ప్రభుత్వ విధానాల వల్ల గ్రామీణ పేదల జీవితాలు అస్థ వ్యస్థమవుతున్నాయి. గ్రామీణ చేతివృత్తిదారుల జీవితాలు విచ్ఛిన్నమవుతున్నాయి. పనుల కోసం వలసలు పోవాల్సి వస్తోంది. వీరి విద్యాస్థాయి అంతంతమాత్రమే. ఆధునిక సాంకేతిక విజ్ఞానంలో శిక్షణ ఇచ్చి.. వీరి జీవితాలను మెరుగుపర్చాల్సిన అవసరం నేడుంది. ఈ లక్ష్యంతోనే హైదరాబాద్‌కు సమీపాన ఉన్న నల్గొండజిల్లాలోని భూదాన్ పోచంపల్లిలో 'స్వామి రామానంద తీర్థ రూరల్ ఇనిస్టిట్యూట్' పనిచేస్తుంది. దీని కార్యక్రమాలు గ్రామీణుల వ్యవసాయాభివృద్ధికి కూడా తోడ్పడుతున్నాయి. ఈ సంస్థ కార్యక్రమాలను తెలుపుతూ.. ఈవారం 'విజ్ఞాన వీచిక' మీముందుకొచ్చింది.
శిక్షణ ద్వారా వృత్తి నైపుణ్యాన్ని పెంచుతూ గ్రామీణులను (18-50 ఏళ్ల వయస్సువారికి) సాధికారత అందించాలనే ప్రధాన లక్ష్యంతో 1995లో 'స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థ' స్థాపించబడింది. దీని కార్యక్రమాలు 2000 సంవత్సరం నుంచి పుంజుకున్నాయి. ఇంటిదగ్గరే శిక్షణ ఇవ్వాలనే ప్రధాన లక్ష్యంతో వివిధ జిల్లాల్లో స్థాపించిన 75కి పైగా విస్తరణ కేంద్రాల ద్వారా గ్రామీణ పేద లకు శిక్షణ అందించబడుతుంది. ప్రతి ఏడాది దాదాపు 17-18 వేల గ్రామీణ పేదల నైపుణ్యాన్ని ఈ సంస్థ పెంచు తోంది. ఈ విస్తరణ కేంద్రాలు ప్రధానంగా నల్గొండ, మహబూబ్‌నగర్, అనంతపురం, రంగారెడ్డి, నిజామా బాద్, వరంగల్, కృష్ణ, పశ్చిమగోదావరి, కరీంనగర్, గుంటూరు తదితర జిల్లాల్లో ఉన్నాయి.
ఇతర సంస్థల సహకారం..
ఈ సంస్థకు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్‌ప్రైజెస్; మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యువబుల్ ఎనర్జీ; ఎంప్లాయిమెంట్ జనరేషన్ అండ్ మార్కెటింగ్ మిషన్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం; ఇంటిగ్రిటెడ్ ఐసిడిఎస్; ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లీజింగ్ అండ్ ఫైనాన్సింగ్ సర్వీసెస్ క్లస్టర్స్-హైదరాబాద్ తదితర సంస్థలు సహకరిస్తున్నాయి.
వసతి సౌకర్యాలు..
పై శిక్షణా కార్యక్రమాలను ఉచితంగా ఇస్తారు. దూర ప్రాంతాల నుండి వచ్చిన వారికి వసతి సౌకర్యం కూడా ఉంటుంది. వీటిని ఎవరైనా స్పాన్సర్‌షిప్ (ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వెల్ఫేర్, మహిళలు, రైతులు కొన్ని స్వచ్ఛంద సంస్థలు) చేస్తే శిక్షణ, వసతి రెండూ ఉచితంగా కల్పిస్తారు. స్పాన్సర్ షిప్ లేకపోతే శిక్షణ వరకు ఉచితంగా ఇస్తారు. వసతి సౌకర్యానికి నెలకు రూ.700లు చెల్లించాల్సి ఉంటుంది.
మీకు తెలుసా..?
* స్వామి రామానంద తీర్థ స్వాతంత్య్ర సమరయోధుడు. హైదరాబాద్ సంస్థాన్ విమోచనానికి పాటుపడ్డ ముఖ్యనేతల్లో ఒకరు. వీరి అసలు పేరు వెంకటేష్ బాపురావు ఖడ్గేకర్. ఈయన అక్టోబర్ 3, 1903లో గుల్బర్గా జిల్లాలో జన్మించి; జనవరి 22, 1972లో మరణించారు.
స బాల గంగాధర్ తిలక్‌ను ఆదర్శంగా తీసుకుని, గాంధీజీ సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొన్నారు. ప్రసిద్ధ కార్మికనేత ఎస్‌ఎం జోషితో కార్మికోద్యమాల్లో పాల్గొన్నారు.
* జనవరి 14, 1930లో సన్యాసిగా మారి, స్వామి రామానంద తీర్థగా పేరును మార్చుకున్నారు.
* గ్రామీణాభివృద్ధి, గ్రామీణుల అభివృద్ధి ఒకటే కావు. కొంతమంది గ్రామీణులు అభివృద్ధి చెందితే గ్రామం అభివృద్ధి చెందినట్లు కాదు. గ్రామ సమిష్టి అవసరాల అభివృద్ధే గ్రామీణాభివృద్ధి.
* పట్టణాభివృద్ధి సాంకేతికాలు గ్రామీణా భివృద్ధికీ తోడ్పడతాయి.
* గ్రామస్థాయి నైపుణ్యంతో నిర్వహించేవి గ్రామీణ సాంకేతికాలు. మరమ్మతు సమస్యలు వచ్చినప్పుడు గ్రామస్థాయిలోనే సవరించగలగాలి.
* ఇంతవరకు దాదాపు లక్ష గ్రామీణ పేదలు స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థ శిక్షణతో లబ్ధి పొందారు.
* ఏ లక్ష్యంతో ఖర్చుపెట్టామనేది గ్రామీణా భివృద్ధిని నిర్ధారిస్తుంది. ఎంత ఖర్చు పెట్టామనేది ఆ తర్వాత స్థానాన్ని ఆక్రమిస్తుంది.
శిక్షణా కార్యక్రమాలు..
వయస్సు (18 నుండి 50 ఏళ్ల వయస్సు), లింగ భేదం లేకుండా గ్రామీణులకు వివిధ అంశాల్లో శిక్షణ ఇస్తున్నారు. వీటిల్లో కొన్ని 21 రోజులు, నెల, రెండు నెలలు, మూడు నెలలు శిక్షణ పొందే కోర్సులు ఉన్నాయి. ఇక్కడ శిక్షణ పొందిన వారికి నేరుగా వివిధ కంపెనీల్లో ఉపాధి పొందేలా కూడా ఈ సంస్థ సహాయపడుతుంది. వివరాల్లోకి వెళితే...
ఐదవ తరగతి అర్హతగల వారికి...
ఎంబ్రాయిడరీలో 60 రకాలను (చేతి, మిషన్ ఎంబ్రాయిడరీ); జర్దోశీ (మగ్గం వర్కు) / ఆరీ ఎంబ్రాయి డరీ పనులు; కుట్టు పని; దుస్తుల తయారీ; ఆధునిక నైపుణ్యం కలిగిన దుస్తుల తయారీ; కుండలపై, చీరలపై పెయింటింగ్ చేయడం; రంగుల అద్దకం (బాతిక్ డిజై నింగ్); బ్లాక్ ప్రింటింగ్; టై అండ్ డై; క్విల్ట్‌లు (ప్యాచ్ వర్క్); అందమైన బ్యాగుల తయారీ (25 రకాలు); జ్యూట్ వస్తువుల తయారీ (21 రోజుల్లో) నేర్పిస్తారు; వీటి శిక్షణకు కొలతలు తెలుసుకోగలిగే పరిజ్ఞానం ఉంటే సరిపోతుంది. శిక్షణా కాలం : దాదాపు 3 నెలలు
పదవ తరగతి అర్హతగల వారికి...
ఆహారశుద్ధి, నిల్వ (ఆయా కాలాల్లో దొరికే కూరగాయలను నిల్వ చేసుకో వడం, వివిధ పద్ధతుల్లో తయారు చేయడం నేర్పిస్తారు. ఉదా: ఒరుగులు, వడియాలు, చల్ల మిరపకాయలు, జామ్‌లు, జ్యూస్‌లు (ఒక నెల); వ్యక్తిత్వ వికాసం, పరిశ్రమ, చిన్న చిన్న వృత్తులను స్వయంగా నిర్వహించగలిగే చొరవను (ఎంటర్‌ప్రైన్యూర్) పెంచే శిక్షణ. వ్యక్తిత్వ వికాసం ద్వారా ప్రచార, మార్కెటింగ్ నైపుణ్యాల అభివృద్ధి, సౌరశక్తి వినియోగంలో నైపుణ్యాన్ని (ఉదా: సౌరశక్తితో లైట్ ఛార్జింగ్ చేయడం; నీటిని వేడిచేయడం తదితరాలు) పెంపొందిస్తారు.
ఙ పదవ తరగతి పాస్ / ఫెయిల్ అయిన వారికి...
ఎలక్ట్రికల్ వర్క్స్ (మోటార్ రివైండింగ్, గృహానికి ఎలక్ట్రికల్ వైరింగ్, ఎలక్ట్రికల్ వస్తువుల మరమ్మతు); ఎలక్ట్రానిక్ వస్తువుల (టివి, రేడియో, మిక్సీ, సెల్‌ఫోన్స్) మరమ్మతులో శిక్షణ. సెల్‌ఫోన్ రిపేరింగ్; ఆటోమొబైల్ (2 / 3 / 4 చక్రాల వాహనాల మరమ్మతు) మెకానిజం.
ఇంటర్ అర్హతగల వారికి...
కంప్యూటర్ కోర్సులు; ఎంఎస్ ఆఫీస్, డిటిపి, డేటా ఎంట్రీ ఆపరేటర్, కంప్యూటర్ ఎకౌంటింగ్; కంప్యూటర్ హార్డ్‌వేర్ కోర్సులు. శిక్షణాకాలం: రెండు నెలలు. వ్యక్తిత్వ వికాసం; ఎంటర్ ప్రెన్యూర్ డెవలప్‌మెంటు కోర్సుల శిక్షణాకాలం: 2 వారాలు.
పై అంశాలతో పాటు కారు డ్రైవింగ్‌ను కూడా ఈ సంస్థ విస్తరణ కేంద్రాల్లో నేర్పిస్తున్నారు.
కొత్త కోర్సులు..
నేషనల్ కౌన్సిల్ ఆఫ్ రూరల్ ఇనిస్టిట్యూట్, న్యూఢిల్లీ సహకారంతో వ్యవసాయానికి సంబంధించిన (ఫామ్ మిషనరీ) అన్ని పరికరాల వాడకం, మరమ్మతులో శిక్షణ ఇస్తున్నారు. ప్రధానంగా గ్రామీణ రైతులకు ఇది ఎంత గానో ప్రయోజనం చేకూరుస్తుంది. అర్హత: పదవ తరగతి పాస్ / ఫెయిల్.
కొన్ని సూచనలు..
* గ్రామీణుల అభివృద్ధే లక్ష్యంగా ఈ సంస్థ పనిచేస్తుంది. సంస్థ కార్యక్రమాలన్నీ గ్రామీణ పేదల నైపుణ్యాన్ని పెంచి, వారి జీవితాలను స్థిరపర్చేందుకు తోడ్పడుతుంది. ఇది ఆహ్వానించదగినది. కానీ, దీనికితోడు గ్రామీణులందరినీ సమిష్టిగా వేధించే సమస్యలు కూడా ఎన్నో ఉన్నాయి. వీరి కోసం కూడా అభివృద్ధి కార్యక్రమాల్ని రూపొందించాలి.
* విత్తన ఉత్పత్తి శిక్షణ, పట్టణ వ్యర్థ పదార్థాలతో భూ జీవ సంబంధాల పునరుద్ధరణ (ఎరువు రూపంలో); గ్రామీణ పారిశుధ్య వ్యర్థ పదార్థాల యాజమాన్యం తదితర అంశాలపై శిక్షణా కార్యక్రమాలు గ్రామీణాభివృద్ధికి ఎంతో అవసరం.
* గ్రామీణ వృత్తులు క్షీణించాయి. ఆధునిక విజ్ఞానంతో వీరి వృత్తుల్ని మెరుగుపరిచి, విస్తరింపజేయాల్సి (డైవర్స్‌ఫై) ఉంది. దీనికి సంబంధించిన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉంది. వీటిని ఉపయోగించి, గ్రామీణ వృత్తులను పునరుజ్జీవింపచేయాల్సి ఉంది.
* రైతుల ఆదాయాల్ని పెంచి, వారి కుటుంబసభ్యులకు పని కల్పించడానికి గ్రామాల్లో రైతుస్థాయిలోనే శుద్ధికార్యక్రమాలను చేపట్టాలని ప్రభుత్వం చెపుతోంది. అయితే, దీనికనుగుణంగా ప్రయోగాత్మకంగానైనా ప్రారంభించగల కార్యకలాపాలను, పరిశ్రమలను గుర్తించి, స్థాపనకు అనుగుణమైన ఎస్టేట్‌లను ఏర్పాటు చేయాలి. దీనికోసం నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజెస్; మినిస్ట్రీ ఆఫ్ అగ్రో ప్రాసెసింగ్ ఇండిస్టీస్ సహకారంతో ఈ ఎస్టేట్‌లను ఏర్పరచాలి. ఈ అనుభవాలను ఇతర గ్రామాలకూ విస్తరించాల్సిన అవసరం ఉంది.
* ఈ సంస్థ విస్తరణ కేంద్రాలను అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేయాలి.
* జనవిజ్ఞాన వేదిక వంటి ప్రజా విజ్ఞానశాస్త్ర సంస్థల సమన్వయ, సహకారాలతో గ్రామీణాభివృద్ధికి కృషి చేయాలి.
* దీనికి అనుగుణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవసరమైన సహకారాన్ని అందించాలి.
శిక్షణా పద్ధతులు..
కింది పద్ధతులతో శిక్షణ ఇస్తారు.
* ఆధునిక యంత్రాలు, సాంకేతిక ప్రక్రియ లతో స్వయంగా నేర్చుకొనే ప్రత్యక్ష శిక్షణ.
* దృశ్య, శ్రవణ పద్ధతుల ద్వారా.
* వ్యక్తిగత పర్యవేక్షణ, పరీక్షల ద్వారా కీలక శిక్షణ.
* హెచ్‌ఐవి, ఎయిడ్స్, ఆరోగ్య, వ్యక్తిగత, సామాజిక పరిశుభ్రతల గురించి అవగాహన కలిగించడం.
* పరిశ్రమ, చిన్న చిన్న వృత్తులను స్వయంగా నిర్వహించగలిగే చొరవను పెంచే (ఎంటర్‌ప్రెన్యూర్) శిక్షణ.
* వ్యక్తిత్వ వికాసం ద్వారా ప్రచార, మార్కెటింగ్ నైపుణ్యాల అభివృద్ధి.
* సామాజిక అభివృద్ధి, స్వయం సహాయబృందాల గురించిన విజ్ఞానాన్ని అందించడం.
వివరాలకు సంప్రదించాల్సిన చిరునామా:
స్వామి రామానంద తీర్థ రూరల్ ఇనిస్టిట్యూట్, జాలాపూర్ (గ్రా), భూదాన్ పోచంపల్లి (మ),నల్గొండ జిల్లా - 508284, ఫోన్:08685 - 222552/205076
వెబ్‌సైట్:www.srtri.com: Email:srtri@rediffmail.com
No comments:
Post a Comment