన మరో రెండు ముఖ్య పట్టణాలు ఆర్హస్‌, ఓడెన్స్‌. డెన్మార్క్‌లో పెద్ద పట్టణాల్లో ఆర్హస్‌ ఒకటి. ఇక్కడ లడాకూ వైకింగ్‌ జాతీయులు నివసిస్తారు. వెయ్యి సంవత్సరాల క్రితం వీరు ఈ నగరానికి మూల స్థంభాల్లా వుండేవారు. ప్రస్తుతం వీరు తమ పూర్వీకులతో పోలిస్తే చాలా ఆధునికంగా, అందంగా కనిపిస్తారు. ఎంతో గౌరవ మర్యాదలతో పర్యాటకులకు తమ సహాయ సహకారాల్ని అందిస్తారు. అంతే కాకుండా ప్రస్తుతం ఎన్నో విద్యాలయాలతో ఈ నగరం వెలుగొందుతోంది. డెన్మార్క్‌ సాంస్కృతిక జీవనంలో ఈ నగరం ప్రముఖ పాత్ర పోషిస్తోంది.
సిటీహాల్‌
1940లో నిర్మించిన సిటీ హాల్‌ ముఖ్యమైన పర్యాటక స్థలంగా ఉంది. ఈ టవర్‌ పైకి వెళ్లడానికి 450 మెట్లు ఎక్కాల్సుంటుంది. దీని పైకెక్కి చూస్తే నగరమంతా కనిపిస్తుంది. ఇక్కడి మ్యూజియం ప్రపంచంలోకెల్లా ప్రసిద్ధి పొందింది. దీనిని దర్శిస్తే అక్కడి ప్రాచీనుల జీవన శైలి, ఆచార వ్యవహారాలు అర్ధమౌతాయి. పూర్వకాలంలో మహిళల వస్త్రధారణ, వారి వంట విధానం, ఇంటిపనులు చేసే పద్ధతి, ఇంటిని శుభ్రపరచుకొనే విధానం ఆశ్చర్యపరుస్తుంది.

ఓడెన్స్‌ నగరం
జనాభా దృష్ట్యా డెన్మార్క్‌లో మూడోస్థానంలో ఓడెన్స్‌ పట్టణం ఉంది. ఈ నగరం మొత్తం హెన్స్‌ క్రిస్టియన్‌ ఆండర్సన్‌ రాజు పర్యవేక్షణలోనే నిర్మితమైంది. నగరంలో ప్రతిచోటా అతని చిత్రాలు కనిపిస్తాయి. ఇతని జీవిత కాలం మొత్తం ఈ నగరంలోనే గడిచిందనడానికి చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ఈయన జీవితం మొత్తం దారిద్య్రంలోనే గడిచింది. అది ఎలా ఉందంటే పేరుకు రాజు కానీ జీవితాంతం పూరి గుడిసెలోనే గడిపాడు. ఇప్పుడు ఆ ఇంటినే 'ఆండర్సన్‌ మ్యూజియం'గా మార్చారు. ఈయన చరిత్రను పిల్లలు ఇష్టంగా చదువుతారు. కొద్ది సంవత్సరాల క్రితమే మొదటి హెన్స్‌ క్రిస్టియన్‌ ఆండర్సన్‌ ద్విశతాబ్ది పుట్టినరోజు ఉత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన అభిమానులు కొందరు 'అంత గొప్ప వ్యక్తి పేరును వ్యాపారం కోసం వాడుకుంటున్నారు' అని తమ నిరసనను తెలియజేశారు.
ఆండర్సన్‌ మ్యూజియం

మంక్‌మోస్ట్రెడ్‌ రహదారిలో ఉన్న చిన్న గుడిసెలో హెన్స్‌ జన్మించాడు. అతని బాల్యమంతా ఆ ఇంట్లోనే గడిచింది. ప్రస్తుతం ఆ ఇంటిని ఆండర్సన్‌ మ్యూజియంగా మార్చేశారు. ఆయన తన ఆత్మకథలో రాసుకున్న వివరాల ప్రకారం వస్తుసముదాయాన్ని సేకరించి ఇక్కడ భద్రపరిచారు. ఆండర్సన్‌ పేపర్‌ కటింగ్‌ కళలో నిపుణుడని చాలా కొద్దిమందికే తెలుసు.
ఎప్పుడైతే బావుంటుంది?
డెన్మార్క్‌లో జూన్‌, జులై మాసాల్లో కనిష్ట ఉష్టోగ్రత 10-11 డిగ్రీల సెల్సియస్‌, గరిష్ట ఉష్ణోగ్రత 18-21 డిగ్రీల సెల్సియస్‌ వుంటుంది. మిగిలిన నెలల్లో ఇక్కడి వాతావరణం చాలా చల్లగా వుంటుంది. అప్పుడు హాయిగా...కోపెన్‌హాగెన్‌ చెక్కేయొచ్చన్నమాట.
