''మీరేం చేస్తారో తెలియదు. ఎవ్వరూ ఫెయిలవ కూడదు. చెప్పినందుకు మా పరువు... స్కూల్ పరువు నిలబెట్టండి'' కొందరు ప్రయివేటు, కార్పొరేటు పాఠశాలల ఉపాధ్యాయుల హెచ్చరికలివి.''వేలకు వేలు తగలెడ్తున్నాం. పాసవ్వకుంటే మా పరువే కాదు. నువ్వు కూడా పనికి రాకుండా పోతావ్'' కొందరు తల్లిదండ్రుల వార్నింగ్ ఇది.''నువ్వు పాసవ్వాలన్నదే మా కోరిక. టెన్షన్ పడకుండా చదువుకో. కష్టపడితే తప్పక పాసవుతావు. ఆ నమ్మకం మాకుంది'' ఉపాధ్యాయులతో, తల్లిదండ్రులతో విద్యార్థులకు ఎదురవుతున్న అనుభవాలివి. ఇలాంటి సలహాల్లోనూ, హెచ్చరికల్లోనూ తమ విద్యార్థులు మంచి మార్కులు తెచ్చుకోవాలన్న తపన వుండొచ్చు కానీ, అదే సందర్భంలో వారిని మానసికంగా సంఘర్షణలకు గురిచేసే పాజిటివ్, నెగెటివ్ అంశాలూ ఉన్నాయి. మొదటి రెండు వాక్యాలవల్ల విద్యార్థుల్లో నెగెటివ్ ఫీలింగ్స్ ఏర్పడే అవకాశం ఎక్కువ. ఇక మూడో వాక్యం వారిలో ఆత్మ విశ్వాసం కలిగిస్తుంది. కాబట్టి బాగా చదవడానికి ఒక ప్రశంస, ఒక పొగడ్త టానిక్‌లా పనిచేస్తుంది. 'నువ్వు చేయగలవు' 'సాధించగలవు' లాంటి మాటలు ప్రేరణగా నిలిచి విజయం వైపు నడిపిస్తాయి.
'ఫలానా అబ్బాయి చూడు ఎంత బాగా చదువుతున్నాడో ఎప్పుడు చూసినా పుస్తకం చేతిలో వుంటుంది. చదివేది గట్టిగా విన్పిస్తుంది. నీకెంత చెప్పినా బుద్ధి రాదు. ఏ కొద్దిసేపో చదువుతుంటావు' పక్కింటి పిల్లలు చదివేది వినో, చూసో తమ పిల్లల్ని కూడా అలా చదవాలని హెచ్చరిస్తుంటారు. దీనివల్ల పిల్లల్లో చదవాలన్న ఆసక్తికి బదులు తమ ముందు పొగిడిన వారి గురించి ఆలోచించే ప్రమాదం ఎక్కువ. కాబట్టి ఎప్పుడూ ఇతరుల గురించి పొగుడుతూ తమ పిల్లల్ని కించపరిచే విధంగా మాట్లాడవద్దు. ఇతరుల్ని మెచ్చుకోవచ్చు కానీ వారితో పోల్చుతూ పిల్లల్ని చులకన చేయడమనేది వారిలో వ్యతిరేక ఆలోచనలకు దారి తీస్తుంది. ఆత్మ విశ్వాసం సన్నగిల్లుతుంది. అపసవ్య ఆలోచనల సంఘర్షణలు మెదడు మెమరీలో చేరి జ్ఞాపక శక్తిని హరిస్తాయి. కాబట్టి పిల్లల్ని తీవ్రంగా ప్రభావితం చేసే విధంగా మాటలుగానీ, చేతలుగానీ ఉండ కూడదు. ఉపాధ్యాయులైనా, తల్లిదడ్రులైనా విద్యార్థుల్ని తక్కువ చేసి మాట్లాడుతున్నారంటే ఇతరులతో పోల్చి కించపర్చుతున్నారంటే... వారిని ఓటమి దారిలో నడిపిస్తున్నట్లే లెక్క.
''నువ్వు బాగా చదువుతావని తెలుసు. ఇంకాస్త కష్టపడితే ర్యాంకు తెచ్చుకోగలవు'' అన్నారనుకోండి. ఈ ఒక్క మాటే ఎంతో ప్రేరణను ఇస్తుంది. సాధించి తీరాలన్న కసిని పెంచుతుంది. లక్ష్యం వైపు నడిపిస్తుంది. చదువకపోతే మాట నిలబెట్టుకోలేమన్న ఫీలింగ్ కలిగిస్తుంది. అది పట్టుదలని పెంచుతుంది. ఆ కృషి తప్పక ఫలిస్తుంది.
పరీక్షలు దగ్గర పడుతున్నాయి కదా! ఇక సినిమాలుబంద్, ఆటలు బంద్, ఫ్రెండ్స్‌తో మాట్లాడటం బంద్ ఇలాంటివి విద్యార్థులు తమకు తాము ఓ లిమిట్‌లో పెట్టుకునేలా ఆ ఆలోచనల వారిలో కల్పించాలె తప్ప బలవంతంగా వారిని పట్టి పట్టి చేయించినట్లు ఉండకూడదు. పరీక్షలయితే మాత్రం ఏకబిగిన గంటల తరబడి పుస్తకం పట్టుకొని కూర్చున్నంత మాత్రాన మంచి మార్కులు తెస్తారనుకోలేం. ఎంత సేపు చదివారనే దానికన్న ఎంత నేర్చుకుంటున్నారన్నదే ముఖ్యం. అందుకు ఆసక్తి కూడా ముఖ్యం. ఆసక్తితో అరగంట చదివినా అది బాగా గుర్తుండి పోతుంది. ఆసక్తి లేకుండా పొద్దస్తమానం చదివినా అది నెత్తికెక్కకపోవచ్చు. అలాగని విద్యార్థుల్ని దారిలో పెట్టకూడదని కాదు. వారికి విషయం అర్థమయ్యేలా చేయగలగాలన్నదే ఇక్కడ ముఖ్యం. కాబట్టి ఇక్కడ విద్యార్థుల మనస్తత్వాన్ని అర్థం చేసుకొని మసలు కోవాలి. చదువుతోపాటు ఆడుకోవడానికి, రిలాక్స్ అవడానికి టైమివ్వాలి.
ఇలా చదవాలని? ఈ విధంగా చదవడం పద్ధతనీ పరీక్షల ముందు విద్యార్థులను ఇబ్బంది పెడుతుంటారు. అయితే ఇన్నాళ్లు ఎలా చదివితే తమకు అర్థమైందో, ఎలా చదివితే తాము మంచి మార్కులు స్కోర్ చేయగలుగుతున్నారో ఆ పద్ధతినే విద్యార్థులు ఈ ఉన్న తక్కువ సమయంలో కూడా పాటిస్తే మంచిది. అంతేగాని ఇన్నాళ్లూ లేనిది ఇప్పుడు కొత్త తరహా ప్రాక్టీస్‌వల్ల కన్‌ఫ్యూజ్ అవడగమేగాక ఫలితాలు తారుమారు కావచ్చు కాబట్టి, మీరు ఎలా చదివితే బాగా మార్కులు తెచ్చుకోగలమని భావిస్తున్నారో ఆ పద్ధతి అనుసరించడమే మంచిది. కొందరికి గట్టిగా చదివితేగానీ గుర్తుండదు? మరి కొందరికి ఎవ్వరికీ వినబడకుండా తమలో తాము చదువుకుంటేనే నెత్తికెక్కుతుంది. ఇంకొందరికి టివి చూస్తూనో, మ్యూజిక్ వింటూనో చదివితే తొందరగా గుర్తుండి పోతుంది. ఈ హాబీలు, అలవాట్లు కేవలం పరీక్షలకు నెలరోజుల ముందుమాత్రమే గమనించి బలవంతంగా మరోలా చదివించాలనుకుంటే అది వారి ఓటమికి కారణం కావచ్చు. ఎలా చదివితే విద్యార్థులు బాగా గుర్తుంచుకోగలుగుతారో... ఎలా చదివితే మంచి మార్కులు తెచ్చుకోగలుగుతారో... ఎలా చదివితే పాసవుతామన్న విశ్వాసం వారు ప్రదర్శించగలుగుతారో అలాగే చదవనివ్వండి. విద్యార్థులూ... మీరూ అదే ఫాలో అవండి. అతి తక్కువ సమయంలో అదే సరైన పద్ధతి.
No comments:
Post a Comment