- 27/02/2012
TAGS:
కెప్లర్ విశ్వం నమూనా
జూహానెన్ కెప్లర్, జర్మనీకి చెందిన గణిత నిపుణుడు, ఖగోళ పరిశీలకుడు కూడా. అతను విశ్వం తీరును గురించి అందమయిన ఊహలు చేశాడు. చిత్రంగా న్యూటన్ తరువాత కూడా ఆ ఆలోచనలు నిలిచి కొనసాగుతున్నాయి. 1571-1630 మధ్యన జీవించిన కెప్లర్ గ్రహాల కదలికల గురించి మూడు సూత్రాలను సూచించాడు. ఈ అంశం గురించి న్యూటన్ మరెంతో పరిశోధించాడు. అయినా కెప్లర్ సూత్రాలు నిలిచే ఉన్నాయి. నిజానికి న్యూటన్ పరిశీలనలకు అవే ఆధారం అంటారు. కెప్లర్ నిజానికి భగవంతుడి సృష్టిలో ఒక క్రమం ఉందనీ, ఈవిశ్వానికి సంగీతం తీరుకు పోలిక ఉందనీ, అందులో అయస్కాంత శక్తికి భాగం ఉందనీ ఆలోచించాడు. గ్రహాల మార్గాల మధ్యన గల విశేషాలను గురించి కెప్లర్ ఏవేవో ప్రతిపాదనలు చేశాడు. వాటి ఆధారంగా విశ్వానికే ఒక నమూనాను తయారుచేశాడు. ఆలోచనలన్నీ నిలవలేదు. కానీకొన్ని సూత్రాలు మాత్రం నిజమయ్యాయి. అది సైన్సులోని పద్ధతి!
వోల్టాస్ బ్యాటరీ
ఆలెస్సాండ్రో వోల్టా ఇటలీకి చెందిన భౌతిక శాస్తవ్రేత్త. 1745-1827 మధ్య జీవించాడు. మనమిప్పుడు ఆలోచించకుండానే రకరకాల బ్యాటరీలను వాడుకుంటున్నాము. వాటిలోని, ఇతరత్రా విద్యుత్తును వోల్టులలో కొలుస్తున్నాము. సెల్ బ్యాటరీకి వోల్టా 1800లో తొలిరూపం ఇచ్చిన సంగతి మనకు పట్టదు. సైన్సు, టెక్నాలజీగా మారి ప్రజలలోకి వచ్చిన తర్వాత మామూలుగా ఇదే జరుగుతుంది! నిలువుగా వున్న గాజు కడ్డీలమీద, రెండు వేరు వేరు లోహాల బిళ్ళలను, ఒకదానిమీద మరొకటిగా మార్చి మార్చి పేర్చాడు వోల్టా. వాటి మధ్యన ఉప్పునీటిలో తడిపిన అట్టముక్కలను అమర్చాడు. కరెంటు పుడుతుందని తెలుసు. అది రుజువుచేయడానికి, వోల్టా మరెవరినీ పిలవలేదు. అడుగున ఉండే నీటి బేసిన్‌లో ఒక చెయ్యి పెట్టి, మరో చేత్తో, అన్నిటికన్నా పైనున్నమెటల్ ప్లేట్‌ను ముట్టుకున్నాడు. అవసరమనుకున్నప్పుడు, ఆ ప్లేటును నాలుకతో కూడా తగిలి చూచాడు. కరెంటు పుట్టిందని తెలిసింది. ఎన్నిసార్లు షాక్‌లు తిన్నాడో తెలియదు. అందులో అతనికి విజయం కనిపించింది తప్ప బాధ తెలియలేదు. అప్పటికే ఈల్ వంటి చేపలలో ఉన్న విద్యుత్తు గురించి తెలుసు. ల్యాబ్‌లో పుట్టించిన ఈ కృత్రిమ విద్యుత్తు కూడా అలాంటిదే అన్నాడు వోల్టా!
