కాస్మిక్ ఎనర్జీ అంటే? ఇదసలు ఉందా? ధ్యానంతో ఇది శరీరంలో ప్రవేశించి రుగ్మతల్ని నివారిస్తుందా?
ఈ మధ్య విజ్ఞానశాస్త్ర పదాల్ని (scientific words), సాంకేతిక రాశుల్ని (technical terms) కుహనా శాస్త్రవేత్తలు, ఛాందసవాదులు పత్రికల మాటున, ఎలక్ట్రానిక్ మీడియా చాటున వాడుతూ ప్రజల్ని గందరగోళపరుస్తున్నారు.
కాస్మిక్ ఎనర్జీ శాస్త్రీయ అర్థాన్ని ముందుగా తెలుసుకుందాం. కాస్మిక్ అంటే విశ్వపరమైనదని అర్థం. ఎందుకంటే విశ్వాన్ని కాస్మోస్ (cosmos) అని కూడా అంటారు. సాధారణంగా కనిపించని సుదూర దూరాల్లో ఉన్న విశ్వాంతరాళ భాగాల్ని కాస్మోస్ అనడం కద్దు. కానీ సైన్సు పరిధిలో విశ్వం (universe) అన్నా కాస్మోస్ అన్నా ఒకే అర్థం ఉంది. విశ్వానికి సంబంధించిన విజ్ఞానాన్ని కాస్మోలజీ అంటారు. ఎనర్జీ అంటే శక్తి. పనిచేయగల భౌతికతంతు (physical entity) ను శక్తి (energy) అంటారు. ఇది భౌతికరాశి. విశ్వానికి కొన్ని వాస్తవాలున్నాయి.
1. విశ్వం సర్వవ్యాప్తం. ఫలానిచోటు విశ్వం లేని భాగమనీ, ఫలాని చోటు విశ్వపు భాగమనీ ఎల్లలూ, ప్రాంతీయతలూ (localities or boundaries) లేవు.
2. విశ్వం అనంతం (infinite). కానీ దానికి అంచులున్నాయి. ఆ అంచులకు ఆవల అంటూ ఏమీ లేదు. విశ్వానికి ఆవల అనడంలో అర్థం లేదు.
3. సాధారణ పరిజ్ఞానానికి అందితేనే సత్యం (fact) కాదు. ప్రయోగాల ద్వారా ఋజువైనదే సత్యం. పై రెండు విషయాలు సాధారణ పరిజ్ఞానానికి (intuition) కి అందకపోవచ్చును. కానీ అవి ప్రయోగ పూర్వకంగా ఋజువైనవి.
4. విశ్వంలో ఉన్న మొత్తం పదార్థం (mass), శక్తి (energy) పరస్పర వినిమయాలు కాబట్టి శక్తి కూడా పాదార్థికపుటంశమే. విశ్వంలో ఉన్న పదార్థం + శక్తి కలగలిపితే ఆ మొత్తం నిత్యత్వం అయ్యింది. అంటే పదార్థాన్ని సృష్టించలేము, నాశనం చేయలేము.
5. విశ్వం సృష్టించబడలేదు. అది ఒకప్పుడు లేకుండా ఉండిన తతంగం కాదు. అది ఎప్పుడూ ఉంది. తన స్వరూపాన్ని, ధర్మాల్ని మార్చుకొంటూ వస్తోంది.
ఇక శక్తికి సంబంధించిన వాస్తవాలు:
1. శక్తి లేకుండా ఏ పనీ జరగదు.
2. శక్తి పదార్థాలతోనే సంయుక్తం (associate)అయి ఉం టుంది. పదార్థాలకు బయట తనంత తానుగా శక్తి పుట్టదు. శూన్యంలో ప్రయాణించే కాంతి శక్తి (electromagnetic energy) తప్ప మిగిలిన శక్తి రూపాలన్నీ పదార్థాల కదలికలతోనే ద్యోతకం (manifest) అవుతాయి.
3. కాంతిశక్తిని ఏదో ఒక పాదార్థిక చలనం (material dynamics) విడుదల చేస్తుంది.
4. సాధారణ కార్యకలాపాలలో శక్తి నిత్యత్వమయి ఉంది (energy is conserved in all normal routine processes).
5. ఈ విశ్వంలో ఉన్న అన్నిరకాల శక్తికి మౌలిక మాత్రిక (ultimate source) ద్రవ్యమే (matter). అది E=mc2 అనే పద్ధతిలో ఖర్చవగా శక్తి పుట్టి, అది క్రమేపీ వేర్వేరు రూపాల్లోకి తర్జుమా (energy transformation) అవుతోంది.
ఈ విధమైన పరిభాషలో చూస్తే కాస్మిక్ ఎనర్జీకి మూలాలు ఇవి:
(1) సూర్యుడు, నక్షత్రాల నుంచి వచ్చే వెలుగు.
(2) మిగిలిన స్వంత వెలుగులేని గ్రహాలు, ఉపగ్రహాల నుంచి పరావర్తనం (reflection)ద్వారా అన్ని వైపులకు వ్యాపిస్తున్న వెన్నెల వంటి కాంతిశక్తి.
(3) విశ్వం మొత్తంలో కేవలం నాలుగంటే నాలుగే రకాల పరస్పర ప్రభావాలు (interactions) ఉన్నాయి. ఇందులో ఏదో ఒక ప్రభావానికి లోనుకాకుండా ఈ విశ్వంలో శక్తి ఏర్పడదు. ప్రయా ణించదు. ఖర్చు కాదు. అవి: విద్యుదయస్కాంత ప్రభావాలు (electromagnetic interactions), గురుత్వ ప్రభావాలు (gravitational interactions), బలమైన కేంద్రక ప్రభావాలు (strong nuclear interactions), బలహీనమైన కేంద్రక ప్రభావాలు (weak nuclear interactions). ఇందులో చివరి రెండు ప్రభావాలు పదార్థం బయట ఏమాత్రం ద్యోతకం కావు. పదార్థపు లోలోతుల్లో ఎక్కడో కనిష్ట ప్రాంతంలో దాగున్న పరమాణు కేంద్రకాలలో మాత్రమే ప్రభావాలను కనబరుస్తాయి. కాంతి వంటి విద్యుదయస్కాంత ప్రభావాలు, భూమ్యాకర్షణ వంటి గురుత్వాకర్షక ప్రభావాలు మాత్రమే విశ్వాంతరాళంలో ద్యోతకం అవుతాయి.
కాబట్టి గ్రహగతులు, ఉల్కలు, అణువులు, పరమాణు వులలో ఉండే చలనాలలోని యాంత్రికశక్తులు, ఎలక్ట్రాన్లకు, పరమాణుకేంద్రాలకు మధ్య ఒనగూడే విద్యుదయస్కాంత, రసాయనిక ప్రభావాలు మాత్రమే విశ్వంలో ఉన్నాయి. జీవిలోనూ, నిర్జీవిలోనూ ఉన్న శక్తులన్నీ ఒకే విధమైనవి. నిర్జీవిలో లేని శక్తి రూపాలేవీ జీవిలో ప్రత్యేకించి ఉండవు. పదార్థానికి లేనిది జీవికి ప్రత్యేకంగా శక్తి రూపమేదీ లేదు.
(4) కాస్మిక్ ఎనర్జీ ఓ వ్యక్తి మీద ఒక విధంగానూ, పక్కనున్న బండమీద మరో విధంగానూ, ఆ బండమీద పడుకొని ఉన్న కుక్క మీద ఇంకోవిధంగానూ వివక్షతతో పడదు. శక్తి పతనం (incidence) తర్వాత ఆయా వస్తువుల పాదార్థిక నిర్మాణాన్ని బట్టి ఆయా వస్తువులు ఆ శక్తితో ప్రభావితమవుతాయి.
(5) విశ్వపు అంతరంగిక మార్పుల్లో అంతర్భాగంగానే మహా విస్ఫోటనం (Big Bang) అనే సంఘటన జరిగింది. సుమారు 1500 కోట్ల సంవత్సరాల క్రితం సంభవించిన ఈ సంఘటనలో విడుదలైన కాంతి శక్తి విశ్వవ్యాప్తంగా విస్తరించి ఉంది. దీన్ని కాస్మిక్ రేడియేషన్ అంటారు. కాస్మిక్ ఎనర్జీలో ఇది కూడా ఓ అంశం.
కానీ ధ్యానం (meditation) చేస్తే కాస్మిక్ ఎనర్జీ విశ్వాంతరాళం నుంచి మన శరీరంలోకి ప్రవేశించి, మనకున్న అన్ని రుగ్మతలను పోగొడ్తుందనడంలో ఏమాత్రం నిజం లేదు. ఇది కేవలం అపోహ మాత్రమే. మత ఛాందసత్వాన్ని పెంపొందించేందుకు, పూర్వం ఋషులు, మునులు ధ్యానం చేయడం వల్ల అంతులేని అద్భుతశక్తుల్ని సాధించారనీ, శాపాలు, శాపనార్థాలు పెట్టే శక్తిని శాపవిముక్తిని కలిగించే యుక్తిని పొందారనే కల్లబొల్లి కబుర్లను సమర్థించుకోవడానికి సైన్సు పడికట్టు పదాల్ని వాడడమే ఇందులో ఉన్న నిజం. మన శరీరంలోకి తినే అన్నం ద్వారా, వీచే గాలి ద్వారా, తగిలే వెలుగు ద్వారా, యంత్రాల సాయంతో అవయవాలకు కలిగే యాంత్రికశక్తి ద్వారా మాత్రమే శక్తి వెళుతుంది. విసర్జనవ్యవస్థ ద్వారా పాదార్థిక రూపంలోనూ, చర్మం ద్వారా, శ్వాస ద్వారా ఉష్ణం రూపంలో శక్తి బయటపడ్తుంది.
రుగ్మతలకు కారణాలు శరీరంలోని ధర్మాలు, పాదార్థిక భంగిమలో తేడాలు, పరాన్నజీవులు (parasites), వ్యాధికారక సూక్ష్మక్రిములు (pathogenic microorganisms). వీటికి పరిష్కారం వైద్యము లేదా విశ్రాంతి. తపస్సు, ధ్యానం అనేవి కూడా నిద్రా రూపాలే. అంతేగానీ దానివల్ల విశ్వంలోంచి కాస్మిక్ ఎనర్జీ పనిగట్టుకొని మన కోసం వెదుక్కుంటూ వచ్చి శరీరంలోనికి దూరి, రుగ్మతల్ని పోగొట్టదు. మూఢ, కుహనా శాస్త్రపుటంశాలు ప్రజల్లో ప్రేరేపించే కొంతమంది ఛాందస మేధావుల మనస్సుల్లో ఉండే రుగ్మతలే ఇవి. వీటికి మందు ధ్యానం కాదు... అధ్యయనం. ఇదే అవసరం.
No comments:
Post a Comment