7 Feb 2012

ఆరో గది తెరిస్తే..?

ఆరో గది తెరిస్తే..?

  • విశ్వాసాలు.. వాస్తవాలు...94
''లక్ష్మీకాంతం! తిరువనంతపురంలోని అనంత పద్మనాభస్వామి దేవాలయంలోని నేలమాళిగలోని ఆరోగదిని తెరిస్తే ఏమవుతుంది?'' కబుర్ల మధ్యలో సంభాషణను మళ్ళిస్తూ ప్రశ్నించాడు సుబ్బారావు.
''ఏమవుతుంది? నీవే చెప్పు'' సుబ్బారావుకు ఎదురుప్రశ్న వేశాను.
''ఆ గదిని తెరవడానికి ప్రయత్నం చేసినవారు అకాలమరణం పొందుతారు. అలా తెరవమని పిటీషన్‌ వేసిన వ్యక్తి చనిపోయాడని పేపర్లలో చదవలేదా?'' మరల ప్రశ్నించాడు సుబ్బారావు.
నేను సమాధానం చెప్పకుండా నా ఫైలులో దాచి ఉంచిన 1-5-97 నాటి 'ఈనాడు' పత్రికలోని ఒక వ్యాసాన్ని తీసి అతనిని చదవమన్నాను. దాని సారాంశం ఇది.
కర్ణాటకలో 'సందూర్‌' అనే ఒక పట్టణంలో ఒక గుట్టమీద కుమారస్వామి దేవాలయం ఉంది. ఈ దేవాలయంలోకి పురుషులకు మాత్రమే ప్రవేశం. స్త్రీలకు ప్రవేశం నిషిద్ధం. స్త్రీలు ఆ ఆలయంలోకి వెళ్ళగూడదనీ, అలా వెళ్ళినవాళ్ళెవరూ బతకలేదనీ, అకాలమృత్యువు పాలయ్యారనీ ట్రస్టు సభ్యులూ, చుట్టుపక్కల వారూ కథలు కథలుగా చెప్పేవారు. దాంతో ఎవరూ అటు వెళ్ళే ప్రయత్నం చేసేవారు కాదు. ఇలా వందల సంవత్సరాలుగా ఈ పద్ధతి కొనసాగుతోంది.
ఇలాంటి పరిస్థితుల్లో సందూర్‌ దగ్గర్లోని నందిహళ్ళి పి.జి. సెంటర్లో రీడరుగా మల్లికాఘంటే అనే విద్యావేత్త చేరింది. ఆమె ఈ మూఢ విశ్వాసాన్ని పటాపంచలు చేయాలనీ, స్త్రీలందరికీ ఆ ఆలయ ప్రవేశం చేయించాలనీ నిర్ణయించారు. వెంటనే 1997 జనవరిలో కొంతమంది స్నేహితుల్ని తీసుకొని, ఆమె ఆలయంలోకి వెళ్ళి ప్రార్థనలు చేసొచ్చారు. ఆ తరువాత కళాశాల విద్యార్థినుల బృందం వెళ్ళొచ్చింది. అందరూ ఆనందంగా ఉన్నారు. దీంతో ఇన్నాళ్ళూ వినిపించిన కథలు అన్నీ కట్టుకథలే అని తేలిపోవడంతో నేడు రోజూ వందలాది మంది స్త్రీలు ఆ ఆలయానికి వెళ్లి, ప్రార్థనలు చేస్తున్నారు.
''ఇలాంటి నమ్మకాలు ఇంకెక్కడైనా ఉంటే కాస్త తార్కికంగా ఆలోచించి, ప్రజలను చైతన్యపరచాల్సిన బాధ్యత చదువుకున్న వారందరిపైనా ఉంది'' అనే వాక్యంతో ఆ వ్యాసం ముగిసింది.
వ్యాసం చదవడం ముగించిన సుబ్బారావు ఇలా ప్రశ్నించాడు. ''సందూర్‌లోలాగే తిరువనంతపురం నేలమాళిగ విషయం కూడ మూఢనమ్మకమైతే, ఆ నేలమాళిగను తెరవాలన్న లాయరు ఎందుకు చనిపోయాడు?''
''సుబ్బారావు! నీవు కూడా పేపర్లో చదివి ఉంటావు. ఆ లాయరుకు 70 ఏళ్ళు పైబడినాయి. అతడు కొన్ని సంవత్సరాల నుండి ఆ నేలమాళిగలలో ఉన్న నిధి విషయమై న్యాయపోరాటం చేస్తున్నాడు. 70 ఏళ్ళ పైబడిన వాళ్ళ సహజ మరణానికి ఏవో కారణాలు చెప్పడం హాస్యాస్పదం కాదా? ఆలోచించు. అంతేకాదు. ఆ నిధిని అన్నార్తులైన ప్రజల కోసం వినియోగిస్తే అనంత పద్మనాభుడు సంతోషిస్తాడు. ఇలా సంతోషపడకపోతే నీవు రోజూ ప్రార్థిస్తున్నట్లు ఆయన కరుణాపయోనిధి, కరుణా సింధువు అవుతాడా? చెప్పు'' అని ప్రశ్నించాను.
''అదికాదు లక్ష్మీకాంతం! ఆ నిధిని పేదల కోసం వినియో గించాలని ప్రయత్నిస్తే, భక్తుల పేరుతో 'పెద్ద మనుషులు' ఆ నిధిని కైంకర్యం చేస్తారు. అలా ప్రభుత్వ పథకాల డబ్బు ఎంతగా దుర్వినియోగం అవుతుందో మనం చూడటంలేదా?''

''పిచ్చి సుబ్బారావు! అనంత పద్మనాభుడు సర్వేశ్వరుడనీ, సర్వలోకపాలకుడనీ, సృష్టి స్థితి, లయలను చేయగల సర్వ సమర్థుడనీ నీవే అంటావు. రెండోపక్క ఆలయనిధిని కైంకర్యం చేస్తుంటే శిక్షించలేని వాడంటావు. ఏది నిజమోగానీ, ఒకటి మాత్రం వాస్తవం. తిరుపతిలోలాగా ఆ నిధిని విద్యాలయాలకూ, వైద్యాలయాలకూ ఖర్చుపెట్టి, పేదలకు ఉపయోగపెడితే, సందూర్‌లోలాగా మూఢ విశ్వాసాలు ప్రచారం చేసేవాళ్లు తప్పితే, మానవతా వాదులందరూ సంతోషిస్తారు. కాబట్టి సందూర్‌ దేవా లయాన్ని గూర్చి రాసిన వ్యాసరచయిత చెప్పినట్లు 'కాస్త తార్కి కంగా ఆలోచించి, ప్రజలను చైతన్యపరచాల్సిన బాధ్యత చదువు కున్న మనందరిపైనా ఉంది. ఆ కర్తవ్యం నిర్వర్తిద్దాం.. ఏమంటావు?'' అని అడిగాను.
''అలాగే అంటాను'' అని మందహాసంతో అన్నాడు సుబ్బారావు.
కె.ఎల్‌.కాంతారావు, జన విజ్ఞాన వేదిక.

No comments: