7 Feb 2012

మీకు తెలుసా..?

మీకు తెలుసా..?

* ఒకేరకమైన పరమాణువులు కలిగిన పదార్థం మూలకం.
* భూ గోళం మీద వైవిధ్యం గల కోట్లాది జీవ-నిర్జీవ పదార్థాలున్నాయి. ఇవన్నీ కేవలం 118 మూలకాల కలియికవల్లే రూపొందినవి.
* అన్ని మూలకాల పరమాణువుల ప్రాథమికకణాలు కేవలం ఎలక్ట్రాన్లు ప్రోటాన్లు, న్యూట్రాన్లు మాత్రమే. అంటే, భూగోళం యావత్తూ ఈ ప్రాథమిక కణాల ప్రత్యేక పొందికవల్లనే ఏర్పడింది.
* భూగోళం మీద ఉన్న అన్ని మూలకాల్లో 'ఆక్సిజన్‌' మూలకం అత్యధిక పరిమాణంలో ఉంది.
* వివిధ పరమాణువుల రసాయనిక ధర్మాలను బాహ్య ఎలక్ట్రాన్‌ కర్పరం (అవుటర్‌ ఎలక్ట్రాన్‌ షెల్‌) నిర్దేశిస్తుంది.
* పరమాణు కేంద్రకంలోని ప్రోటాన్ల సంఖ్య ఇతర ధర్మాలను నిర్దేశిస్తాయి.
నష్టాలు.. యుద్ధంలో..
గన్‌ఫౌడర్‌ ఆవిష్కరణ యుద్ధ తంత్రంలో ఎంతో మార్పును తెచ్చింది. నష్టాలనూ ఎక్కువ చేసింది. రసాయనిక విజ్ఞానాన్ని ఉపయో గించి విస్తృత నష్టాలను కలిగించే అణుబాంబులతో సహా ఎన్నో ఇతర భారీ బాంబులు రూపొందు తున్నాయి. క్లస్టర్‌ బాంబులు, నాపాలం (ఫాస్ఫరస్‌) బాంబులు, గాలిలో ఆక్సిజన్‌ను పూర్తిగా హరించివేసే ఇతర బాంబులు, జీవాయుధాలు, విషవాయువులు వెదజల్లే బాంబులు.. ఇలా పలురూపాల్లో రూపొం దించబడుతున్నాయి. యుద్ధంలో ఈ బాంబులు ఎనలేని నష్టాన్ని కలిగిస్తున్నాయి. ఈవిధంగా రసాయనిక విజ్ఞానం పెద్దఎత్తున దురుపయోగం కూడా అవుతుంది. దీనితో బలహీనుల్ని, బలహీన దేశాల్ని కూడా లొంగదీసుకుని, ఆక్రమించుకోవడానికి బలమైన దేశాలకు రసాయనికశాస్త్రం దురుపయోగమవుతుంది. హీరోషిమా, నాగసాకి మీద వాడిన అణుబాంబుల వల్ల జరిగిన ప్రాణ, ఆస్థి నష్టం అక్కడి ప్రజలను నేటికీ వెంటాడుతూనే ఉంది. అమెరికా ఇరాక్‌ ఆక్రమణ, ఆఫ్ఘనిస్తాన్‌లో దారుణ మారణకాండ తాజా ఉదాహరణలు మాత్రమే.
కాలుష్యం..
విచక్షణా రహితంగా వినియోగించే ఇంధన వాడకం, పారిశ్రామికీకరణ, ఇతర ప్రమాదాలు, భూ, జల, వాయు కాలుష్యాలకు దారితీస్తున్నాయి. వాతావరణ కాలుష్యం వల్ల ఆమ్ల వర్షాలు తరచుగా కురుస్తున్నాయి. విడుదలైన గ్రీన్‌ హౌస్‌ వాయువులు భూగోళాన్ని వేడెక్కిస్తున్నాయి. వాతావరణ ఒడుదుడుకులు పెరుగుతున్నాయి. ఒకే సంవత్సరంలో వచ్చే అతి, అనావృష్టులను మన దేశంలోనే చూడగలుగుతున్నాం. వీటన్నింటికీ మూలకారణం అవాంఛనీయ రసాయనిక మార్పులే.
సస్యరక్షణ మందులు.. వేచి ఉండుకాలం..
సస్యరక్షణ మందుల అవశేషాలు మన ఆరోగ్యాల్ని దెబ్బతీస్తున్నాయి. ఈ అవశేషాలు మన ఆరోగ్యానికి హాని కలిగించని స్థాయికి తగ్గిపోవడానికి మందులు వాడిన తర్వాత కొన్నిరోజులు వేచి ఉండాలి. వివిధ మందులతో కొన్ని కూరగాయాల్లో వేచి ఉండేరోజుల వివరాలు : కార్బరిల్‌ - 5 రోజుల వరకూ, మోనోక్రోటోఫాస్‌ - 23 రోజులు, ఫసలోన్‌ - 6-10 రోజులు, డైమిథోయేట్‌ - 5-7 రోజులు, సూపర్‌ మెత్రిన్‌ - 7-10 రోజులు, క్వినాల్‌ఫాస్‌-7 రోజులు (బెండకు 15 రోజులు), ఎండో సల్ఫాన్‌ - 7 రోజులు (క్యాబేజీ, క్యాలిఫ్లవర్‌ -10 రోజులు); మలాథియాన్‌ - 5 రోజులు, ఫెన్‌వలరేట్‌ - 7 రోజులు (టొమాట, క్యాబేజీ-15 రోజులు); డెల్టా మెథ్రిన్‌-2 (క్యాబేజీ-4 రోజులు)
చరిత్ర
'కెమి' అంటే 'విలువ' అని అర్థం. ఈ పదం అరబిక్‌ భాష నుండి వచ్చింది. దీనికి ఉర్దూలోని 'ఆల్‌' కలిపి 'ఆల్‌కెమి'గా రూపొందించారు. గ్రీకు లు ఈ పదాన్ని సొంతం చేసుకొని 'కెమి' లేదా 'కిమి'గా వాడారు. దీన్నుంచి రూపొందిందే 'కెమిస్ట్రీ' (రసాయనిక శాస్త్రం) అనే ఇంగ్లీషు పదం. రసాయనిక సూత్రాలను గుర్తించక ముందే రసాయనిక మార్పుల ఫలితాలను మానవాళి అనుభవిస్తుంది. నాలుగు వేల సంవత్సరాల క్రితం ప్రాచీన ఈజిప్షియన్లు తడి (నీరు) ద్వారా జరిగే రసాయనిక మార్పులను వినియోగించారు. క్రీ.పూ.1000 నాటికి లోహాలను ముడి ఖనిజాల నుండి వేరుచేసి, శుద్ధిచేసే ప్రక్రియ లను కనుగొన్నారు. మెరిసే పింగాణీ పాత్రలను, పులియబెట్టడం ద్వారా బీరు, వైన్‌లను, పెరుగు, జున్ను తయారుచేశారు. అలంకరణ కోసం, చిత్రాలను గీయడానికి, దుస్తులకు వేయటానికి రంగులను తయారుచేశారు. చికిత్సకోసం వివిధ చెట్ల నుండి మందుల్ని తయారుచేశారు. సుగంధ ద్రవ్యాలనూ తయారుచేశారు. పశు చర్మాలను శుద్ధిచేయడం నేర్చుకున్నారు. సబ్బుల్ని తయారుచేశారు. ఇనుము వంటి లోహ మిశ్రమాలు, రాగి వంటి లోహాలను తయారుచేశారు. వీటన్నింటిలో రసాయనిక మార్పులు ఇమిడి ఉన్నాయి. ముడి ఖనిజాన్ని శుద్ధి చేసి, బంగారాన్ని సేకరించారు. అతి చౌకగా, విరివిగా దొరికే సీసం నుండి బంగారాన్ని రూపొందించాలనే లక్ష్యంతో పూర్వీకులు ప్రయత్నం చేశారు. ఇది 'ఆల్‌కెమి'గా (లోహాలతో ప్రయోగం) ప్రాచుర్యం పొందింది. కానీ, ఇలా బంగారాన్ని పొందలేకపోయారు.
పీరియాడిక్‌ చార్ట్‌ లేక పట్టిక
సంక్లిష్టమైన, విస్తారమైన సమాచారాన్ని అతి క్లుప్తంగా, అర్థవంతంగా చెప్పడానికి పట్టిక లేదా చార్ట్‌లను రూపొందిస్తాం. సంక్లిష్టమైన అన్ని మూలకాల ధర్మాలను అతి క్లుప్తంగా చెప్పేందుకు పీరియాడిక్‌ చార్ట్‌ లేదా పట్టిక రూపొందించబడింది. దీన్ని అర్థంచేసుకోవడం రసాయనిక శాస్త్రంలో అతి ముఖ్యం. మనకు తెలిసిన విజ్ఞానంలో ఇదే అత్యంత సమర్థవంతమైన, ప్రామాణికమైన పట్టిక. దీన్ని రష్యా రసాయనిక శాస్త్రజ్ఞుడు 'డిమిట్రీ మెండలీవ్‌' 1869లో రూపొందించాడు.కొద్ది మార్పులతో ఇదే ఇప్పటికీ కొనసాగుతుంది. దీనిలో 118 మూలకాల ధర్మాలు ఇమిడ్చారు. మొదట ఈ పట్టికను పరమాణుభారం (ఆటమిక్‌ వెయిట్‌) ఆధారంగా రూపొందించినప్పటికీ తర్వాత పరమాణు సంఖ్యకు (కేంద్రకంలో ప్రోటాన్ల సంఖ్య) మార్చబడింది. ఇలా రూపొందిన ఈ పట్టికలో కొన్ని ఖాళీలు వచ్చాయి. వీటి ఆధారంగా కొత్త మూలకాలు కనిపెట్టబడ్డాయి. ఇదే ఈ పట్టిక ప్రత్యేకత. ఈ పట్టికలో నిలువుగా ఒకే వరుసలో ఉండే మూలక రసాయనికచర్యలు ఒకేవిధంగా ఉంటాయి. అడ్డంగా ఒకే వరుసలో ఉండే మూలకాల పరమాణవుల ఆక్సీకరణ సామర్థ్యం, శక్తి, విద్యుత్‌ఛార్జి తదితరాలు ఒకేవిధంగా ఉంటాయి. 112 నుండి 118 వరకూ ఉన్న మూలకాల పరమాణువులు (ఉదా: నెఫ్ట్యూనియం తదితరాలు) అస్థిరంగా ఉంటాయి. సహజస్థితిలో వీటిని గమనించలేం.

No comments: