"ఇందు" గలడు, "అందు" లేడు
సంప్రదాయవాదుల
లెక్కన భగవంతుడంటే విశ్వాన్ని సృష్టించినవాడు. భగవంతుడంటే మానవులకు
అలవికాని శక్తులున్నవాడు. భగవంతుడి గురించి అర్థం చేసుకోవాలంటే కళ్ళు
మూసుకుని ధ్యానం చెయ్యాలే తప్ప హేతువాద దృష్టితో విశ్లేషించకూడదు. భగవంతుడి
ప్రస్తావన అతి ప్రాచీనమైనది కనక ఈనాటి నాస్తికుల సందేహాలకు అర్థంలేదు. ఈ
ప్రతిపాదనలన్నీ తప్పుడువేనని నిరూపించవచ్చు. ఎందుకంటే దేవుళ్ళూ, దేవతలూ,
అతీతశక్తుల గురించిన భావనలు ఎటువంటివో, అవన్నీ ఎప్పుడు, ఎందుకు, ఎలా
తలెత్తుతాయో ఈ నాడు ఎవరైనా అర్థం చేసుకోగలిగిన పరిస్థితులు
ఏర్పడుతున్నాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ద్వారా సమాజంలోనూ,
చరిత్రలోనూ, విజ్ఞానశాస్త్రపరంగానూ మతవిశ్వాసాల సంకుచితత్వాన్ని గురించి
తెలుసుకోవడం కష్టమేమీ కాదు. దేవుడనేవా డున్నాడా అంటే "ఇందు"లోనే, అంటే
నమ్మేవాళ్ళ మూఢనమ్మకాల్లో మాత్రమే ఉన్నాడు. మరెక్కడా లేడు. అటువంటి నమ్మకాల
గురించీ, మెదడులో కలిగే గందరగోళం గురించీ కూడా ఈనాటి శాస్త్రవిజ్ఞానం
వివరించగలుగుతోంది. మొత్తం మీద దేవుడున్నాడనే వాదన రానురాను బలహీనపడుతోంది.
ప్రకృతి గురించి అర్థం చేసుకోగలుగుతూ, దాని మీద కొంత ఆధిపత్యాన్ని కూడా
చలాయించే స్థాయికి చేరిన ఆధునిక మానవులకు ప్రకృతిలోని మిస్టరీలన్నీ క్రమంగా
అవగాహనకు వస్తున్నాయి. మతాలకూ, దైవిక శక్తుల భావనకూ అసలైన మూలాలు
ప్రకృతి శక్తుల పట్ల ప్రాచీనులకు ఉండిన భయాల కారణంగానే మొదలయాయి కనక ఈ
పరిణామాలు ముఖ్యమైనవి. అంతా మన కర్మ అనుకోకుండా, తమ పంటలు సరిగ్గా
పండకపోయినా, బావుల్లో నీళ్ళన్నీ ఎండిపోయినా చదువురాని రైతులు కూడా ఈనాడు
విత్తనాల నాణ్యతనూ, భారీ పంపుసెట్లతో భూగర్భజలాలని పీల్చేసే పొరుగు
భూస్వాములనూ ప్రశ్నించే స్థితిలో ఉన్నారు. దేవుడి అస్తిత్వానికి ఎదురౌతున్న
సవాళ్ళెటువంటివో చూద్దాం.
మొదటిది ప్రకృతి గురించిన అవగాహన. సీదా సాదా వాతావరణ సూచనలూ, పత్రికల్లో వార్తలూ చదివితే "భవిష్యత్తును" గురించి తెలుసుకోవచ్చుననేది మామూలైంది. ఇది ఎందుకు చెప్పాలంటే ఇటువంటి "పరిశీలనలు" జరిపి, రాబోతున్న వరదలను గురించి "జోస్యం" చెప్పిన ప్రాచీన ఈజిప్ట్ పూజారులు ఒకప్పుడు చాలా గొప్ప శక్తులున్నవారుగా పేరుపొందారు. ఈరోజుల్లో పరిశీలనలు చాలా ఉన్నత స్థాయిలో జరుగుతున్నాయి. భౌతిక, ఖగోళ శాస్త్రాలు నిత్యమూ కొత్త విషయాలను కనిపెడుతూనే ఉన్నాయి. లోకాన్ని "సృష్టించినది" ఎవరనే చర్చ మొదలుపెట్టే ముందు అసలు లోకమంటే ఏమిటో ఆధునిక పరిశోధనల వల్ల తెలుసుకోవడం వీలవుతోంది. విశ్వాంతరాళం ఎంత పెద్దదో, బిగ్ బేంగ్ ఎప్పుడు మొదలైందో శాస్త్రవేత్తలు తెలుసుకుంటున్నారు. మన పూర్వీకులను భయపెట్టిన ఉల్కలూ, తోకచుక్కలూ, గ్రహణాల వంటి ఖగోళ సంఘటనలు ఎటువంటివో ఈ రోజుల్లో స్కూలు పిల్లలు కూడా చెప్పగలరు. ఎంతో దూరాన ఉండే నక్షత్రాలూ, వాటి గ్రహాలూ, కాంతి కిరణాలూ అన్నీ మనకు తెలిసిన భౌతిక సూత్రాలనే అనుసరిస్తాయి. భూమివంటి గ్రహాల మీద తలెత్తే జీవరాశి అంతా ఈ భౌతిక పరిణామాలకు లోబడి ఉండవలసిందే. ఏ అగ్నిపర్వతమో బద్దలై లావా ప్రవహించనారంభిస్తే పరిసరాలన్నీ మొక్కలూ, ప్రాణులతో సహా కాలి బుగ్గి అయిపోతాయి. భౌతిక, భౌగోళిక పరిస్థితులన్నీ అనుకూలిస్తే తప్ప దేవుడు "బొమ్మను చేసీ, ప్రాణము పోసీ" పెంచిన జీవాలేవీ బతకలేవు. మరొకవంక అణువులూ, పరమాణువులూ, ప్రోటాన్, న్యూట్రాన్ మొదలైన కణాల అంతర్ నిర్మాణమూ వగైరాల సమాచారం కూడా పోగవుతోంది. పదార్థరాశిలో నిక్షిప్తమై ఉన్న బ్రహ్మాండమైన శక్తులు గురించి కొత్త విషయాలు తెలుస్తున్నాయి. కంటికి కనబడని డార్క్ మేటర్, విశ్వమంతా ప్రసరిస్తున్న న్యూట్రినోలూ వగైరాల గురించి ఇప్పుడిప్పుడే అర్థం అవుతోంది. విశ్వంలో అక్కడక్కడా కనబడసాగిన బ్లాక్‌హోల్ కృష్ణబిలాలు ప్రతి గేలక్సీ కేంద్రంలోనూ ఉన్నట్టుగా పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. మన ప్రాచీనులు సృష్టి, స్థితి, లయ గురించి స్థూలంగా ఊహించి చెప్పారే తప్ప అంతరిక్షంలోని ఈ వివరాల ప్రసక్తి ఏ పవిత్ర గ్రంథంలోనూ కనబడదు. హిందూమతానికి ప్రత్యేకమైన లోపమేదీ లేకపోవచ్చుగాని, వేదాల్లో అన్నీ ఉన్నాయష అనేది తెలుగువారికి ఒక జోక్ అయిపోయింది. మన కేలండర్ బొమ్మల మీద కనిపించే దేవుళ్ళే ఇవన్నీ "సృష్టించారని" నమ్మడం ఎవరికైనా నానాటికీ కష్టం అయిపోతోంది. ఆదివారపు ఉదయం సముద్ర తీరాన చర్చికి వెళ్ళిన భక్తులంతా సునామీలో కొట్టుకుపోవడం "భగవదేచ్ఛ" అని నమ్మడం కన్నా, మనుషులతో ప్రమేయం లేకుండా, "ఉద్దేశ" రహితంగా సముద్రగర్భంలో జరిగిన ప్రక్రియల ఫలితమేనని అంగీకరించక తప్పడం లేదు. ఇదంతా కర్మ పరిపాకం అని సరిపెట్టుకోకుండా, అలాంటివి జరిగే ముందే పసికట్టే పరికరాలని అమర్చుకోవడం తెలివైన పని.
చరిత్ర,
పురాతత్వ పరిశోధనలవల్ల మతభావనలు ఆటవిక దశలో మనుషులకు ఎలా అలవడ్డాయో
చెప్పగలిగే ఆధారాలున్నాయి. పూజారి వర్గాలు ఎలా ఏర్పడ్డాయో, శ్రమ విభజన ఎలా
మొదలైందో, సామాన్యులను పాలకవర్గాలు ఎలా అదుపులో ఉంచాయో అన్నీ చెప్పవచ్చు.
వేల ఏళ్ళ క్రితం పశ్చిమ యూరప్‌లో కెల్ట్ జాతి ప్రజలూ, డ్రూయిడ్లూ, దక్షిణ
అమెరికాలో ఇన్కాజాతివారూ,ఇలా ప్రతీ ప్రాంతంలోనూ మతం పేరుతో చిన్నపిల్లలనూ,
పెద్దవారినీ కూడా ఎలా బలి ఇచ్చేవారో తెలిపే సాక్ష్యాలున్నాయి. ఇవన్నీ మతాల
ఆటవిక మూలాలను సూచిస్తాయి. తరవాతి చరిత్రలో మతాలకి చెడ్డ పేరు తెచ్చే
సంఘటనలకు అంతు లేదు. మధ్య యుగాల క్రూసేడ్లన్నీ రాజకీయ కుట్రల, పోరాటాల
ఫలితమే. వివిధ మతాల మధ్య అనాదిగా జరుగుతున్న సంఘర్షణలు కాక నిన్నా మొన్నా
కేథలిక్, ప్రొటెస్టంట్ల మధ్యా, ప్రస్తుతం షియా, సున్నీల మధ్యా జరుగుతున్న
పోరాటాలు మతాల మీద సామాన్య ప్రజలకి ఉన్న నమ్మకాలని దెబ్బ తీస్తున్నాయి.
భక్తులనబడే వీరందరూ కొట్టుకు చస్తూ ఉంటే భగవంతుడు "కళ్ళూ, చెవులూ మూసుకుని"
కూర్చున్నాడని అనుకోవాలి. దేవుడి సంగతి ఎలా ఉన్నా దేవుణ్ణి నమ్మేవారు
మాత్రం "కళ్ళూ, చెవులూ మూసుకుని" ధ్యానం చేసుకోక తప్పేట్టు లేదు. ఎందుకంటే
మన చుట్టూ జరుగుతున్న సంఘటనల్లో మతవిశ్వాసాలని బలపరిచేది ఒక్కటి కూడా
ఉన్నట్టు కనబడదు.
సంఘపరంగా మతవిశ్వాసాలు
ఒకప్పుడు మనుషులను బలమైన సామూహికశక్తిగా తీర్చిదిద్దినమాట నిజమే కాని,
దేవుణ్ణి పాలక వర్గాల తొత్తుగా చేసేశాక అణగారిన వర్గాలకు దేవుడు
ఒరగబెట్టినదేమీ లేదు. సమాజంలో నిత్యమూ జరుగుతున్న అన్యాయాలకు అంతు లేదు.
డబ్బూ, అధికారమూ ఉన్నవాడికి జరిగే "న్యాయం" అందరికీ వర్తించదు. ఎవెరినైనా
తుపాకీతో కాల్చి హత్య చెయ్యబోయిన మనిషి ఏ సినిమా స్టారో అయితే అమలయే చట్టం
వేరు. నిరుపేదలకూ, బడుగు ప్రజానీకానికీ రూల్సు వేరు. ఎవరి పాపమూ ఎవరినీ
"కట్టి కుడుపుతున్న" దాఖలాలేవీ లేవు. దైవభీతీ, పాప భీతీ ఉండవలసినది
అట్టడుగు వర్గాలకే అని అందరికీ తెలిసిపోతోంది. మతానికి ఉన్న రాజకీయ పక్షపాత
వైఖరి మనకు కొత్త కాదు. మతపరమైన విషయాలన్నీ సంస్కృతిలో భాగాలైపోయాయి.
చిన్న తెగలుగా జీవించినప్పుడు మనుషులను ఏకం చేసిన మతభావనలే ప్రజలను దేశాల,
ప్రాంతాల, జాతులవారీగా విభజించడానికి పనికొచ్చాయి. సర్వమానవ సౌభ్రాతృత్వం
లేకపోగా మతవిద్వేషాలు ఎన్నో శతాబ్దాల నుంచీ అంతులేని రక్తపాతాన్ని
కలిగించాయి. రథయాత్రలూ, బాంబు దాడులూ మతం పేరుతో వివిధ వర్గాలను
రెచ్చగొట్టటానికే ఉపయోగపడుతున్నాయి. పవిత్ర గ్రంథాల్లో నీతిసూత్రాలకు
పరిమితం అయిన మతబోధనలన్నీ వాస్తవరూపంలో నరరూప రాక్షసులను
తయారుచేస్తున్నాయి. ఏది పాపం, ఏది పుణ్యం, ఏ మతం గొప్పదో, ఎటువంటి మతహింస
ప్రశంసనీయమైనదో ఏ దేవుడూ చెప్పలేడు. దేశపు సరిహద్దుకు ఇటువైపున
ఉన్నవారికి పవిత్రమైన దినాలూ, ఘడియలూ అటు ఉన్నవారికి ఎందుకు వర్తించవో
తెలీదు. తప్పనిసరిగా చెయ్యవలసిన పూజలూ, వ్రతాలూ, శాంతులూ, ఉపవాసాలూ, పండగలూ
ఒకే దేశవాసులలోకూడా అందరూ పాటిస్తున్నట్టు కనబడదు. దేవుళ్ళ పేరుతో నడిపే ఈ
హాస్యాస్పదమైన తంతులన్నీ ఆధునికతను వెక్కిరించేవిగా పరిణమిస్తున్నాయి.
బలహీనులను బలవంతులు అణుస్తూ ఉంటే తక్కినవారంతా కళ్ళూ, నోరూ మూసుకుని
ఉండటానికి తప్ప ఈ దైవచింతన మరెందుకూ పనికిరావటం లేదు.
జీవశాస్త్రంలో అతివేగంగా జరుగుతున్న పరిశోధనలు మతవిశ్వాసాలకు గొడ్డలి పెట్టు అవుతున్నాయి. పంతొమ్మిదో శతాబ్దంలో సేంద్రియ జీవపదార్థానికీ, రసాయన పదార్థాలకీ సంబంధం ఉందనేది మొదటగా తెలిశాక జీవకణాల సంగతులన్నీ ఒకటొకటిగా బైటపడుతూ వచ్చాయి. ఒక వంక డార్విన్ సిద్ధాంతాలవల్ల మనుషులకూ, తక్కిన ప్రాణులకూ ఉన్న సంబంధ బాంధవ్యాలు అవగాహనకు వచ్చాయి. జీవరాశి భూమి మీద ఎటువంటి పరిస్థితుల్లో ఆవిర్భవించిందో, అందులో ఇంతటి వైవిధ్యం ఎలా ఏర్పడిందో, జీవపరిణామాన్ని భౌతిక పరిస్థితులు ఎన్ని రకాలుగా శాసిస్తాయో అన్నీ శాస్త్రవేత్తలు తెలుసుకోగలిగారు. జన్యువుల నిర్మాణం ఎటువంటిదో, శరీరలక్షణాలను నియంత్రించే ప్రక్రియలు ఎటువంటివో తెలుసుకున్నాక కొన్ని రోగాలు రాకుండా జన్యుస్థాయిలో మార్పులు చెయ్యడం కూడా ఈనాడు సాధ్యపడుతోంది. కృత్రిమంగా రెండేసి తలలున్న కోడి పిల్లలవంటి వాటిని పుట్టించగలిగే స్థాయికి జన్యుశాస్త్రం ఎదిగింది. రోగాల వ్యాప్తిలో, చావు పుటకలలో జరిగే జీవప్రక్రియలన్నీ తేటతెల్లం అవుతున్నాయి. జీవసృష్టిలో దేవుడి ప్రమేయం ఏదీ లేదని స్పష్టమైపోతోంది.
బాహ్యప్రపంచంలోని వివిధ రంగాలనుంచి దేవుడికి స్థానభ్రంశం కలుగుతూ ఉంటే ఇక ఆస్తికులకి మిగిలిందల్లా తమ మనసులోని భావాలే. ఆధ్యాత్మిక అనుభూతులన్నీ వర్ణించడానికి వీలు కానటువంటివనీ, దేవుడి ఉనికిని నిజంగా గుర్తించగలిగినది భక్తుల మనసేననీ వారు వాదిస్తారు. సైన్సు ఈ ప్రతిపాదనని కూడా కొట్టిపారేస్తోంది. గత పది, పదిహేనేళ్ళుగా మనిషి మెదడు నిర్మాణమూ, అది పనిచేసే తీరూ నిశితమైన పరిశోధనలకు లోనవుతున్నాయి. యదార్థతతో సంబంధం లేని భావాలూ, ఆలోచనలూ ఎటువంటి నాడీ ప్రక్రియలవల్ల తలెత్తుతాయో, "అతీంద్రియ" భావనల లక్షణాలేమిటో, ఏ మనోస్థితిలో మెదడులో ఎటువంటి జీవరసాయనిక ప్రక్రియలు జరుగుతాయో అంతా శాస్త్రవేత్తలకు అర్థమౌతోంది. కృత్రిమ ప్రేరణల ద్వారా మెదడులో ఆధ్యాత్మిక భావనలు కలిగించవచ్చునని నిరూపించడంతో మతాలకు ఆధారమైన భావజాలమంతా కేవలం మెదడులోని నరాల మాయాజాలమే అనేది తెలిసిపోయింది. భక్య్తావేశానికీ, మాదక ద్రవ్యాల ప్రభావానికీ, మూర్ఛ రోగుల లక్షణాలకూ పెద్దగా తేడాలు లేవని స్పష్టమౌతున్న పరిస్థితిలో దేవుడికి మనుషుల మెదడులో కూడా స్థానం లేకుండా పోతోంది.
అయినప్పటికీ మతవిశ్వాసాలను
పాలకవర్గాలు పనిగట్టుకుని ప్రోత్సహిస్తూ, సామాన్యులని మభ్యపెట్టే
ప్రయత్నాలు చేస్తూనే ఉంటాయి. మతాలకి ప్రతీకలైన దేవాలయాలకూ, మసీదులకూ
అంతులేని నిధులు సరఫరా అవుతూనే ఉంటాయి. మూఢవిశ్వాసాలదే రాజ్యం. ఈ వ్యవస్థలో
బాగుపడుతున్న ఉన్నత వర్గాలన్నీ వీటికి వత్తాసు పలుకుతూ వెనకబడ్డవారికి
"మార్గ దర్శనం" చేస్తూ ఉంటారు. గట్టిగా, ఖంగుమని మారుమోగుతున్న అబద్ధాలన్నీ
నిజాలుగా చలామణి అవుతూ ఉంటాయి. అందరికీ అందుబాటులో ఉన్న విజ్ఞానాన్ని
పక్కన పెట్టిన "విద్యాధికు" లందరూ దైవ భజనలు చేస్తూ కాలం గడుపుతారు. కుట్ర
పబ్లిక్‌గా కొనసాగుతూనే ఉంటుంది.
చేతబడుల
గురించిన నమ్మకాలూ, గ్రామదేవతలకిచ్చే బలులూ మొదలైనవన్నీ పల్లె ప్రజల
మూఢవిశ్వాసాలకు ప్రతీకలని ఆధునిక ఆస్తికులకు కూడా అనిపించడం సహజం.
భౌతికవాదం ప్రతిదాన్నిగురించీ "ఉన్నదున్నట్టుగా" వివరించడానికి
ప్రయత్నిస్తూ ఉంటుంది. కనబడనివాటిని ఊహించుకుని సంతృప్తి చెందడమో, బెంబేలు
పడడమో మనుషులకు ప్రకృతిరీత్యా అబ్బిన ఒక లక్షణం అనుకోవచ్చు. మతాలూ,
మూఢనమ్మకాలూ తలెత్తడానికి కారణం అదే.
No comments:
Post a Comment