21 Feb 2012

గాలి కాలుష్యంతో గుండెపోటు


ఏడు రోజులపాటు కాలుష్యానికి ప్రభావితమైతే గుండెపోటు ప్రమాదం పెరుగుతుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. హానికరమైన అధిక గాలి కాలుష్య సంఘటనలు ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయని 50 ఏళ్ల నుంచి అనుమానిస్తున్నారు. తక్కువ వ్యవధి గాలి కాలుష్యానికి ప్రభావితమవడానికి, గుండె పోటు ప్రమాదానికి మధ్య ఉన్న సంబంధంపై పారిస్‌ డిస్కరట్స్‌ విశ్వవిద్యాలయానికి చెందిన హజ్‌రిజి ముస్టఫిక్‌, అతని సహచర బృందం వ్యవస్థీకృత సమీక్ష చేశారు. ప్రధానమైన గాలి కాలుష్యం కారకాలను వీరు విశ్లేషించారు. ఇందులో ఓజోన్‌, కార్బన్‌ మోనాక్సైడ్‌, నైట్రోజన్‌ డైయాక్సైడ్‌, సల్ఫర్‌ డయాక్సైడ్‌, కాలుష్యకణాల వ్యాసార్థం 10 మైక్రోమీటర్ల నుంచి 2.5 మైక్రోమీటర్ల వరకు ఉన్నాయి. ఈ అంశానికి సంబంధించిన వైద్యసాహిత్యాన్ని పరిశీలించారు. ఇందులో 34 అధ్యయనాలు విశ్లేషణ ప్రమాణానికి సరిపోయాయి. గాలి కాలుష్యంలో సి-రియాక్టివ్‌ ప్రోటీన్‌ ఉంటుంది. అధిక గాలికాలుష్యం స్థాయి ఉన్నప్పుడు గుండె కొట్టుకునే రేటు పెరగడం, తగ్గడం జరుగుతుంది. గాలి కాలుష్యం వల్ల రక్తం చిక్కదనం పెరుగుతుంది. ఇది రక్తం గడ్డకట్టడానికి, అథిరొస్క్లిరొసిస్‌కు దారితీస్తుంది. అయితే ధూమపానం, అధిక రక్తపోటు, మధుమేహం వల్ల వచ్చే గుండెపోటుతో పోలిస్తే గాలి కాలుష్యం వల్ల వచ్చే గుండెపోటు తక్కువే. తక్కువే కదా అని దీన్ని ఉపేక్షించకూడదు. ఎందుకంటే మెజారిటీ జనాభా గాలి కాలుష్యానికి ప్రభావితం అవుతున్నది. ముఖ్యంగా నగరాల్లోయువత, మధుమేహ రోగులు కాలుష్యబారినపడుతున్నారని పరిశోధకులు పేర్కొన్నారు. దీనిపై మరింత అధ్యయనాలు చేయాల్సిన అవసరం ఉందని వారు అభిప్రాయపడ్డారు.

No comments: