- -కాండ్రకోట వీరునాయుడు
- 09/02/2012
TAGS:
ఏటికొప్పాక లక్కబొమ్మ భారత 63వ గణతంత్ర దినోత్సవం వేడుకల్లో కొలువుదీరే అరుదైన అవకాశం దక్కించుకుని వస్త్ర మంత్రాలయ కళాకారుల శకటంపై హుందాగా ఊరేగి అందరినీ ఆకట్టుకుంది. వందేళ్ళ కిందట నక్కపల్లి సంతలో లక్కపిడతగా కళాభిమానుల దయ, ఆదరణలను అర్థిస్తూ కళాకారులకు అరకొరగా తిండిగింజలందించిన లక్కబొమ్మ నేడు ఊరూ, వాడా దాటి దేశ విదేశాల్లో ముచ్చటగొలిపే ముద్దుగుమ్మగా కళాహృదయాలను ఆకర్షించి ఖండాంతర ఖ్యాతిని ఆర్జిస్తోంది. తనను నమ్ముకున్న హస్త కళాకారులకు పట్టెడన్నం పెట్టేందుకు కొత్తసొబగులద్దుకుని మారుతున్న కాలానికనుగుణంగా ముస్తాబయి కళా ప్రపంచంలో ఏటికొప్పాక కీర్తి పతాకను సమున్నతంగా ఎగరేస్తోంది. అంతర్జాతీయ స్థాయి పురస్కారాలు ఇప్పుడిప్పుడే ఏటికొప్పాకకు చేరువవుతున్నాయి. ఈ కృషిలో ముందుకు సాగిపోతున్న జాతీయ పురస్కార గ్రహీత, లిమ్కాబుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం పొందిన నిత్యకృషీవలుడు యువకళాకారుడు శ్రీ శైలపు చిన్నయసూరి ఏటికొప్పాక లక్కబొమ్మని చంకనెత్తుకుని ప్రతిష్ఠాత్మక జాతీయస్థాయి ప్రదర్శనల్లో పాల్గొంటున్నాడు. జాతీయ హస్తకళల అభివృద్ధి సంస్థ ఆహ్వానం అందుకుని, డెవలప్‌మెంట్ కమిషనర్, హేండీక్రాఫ్ట్స్, న్యూఢిల్లీ వారి ప్రోత్సాహంతో చిన్నయాచారి బొమ్మల కళ విభాగంలో భారత గణతంత్ర దినోత్సవ వేడుకల్లో హస్తకళా ప్రదర్శకునిగా పాల్గొన్నాడు. ఈ వేడుకలో పాల్గొనేందుకు మినిస్ట్రీ ఆఫ్ టెక్స్‌టైల్స్ ‘వస్త్ర మంత్రాలయ’కు మొదటిసారి అవకాశం లభిస్తే అందులో ఆంధ్రప్రదేశ్ నుండి జాతీయస్థాయి కళాకారుడిగా ఏటికొప్పాక గ్రామస్థుడైన చిన్నయాచారి పాల్గొనడం రాష్ట్ర హస్తకళాకారులందరికీ గర్వకారణం. ఎనిమిది రోజులపాటు రక్షణశాఖ పర్యవేక్షణలో ఏటికొప్పాక లక్కబొమ్మల తయారీ కళను వస్తమ్రంత్రాలయ శకటంపై జనవరి 26న రిపబ్లిక్‌డే పెరేడ్‌లో ప్రదర్శించాడు. అంతర్జాతీయస్థాయి ప్రమాణాలతో లక్క బొమ్మలను అందంగా తయారు చేయటం నేర్చుకున్న చిన్నయాచారి ఇప్పుడు హర్యానా సూరజ్ కుంద్ జాతీయస్థాయి హస్తకళా ప్రదర్శనలో పాల్గొంటున్నాడు. ఫిబ్రవరి 15 వరకూ జరిగే ఈ ప్రదర్శనలో అందరూ పురస్కార గ్రహీతలే ప్రధానంగా పాల్గొన్నారు.
గతంలో రాష్టప్రతి చేతులమీదుగా జాతీయ పురస్కారం అందుకున్న చిన్నయాచారి ఏటికొప్పాక లక్కబొమ్మలను ఈ ప్రదర్శనలో ప్రదర్శిస్తాడు. అమ్మకం ప్రోత్సాహకరంగా ఉంటుందని, ఇలాంటి ప్రదర్శనలో పాల్గొనడం ద్వారా ఏటికొప్పాక లక్కబొమ్మలకు ఆదరణ పెరుగుతుందని, తద్వారా మా గ్రామ హస్తకళాకారులందరికీ పని, ప్రోత్సాహం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు చిన్నయాచారి.
గతంలో రాష్టప్రతి చేతులమీదుగా జాతీయ పురస్కారం అందుకున్న చిన్నయాచారి ఏటికొప్పాక లక్కబొమ్మలను ఈ ప్రదర్శనలో ప్రదర్శిస్తాడు. అమ్మకం ప్రోత్సాహకరంగా ఉంటుందని, ఇలాంటి ప్రదర్శనలో పాల్గొనడం ద్వారా ఏటికొప్పాక లక్కబొమ్మలకు ఆదరణ పెరుగుతుందని, తద్వారా మా గ్రామ హస్తకళాకారులందరికీ పని, ప్రోత్సాహం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు చిన్నయాచారి.
No comments:
Post a Comment