రోంజెన్ ఉంగరం
మరో జెర్మన్ దేశస్థుడు, భౌతిక శాస్తవ్రేత్త విల్‌హెల్మ్ రోంజెన్. 1845-1923 మధ్యన జీవించాడాయన. అతను కిరణాలను గురించి పరిశోధించాడు. అందుకు గాలిచొరని ఒక పెట్టెను తయారుచేశాడు. అందులోకి వెలుగు దూరడానికి, వెలికిరావడానికీ లేదు. కానీ, కొంత దూరంలో ఒక వెలుగుమాత్రం కనబడసాగింది. దాని సంగతి తెలుసుకోవాలని పగలు రాత్రి అనక వారం రోజుల పాటు అతను పరిశోధనశాలలోనే గడిపాడు. పద్ధతిగా పరిశీలన సాగించాడు. కొత్త కిరణాలు అతడిని ఆశ్చర్యంలో ముంచెత్తాయి. అందుకే వాటికి ఎక్స్ కిరణాలని పేరు పెట్టాడు. వాటిని పరీక్షించే ప్రయోగం కోసం భార్య ఆనా బెర్తాను పిలిచాడు. కిరణాల దారిలో చెయ్యి పెట్టమన్నాడు. ‘నా మృత్యువు నాకు కనిపించింది’ అన్నదామె. అవును మరి! ఆమె చేతి ఎముకలు కనిపించాయి. మాంసం ఉండీ లేనట్టు కనిపించింది. వాటికి మించి ఆమె చేతికి ఉన్న ఉంగరాన్ని కూడా మనం చిత్రంలో చూడవచ్చు. సైన్సు చరిత్రలో మైలురాయి వంటి ఈ చిత్రంలో ఉంగరం స్థానం ఏమిటి?
హబుల్ విజయం
అమెరికన్ అంతరిక్ష శాస్తవ్రేత్త ఎడ్విన్ హబుల్ 1889-1953 మధ్య జీవించాడు. విశ్వం గురించి సిద్ధాంతాలుచేసిన ఆల్బర్ట్ ఐన్‌స్టైన్ పరిశోధనల గురించి తీవ్రమయిన చర్చ జరిగింది. అతను విచిత్రమయిన వ్యక్తి. తన పొరపాటును ఏనాడూ ఒప్పుకోలేదు. హబుల్ మాత్రం, ఒక గెలాక్సీ మన నుంచి ఎంత దూరంగా ఉంటే, అది అంత వేగంగానూ మన నుంచి దూరంగా పోతున్నట్లు లెక్క అని రుజువు చేశాడు. విశ్వం ఒక బిందువుగా పుట్టి పెరుగుతున్నదని, క్రమంగా విస్తరిస్తున్నదనీ, ఐన్‌స్టైన్ మాత్రం అంగీకరించలేదు. హబుల్ ఆ విషయాన్ని రుజువు చేశాడు. ఐన్‌స్టైన్ కూడా అవునన్నాడు. ఇంకా కొంతమంది మాత్రం మొండివైఖరి కనబరచారు. హబుల్ పేరున ప్రయోగించిన టెలిస్కోప్, సాక్ష్యంగా ఎన్నో వివరాలను అందించింది!
సైన్సు పద్ధతికి, ఈ ప్రయోగాలు, విశేషాలు అన్ని చక్కని ఉదాహరణలుగా నిలబడతాయి. నిజం తెలుసుకునే ప్రయత్నంలో పరిశోధకులు కనబరిచిన క్రమశిక్షణ, పట్టుదల, ఉత్సాహం కనబడతాయి. ఈ పద్ధతి సైన్సును ముందుకు సాగించింది. మానవుల ప్రగతి వీలయింది. జీవితంలోనూ ఈ లక్షణాలు అలవాటయితే, అదే శాస్ర్తియ దృక్పథం
No comments:
Post a Comment