15 Feb 2012

చదువుతున్నారా?


చదువుతున్నారా?


  • 01/02/2012
ఈ నాలుగు అక్షరాలూ చదువుతున్నారంటే, మీకు చదవడం అలవాటని అర్థం! మరి చదవడం గురించి మీకు ఒక ప్రణాళిక, పద్ధతి ఉన్నాయా? గమనించండి!
ఏం చదువుతున్నారు? ఎందుకు చదువుతున్నారు?: పరీక్ష కోసం చదువుతున్నారా? విషయం నిజంగా తలకెక్కాలని చదువుతున్నారా? ఈ రెండూకాక కేవలం కాలక్షేపం కోసమేనా? కథలూ, నవలలను కూడా సీరియస్‌గా చదవవచ్చునని మీకు అనిపించిందా?
చదువుతున్నది తలకు ఎక్కుతున్నదా?: కళ్లు కదులుతుంటాయి. పేజీలు తిరుగుతుంటాయి. ఒక్క క్షణమాగి, గడిచిన పేజీలో ఏముందో గుర్తుతెచ్చుకుందామంటే, అంతా ఖాళీగా కనబడుతుంది. కథను కూడా ఈ పద్ధతిలో చదవకూడదు. చివరికి దాని రుచి మనకు అందక తలనొప్పి పుడుతుంది. ఇక చదువుతున్నది నిజంగా ‘చదువు’లో భాగమైతే, చదివిన ప్రతివాక్యం మెదడులో ముద్రవేయాలి. కనుక మెదడుతో చదవాలి. మనసు పెట్టి చదివింది అరగంటయినా గుర్తుంటుంది. చదివే విషయం, దానికిగల సంబంధం తెలుస్తూ ఉంటుంది.
మననం చేసుకోవడం మంచిది: గడిచిన పేజీలో ఏముంది? అది సినిమాలాగ కళ్లముందు కదలాలి. ఖాళీ తెర ఎదురయితే, పుస్తకం కింద పెట్టి, మనసును మెదడును మళ్లీ వాటి అసలు చోటికి తీసుకురావాలి! లేకుంటే చదివామన్న సంతృప్తి కూడా మిగలదు. ప్రయోజనం అంతకన్నా మిగలదు.
ఆగకుండా గంటలు చదివితే లాభం లేదు: ఒకసారి కూచుని చదవడం మొదలుపెడితే, కనీసం గంట అయ్యేసరికి బ్రేక్ ఇవ్వడం మంచిది. ఆ ఖాళీలో మనకు తెలియకుండానే మెదడు, అంతవరకు చదివిన విషయాలను మరోసారి రివ్యూ చేస్తుంది. ఆ పని, మనం తెలిసి చేస్తే మరింత బాగుంటుంది. లేకున్నా సరే, కొంచెంసేపు తీరిక అవసరం.
ముఖ్యమయిన విషయాలను గుర్తించం, గుర్తుంచుకోవడం ఒక కళ: దారిలో ఉండే ముఖ్యమయిన స్థలాలు గుర్తుంటే, సులభంగా, వాటి మధ్య ప్రాంతం కూడా సినిమాలాగా కళ్లముందు కదులుతుంది. కథ, నవలలోనయినా ముఖ్య సంఘటనలు, పాత్రలు, మాటలను గుర్తుంచుకోవాలి. పాఠ్యపుస్తకాలలోనయితే, చదువు ముందుకు సాగడానికి, ఈ ముఖ్యాంశాలు, మెట్లలాగా సాయపడాలి. ఒకదాని తరువాత ఒకటిగా వాటి వరుస గుర్తుంటే, తిరిగి గుర్తుకు తెచ్చుకుని జవాబులు ఇవ్వడం సులభం. పరీక్ష సంగతి పక్కనపెట్టి, అసలు విషయాన్ని అర్థం చేసుకోవడానికి ఈ క్రమం ఎంతో అవసరం.
ఏ రకమయిన చదువైనా సరదాగా సాగాలి. బలవంతపు చదువు దండగ! చదువుతున్న ఆనందం ఎప్పటికప్పుడు అనుభవంలోకి వస్తుంటే చాలా బాగుంటుంది!

No comments: