డా. కొడవటిగంటి రోహిణీప్రసాద్
స్కూళ్ళు తెరిచేదెప్పుడో, పరీక్షల కెన్నాళ్ళున్నాయో, వేసవి సెలవలు ఎప్పుడొస్తాయో అన్నీ తెలుసుకోవడానికి మనం నెలలు లెక్క పెడుతూ ఉంటాం. భూమి సూర్యుడి చుట్టూ ఒకసారి తిరిగి రావడానికి ఏడాది అవుతుంది. ఒక ఏడాది అంటే 365 రోజులనుకుంటాం కాని ఖచ్చితంగా చెప్పాలంటే అది 365 రోజుల, 5 గంటల, 48 నిమిషాల, నలభై అయిదున్నర సెకండ్ల వ్యవధి. సంవత్సరానికి పన్నెండు నెలలనీ, వాటికి ఇంగ్లీషులో జనవరి, ఫిబ్రవరి వగైరా పేర్లుంటాయనీ మీకు తెలిసినదే. ఇవి కాక మనవాళ్ళు ఉగాది నుంచీ చైత్రం, వైశాఖం మొదలైన పేర్లతో 12 నెలలు లెక్క పెడుతూ ఉంటారు. టైము ఆగకుండా నడుస్తూనే ఉంటుంది కాని మన వీలును బట్టి దాన్ని నిమిషాలూ, గంటలూ, రోజులూ, నెలలూ, సంవత్సరాలుగా లెక్కపెట్టుకుంటాం. అసలీ నెలల పద్ధతి ఎప్పుడు, ఎలా మొదలైంది?
లక్షల సంవత్సరాల నుంచీ మనుషులు ఆకాశంలో సూర్యుణ్ణీ, చంద్రుణ్ణీ, నక్షత్రాలనూ గమనిస్తూనే ఉన్నారు. చంద్రబింబం నెలకొకసారి అమావాస్య రోజున కనబడకుండా పోతుందనీ ఆ తరవాత క్రమంగా పెద్దదై పౌర్ణమి నాటికల్లా పూర్తిగా కనిపిస్తుందనీ వారు తెలుసుకున్నారు. చంద్రుడి కళలను బట్టి లెక్క పెట్టేవే నెలలు. అందుకే చందమామను నెలవంక అని కూడా అంటారు. మొదట్లో ఈ పద్ధతిలోనే లెక్క పెట్టేవారు. ఎటొచ్చీ కేవలం చంద్రుడిని బట్టి పన్నెండు నెలలు లెక్క కడితే ఏడాదికి 354 రోజుల పదకొండుంబాతిక రోజులే వస్తాయి. ప్రకృతిలో రుతువుల్లోని మార్పులన్నీ సూర్యుడి గమనాన్ని బట్టే కలుగుతాయి కనక చంద్రుడి ఆధారంగా నెలలను లెక్కపెట్టే పద్ధతి సరిగ్గా అనిపించలేదు. ఆధునిక పద్ధతిలో నెలలను ఆ రకంగా లెక్కించరు. 28 నుంచి 31 రోజుల దాకా నెలల వ్యవధి రకరకాలుగా ఏర్పాటయి ఉంటుంది.
పురాతన కాలంలో ఇప్పటి ఇరాక్ ప్రాంతంలో విలసిల్లిన సుమేరియన్ నాగరికతలో ఏడాదికి 12 నెలలనీ, నెలకు 30 రోజులనీ లెక్కించేవారు. ప్రాచీన ఈజిప్ట్‌లోనూ అదే పద్ధతి ఉండేది కాని చివరలో అదనంగా 5 రోజులు చేరుస్తూ ఉండేవారు. క్రీ.పూ.238లో నాలుగేళ్ళ కొకసారి ఒక రోజును చేర్చుకోవాలనే పద్ధతిని వారు ప్రవేశపెట్టారు. లీప్ సంవత్సరంగా ఇప్పటికీ అది అమలులో ఉంది. క్రీ.పూ. ఏడో శతాబ్దం దాకా రోమన్ కేలండర్ పద్ధతిలో ఏడాది మార్చ్‌లో మొదలై పది నెలలపాటే కొనసాగేది. ఆ తరవాత జనవరి, ఫిబ్రవరి నెలలను చేర్చుకున్నారు. అయినప్పటికీ కొన్ని నెలలకు 29, కొన్నిటికి 30 చొప్పున రోజులుండేవి కనక అంతా తికమకగా తయారయింది. క్రీస్తు పుట్టుకకు 45 ఏళ్ళ క్రితం జూలియస్ సీజర్ అనే రోమన్ నేత ఈ వ్యవహారాన్ని సరిదిద్ది, ఇప్పుడు మనం పాటిస్తున్న పద్ధతిని ప్రవేశపెట్టాడు. తాను పుట్టిన తేదీని బట్టి ఆనాడు క్వింటిలిస్ అనే పేరున్న నెలకు తన పేరు పెట్టి జూలైగా మార్చాడు. అతని తరవాత అధికారం చేపట్టిన ఆగస్టస్ సీజర్ ఆ తరవాతి నెలను ఆగస్ట్‌గా మార్చాడు. ఈ జూలియన్ కేలండర్ లెక్కకూ, సూర్యుడి గమనానికీ 11 నిమిషాల పైగా తేడా ఉండేది. ఇది శతాబ్దాల పాటు పెరిగి కొంత గందరగోళం కలిగించింది.
పదహారో శతాబ్దంలో గ్రిగొరీ అనే రోమన్ మతాధికారి పోప్‌గా వ్యవహరిస్తున్నప్పుడు 1600 సంవత్సరాన్ని లీప్ సంవత్సరంగా నిర్ణయించాడు. ఈ గ్రిగోరియన్ పద్ధతిని అన్ని దేశాలూ అనుసరించడంతో ఇప్పటికీ అదే కొనసాగుతోంది. ఇందులో సంవత్సరాలన్నిటినీ ఏసు క్రీస్తు పుట్టిన సంవత్సరం నుంచీ లెక్కిస్తారు. దీనికి భిన్నంగా యూదు మతస్థులు గత 1200 ఏళ్ళుగా హీబ్రూ కేలండర్‌ను అనుసరిస్తున్నారు. వారి లెక్కన సృష్టి అనేది క్రీ.పూ.3761లో మొదలైంది. ఇస్లామ్ మతంలో క్రీ.శ.622 నుంచీ లెక్కిస్తారు. హిందూ పద్ధతిలో ప్రస్తుతం శాలివాహన శక సంవత్సరం 1928 నడుస్తోంది. ఇదే విక్రమ సంవత్సరం 2062 అవుతుంది.
జనవరి అనే నెల జానస్ అనే రోమన్ దేవత పేరున ప్రారంభమైంది. అలాగే ఫిబ్రవరి అనేది ఫెబ్రువా అనే రోమన్ దేవత వల్ల వచ్చింది. ఇందులో మొదట 29 రోజులుండేవి కాని ఇందులోంచి ఒకటి తగ్గించి ఆగస్ట్‌లో చేర్చారు. మార్చ్ అనేది యుద్ధాలకు అధిదేవత అయిన కుజుడి పేరుతో (మార్స్) ఏర్పడింది. ఏప్రిలిస్ అనే మాట నుంచి ఏప్రిల్ నెల పేరు వచ్చింది. ఇది (అపెరీరె) ప్రారంభాన్ని సూచిస్తుందని అంటారు. మేయెస్తా అనే రోమన్ దేవత వల్ల మే నెల పేరు వచ్చి ఉండవచ్చు. జూన్ అనే పేరుకు రోమన్ దేవత జూనో కారణమనీ, జూనియస్ అనే తెగ కారణమనీ రకరకాల ప్రతిపాదనలున్నాయి. పైన చెప్పినట్టుగా జూలై, ఆగస్ట్ నెలలకు రోమన్ చక్రవర్తుల పేర్లు ఆధారం. మొదట్లో సెప్టెంబర్ ఏడో నెలగా ఉండేది. సంస్కృతానికీ, లాటిన్ భాషకూ పోలికలున్నాయి. సంస్కృతంలో ఏడు, ఎనిమిది వగైరా సంఖ్యలను సప్తమ, అష్టమ, నవమ, దశమ అంటారు కనక ఈ శబ్దాలను పోలిన పేర్లుగా సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ కనబడతాయి. మొత్తం మీద సూర్య చంద్రుల కదలికలోని తేడాలవల్ల నెలలన్నీ తలొక రకంగా రూపొందాయి. ఇది కాక నాలుగేళ్ళకొకసారి ఏడాదికి ఒక రోజు కలుపుకుంటూ ఉంటాం.
ఇంగ్లీషు నెలల పేర్లతో బాటు మనవాళ్ళు పెట్టుకున్న పేర్లు కూడా మనం మరచిపోకూడదు. వాటిని మరొక్కసారి గుర్తు చేసుకుందాం చైత్రం, వైశాఖం, జ్యేష్ఠం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వయుజం, కార్తీకం, మార్గశిరం, పుష్యం, మాఘం, ఫాల్గుణం. మీ స్నేహితులకు కూడా ఇవి నేర్పించండి.
No comments:
Post a Comment