____________________________________________________

చరిత్ర నిధి...ప్రకృతి సిరి...రాచకొండ

మూడు బైకులపై ముందుకు సాగిపోతున్న మేము నీరు నిండుగా పారుతున్న పిల్లకాలువ రావడంతో ఆగిపోయాం. చుట్టూ చూశాం. మూడు వైపులా ఆకుపచ్చ సంపదతో అలరారుతోన్న ఎత్తయిన కొండలు. నట్ట నడుమ.. వరిచేను, జొన్న చేను... వీటి మధ్యలో పశువుల మందలు.. ప్రకృతిని ఆస్వాదిస్తూ కొద్దిసేపటి వరకూ అలా ఉండిపోయాం.
'ఇక్కణ్ణుంచీ రాచకొండ కోట ప్రాంతం మొదలవుతుంది' అంటూనే బైకుతో కాలువను దాటుతూ దోవతీశాడు శ్రీనివాస్‌. మేమూ అనుసరించాం.
మూడు బైకులపై మొత్తం ఆరుగురమున్నాం. శ్రీకాంత్‌, అమర్‌ నేను ప్రజాశక్తిలో పని చేస్తున్నాం. నాలుగో సభ్యుడు అడ్వెంచర్‌ యాక్టివిటీ చేసే స్పోర్ట్స్‌పర్సన్‌ విజేశ్‌. అయిదో వ్యక్తి ప్రజాశక్తి మంచాల విలేకరి జోగు శ్రీనివాస్‌. ఆరో వ్యక్తి అదే ఊరికి చెందిన ఫ్రీలాన్స్‌ ఫొటోగ్రాఫర్‌ శ్రీనివాస్‌. ఇద్దరు శ్రీనివాస్‌లు ఉండడంతో ఇతన్ని మేం ఫొటో శ్రీను అని పిలిచాం.
ఔటింగ్‌ చేయడానికి ఏదైనా గుర్తుండిపోయే చోటు కోసం వెతుకుతున్న మాకు జోగు శ్రీనివాస్‌ ద్వారా రాచకొండ చారిత్రక ప్రాధాన్యత, అడ్వెంచర్‌ యాక్టివిటీకి గల అవకాశం గురించి తెలిసింది. మాకు కావలసింది ఇదే అనుకుని 'ఛలో రాచకొండ' అనుకున్నాం.
హైదరాబాద్‌ నుంచి విజయవాడ రహదారి నుంచయినా, శ్రీశైలం రహదారి నుండైనా దాదాపు 40 కిలో మీటర్ల దూరంలో ఉన్న ఇక్కడికి రావడానికి బస్సులున్నాయి. అయినా థ్రిల్లింగ్‌గా ఉంటుందని బైకులపై వచ్చిన మా నలుగురితో మంచాల వద్ద జత కలిశారు జోగు శ్రీనివాస్‌, ఫొటోగ్రాఫర్‌ శ్రీనివాస్‌...
కాలువదాటి ముందుకెళ్లిన శ్రీనివాస్‌ను అనుసరించాం. కాలిబాట కూడా సరిగ్గాలేని దారి వెంట బైకులను స్లోగా నడిపిస్తూ ఓ గుట్ట మొదలుకు చేరుకున్నాం. బండ్లు అక్కడ పెట్టి లాక్‌ చేశాం. 'మనం ముందే చెప్పుకున్నట్లు మూడు గుట్టలతో కూడి ఉంటుంది రాచకొండ కోట. ఇది కచేరి కొండ. ఆ పక్కది నాగానాయుడి కొండ. ఇటు పక్కది రాచకొండ...' అని వాటివైపు చూపుతూ 'మూడూ ఒకదానితో ఒకటి కలిసి ఉన్నట్లే కనిపిస్తాయి. కానీ ఒక దాన్నుంచి మరోదానికి వెళ్లాలంటే పూర్తిగా కిందికి దిగి మరో గుట్టపైకి ఎక్కాల్సిందే తప్ప మరో దారి లేదు. ఈమూడిటినీ కలుపుతూ కోటగోడను వ్యూహాత్మకంగా రెండు వరుసల్లో నిర్మించడం దీని ప్రత్యేకత. ముందుగా రాచకొండను చూద్దాం. అప్పటికీ ఓపికుంటే వాటినీ చూద్దాం' అని చెబుతూ కొండపైకి అడుగులు వేసిన శ్రీనివాస్‌ను అనుసరించాం.
కొండపైకి వెళ్లేదారంతా చెట్లు నగరజీవితానికి అలవాటు పడ్డ మాకు నడవడం కష్టంగా ఉంది. అందరిలో నేనొక్కడినే నడి వయస్కుడిని. మిగతావారంతా కుర్రాళ్లే. 'బాబూ మీ అంత ఫాస్ట్‌గా నేను నడవలేను. మీరు స్లోగా నడవాలి' అన్న నా మాటలతో అందరూ ఆగి నన్ను ముందుకు పోనిచ్చి, నా వెనుకగా నడవడం ప్రారంభించారు. కొంచెం పైకి వెళ్లగానే ఏటవాలు కొండ, గుబురు పొదలు ఎదురయ్యాయి. దారి కనిపించలేదు. 'అయ్యో దారే లేదు...గా ఎలా?' అని ప్రశ్నించిన నాకు జవాబుగా వాటిమధ్య నుంచే వెళ్లాలి' అని చెప్పాడు శ్రీనివాస్‌. ఆ మాటలతో చెట్లపై పాములు అవీ ఉండొచ్చన్న ఆలోచన వచ్చి భయమేసి ఆగిపోయాను. నా పరిస్థితి గ్రహించిన విజేశ్‌ 'ఏం కాదు సార్‌...రండి..' అంటూనే పక్కనున్న చెట్టు కొమ్మ విరిచి, దానితో చెట్లకొమ్మలు జరుపుతూ ముందుకు సాగాడు.
'ఇక్కడ కాలుపెట్టండి... ఈ కొమ్మను పట్టుకోండి... జాగ్రత్త...'అంటూ చెబుతున్న వారి సూచనల మధ్య మూడునాలుగు నిమిషాల్లోనే ఆ ప్రాంతం దాటి పైకి వెళ్లాం. 'ఇలా ఉంటుందని తెలిస్తే కర్రో, కత్తో తెచ్చేవారం కదా!...' చెప్పలేదేం అన్నట్లు శ్రీనివాస్‌ వైపు చూశాను. 'చారిత్రక కొండ అంటే మీకు అర్థం కాలేదా? సార్‌...'అని నవ్వాడతను. మాట్లాడుకుంటూ నడుస్తూనే ఒక ద్వారం వంటి దాని వద్దకు చేరుకున్నాం. 'ఇది చూడ్డానికి ద్వారంలా ఉంది కానీ కాదు. శత్రువు ఇదే ద్వారమని భ్రమించేలా దీనిని కట్టారు' చెప్పాడు శ్రీనివాస్‌.
నిజమే.. గోడమధ్య గ్యాపు, పైన బండరాళ్లతో దర్వాజాలాగే కనిపిస్తున్న దాన్ని చూస్తూ లోపలకు వెళ్లాం. అదంతా బల్లపరుపు నేల. ముందుకు నడుస్తూ 'శ్రీనివాస్‌ ఈ కొండపైన జంతువులు, క్రూరమృగాలు ఏమైనా ఉంటాయా?'అని అడిగాను. 'క్రూరమృగాలేం లేవు కానీ కోతులు, కొండముచ్చులు, నక్కలుంటాయి. నెమళ్లు కూడా కనిపించాయి' అన్నాడు. 'ఏ నక్కో, కోతో ఎదురైతే మన పని అయిపోయినట్లే. ఎదుర్కోవడానికి మన దగ్గరేమీ ఆయుధాల్లేవు.. పారిపోవడం కూడా అంత ఈజీ కాదు... ఏం చేద్దాం?'అన్నాను.
విజేశ్‌ తన వీపునుంచి బ్యాగును తీసి అందులోని ఓ రోప్‌, వాటర్‌ బాటిల్‌, చిన్న సుత్తి వంటివి చూపుతూ 'ఇవి ఉన్నాయి కదా! మీరేం వర్రీ అవకండి...' అంటూ నాకు ధైర్యం కలిగించే ప్రయత్నం చేశాడు. 'కోతులేంజేస్తాయి సార్‌...మనని చూసి అవే జడుసుకుంటారు...'అంటూనే పక్కనున్న చెట్టుకొమ్మని విరిచాడు అమర్‌. 'నెమళ్లు మనం చప్పుడు చేస్తే పోతాయి...' అన్నాడు ఫొటో శ్రీను. ఆ మాటలతో 'అమర్‌, శ్రీకాంత్‌...! ఏదైనా జంతువెదురైతే రాయి విసిరో, కర్రతోనో బెదిరించకండి...ఇద్దరు శ్రీనివాస్‌లు చెప్పినట్లు చేయండి' అన్న నామాటలు వింటూనే 'ఏదైనా జంతువొస్తే మేమంతా వచ్చి మీ వెనకాలే నిలబడతాం. మీరే వాటిని పారదోలండి...'అంటూ అమర్‌ వేసిన సెటైర్‌తో అందరమూ నవ్వేశాం. నాలుగైదడుగులు వేయగానే సింహద్వారం ఎదురైంది.
దాని ముందు ఆగి వెనుకకు తిరిగిన శ్రీనివాస్‌ మమ్మల్ని చూస్తూ 'రాచకొండ దుర్గానికి ఇలాంటివే మొత్తం ఆరు సింహద్వారాలున్నాయి...' వాటి గురించి చెబుతోన్న అతని మాటలు వింటూనే ఆ ద్వారం నిర్మాణంలో వాడిన రాళ్లపై చెక్కిన నగిషీలు పరిశీలించాం. ద్వారం ముందు వైపు నుంచి వెనుక తలుపుల వరకూ దాదాపు ఆరడుగుల స్థలముంది. రెండు వైపులా అరుగులున్నాయి. మధ్యలో గుంతలు కనిపించాయి.
'నిధుల కోసం స్థానికులు తవ్విన గుంతలు' చెప్పాడు శ్రీనివాస్‌. ఆ మాటలు విన్న శ్రీకాంత్‌ నవ్వుతూ 'మనం కూడా తవ్వుదామా...!'అన్నాడు. 'నువ్వు తవ్వుతూ ఉండు, మేం పైకెళ్లొస్తాం. నిధులు దొరికితే మాకూ వాటా ఇవ్వండి' అన్న నామాటలతో నవ్వారంతా. 'ఇక్కడ సినిమా షూటింగ్‌ జరిగింది....'అని చెబుతూ దర్వాజ అవతలి వైపు అడుగులు వేసిన శ్రీనివాస్‌ను అనుసరించాం. సినిమా పేరు వినగానే శ్రీకాంత్‌ 'ఏసినిమా'అనడిగాడు. 'విరోధి. దాన్లో నక్సలైటును ఎన్‌కౌంటర్‌ చేసింది ఇక్కడే' అని దర్వాజా పైన చూపాడు. శ్రీకాంత్‌, అమర్‌ పైకెక్కి చూశారు. అక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్లాం. దారి సన్నగా ఏటవాలుగా ఉంది. బండలు, రాళ్ల పైన అడుగులు వేస్తూ 'బండలు నున్నగా ఉంటాయి...కాళ్లు జారతాయి' జాగ్రత్తలు చెప్పాడు శ్రీనివాస్‌. నెమ్మదిగా పైకెక్కాం. అక్కడో రాతి షెడ్డులాంటిది కనిపించింది. 'ఇది సభామంటపం సార్‌. ఇక్కడే కూర్చుని రాజోద్యోగులు, అధికారులు ప్రజలతో మాట్లాడేవారు. సమావేశాలు జరిపేవాడట. అందుకే ఈ గుట్టకు కచ్చేరి కొండ అనే పేరు వచ్చింది. దీని మధ్య నుంచి అండర్‌గ్రౌండ్‌, దాని నుంచి పక్కనున్న కొండలకూ, బయటకూ దారి ఉండేదంటారు...'అని చెప్పాడు.
అండర్‌గ్రౌండ్‌ ఉందీ అనడానికి ఆధారంగా మధ్యన పూడుకుపోయిన గుంత కనిపించింది. 'ఇక్కడ నుంచి మధ్యలో ఉన్న రాచకొండ, దానికవతలి వైపు నాగానాయుని కొండ కనిపిస్తుంది. దానిపైన రామాలయం, శివాలయాలుంటాయి. శివుని మందిరాలు ఎక్కువగా ఉన్నందునే దానికి ఆ పేరొచ్చింది' అన్నాడు శ్రీనివాస్‌. దానిపై కోటగోడ, అక్కడక్కడా ఇళ్ల వంటి శిథిలమైన నిర్మాణాలు కనిపించాయి. అటువేపు పది, పదిహేనడుగులు వేయగానే కొండఅంచు.. లోతైన అగాథం కనిపించింది. అది చూస్తూనే 'ఈ కచేరి కొండ ఎత్తు 600 అడుగులుంటుందట. అంటే మనం అంత ఎత్తులో ఉన్నాం. ఇక్కడనుంచీ కాలుగానీ జారిందంటే అంతే సంగతులు' అన్న శ్రీనివాస్‌ మాటలతో కొద్దిగా వెనక్కి జరిగాం. కుడివైపు దారి తీశాడు శ్రీనివాస్‌. ఓచోట రాతి మధ్యలోనే ఓ రెండు ఫీట్ల లోతున్న నీటిచెలమ కనిపించింది. 'ఇది ఏ కాలంలోనూ ఎండిపోదు...'అని చెబుతూ 'ఆరోజుల్లో దీన్నుంచే కాలువ ద్వారా నీరు సప్లై అయ్యేదట...' అని బండను తొలిచి చేసిన కాలువను చూపాడు.
దాన్ని చూశాక మా చర్చ రాజులు, కోటలు, ఆనాటి జీవితం, సామాజిక పరిస్థితులపైకి మళ్లింది.
'ఓరుగల్లు సామ్రాజ్యాన్నేలిన ప్రతాపరుద్రుడు, తన రాజ్య రక్షణ కోసం 77 దుర్గాలను నిర్మించాడు. రాచకొండ దుర్గాధిపతియైన రేచర్ల సింగమనాయకుడు ఆయనకు కుడిభుజంగా వ్యవహరించేవాడు. అయితే కాపానీడు చక్రవర్తి అయ్యాక తలెత్తిన విభేదాల కారణంగా సింగమనాయకుడు స్వతంత్ర రాజుగా ప్రకటించుకున్నాడు. దానితో అద్దంకి వేమారెడ్డి నాయకత్వంలో సైన్యాన్ని పంపాడు. వారితో జల్లపల్లి వద్ద తలపడ్డ సింగమనాయకుడు చనిపోగా, ఆయన కొడుకులు అనపోతా నాయకుడు, మాదానాయకుడు వేమారెడ్డిని వధించి విజయం సాధించారు. క్రీ.శ.1365 నుంచీ 1474 వరకూ ఈ రాచకొండ రాజధానిగా వీరు పాలన కొనసాగించారు.
ఈ రేచర్ల పద్మనాయకులు శత్రు దుర్భేద్యమైన కోటల నిర్మాణానికే కాకుండా శాస్త్ర సాహిత్యానికి, కళలకు కూడా చేయూతనిచ్చారని చెబుతారు. కవి, పండితుడైన సింగభూపాలుని కాలంలో ప్రతీయేటా పండితులు, సాహితీ కళాకారులతో సభలూ, సమావేశాలు, గోష్టులు, కళాప్రదర్శనలతో కూడిన వసంతోత్సవాలు జరిగేవి' అని తను తెలుసుకున్న రాచకొండ చరిత్ర సినిమా చూపించాడు ఫొటోశ్రీను.
చెప్పడం ఆపి టైమ్‌ చూసుకుని 'అబ్బో నాలుగున్నరైంది. ఇక మనం దిగాలి. వెలుగు పోయిందంటే జంతువులు అలర్ట్‌ అవుతాయి.. దారి కూడా దొరకదు. పైగా దిగే దారిలోనూ చూడాల్సినవి ఉన్నాయి' అన్న ఫొటోశ్రీను హెచ్చరికతో లేచాం. 'ఇటునుంచి వెళదాం' అంటూ గుట్ట రెండో వైపు నుంచి దారి తీశాడు శ్రీనివాస్‌. గుట్టలు, చెట్లు, వృక్షాలతో పచ్చదనం నింపుకున్న విశాలమైన మైదానంలో పంటపొలాల మధ్యన మసీదు, దాని పక్కునున్న సన్నటి బాటవెంట ఎడ్లబండ్లు, సైకిళ్లు వెళుతున్న దృశ్యం కనువిందు చేసింది.
'దాదాపు 6,000 ఎకరాల విస్తీర్ణంలో దట్టమైన అటవీ ప్రాంతమైనందునే ఇక్కడ నక్సలైట్లుండేవారు. ఈ రాచకొండ దళాన్ని తరిమేయడానికే ఇక్కడ ఫీల్డ్‌ ఫైరింగ్‌ రేంజ్‌ ఏర్పాటు చేస్తామన్నారు. 1992లో సర్వే చేశారు. అయితే వామపక్షాలు ముఖ్యంగా సిపిఎం నాయకత్వంలో ప్రజలు దానికి వ్యతిరేకంగా ఉద్యమించడంతో అది వాయిదాపడింది. అదే కాలంలో రెండు, మూడు ఎన్‌కౌంటర్లు జరిగాయి. అటు తరువాత మావోయిస్టులు లేకుండా పోయారు' చెబుతున్న ఫొటో శ్రీనివాస్‌ మాటలు వింటూ చెట్లకున్న పండ్లు తెంపుతూ కొండ దిగువకి నడిచాం. అక్కడ చుట్టూ పెద్ద బండల మధ్యన లోతుగా ఉన్న బావి కనిపించింది. సహజంగా ఏర్పడిందే అయినా కళాకారుడు తీర్చిదిద్దినట్లు ఉందాబావి. ఓ పక్కనున్న రాళ్ల మెట్ల ఆసరాతో లోపలకు దిగాం. పూల గుత్తులు వేలాడుతున్న చెట్ల మధ్య కూచున్నాక వెంటనే లేవాలనిపించలేదు. ఆ అనుభూతిని మనస్సులో, దృశ్యాలను కెమెరాలో బంధించాం. అక్కడ నుంచి ఓ పది నిమిషాల నడక అనంతరం సింహద్వారం దాటి బైకులు నిలిపిన చోటికి వచ్చేటప్పటికి ఆరైంది. ఇద్దరు శ్రీనివాస్‌లకు వీడ్కోలు చెప్పి హైదరాబాద్‌ వైపు బైకులను దూకించాం.
- ఎన్‌. మదనయ్య
_________________________________________________

తలకోన తలపులు

  • చుట్టూ ఎత్తైన కొండలు... దట్టమైన అరణ్యప్రాంతం... మధ్యలో ఓ జలపాతం ఉంటే ఎంత బాగుంటుందో కదా. అంత అందమైన ప్రకృతి ఎక్కడుందా అనుకుంటున్నారా? మరెక్కడో కాదు... చిత్తూరు జిల్లాలో. ప్రముఖ పుణ్యక్షేత్రంగా వెలుగొందుతున్న తిరుపతికి 45 కిలోమీటర్ల దూరంలోనే ఈ రమణీయ ప్రదేశం ఉంది. అదే తలకోన జలపాతం. ఈ ప్రాంతం నిత్యం పర్యాటకులతో కళకళలాడుతుంటుంది.
నల్లమల పర్వతశ్రేణుల్లో ఈ జలపాతం ఉండడం విశేషం. చుట్టూ దట్టమైన అడవి, ఎత్తైన కొండలు... మధ్యలో జలపాతాన్ని చూసిన పర్యాటకులకు చిత్రమైన అనుభూతి కల్గుతుంది. దాదాపు అరవై మీటర్ల ఎత్తునుంచి జాలువారే జలపాతం కింద నిలబడితే శరీరమంతా చిత్రమైన జలదరింపుకు లోనవుతుంది. ఇక అక్కడినుండి కదలాలని ఎవరికైనా అనిపిస్తుందా చెప్పండి? తలకోన జలపాతం ఉన్న ప్రాంతంలోనే ఓ శివాలయం ఉంది. ఇక్కడి శివుడు సిద్ధేశ్వరుని రూపాన కొలువై ఉన్నాడు. శివుడితో పాటు అమ్మవారు, విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్యస్వామి ఆలయాలు కూడా వున్నాయి. పర్యాటకులు తీసుకెళ్లే వాహనాలను ఈ దేవాలయ ప్రాంతం వరకు మాత్రమే అనుమతిస్తారు. అక్కడ్నుండి జలపాతం దగ్గరికి చేరుకోవాలంటే పాదయాత్ర చేయాల్సిందే. కొండ అంచుల్లో దట్టమైన అడవిగుండా దాదాపు రెండు కిలోమీటర్లు ముందుకు వెళ్తే అక్కడ జాలువారే జలపాతాన్ని చూడొచ్చు. రెండు కొండల మధ్య జాలువారే జలపాత దృశ్యం అద్భుతంగా ఉంటుంది. జలపాతానికి కొంత ఎత్తువరకు ఆక్రమించిన బండరాళ్లపై నిలబడితే జలపాతం కింద తడవడానికి వీలవుతుంది. అలాగే జలపాతం కింద పడడం వల్ల ఆ ప్రాంతంలో ఓ పెద్ద గుంటలా ఏర్పడింది. అక్కడ పర్యాటకులు హాయిగా ఈత కొడుతుంటారు.
తలకోనలో వసతి సౌకర్యాలు
జలపాతానికి దగ్గర్లోని ఆలయ ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్‌ పర్యాటకశాఖ నిర్మించిన ఓ అతిథి గృహం ఉంది. ఇది తప్ప చెప్పుకోదగ్గ సౌకర్యాలు లేవు. ఆలయానికి ముందు భాగంలో పూజాసామగ్రి విక్రయించే చిన్న దుకాణాలు రెండో మూడో ఉంటాయి. అలాగే ఆలయానికి పక్కగా ఓ చిన్న హోటల్‌ అందుబాటులో ఉంటుంది. తలకోనకు వెళ్లే పర్యాటకులు తినే పదార్థాలను వెంట తీసుకెళ్లాలి. ఏమీ తీసుకెళ్లనివారు ఆలయం దగ్గరున్న హోటల్లో ముందుగా చెపితే భోజనం ఏర్పాటు చేస్తారు. తలకోనలోని జలపాతాన్ని సందర్శించే పర్యాటకులు సాయంత్రం వరకు జలపాతం వద్ద గడిపి పొద్దుపోయే సమయానికి గుడిదగ్గరికి చేరుకుంటారు. ఏ కొద్దిమందో తప్ప అందరూ సాయంత్రానికి దగ్గర్లోని గ్రామాలకో లేదా సొంత ప్రదేశానికో తిరుగు ప్రయాణమౌతారు. మరో ప్రత్యేకత ఏమంటే ఇక్కడ సినిమా షూటింగులు నిరంతరం జరుగుతూనే వుంటాయి.
రవాణా సౌకర్యం
తిరుపతి నుండి యెర్రావారి పాలెం చేరుకుని అక్కడ్నుండి పైవేటు వాహనాల ద్వారా తలకోన ఆలయం వద్దకు చేరుకోవచ్చు. యెర్రావారిపాలెం వరకు ఎప్పుడూ బస్సు సౌకర్యం ఉంటుంది. అక్కడినుండి తలకోనకు చేరడానికి వ్యాన్‌, ఆటోలు సిద్ధంగా ఉంటాయి.
________________________________________________

ఆకట్టుకునే కుట్రాల జలపాతం

  • ప్రకృతి సిద్ధంగా ఏర్పడి పైనుండి జాలువారే జలపాతంలో తడుస్తూ స్నానం చేయడమంటే ఇష్టపడని వారుండరు. ఆ నీటి ధారల్లో తడవడంలో ఉన్న ఆనందం మరెందులోనూ ఉండదేమో! ఇంతటి సంతోషాన్ని సొంతం చేసుకోవాలంటే కుట్రాలం వెళ్లాల్సిందే.
కుట్రాల జలపాతం తమిళనాడులోని తిరునల్వేలికి 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ప్రాంతం ఏడాది పొడవునా పర్యాటకులతో సందడిగా ఉంటుంది. వారాంతాల్లో, సెలవురోజుల్లో సందర్శకుల తాకిడి మరీ ఎక్కువగా ఉంటుంది.
జలపాతాల నెలవు కుట్రాలం
చిత్తరువి అనే నది పశ్చిమ కనుమల్లోని తిరుకూడమ్‌ ప్రాంతంలో పుట్టి, కొండ కోనల్లో ప్రవహిస్తూ శిలలప్పెరి అనే ప్రధాన నదిలో కలుస్తుంది. దానికి ముందు కుట్రాలంలోని వివిధ ప్రదేశాల్లో ఏడు జలపాతాలుగా విడిపోతుంది. అత్యంత అద్భుతంగా కనిపించే ఈ ఏడు జలపాతాల్లో కొన్ని అత్యంత ప్రమాదకర ప్రదేశాల్లో ఉన్నాయి. అందుకే అక్కడ పర్యాటకులను స్నానానికి అనుమతించరు. మిగతా చోట్ల సందర్శకులకు పూర్తి స్వేచ్ఛ ఉంది. వాటిలో తనివితీరా జలకాలాడొచ్చు. ఈ ఏడు జలపాతాల్లో ప్రధానమైంది కుర్తాల నాదన్‌ ఆలయానికి సమీపంలో ఉంది. దాదాపు 60 మీటర్ల ఎత్తు నుండి జాలువారే ఈ జలపాతాన్ని పర్యాటకులు చూడడానికి మాత్రమే అనుమతి ఉంది. సిత్తరవి అనే మరో జలపాతం స్నానం చేయడానికి అనువుగా ఉంటుంది. పెద్దగా ఉండే ఇంకో జలపాతం ఐదు పాయలుగా కిందికి పడుతుంది. అందుకే దీనిని ఐదు జలపాతాలు అని పిలుస్తారు. ఇక్కడ కూడా పర్యాటకులు స్నానం చేయడానికి అనుమతి ఉంది.
మరో జలపాతం పేరు టైగర్‌ ఫాల్స్‌. ఇక్కడి నీళ్ల శబ్దం పులి గాండ్రింపులా ఉంటుంది. అందుకే ఈ జలపాతానికి ఆ పేరు వచ్చింది. ఇక్కడ కూడా పర్యాటకులు స్నానం చేయవచ్చు. ఇవే కాకుండా ఇంకొన్ని చిన్న జలపాతాలకూ ఉన్నాయి. ఇవి కూడా పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తాయి.
కుట్రాలం విశేషాలు ఇక్కడ జలపాతాలే కాకుండా చూడాల్సినవి చాలా ఉన్నాయి. వాటిలో కుట్రాల నాదర్‌ స్వామి ఆలయం ఒకటి. దీన్ని తమిళ రాజ్యాధిపతులైన చోళ, పండ్య రాజులు అభివృద్ధి చేసినట్టు ఇక్కడి శిలాశాసనాలు చెబుతున్నాయి. నటరాజ రూపంలో ఉన్న పరమేశ్వరుడు కుర్తాల నాదర్‌గా వెలిశాడని చెబుతారు. ఇక్కడి శివలింగాన్ని అగస్త్య మహర్షి స్వయంగా ప్రతిష్టించాడని కథనం. ఈ ఆలయంలో శివుడు లింగాకారంలో వున్నప్పటికీ ప్రధాన పూజలు మాత్రం నటరాజ స్వరూపానికే జరుగుతాయి. అత్యంత రమణీయంగా నిర్మించబడ్డ ఈ ఆలయంలోని శిల్ప సంపద చూపరులను కట్టిపడేస్తుంది. పరమేశ్వరుడితో పాటు కొలువైన అమ్మవారిని వేణువాగ్వాదినీ దేవి అని పిలుస్తారు.
ఈమెతో పాటు పరాశక్తి కూడా కొలువై ఉంది. ఇక్కడ కొలువైన పరాశక్తి అమ్మవారి పీఠం 51 ధరణీ పీఠాల్లో ఒకటిగా విలసిల్లుతోంది.
రవాణా సౌకర్యాలు
చెన్నై నుండి కుట్రాలకు రైలు, బస్సు సౌకర్యాలున్నాయి. కుట్రాలం ప్రాంతానికి సమీపంలోని రైల్వే స్టేషన్‌ పేరు తెన్‌కాశి. ఇక్కడ్నుండి కుట్రాలం ప్రాంతానికి బస్సులు, ఆటోల సౌకర్యం ఉంది. తెన్‌కాశి, కుట్రాలం ప్రాంతాల్లోనూ పర్యాటకులకు అన్ని సదుపాయాలు అందుబాటు ధరల్లోనే లభించడం విశేషం.
_______________________________________________

అందాల అద్భుతం నాగార్జున కొండ

నాగార్జున సాగర్‌ రిజర్వాయర్‌ మధ్యలో ఓ చిన్నపాటి ద్వీపకల్పం నాగార్జున కొండ. దీనిమీద ఓ మ్యూజియం కూడా ఉంది. ఇందులో బుద్ధుడికి సంబంధించి అనేక వస్తువులున్నాయి. ఇక్కడి శిల్పకళ శాతవాహనులు, ఇక్ష్వాకుల రాజవైభవానికి నిదర్శనంగా నిలుస్తుంది. మూడు, నాలుగు శతాబ్దాలకు సంబంధించిన శిల్పకళలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటాయి. ఇక్కడున్న బుద్ధుని నిలువెత్తు విగ్రహం చాలా అందంగా ఉంటుంది. స్థానకా అనే ఆకృతిలో కూర్చుని, ఆసనాలు వేస్తున్నట్లుండే బుద్ధవిగ్రహం పర్యాటకులను ఆకర్షిస్తుంది. బుద్ధుని కుడిచేయి అభయమిస్తున్నట్టు, ఏదో బోధిస్తున్నట్టు ఉంటుంది. ఈ ప్రాంతానికి వెళ్లే మార్గాల గురించి వివరాలు కలిగిన పుస్తకాలు ఈ మ్యూజియంలోని గ్యాలరీలో ఉంటాయి. నాగార్జున సాగర్‌ నుంచి మోటార్‌బోట్ల ద్వారా ఈ ప్రాంతానికి చేరుకోవచ్చు. సాగర్‌కు ఎనభై కిలోమీటర్ల దూరంలోనే ఎత్తిపోతల జలపాతం ఉంది. కొండకోనల్లో నుండి ప్రవహించే చంద్రవంక జలపాతం 22 కిలోమీటర్ల ఎత్తు నుండి కిందకి పడి కృష్ణానదిలో కలుస్తుంది. సూర్యాస్తమయం తర్వాత కూడా ఈ జలపాతం వింతకాంతిలో వెలిగిపోతుంది. ఈ ప్రాంతానికి సమీపంలోనే అటవీ ప్రాంత విభాగం వారు నిర్వహించే మొసళ్ల కేంద్రం ఉంది. అన్నిటికన్నా నాగార్జున కొండపై నుండి చూస్తే కనిపించే మనోహర దృశ్యాలు ఆహ్లాదంగా ఉంటాయి..
_____________________________________________

No comments: