7 Feb 2012

జైతాపూర్‌ పార్క్‌..

జైతాపూర్‌ పార్క్‌..

మహారాష్ట్రలో కొంకణ్‌ తీర ప్రాంతంలోని రత్నగిరి జిల్లాలో జైతాపూర్‌ వద్ద 650 మెగావాట్ల సామర్థ్యం గల ఆరు రియాక్టర్లను (సుమారు 10 వేల మె.వా.) ఫ్రెంచి కంపెనీ (అరేవా) నుండి కొనడానికి ప్రభుత్వం అంతిమంగా నిర్ణయించింది. ఈ రియాక్టర్లు మరెక్కడా ఉత్పత్తిలో లేవు. మనమీదే ప్రయోగం. అందువల్ల రిస్క్‌ చాలా ఎక్కువ. ప్రకృతిపరంగా కొంకణ్‌ ప్రాంతం ఎంతో వైవిధ్యభరితమైన సుందర ప్రాంతం. ఇక్కడే కృష్ణా, గోదావరి నదులు పుట్టాయి. దాదాపు ఐదువేల రకాల పుష్పించే చెట్లు, 139 క్షీరదాలు (పాలిచ్చు జంతువులు), 500కుపైగా పక్షులు, 179 పాముల్లా పాకే జంతువులు కలిగి ఉంది. అంతరించే ప్రమాదంగల దాదాపు 325 రకాల జీవజాతులు కూడా ఉన్నాయి. కేవలం 0.5 డిగ్రీల సెంటీగ్రేడ్‌ ఉష్ణోగ్రత పెరిగితేనే సముద్రంలో ఉండే జలచరాలు, ముఖ్యంగా చేపలు జీవించలేవని ముంబయి నేచురల్‌ హిస్టరీ సొసైటీ తెలుపుతోంది.

ఇటువంటి సముద్ర ప్రాంతంలో ఐదు డిగ్రీల అధిక ఉష్ణోగ్రత కలిగిన నీరు ప్లాంట్‌ నుండి విడుదలై, సముద్రంలో కలుస్తుంది. దీనివల్ల దాదాపు 10 కి.మీ. వ్యాసార్థంలో జీవజాతులు ప్రభావితమవుతాయి. ఇక్కడ ఏదన్నా ప్రమాదం జరిగితే, కర్మాగారంలో పనిచేసే కార్మికులే కాక, చుట్టుపక్కల 20 కి.మీ.ల వ్యాసార్థంలో ఉన్న జీవజాతులు (మనుషులు సహా) రేడియేషన్‌ దుష్ప్రభావాలకు గురవుతారు. కృష్ణా-గోదావరి జలాల ద్వారా వీటి ప్రవాహ ప్రాంతాలన్నీ రేడియేషన్‌ దుష్ప్రభావాలకు గురవుతాయి. అందుకే, మహారాష్ట్రలో అణువిద్యుత్‌ పార్క్‌ పెడితే జరిగే ఆందోళనతో మనకేంటి అని మనం అనుకోకూడదు. ఫుకుషిమా అణు రియాక్టర్ల ప్రమాద ప్రభావాలను గమనించిన ప్రజలు భూములు కోల్పోయే వాళ్లే కాక, చుట్టుపక్కల ప్రాంత ప్రజలు కూడా ఈ పార్క్‌ వద్దని ఆందోళన చేస్తున్నారు. అయినా ఈ నిరసనలు పట్టించుకోకుండా పార్క్‌ని నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పర్యావరణ అనుమతి లేకుండానే ప్రభుత్వం భూసేకరణకు ప్రారంభించింది. ఇవన్నీ ఎవరి ప్రయోజనం కోసం? ప్రజల కోసం మాత్రం కాదు.

No comments: