భగవంతుడు.. భగవత్స్వరూపుడు.. సామాన్యుడు..
-
విశ్వాసాలు.. వాస్తవాలు...72
భగవంతుడిని తెలుసుకోవడానికి ఎంతోమంది ప్రయత్నించారు కూడా. తమకు తెలియని విషయాలన్నీ భగవంతుడి వలనే జరుగుతున్నాయని, అవన్నీ ఆయన లీలలని, మహత్యాలని వీరు నమ్ముతున్నారు. ఒక విధంగా మనకు తెలియని అంశాలన్నింటినీ భగవంతునికే ఆపాదిస్తున్నారు. అన్ని మతాలు తరతమ భేదాలతో భగవంతుని భావం చుట్టూ, ఆయన చేసే అద్భుత కార్యకలాపాల చుట్టూ తిరుగుతున్నాయి. భగవంతుని స్వరూపం, స్వభావాన్ని అర్థంచేసుకోవడానికి ఎంతోమంది తాత్వికులు దీర్ఘకాలంగా ఆలోచించారు, తర్కించారు. వీరిలో కొంతమంది తాము భగవంతుని చూశామని, భగవత్ రహస్యాలు కనుగొన్నామని, భగవంతుని సందేశాన్ని గ్రహించామని, అది ఇతరులకు (సామాన్యులకు) అందిస్తున్నామని చెప్పేవారు కూడా కోకొల్లలు. భగవంతుడు లేదా దైవత్వానికి అద్భుతశక్తి, మంచి, చెడులను గుర్తించే గుణగణాలు ఆపాదించబడ్డాయి. మంచిని రక్షిస్తూ చెడును శిక్షించే శక్తి కూడా వీరికి ఆపాదించబడుతుంది.
ఎంతోమంది తాత్వికులు భగవంతుడిని నిరాకారుడిగా, ఒక శక్తిగానే భావిస్తున్నారు. చరిత్రలోకి వెళితే భగవంతుడిని అగ్నిలో, పాముల్లో ఇలా కనిపించి, మాయమై, ఆశ్చర్యం కలిగించే వాటిల్లో ఉన్నాడని ఆదిమానవుడు భావించారు. భగవంతుడు మనల్ని సృష్టించాడా? లేక మన అవసరాల కోసం భగవంతుడనే భావనను మనం సృష్టించుకున్నామా? అనే తాత్విక చర్చ ఎంతోమందిలో కొనసాగుతూనే ఉంది. ఏదిఏమైనా, మన తాత్విక ప్రపంచంలో భగవంతుడికే మొదటిస్థానం.
విజ్ఞానం పెరుగుతున్న కొద్దీ భగవంతుని రూపకల్పనల్లో మార్పులూ చోటు చేసుకున్నాయి. కానీ, 'భగవంతుడిని చూశాం, వారి సందేశాన్ని సామాన్యులకు అందిస్తున్నాం' అనే వారిలో మార్పేమీ లేదు. పైగా, వీరు (భగవత్స్వరూపులు) ఊహకందని స్థాయిలో ఎన్నో రూపాల్లో పుట్టుకొచ్చారు. పుట్టుకొస్తున్నారు. వీరు భగవద్గీతలోని 'పరిత్రాణాయ సాధూనాం, వినాశాయచదుష్కుృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగేయుగే' అనే శ్లోకాన్ని తమకు అన్వయించుకున్నారు. పైశ్లోకం యొక్క అర్థం ఏమిటంటే 'మంచివారిని రక్షించుటకు, చెడ్డవారిని శిక్షించుటకు, ధర్మాన్ని స్థాపించడం కొరకు నేను అప్పుడప్పుడు అవతరిస్తుంటాను' అని. పైశ్లోకం ప్రకారం ధర్మాన్ని రక్షించడానికి భగవంతుడైన తాను (మానవ ప్రపంచంలో) అవతరించానని వీరు ప్రచారం చేసుకుంటున్నారు. వీరు 'బాబాలు, అమ్మలు, స్వాములు, యోగుల' పేరుతో చలామణి అవుతున్నారు.
సామాన్యుని దృష్టిలో భగవంతుడికి, భగవత్వ్సరూపుడికి తేడా ఏమిటి..? భగవంతుడు తన అద్భుతశక్తితో విశ్వాన్ని సృష్టించాడు. శాసిస్తున్నాడు. కర్త, కర్మ, క్రియ అన్నీ ఆయనే. కానీ, భగవత్వ్సరూపుడు 'ఉన్నతంగా' భావించే భావాలను స్థానిక అవసరాలకు అనుగుణంగా మలిచి చెప్పడమే కాక, తమ దగ్గరకు వచ్చే భక్తుల కష్టనష్టాలను తెలుసుకొని, తమ శక్తి, యుక్తుల చేత తొలగిస్తారనే విశ్వాసాన్ని కలిగిస్తున్నారు. భయపెట్టి లొంగదీసుకుంటారు కూడా. సాధారణ వ్యక్తిగత జీవితంలో వీరు అందరిలాగే ఉంటూ విజ్ఞానశాస్త్రం అందిస్తున్న సర్వసుఖాలనూ అనుభవిస్తున్నారు. ధనాన్ని కూడబెట్టుకుంటు న్నారు. ఆస్తుల్ని సంపాదించుకుని, అనుభవిస్తున్నారు.
ఉదాహరణకు ఒక భక్తుడు బస్టాండులో రద్దీగా ఉందనీ, అయినా తనకు బస్సులో సీటు దొరికిందనీ, ఇదే బాబా దయకు దృష్టాంతమనీ పేర్కొన్నాడు. మరొక వి.ఐ.పి. భక్తుడు బాబా ఆశీర్వాదం వలన తన కుమార్తెకు మెడిసిన్‌లో సీటు దొరికిందని పేర్కొన్నాడు. ఇలా ఏ 'భగవత్స్వరూపుని' భక్తుణ్ణి కదిలించినా ఇలాంటి కథలనే చెబుతారు. ఇక యీ భగవత్స్వరూపుల ప్రత్యేకత ఏమిటంటే వారు తమను తాము భగవంతుడుగా ప్రచారం చేసుకుంటారు.
భగవంతునికి భగవత్స్వరూపుడికి మరో తేడా.... భగవంతుడు చేసే ఏ గొప్ప పనులూ స్వయంగా చెప్పుకోడు. జరుగుతున్న మార్పుల నేపథ్యంలో మనం వీటిని అర్థంచేసుకోవాల్సిందే. అన్వయించుకోవాల్సిందే. కానీ, భగవత్వ్సరూపులు తమను తామే భగవంతునిగా ప్రచారం చేసుకుంటారు. ఎన్నో అద్భుతశక్తులు తమకున్నట్లు కథలు కథలుగా ప్రచారం చేసుకుంటారు లేదా చేయించుకుంటారు. లేదా వారి పక్షాన మరొకరు చేస్తుంటారు. ఉదాహరణగా.. భగవాన్‌గా ప్రకటించుకున్న సత్యసాయిబాబా 1985 వేసవికాలంలో ఏమన్నారో గమనిద్దాం.. 'మీరు ఎంత అదృష్టవంతులో చూడండి. నాకు సన్నిహితంగా కూర్చొని పాద సేవ చేసే అవకాశం మీకు లభించింది. నేను తలచుకుంటే ఒక్కసారిగా ఆకాశంలో ఇటువైపు నుంచి అటువైపునకు నడిచి వెళ్ళగలను.' (సత్యసాయి బుక్‌ట్రస్ట్ రూపొందించిన 'తపోవనం' నుండి). అంతేకాదు. ఈ 'భగవత్స్వరూపులు' సాధారణ మెజీషియన్లు చేసే మాజిక్కులను, (చేతిలో నుండి విబూది తెప్పించడం, బంగారు ఆభరణం సృష్టించడం, నోట్లో నుండి శివలింగం తెప్పించడం లాంటివి) చేసి, అవి తమ మహిమలుగా ప్రచారం చేసుకుంటారు.
సత్యసాయి బాబా శూన్యం నుండి వస్తువులను సృష్టించడం అనే 'మహిమ'ను పరిశీలిద్దాం. 'సత్యసాయి' శూన్యం నుండి 10 గ్రాముల ఉంగరాన్ని తెప్పించాడనుకుందాం. అది సృష్టించడానికి ఎంత శక్తి కావాలి? ద్రవ్యనిత్యత్వ సూత్రం ప్రకారం లెక్కిస్తే 9వేల కోట్ల జౌళ్ల శక్తి కావాలి. ఈ శక్తితో భారతదేశంలో వ్యవసాయ విద్యుత్‌మోటార్లు అన్నింటినీ ఒక సంవత్సరం నడిపించవచ్చు. కాబట్టి సాయిబాబా తన మహిమతో ఒక భక్తుడికి ఒక ఉంగ రం ప్రసాదించే బదులు దేశంలోని లక్షలాది మోటారు పంపుసెట్లకు విద్యుత్ శక్తినందిస్తే దేశం సస్యశ్యామలమౌతుంది గదా? ఈ సత్కార్యానికి అందరూ మోకరిల్లుతారు కదా! మరి బాబా అందుకు ఎందుకు సంకల్పించలేదు?
నీళ్ళ స్వామి నుండి నిత్యానంద స్వామి వరకు, మహేష్ యోగి నుండి 'శక్తి పాత' మహర్షి వరకు అందరు 'భగవత్స్వరూపులూ' ఇలా మహిమలు ప్రదర్శిస్తున్నవారే. అనుయాయుల సమస్యలకూ, బాధలకూ తక్షణ నివారణ చర్యలతో 'భగవంతుడు రాసిన నుదుటి రాతను గూడ మార్చగలమ'ంటూ వారిని ఆకర్షిస్తున్నవారే. వీరి మహిమలను గూర్చి టన్నుల కొద్దీ సాహిత్యం వెలువడుతోంది. కానీ ఎవరైనా వీరి మహిమలను పరీక్షకు పెడితే మాత్రం పారిపోతారు. సత్యసాయిబాబాను ప్రా|| నరసింహయ్య కమిటీ, తమ ఎదుట శూన్యం నుండి వస్తువు వెలికి తీయమంటే తప్పించుకు తిరిగాడు. అలానే మహేష్ యోగి తాను యోగశక్తితో గాలిలో ఎగురుతాననీ, తన శిష్యులలో 3000 మందికి ఆ సిద్ధులు అబ్బినాయనీ ప్రకటించాడు. ఆ విద్యను లేక సిద్ధిని ఆహుతుల ముందు ప్రదర్శించమని ప్రఖ్యాత సైంటిస్టు డాక్టర్ పి.ఎన్.భార్గవ కోరితే, యోగి తిరస్కరించాడు (ఏంజెల్స్, డెవిల్ అండ్ సైన్స్, పేజి 106).
భగవత్స్వరూపుల భక్తులు చిన్న చిన్న బాధల నివారణలు కూడా కోరతారు. ఉదా: దోమలు కుట్టకుండా ఆపిన యుక్తేశ్వర్ (ఒక యోగి ఆత్మకథ పేజి 195); చెల్లెలి బరువు పెంచిన యోగానంద (పై పుస్తకం పేజి 412 నుంచి 415); చేతి స్పర్శతో శిష్యుడి జబ్బు నయం చేసిన నిర్మలాదేవి (పై పుస్తకం పేజి 780)
రెండో విషయం. భగవంతుని ఉనికిని, శక్తిని ఎవరైనా ప్రశ్నించినా, ఆనాటి భగవంతుని భక్తులు ఆ విషయం 'భగవంతునికే' వదలివేశారు. కానీ యీ నాటి భగవత్స్వరూపుల భక్తులు తమ 'భగవాన్'ల శక్తిని ఎవరైనా పరీక్షింప యత్నిస్తే వారిని 'తమ మనోభావాలు గాయపరిచారం'టూ తీవ్రంగా నిరసిస్తున్నారు. 'కల్కి భగవాన్'కు వ్యతిరేకంగా పాల్వంచలో ఒక కరపత్రాన్ని పంపిణీ చేస్తే, ఆ కరపత్ర పంపిణీని ఆపేయమని భగవాన్ భక్తులు హెచ్చరించడం యీ రచయిత స్వానుభవం!
ఇక సామాన్యుల సంగతి... భగవంతుని భక్తుల వలన సామాన్యులకు పెద్దగా ఇబ్బందులు కలగడం లేదు. భగవత్స్వరూపులు, వారి భక్తుల వలననే సామాన్యుడు అనేక ఇబ్బందుల పాలౌతున్నాడు. 'శూన్యం నుంచి వస్తువులు సృష్టించామ'నే వీరి ప్రచారం వలన ప్రజలలో శాస్త్రీయ ఆలోచనాశక్తి సన్నగిల్లుతోంది. విజ్ఞానశాస్త్ర ఆచార్యులు కూడ ఈ 'భగవత్స్వరూపులు' శూన్యం నుండి వస్తువులు తీస్తారనే శాస్త్ర వ్యతిరేక ప్రచారం చేయడం యీ దేశ దౌర్భాగ్యం. ఆ ప్రచారం కారణంగా భావిభారత పౌరులలో శాస్త్రీయ దృక్పథం నశిస్తోంది. అశాస్త్రీయ ఆలోచనా ధోరణి విజృంభిస్తోంది. శాస్త్రీయ దృక్పథం విస్తరించడం లేదు. దానివలన శాస్త్ర సాంకేతికరంగాలలో తీవ్రంగా వెనుకబడిపోతున్నాము. ఉదాహరణకు 5700 సైన్సు విద్యాలయాలున్న అమెరికాలో 300 మంది సైన్సులో నోబెల్ బహుమతులు తెచ్చుకుంటే, 8400 విద్యాలయాలున్న మనదేశంలో కేవలం ఇద్దరు మాత్రమే నోబెల్ బహుమతులు తెచ్చుకున్నారు. ఇదీ మన శాస్త్రవేత్తల దౌర్భాగ్యస్థితి. ఇక సామాన్యుల పరిస్థితి ఇంకా ఘోరం. మన ఇళ్ళలో ఉండే మంట, పంట, గుంటలు మన జీవితాలు శాసిస్తాయనీ, నిన్నటిదాకా బ్లాకులో టికెట్లమ్మిన వ్యక్తి నేడు మన కష్టాలు తీర్చగల దేవుడనీ, ప్రకృతి సహజంగా సంభవించే వింతలను మహిమలనీ, భగవత్స్వరూపుల హస్తలాఘవాన్నీ దైవిక చర్యలనీ భావిస్తున్నారు. మూఢనమ్మకాల ఊబిలో కూరుకుపోతున్నారు.
ఈ నేపథ్యంలో.. భావిభారత పౌరుల్లో శాస్త్రీయ అవగాహనా జ్యోతుల్ని వెలిగించాలి. అశాస్త్రీయ ఆలోచనా ధోరణులపై పోరాడాలి. మూఢనమ్మకాలను అరికట్టాలి. భగవత్స్వరూపులమని ప్రకటించుకొంటూ, సామాన్యుల్ని మోసగిస్తూ, మాయమాటల్ని చేప్పే వారి ఆటల్ని బహిర్గతపర్చాలి. అప్పుడే మన దేశం అన్ని రంగాలలో అభివృద్ధి అయ్యేందుకు వీలవుతుంది.
కె.ఎల్.కాంతారావు, జన విజ్ఞాన వేదిక.
No comments:
Post a Comment