7 Feb 2012

రోగ నిరోధక శక్తి .. నోబెల్‌ బహుమతులు ...

రోగ నిరోధక శక్తి .. నోబెల్‌ బహుమతులు ...

ఆరోగ్య పరిరక్షణలో రోగ నిరోధక శక్తి ఒక ముఖ్యాంశం. శరీర సౌష్టవం, మన పరిసరాలు, తినే తిండి, అలవాట్లు ఈ నిరోధక శక్తిని భౌతికంగా నిర్ధారిస్తాయి. శరీర అంతర్గత (ఇన్నేట్‌), అవసరానికి అనుగుణమైన మార్పుల (ఎడాప్టింగ్‌) రూపాలలో ఈ నిరోధకశక్తి ఉంటుంది. అనారోగ్యం కలిగించే సూక్ష్మజీవులు లేదా వైరస్‌లు శరీరంలోకి ప్రవేశించే సమయంలో ఈ రక్షణ ప్రక్రియలు వాటంతటవే చురుకుగా పనిచేస్తూ (ట్రిగ్గరై) దాడి చేస్తున్న సూక్ష్మజీవుల నుంచి మన ఆరోగ్యాన్ని రక్షిస్తాయి. ఈ విజ్ఞానం ద్వారా ఆరోగ్య పరిరక్షణ, అనారోగ్యానికి చికిత్స సుసాధ్యమవుతుంది. ఈ ప్రక్రియల అవగాహన క్రమంగా విస్తరిస్తుంది. వీటిని వినియోగించే మేర మన జీవన నాణ్యత, ప్రమాణాలు అభివృద్ధి చెందుతున్నాయి. విజ్ఞాన విస్తరణలో మైలురాళ్లుగా భావిస్తున్న నూతన గుర్తింపులకు నోబెల్‌ బహుమతులను ఇస్తూ ప్రోత్సహిస్తున్నారు. వైద్యరంగంలో (2011) నోబెల్‌ బహుమతులు అందుకున్న ముగ్గురూ రోగనిరోధక శక్తి రంగంలో పనిచేస్తున్నవారే. 'వీరి పరిశోధనల ప్రాధాన్యతను, నిరోధక శక్తి విజ్ఞానాన్ని' సంక్షిప్తంగా వివరిస్తూ మీ ముందుకు వచ్చింది ఈ వారం 'విజ్ఞాన వీచిక'.
సామాన్య స్థాయి నుండి సంక్లిష్ట స్థాయి వరకూ అంచెలంచెలుగా రోగకారక సూక్ష్మ జీవుల నుండి రోగ నిరోధకవ్యవస్థ రక్షిస్తుంది. సూక్ష్మంగా చెప్పాలంటే రోగకారక సూక్ష్మజీవులు, వైరస్‌లు మన శరీరంలో ప్రవేశించకుండా భౌతికంగా ఈ వ్యవస్థ అడ్డుకుంటుంది. ఈ భౌతిక నిరోధకాలను దాటి రోగకారక క్రిములు శరీరంలో ప్రవేశించినప్పుడు అంతర్గత నిరోధకశక్తి స్పందిస్తుంది. ఈ వ్యవస్థ అన్ని జీవజాలాల్లో ఉంటుంది. ఈ అంతర్గత నిరోధకశక్తిని తప్పించు కుని, రోగకారక క్రిములు శరీరంలో ప్రవేశించినప్పుడు వెన్నెముకగల జీవుల్లో అవసరానికి అను గుణమైన నిరోధకశక్తిని కలిగించే రెండో రక్షణవ్యవస్థ సిద్ధంగా ఉంటుంది. అంతర్గతవ్యవస్థ నుండి అందే సంకేతాలతో ఈ వ్యవస్థ చురుగ్గా మారుతుంది. ఈ దశలో రోగకారక సూక్ష్మ జీవులను నిరోధకవ్యవస్థ గుర్తించగలుగుతుంది. అయితే, రోగకారక సూక్ష్మజీవి అంతరించిన తర్వాత కూడా దీనికి సంబంధించిన అంశాలను నిరోధకవ్యవస్థ జ్ఞాపకం (ఇమ్యునోలాజికల్‌ మెమోరీ) పెట్టుకుంటుంది. తద్వార, మరోసారి ఇలాంటి రోగకారక సూక్ష్మజీవులే దాడి చేసిన ప్పుడు అవసరానికి అనుగుణంగా రక్షణవ్యవస్థ వెంటనే మేల్కొని, మనల్ని రక్షిస్తుంది. ఈ సూత్రం ఆధారంగానే ఎన్నో జబ్బులకు వ్యాక్సిన్‌లు తయారుచేశారు. చేస్తున్నారు. ముఖ్యంగా, రోగాల్ని కలిగించే అన్ని వైరస్‌లకు వ్యాక్సిన్‌లు అందుబాటులో (కొన్ని తయారీలో) కి వచ్చాయి.

ఆరోగ్యకరమైన సొంత కణాల్ని బయటి కణాల నుండి గుర్తించడం మీదే ఈ (రోగ) రక్షణ వ్యవస్థ ఆధారపడి ఉంటుంది. బయట నుండి దాడిచేసే రోగ కారక సూక్ష్మజీవులకు స్పందనగా కొత్త అణువులు (ఫారిన్‌ మాలిక్యూల్స్‌) ఏర్పడతాయి. సాంకేతికపరంగా, ఇలాంటి ఒక రకం అణువులను 'యాంటిజెన్స్‌'గా వ్యవహరిస్తున్నారు. ఈ కొత్త కణాలు ఆయారకాల రోగకారక క్రిముల నుండి మాత్రమే రక్షిస్తాయి.
బాహ్య నిరోధకాలు...
రోగకారక క్రిముల దాడి నుండి బాహ్య నిరోధకాలు రక్షిస్తాయి. ఈ నిరోధకం యాంత్రిక, రసాయనిక, జీవకణ ప్రత్యేకతల రూపంలో ఉండవచ్చు. ఆకుల మీద ఉండే మైనపు పొర, పురుగులపై ఉండే బాహ్య కవచం (స్కెలిటిన్‌), గుడ్డుపై పెంకు లేదా చర్మం రూపంలో ఈ యాంత్రిక నిరోధకాలు ఉంటాయి. అయితే, ఇవి పూర్తిరక్షణను కలిగించకపోవచ్చు. దగ్గినప్పుడు లేదా తుమ్మిన సందర్భంలో ఊపిరితిత్తిలోని రోగకారకాలు యాంత్రికంగా బయ టకు వస్తాయి. కళ్ల నుండి వచ్చే నీరు, మూత్రం ఇలానే రోగ కారకాలను బయటకు పంపి స్తాయి. శ్వాస, జీర్ణకోశాల్లో రోగకారక సూక్ష్మజీవులు వలలో చిక్కినట్లు బంధింపబడతాయి. చర్మం, శ్వాసకోశంలో సూక్ష్మజీవుల్ని నియంత్రించగల రసాయనాలు వెలువడతాయి. లాలాజలం, కన్నీళ్లు, తల్లిపాలల్లో కూడా ఇలాంటి రసాయనాలే ఉద్భవిస్తాయి. జీర్ణాశయంలో ఆహారం ద్వారా ప్రవేశించే రోగకారక క్రిములను జీర్ణరసాలు నిర్వీర్యం చేస్తాయి.
అంతర్గత నిరోధకశక్తి..
బాహ్య నిరోధకాలను దాటి శరీరంలోకి ప్రవేశించే రోగ క్రిముల్ని ఎదుర్కోవడంలో ఈ అంతర్గత నిరోధక శక్తి దోహదపడుతుంది. అయితే ఈ రక్షణవ్యవస్థ ఏదో ఒక ప్రత్యేక సూక్ష్మ జీవిని కాకుండా అన్ని సూక్ష్మజీవుల్ని ఒకేరకంగా నియంత్రిస్తుంది. దీనివల్ల దీర్ఘకాల నిరోధకశక్తి లభించదు. ఎన్నో జీవాల్లో ఈ రక్షణవ్యవస్థ ప్రధానంగా కొనసాగుతుంది. ఈ రక్షణవ్యవస్థలో వాపు అనేది ఒక సూచిక. ఎర్రగా మారడం, ఉబ్బటం, వేడిగా ఉండటం, నొప్పి కలగడం ఇవన్నీ వాపుకు చిహ్నాలు. ఒకేసారి రక్తప్రసరణ పెరగడం వల్ల ఈ వాపు వస్తుంది. గాయపడిన లేదా దాడికి గురైన జీవకణాలు విడుదల చేసే కొన్ని ప్రత్యేక రసాయనాలు అందించే సంకేతాల వల్ల ఈ వాపు వస్తుంది.
సహచర నిరోధక వ్యవస్థ... (కాంప్లిమెంట్‌ సిస్టమ్‌)..
మనుషుల్లో రోగకారక సూక్ష్మజీవులకు లేదా ప్రోటీన్లను అంటిపెట్టుకునే యాంటీబాడీల ద్వారా ఈ వ్యవస్థ పనిచేస్తుంది. వేగంగా అందుతున్న సంకేతాలకు అనుగుణంగా స్పందన కూడా అంతే వేగంగా ఉంటుంది. ఈ స్పందన చిన్నపాటి జలపాతంలాగా వస్తుంది. ప్రవేశి స్తున్న రోగకారక క్రిముల్ని అత్యంతవేగంగా యాంటీబాడీకణాలు ముంచెత్తి, నాశనం చేస్తాయి.
కణ నిరోధకాలు..
ఇందులో తెల్లరక్త కణాలదే ప్రధానపాత్ర. నిరోధకశక్తిలో వీటిపాత్ర 'మీకు తెలుసా?'లో పేర్కొన్నాం. గమనించగలరు.
అవసరానికి అనుగుణంగా చురుగ్గా మారే రక్షణవ్యవస్థ (అడాప్టింగ్‌ సిస్టమ్‌)..
రోగకారక క్రిములవల్ల గతంలోనే ఉత్పత్తయిన 'యాంటిజెన్‌' కణాలతో ఈ వ్యవస్థ జ్ఞాప కం పెట్టుకుంటుంది. ఆధునిక వైద్య విజ్ఞానంతో సుక్షిప్తావస్థలో ఉన్న ఈ కణాలను వ్యాక్సిన్‌ రూపంలో ఇస్తూ రక్షణ కలిగిస్తున్నాం. మశూచి, పొంగు, పోలియో, క్షయ వంటి ప్రమాదకర వ్యాధులు ఇలా అతితక్కువ ఖర్చుతో, శ్రమతో నియంత్రించబడుతున్నాయి. హెచ్‌ఐవి, ఎయిడ్స్‌ వంటి భయంకరమైన వ్యాధుల వ్యాప్తి కూడా ఇలాగే నిరోధించబడుతున్నాయి.
రక్షణ వ్యవస్థ లోపాలు..
రోగ నిరోధక వ్యవస్థలో ఒకటి రెండు భాగాలు నిర్వీర్యమైన ప్పుడు రక్షణవ్యవస్థలో లోపాలు కలుగుతాయి. ఊబకాయం, మద్యపానం, మందుల వినియోగం నిరోధకవ్యవస్థను బలహీన పరుస్తాయి. పోషకలోపాలు - ఇనుము, రాగి, జింకు, సిలేనియం, కొన్ని విటమిన్లు (ఎ, సి, ఇ, బి6, బి9) కూడా ఈ వ్యవస్థను బలహీనపరుస్తాయి. ఇదేవిధంగా, థైమస్‌ తొలగింపు లేదా ఇతర జన్యు కారణాల వల్ల కూడా నిరోధకశక్తి తగ్గుతుంది.
కొన్ని కణితులు నిరోధక వ్యవస్థను తప్పించుకోవడం ద్వారా క్యాన్సర్‌గా మారతాయి. రోగ నిరోధకశక్తిని కృత్రిమంగా మందు లతో పూర్తిగా హరింపజేసి, అవయవాల మార్పిడిని సుసాధ్యం చేయవచ్చు. తద్వారా బయట నుండి వచ్చిన జీవకణ జాలం సొంత కణజాలంగా గుర్తింపు పొంది, శరీరంలో భాగంగా మారుతుంది. అయితే, దీనివల్ల ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఇది మరో ముఖ్యమైన విషయం.
చరిత్రలో..
క్రీ.పూ.430లో మొట్టమొదటిగా రోగనిరోధకశక్తి గుర్తించబడింది. ఏథెన్స్‌ పట్టణంలో ప్లేగ్‌ వ్యాపించిన సందర్భంలో ఆ వ్యాధి సోకి, తట్టుకుని జీవిస్తున్న వారు సురక్షితంగా ఆ రోగులతోనే ఉంటూ, చికిత్స చేయవచ్చని గుర్తించబడింది. 18వ శతాబ్ధంలో తేలు విషాన్ని కొన్ని కుక్కలు, ఎలుకలు తట్టు కోగలవని పియరీ లూయీ మేరియో ప్రయోగాల ద్వారా నిరూపించారు. ఇవి, ఇలాంటి ఇతర ఫలితాలు లూయీపాశ్చర్‌ను మశూచి వ్యాధికి వ్యాక్సిన్‌ను రూపొందించడానికి, రోగానికి కారణం సూక్ష్మజీవులని గుర్తించడానికి దోహదపడ్డాయి. అంటురోగాలకు సూక్ష్మజీవులే కారణమని 1891లో రాబర్ట్‌ కోచ్‌ నిరూపించారు. దీనికి గుర్తింపుగా 14 సంవత్సరాల తర్వాత ఈయనకు నోబెల్‌ బహుమతి లభించింది. 'వాల్టర్‌ రీడ్‌' అనే శాస్త్రజ్ఞుడు 1901లో ఎల్లో జ్వరం (ఎల్లో ఫీవర్‌) కు వైరస్‌ కారణమని గుర్తించారు. యాంటిజన్‌ - యాంటి బాడీలకు గల ప్రత్యేక సంబంధాన్ని సైడ్‌చైన్‌ సిద్ధాంతం ద్వారా 'వాల్‌ హెర్లిచ్‌' వివరించారు. దీనికిగానూ ఆయనకు 1908లో నోబెల్‌ బహుమతి లభించింది. అనుగుణమైన నిరోధకశక్తి వ్యవస్థను అర్థంచేసుకోడానికి ఈ సిద్ధాంతం ఎంతగానో తోడ్పడింది.
ప్రారంభం..
ప్రపంచ స్థాయిలో అత్యున్నత గుర్తింపును ఇచ్చేది నోబెల్‌ బహుమతి. ఈ బహుమతి జాతి, వర్ణ, మత, కుల, లింగ విభేదాలకు అతీతమైనది. స్వీడెన్‌లో స్టాక్‌హోం వద్ద 31 అక్టోబర్‌ 1833న జన్మించిన 'ఆల్‌ఫ్రెడ్‌ నోబెల్‌' జ్ఞాపకార్థం ఆయన వీలునామా మేరకు తన పూర్తి సంపాదన మీద వచ్చే వడ్డీతో ఈ బహుమతులు ప్రతి సంవత్సరం ఇవ్వబడుతున్నాయి.

'ఆల్‌ఫ్రెడ్‌ నోబెల్‌' ఒక గొప్ప ఇంజనీరు, పరిశోధకుడు. తన మేధస్సుతో డైనమైట్‌తో సహా 355 కొత్త ఆవిష్కరణలను చేశారు. వీటిద్వారా ఎనలేని సంపదను పోగు చేశాడు. 1888లో తన సమీప బంధువు 'లుడ్‌విగ్‌ నోబెల్‌' చనిపోగా, చనిపోయింది 'ఆల్‌ఫ్రెడ్‌ నోబెల్‌' అని భావించిన ఓ ఫ్రెంచి వార్తాపత్రిక 'మరణాల వ్యాపారి చనిపోయాడు' అనే హెడ్డింగ్‌తో వార్తను ప్రచురించింది. దీన్ని చదివిన ఆల్‌ఫ్రెడ్‌ తన మరణం తర్వాత తనను గురించి ఇలా చెడ్డగా జ్ఞాపకం చేసుకోకూడదని, తను చేసిన మంచిని గురించే ఎల్లప్పుడూ స్మరించుకోవాలని భావించాడు. తదనుగుణంగా, అంతకు ముందే రాసిన తన వీలునామాను మార్చి, తను కూడబెట్టిన మొత్తం సంపదపై వచ్చే వడ్డీని 'మాన వాళికి గరిష్ట లాభాన్ని కలిగించే కొత్త అంశాల్ని గుర్తించిన వారికి (డిస్కవరర్‌లకు)' వార్షిక బహుమతుల్ని అందించాలని, తద్వారా ఇలాంటివారికి ప్రోత్సాహాన్ని ఇవ్వాలని పేర్కొన్నాడు. భౌతికశాస్త్రం, రసాయనశాస్త్రం, శాంతి, ఫిజియాలజీ, వైద్యశాస్త్రాల్లో ఒకదానికి, సాహిత్యం వంటి అంశాల్లో ఈ బహుమతుల్ని ఇవ్వాలని కోరాడు. ఈ బహుమతులను ఇవ్వడానికి 'నోబెల్‌ ఫౌండేషన్‌' ఏర్పాటైంది.1901 నుండి ఈ బహుమతుల్ని ఇవ్వడం ప్రారంభించారు. ఆర్థికశాస్త్రానికి కూడా ఈ బహుమతిని 1969 నుండి ఇస్తున్నారు.

2009 నుండి ఈ బహుమతి మొత్తం స్వీడిష్‌ కరెన్సీలో 10 మిలియన్‌ క్రోనార్ల (సుమారు 14 లక్షల అమెరికా డాలర్లు) కు పెరిగింది. నగదు బహుమతితో పాటు ఒక మెడల్‌, ప్రశంసాపత్రాన్ని (సైటేషన్‌) ఇస్తారు. ప్రతి సంవత్సరం ఆల్‌ఫ్రెడ్‌ చనిపోయిన డిసెంబర్‌ 10న ఈ బహుమతుల్ని అందిస్తారు. డిసెంబర్‌ 10న ఓస్లో పట్టణంలో శాంతి బహుమతి గ్రహీత ఉపన్యసిస్తారు. అంతకు ముందే స్టాక్‌హోమ్‌లో మిగతా బహుమతి గ్రహీతలు ప్రత్యేక ఉపన్యాసాలను చేస్తారు.
ఈ ఏడాది..
నిరోధకవ్యవస్థ అవగాహనకు తోడ్పడే పరిశోధనలను ఉన్నత స్థాయిలో కొనసాగించినందుకు వైద్యరంగంలో 2011 నోబుల్‌ బహుమతులకు ముగ్గురు శాస్త్రజ్ఞులు ఎంపికయ్యారు. వీరు అమెరికాకు చెందిన బ్రూస్‌ ఎ.బ్యూట్లర్‌, ఫ్రెంచిదేశస్థుడు జూలెస్‌ ఎ.హాఫ్‌మాన్‌, కెనడాకు చెందిన రాల్ఫ్‌ ఎం.స్టీన్‌మాన్‌. వీరిలో కెనడాకు చెందిన స్టీన్‌మాన్‌ (68) అవార్డు ప్రకటనకు మూడురోజుల ముందే చనిపో యారు. వీరు కనుగొన్న కీలక సూత్రాలు నిరోధకవ్యవస్థను అర్థంచేసుకోవడంలో విప్లవకర మార్పులు తెచ్చాయి. వీరు కనిపెట్టిన సూత్రాలు నిరోధకశక్తి లోపాల్ని సవరించే కొత్త మందు ల తయారీకి తోడ్పడతాయి. అస్తమా (ఉబ్బసం), కీళ్లనొప్పులు తదితర జబ్బుల నియంత్రణకు అవసరమైన కొత్త మందుల తయారీకి వీరి సూత్రాలు ఆధారపడతాయని ఆశిస్తున్నారు.

నోబెల్‌ బహుమతి నియమ, నిబంధనల ప్రకారం చనిపోయిన వారికి ఈ బహుమతిని ఇవ్వరు. కానీ, స్టీన్‌మాన్‌ ప్రాంకియాటిక్‌ గ్రంథి క్యాన్సర్‌తో బహుమతి ప్రకటనకు కొద్దిరోజుల ముందే చనిపోయారు. బహుమతుల ఎంపిక ప్రక్రియ దీర్ఘకాలం పడుతుంది. స్టీన్‌మాన్‌ చనిపోయిన విషయం బహుమతుల ప్రకటనకు కొన్ని గంటల ముందే కమిటీ దృష్టికి వచ్చింది. ఇట్టి ప్రత్యేక పరిస్థితుల్లో స్టీన్‌మాన్‌ను నోబెల్‌ బహుమతి గ్రహీతగానే గుర్తించాలని బహుమతుల కమిటీ నిర్ణయించింది. నగదు బహుమతి మాత్రం మిగిలిన ఇద్దరికే ఇచ్చింది.

బ్యూట్లర్‌, హాఫ్‌మాన్‌ 'జలపాతం'లా వచ్చే అణువులు ఏర్పడడానికి కారకమైన ప్రోటీన్ల ను గుర్తించారు. అంతర్గత నిరోధకవ్యవస్థలో ఇవి ముఖ్యభాగం. స్టీన్‌మాన్‌ అవసరానికి అనుగుణంగా స్పందించే రక్షణవ్యవస్థకు సంబంధించిన విషయాల్ని 1973లోనే గుర్తించారు. రోగకారక సూక్ష్మజీవుల్ని నేరుగా చంపగలిగే 'టి-సెల్స్‌' ఉత్పత్తికి కారకాలైన డెండ్రైటిస్‌ కణాలను ఈయన గుర్తించారు. నిరోధక జ్ఞాపకశక్తిలో ఈ 'టి-సెల్స్‌' కీలకపాత్ర కలిగి ఉన్నాయి. తద్వార గుర్తించబడిన రోగకారక క్రిములు మరోసారి దాడి చేసినప్పుడు జ్ఞాపకశక్తి ఆధారంగా సంబంధిత 'టి-కణాలు' వేగంగా ఉత్పత్తి అయ్యి రోగ నిరోధకాన్ని అందిస్తాయి. రోగకారక సూక్ష్మజీవులను సొంత అణువుల నుండి దూరంగా ఉంచుతూ శరీర నిరోధకవ్యవస్థను పటిష్టంగా కొనసాగిస్తాయని ఈయన నిరూపించారు. దీనికోసం ఈయనకు 2007లోనే 'లస్కర్‌ బహుమానం' కూడా లభించింది.
మీకు తెలుసా?
* నిరోధకశక్తి చురుకుగా లేనప్పుడు తరచుగా అంటురోగాలు లేక ప్రాణాంతక రోగాలు వస్తాయి.
* నిరోధకశక్తి అతి చురుకుగా పనిచేస్తున్నప్పుడు మామూలు కణజాలాల్ని శత్రు కణాలుగా భావించడం, థైరాయిడ్‌ గ్రంథికి సంబంధించిన జబ్బులు, కీళ్ల నొప్పులు, టైప్‌-1 మధుమేహం వంటి జబ్బులు వస్తాయి.
* తెల్ల రక్తకణాలు: స్వతంత్ర ఏకకణ జీవాలుగా అంతర్గత రక్షణ వ్యవస్థ (ఇన్నేట్‌ ఇమ్యునో సిస్టమ్‌) లో పనిచేస్తాయి. వీటిలో 'ఫాగోసైట్స్‌' (మాక్రోఫేజస్‌, న్యూట్రిఫైల్స్‌, డెండ్రైటిస్‌ కణాలు), మాస్ట్‌ కణాలు, ఇస్నోఫిల్స్‌ (శ్వాసకు సంబంధించినవి), బ్యాసోఫైల్స్‌, సహజంగా చంపే కణాలు ఉంటాయి. అవసరానికి అనుగుణమైన రక్షణవ్యవస్థను చురుకుగా మార్చడానికి ఈ కణాలు సంకేతాల్ని అందిస్తాయి.
* న్యూట్రోఫైల్స్‌; మాక్రోఫేజస్‌ రక్త ప్రసరణ ద్వారా అన్ని శరీర భాగాలకు ప్రసారమవుతాయి. నిరుపయోగంగా మారిన శరీర కణా లను మాక్రోఫేజస్‌ తొలగిస్తాయి.
* డెండ్రైటిస్‌ కణాలు చర్మం, ముక్కు, ఊపిరితిత్తులు, జీర్ణకోశంతో సంబంధం కలిగి ఉంటాయి. అంత ర్గత, అవసరానికి అనుగుణమైన రక్షణవ్యవస్థల మధ్య ఇవి వారధిగా పనిచేస్తాయి.
* మాస్ట్‌ కణాలు, కనెక్టింగ్‌ కణ జాలల్లో మ్యూకస్‌ పొరల్లో ఉంటా యి. వాపును నియంత్రిస్తాయి. తాము విడుదల చేసే రసాయనా లతో పరాన్నజీవకణాల నుండి రక్షించడానికి, అలర్జీ, అస్తమా నియంత్రణలో పాల్గొంటాయి.
* సహజంగా చంపే కణాలు, కణితి కణాలను లేదా వైరస్‌ సోకిన కణాలను నేరుగా చంపేస్తాయి.
గమనిక: ఈ పేజీపై మీ స్పందనలను 9490098903కి ఫోను చేసి తెలియజేయండి.

No comments: