పరీక్షలవేళ ... గట్టెక్కేదెలా?
'చూస్తుండగానే విద్యార్థులకు పరీక్షల సమయం సమీపిస్తోంది. మహా అంటే ఇంకెన్ని రోజులో లేవు. కేవలం నెలరోజులు మాత్రమే... ఆ తర్వాత ఇక పరీక్షలే. ఏం చదివినా ఈ లోపే చదవాలి. ఎంత చదివినా ఈ సమయాన్నే సద్వినియోగం చేసుకోవాలి' మార్చిలో పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు ఉన్నందున విద్యార్థుల్లో మొదలవుతున్న అలజడి యిది. బ్రిలియంట్ స్టూడెంట్స్‌కైనా, యావరేజ్ స్టూడెంట్స్‌కైనా ఇది 'పరీక్షా'కాలమే మరి. అందులో నెగ్గాలంటే... ఉన్న తక్కువ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే అనవసర ఆందోళనను, ఒత్తిడిని దూరం చేసుకోవాలి.
పరీక్షలు దగ్గర పడుతున్నాయి. ఫలితంగా విద్యార్థుల్లో టెన్షన్ మొదలవుతోంది. ఇన్నాళ్లు చదువుతోపాటు ఆటాపాటలకు సై అన్న విద్యార్థులు ప్రస్తుతం కేవలంస్టడీ అవర్స్‌మీదే దృష్టి సారిస్తున్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కూడా ఎలా చదవాలో తమ పిల్లలకు సూచనలిస్తున్నారు. కొందరైతే కచ్చితంగా 90 శాతం తెచ్చుకోవాలని హెచ్చరిస్తున్నారు. దీనివల్ల విద్యార్థులు మరింత ఆందోళనకు గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎగ్జామ్స్ అనగానే ఏదో యుద్ధానికి బయల్దేరుతున్నంత హడావిడితో అనవసర ఆందోళన చెందడంవల్ల ఫలితం ఉండదు. పైగా అది అపసవ్య ఆలోచనలకు దారి తీస్తుంది. కాబట్టి చదువుకునేందుకు అనువైన పరిస్థితుల్ని కల్పించాల్సిన బాధ్యత తల్లిదండ్రుల పైనా ఉంది.
పరీక్షల తేదీ దగ్గరపడుతోందనో, పరీక్షలు ఎలా జరుగుతాయోననో అనవసర ఆందోళన చెంద కూడదు. ఎందుకంటే ఇన్నాళ్లుగా మీరు చదివిన సబ్జెక్టుల్లోంచే ప్రశ్నలు వస్తాయి. అప్పటికే అవన్నీ రివిజన్ చేసిన వాళ్లు అస్సలు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. రిలాక్స్‌డ్‌గా ఉంటూ మరోసారి పునశ్చరణ చేసుకుంటే చాలు. 'నేను బాగానే చదివానుగానీ పరీక్ష హాల్లోకి పోయే సరికి ఇవి గుర్తుంటాయో లేదో' అన్న అనుమానం చాలా మంది విద్యార్థులను వెంటాడుతుంది.
ఇలాంటి ఆలోచన అస్సలు రానీయ కూడదు. బాగా చదివేవాళ్లు కూడా ఇలాంటి అపసవ్య ఆలోచన్లకు ప్రభావితమైతే ఫలితాలు కూడా వ్యతిరేకంగానే ఉంటాయి. ఎప్పుడూ ఆత్మ విశ్వాసంతో ఉండాలి. ఒక్కసారి నేర్చుకున్నది ఇంకెప్పుడూ మర్చిపోలేమన్న ధీమా కలిగి ఉండాలి. సహజంగానే ఇలాంటి ఆలోచన్లు ఉన్నవారు, ఎలాంటి టెన్షనూ పడనివారు యావరేజ్ స్టూడెంట్స్ అయినా ఎంచక్కా పరీక్షలు రాసి గట్టెక్కుతుంటారు. కొన్నిసార్లు బాగా చదివే స్టూడెంట్స్ కూడా తక్కువ మార్కులతో పాసవడమో, ఫెయిలవడమో చూస్తుంటాం. దీనికి కారణం పరీక్షలపట్ల వాళ్లకున్న ఆందోళనా, అపసవ్య ఆలోచనా, భయమూను. కాబట్టి ఇన్నాళ్లు చదివిందానికి ఫలితం దక్కాలంటే ఫరీక్షల్లో ప్రతిభ కనబర్చాలి. అందుకోసం విద్యార్థులు ప్రశాంతంగా, ధైర్యంగా ఉండి చదువుకోవాలి.
ప్లాన్ ప్రకారం
అసలే పరీక్షల సమయం. ఇప్పుడు ఉన్న సమయంలోనే అన్ని సబ్జెక్టులూ రివిజన్ చేసుకోవాలి. అలాగనీ ప్రతీ సబ్జెక్టు గడగడా చదువుతూ పోతే ఫలితం ఉండదు. ఇప్పటికే మీకు సబ్జెక్టులపట్ల అవగాహన వచ్చి ఉంటుంది కాబట్టి, పరీక్షలను దృష్టిలో పెట్టుకొని ఏది ఎలా చదవాలో ఒక ప్లాన్ రూపొందించుకోండి. అవసరమైతే ఒక అట్టమీదో, నోట్‌బుక్‌లోనో ఒక టేబుల్ గీసి టైమ్‌టేబుల్ తయారు చేసుకోండి. ఇందుకోసం ఉపాధ్యాయుల సలహా కూడా తీసుకోవచ్చు. ప్రతీరోజు దానిని ఫాలో అయితే చక్కని ఫలితం ఉంటుంది.
షార్ట్‌ఫార్ములా పాటిస్తే...
ఒక ప్రశ్నకు జవాబు రాయాలనుకున్నప్పుడు ఏం చేస్తారు? కొందరు బట్టీపట్టి చదువుతుంటారు. తీరా ఎగ్జామ్ హాల్లోకి వెళ్లాక గుర్తుకురాక తలపీక్కుంటుంటారు. అదే షార్ట్ ఫార్ములా పద్ధతిలోనో, అవగాహన చేసుకుంటూ చదివితేనో ఇలాంటి పరిస్థితి రాదు. కాబట్టి బట్టీ పద్ధతి అస్సలు పనికి రాదు. షార్ట్ ఫార్ములాను మీ అంతకు మీరే రూపొందించుకొని ఆ ప్రకారం చదివితే ఫలితం ఉంటుంది. ఉదాహరణకు పది మార్కుల ప్రశ్నకు జవాబు రాయాలన్నప్పుడు అంతపెద్దది గుర్తుంచుకోవడం కష్టంకదా మాత్రం అనుకోకండి. షార్ట్ ఫార్ములా పద్ధతిలో అది చాలా ఈజీయే అదెలాగంటే అందులో 6 పేరాలున్నాయనుకుందాం ఒక్కో పేరాను విడదీయాలి. వాటికి ఎ.బి.సి.డి.ఇ.ఎఫ్. ఇలా ఏవైనా అబ్రివేషన్లతో విడగొట్టాలి. అది ఒక కవి పరిచయమనుకున్నప్పుడు 'ఎ'లో కవి పేరు, పుట్టిన సంవత్సరం, బాల్యం ఉంటుంది. 'బి'లో విద్యాభ్యాసం చదువుకునే రోజుల్లో అతని ప్రతిభ తదితర విషయాలు ఉంటాయి. 'సి'లో అతను కవిగా మారడానికి ప్రభావితం చేసిన అంశాలుంటాయి. 'డి' అతని రచనలూ, సమాజంలో వాటి గుర్తింపూ లాంటి విషయాలు ఉంటాయి. అని సింపుల్‌గా గుర్తుంచుకుంటే ఎంత పెద్ద ప్రశ్న అయినా అది ఏ సబ్జెక్టు అయినా చకచకా రాయగలరు. ఇవేగాక రాజధానుల పేర్లో, దేశాలపేర్లో, మేథమేటిక్స్‌లోని సూత్రాలో గుర్తుంచుకునేందుకు కూడా అబ్రివేషన్లో, మీకు తోచిన ఇతర షార్ట్ ఫార్ములానో పాటించవచ్చు ఉదాహరణకు 'అకచిక' అన్నది ఒక షార్ట్‌కట్ ఫార్ములా.
ఇది గుర్తుంటే అందులో 'అనంతపురం, కడప, చిత్తూరు, కర్నూలు' అన్న నాలుగు జిల్లాల పేర్లు రాసేయడం ఈజీ. ఇలాంటి ఫార్ములా ప్రయోగిస్తే పరీక్షల్లో చక్కటి ఫలితం రాబట్టవచ్చు. అయితే ఫార్ములాల వెతుకులాటలో పడి అసలుది వదిలిపెట్టే పని చేయకూడదు. కొందరు ఏ ఫార్ములా పాటించకున్నా బాగా చదవగలరు. కొందరికి గడగడా చదివితేనే గుర్తుంటాయి. కొందరికి నిశ్శబ్ద వాతావరణంలో... మనసులో చదువుకుంటేనే గుర్తుంటాయి. అంటే వారు ఆ విధంగా చదివేందుకు చిన్నప్పట్నించీ అలవాటు పడి ఉంటారు. కాబట్టి ఎవరికి వారు ఏ విధంగా చదివితే ప్రయోజనం ఉంటుందో కూడా ఒకసారి ఆలోచించుకొని ఆ తర్వాత ప్రణాళికాబద్ధంగా చదివితే చక్కటి ఫలితం ఉంటుంది.
మర్చిపోవడం ఎందుకు?
'బాగా చదువుతాం కానీ ఎందుకో గుర్తుండదు' అని ఎవరైనా అంటున్నారంటే దానికి వెనుక కారణం వేరు. ఎలా చదవాలో, చదివింది ఎలా గుర్తుంచుకోవాలో అవగాహన లేకపోవడం ఒకటైతే, వారిలో ఆ విధమైన అవగాహన కల్పించకపోవడం మరొకటి. విద్యార్థుల్లో పరీక్షలపట్ల సానుకూల దృక్పథం కల్పించే చర్యలు తీసుకోకపోతే టీచర్లదీ, తల్లిదండ్రులదీ తప్పే. చిన్నపిల్లల మనస్సు తెల్లకాగితం లాంటిది. అందులో ఏ గీతలు గీస్తే, ఏ రాతలు రాస్తే... అవి వారిని ప్రభావితం చేస్తుంటాయి. చదువుకునే విద్యార్థులూ అంతే తమ మనో ఫలకంపై ముద్రింపబడిన ఆలోచనలకు, భావాలకు అనుగుణంగానే వారి మనసు, మెదడు పనిచేస్తూంటుంది. ఉదాహరణకు 'నేనంతే నాకు ఎప్పుడూ సెకండ్‌క్లాస్ మార్కులే వస్తాయి. నాకున్న ట్యాలెంట్‌కు అంతకు మించి రావు' అన్న భావన బలంగా మనసులో నాటుకుపోయిందనుకోండి. మెదడు అందుకు అనుకూలంగానే స్పందిస్తుంది.
ఆ విధమైన ఫలితాలు రాబట్టుకునేందుకే అది సహకరిస్తుంది. అంటే విద్యార్థులైనా, ఇంకెవరైనా తమ ప్రతిభకు తామే గిరీగీసుకొని సంకెళ్లు వేసుకుంటే, లేకపోతే ఆ విధంగా ప్రభావితమయ్యేలా ఎవరైనా ప్రభావితం చేస్తే, అవి నెగెటివ్ ఫీలింగ్స్‌గా మారి అపసవ్య ఆలోచన్లకు దారితీస్తాయి. వ్యతిరేక ఫలితాలకు కారణం అవుతాయి. అదే మీ ఆలోచనలకు పరిధులు గీయకుండా ఉంటే 'నేను ఎందుకు చదవలేను. ఏదైనా చదివేయగలను, గుర్తుంచుకోగలను. ఫస్టుక్లాసులో పాసవగలను. అదేం పెద్ద పనికాదు. చదవడం మన చేతిలోనే ఉన్నప్పుడు ఫలితం కూడా మనచేతిలోనే ఉన్నట్లు కాదా!' అని ఒక్కసారి ప్రశ్నించుకుంటే ఏదైనా సాధ్యమే అన్నభావనతో చదివితే మనసు అందుకు సహకరిస్తుంది. మెదడు ఆ విధంగానే స్పందిస్తుంది. ఫలితం ఆ విధంగానే వస్తుంది. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి.
అదేమిటంటే ఎవరైనా నెగెటివ్ ఆలోచన్లకు డిసైడైపోతే, వాటికి అలవాటు పడిపోతే అలాంటి ఫలితమే ఉంటుంది. పాజిటివ్ ఆలోచన్లకు అలవాటు పడితే, పాజిటివ్‌గా ఆలోచిస్తే ఫలితాలు అలాగే ఉంటాయి. కాబట్టి విద్యార్థులెప్పుడూ పాజిటివ్ దృక్పథంతో ఉండాలి. 'మిమ్మల్ని మీరు ఎలా అంచనా వేసుకుంటారో ఫలితమూ అలాగే ఉంటుంది. 'మేం ప్రతిభావంతులం' అని మీరనుకుంటే నిజంగా ప్రతిభ కనబర్చగలరు. 'ఏదీ సాధించలే'మని అనుకుంటే నిజంగానే సాధించలేరు అందుకే ముందు మీరు మానసికంగా సంసిద్ధమవ్వాలి. ఆ తర్వాత అది ఆచరణలో పెట్టాలి. ఇది పరీక్షలకు వర్తింపజేసుకుంటే ఎలా గట్టేక్కవచ్చునో మీరే నిర్ణయించుకోవచ్చు.
No comments:
Post a Comment