INDIAN SCIENCE TEACHER

7 Feb 2012

పశువులు ఎర్ర రంగుని గుర్తిస్తాయా? తేనె వల్ల వెంట్రుకలు తెల్లగా మారతాయా?

పశువులు ఎర్ర రంగుని గుర్తిస్తాయా? తేనె వల్ల వెంట్రుకలు తెల్లగా మారతాయా?

'నరసింహ' అనే సినిమాలో సౌందర్య, రమ్యకృష్ణలు ఎర్రనిచీర ధరిస్తే ఎద్దు వారి వెంటపడుతుంది. ఇలా పశువులు ఎరుపురంగును గుర్తిస్తాయా?
- ఎ.పల్లవి, ఫాతిమా ఉన్నత పాఠశాల, కాజీపేట, వరంగల్‌.
మానవుడు, పరిణామక్రమంలో కొంతమేరకు మానవుడికి దగ్గరగా ఉన్న చింపాంజీ, ఒరాంగుటాన్‌ వంటి కొన్ని కోతి జాతులకు తప్ప మిగిలిన జీవులకు రంగుల్ని చూసే సామర్థ్యం లేదు. చతుష్పాదుల (quadripods) యిన ఎద్దులు, కుక్కలు, గొర్రెలు, గాడిదలు, గుర్రాలు వంటి జంతువులు కేవలం తెలుపు-నలుపు ఛాయల (gray shades) ద్వారా వస్తువుల రూపాల్ని, తేడాల్ని గుర్తిస్తాయి. కోతుల్లాంటి జంతువులు నలుపు, తెలుపులతో పాటు కొంతమేరకు రంగుని పసిగట్టగలవు. కొన్ని కీటకాలు, నిశాచరజీవులు (nocturnal animals) మనం చూసే దృశ్యకాంతి (visible range)లో చూడలేవు. పరారుణ కాంతి (infrared light) ని గానీ, అతి నీలలోహిత కాంతి (ultraviolet light) ని గానీ కొంతమేరకు చూడగలవు. ఎక్కువ జంతు జాతి జీవులు వర్ణ వివక్ష (colour discrimination) లను చూపలేవు. కళ్లున్న జంతువుల కళ్లల్లో బాగా వెనుక ఉండే తెరను 'రెటీనా' అంటారు. ఇందులో కాంతి తీవ్రతను పసిగట్టే రాడ్లు (rods) అనబడే కాంతిగ్రాహక కణాలు (photoreceptor cells), రంగుల్ని గుర్తించగల కోన్లు (cones) అనబడే వర్ణగ్రాహక కణాలు (chromoreceptor cells)) ఉంటాయి. రాత్రుళ్లు రాడ్లు, పగలు కోన్లు చురుగ్గా పనిచేస్తాయి. ఎద్దుల కళ్లల్లో రాడ్లు ఎక్కువ. కోన్లు దాదాపు ఉండవు. కాబట్టి 'నరసింహ'లోని నరుడు తప్ప సింహాలు, ఎద్దులు రంగుల్ని చూడలేవు. సినిమా రంగంలో ఎన్నో అశాస్త్రీయపుటంశాలు ఉన్నాయి. ఎద్దు ఎర్రచీర వెంటపడటమూ ఓ అశాస్త్రీయ కథనం.
జుట్టుమీద తేనె పడితే వెంట్రుకలు తెల్లగా అవుతాయెందుకు?
- ఎ.అర్చన, ఫాతిమా ఉన్నత పాఠశాల, కాజీపేట, వరంగల్‌.
తేనె చిక్కటి తీపి ద్రవం. ఇందులో ప్రధానంగా ఫ్రక్టోజ్‌ (దాదాపు 39 శాతం), గ్లూకోజ్‌ (సుమారు 32 శాతం) అనే తేలికపాటి చక్కెరలు (mono saccharides) ఉంటాయి. కొద్దో గొప్పో ఇతర మోనోశాకరైడులు, కొంతమేరకు సాధారణ చక్కెర (సూక్రోజ్‌, సుమారు రెండు శాతం), మాల్టోజ్‌ అనే మరో మోనోశాకరైడు (సుమారు ఏడు శాతం) ఉండగా నీరు కేవలం ఒక ద్రావణి (solvent) గా కొద్ది మోతాదు (సుమారు 17 శాతం) లో ఉంటుంది. నీటి శాతం తక్కువ కావడానికి కారణం తేనెటీగలు పదే పదే తేనె తుట్టెను తమ రెక్కలతో విసనకర్రలు వీచినట్లు వీచి, నీటిని బాగా ఆవిరయ్యేలా చేయడమే! ఇలా నీరు తక్కువ ఉండడం వల్ల తేనె మీద ఇతర బాక్టీరియాలు, కీటకాలు, సూక్ష్మజీవులు (microorganisms) దాడి చేయలేవు. అందువల్లే తేనె చాలారోజుల పాటు చెడిపోకుండా నిలువ ఉండగలదు. తేనెలో ఉండే ఫ్రక్టోజ్‌కు క్షయకరణ (reducing) గుణం ఉంది. గ్లూకోజ్‌కు కూడా ఇదే లక్షణం ఉన్నా అది ఫ్రక్టోజ్‌ అంత మోతాదులో ఉండదు.
సాధారణంగా తేనెమీద గాలి సమక్షంలో నీరు తాకినట్లయితే అది నీటి అణువుల్ని హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌ (H2O2) గా మారుస్తుంది.
ఇలా 0 (సున్నా) ఆక్సీకరణ స్థితిలో ఉన్న గాలిలోని ఆక్సిజన్‌, -2 (ఆక్సైడు) ఆక్సీకరణ స్థితిలో ఉన్న నీటిలోని ఆక్సిజన్‌ కలవడం వల్ల -1 నికర ఆక్సీకరణస్థితి ఉన్న పెరాక్సైడు (Peroxide) గా మారడాన్ని విరూప నిష్పత్తి ప్రక్రియ (disproportionation reaction) అంటారు. ఇలా విడుదలయిన హైడ్రోజన్‌ పెరాక్సైడుకు విరంజన (bleaching) గుణం ఉంది. అంటే అది రంగుల్ని వివర్ణం చేసే గుణమన్న మాట.
వెంట్రుకలలో నలుపురంగు రావడానికి కారణం అందులో మెలనిన్‌ (melanin) అనే వర్ణద్రవ్యం (pigment) ఉండడమే. ఇందులో ఉన్న సేంద్రియ అణు లక్షణాలలో కర్బన పరమాణువుల మధ్య ద్విబంధం (double bond) ఉండడం వల్ల మెలనిన్‌కు బూడిదరంగు లేదా నల్లని వర్ణం వచ్చింది. హైడ్రోజన్‌ పెరాక్సైడు సమక్షంలో - C = C - అనే స్థావరం (moiety)
అనే ఎపాక్సైడు (epoxide) గా మారుతుంది. ఇది నీటితో జల విశ్లేషణ (hydrolysis) జరపడం వల్ల C(OH) - C(OH) - అనే సంతృప్త అణువుగా మారుతుంది. ఈ అణువుకు రంగు లేదు. ఇలా తేనె పూసుకున్నంత మాత్రాన అందరి నల్లజుట్టూ తెల్లగా మారుతుందన్న గ్యారంటీ లేదు. ఎందుకంటే ఈ చర్యలు చాలా నిదానంగా జరుగుతాయి. ఒకవేళ రంగు తగ్గినా కొత్తగా వచ్చే వెంట్రుకలు నల్లగానే వస్తాయి.

గమనిక:
ఈ శీర్షికకు సైన్స్‌కు సంబంధించిన ప్రశ్నలను
'ఎందుకని? ఇందుకని?'
ప్రజాశక్తి దినపత్రిక, ఎం.హెచ్‌.భవన్‌,
ఫ్లాట్‌ నెం. 21/1,
అజామాబాద్‌ ఇండిస్టియల్‌ ఎస్టేట్‌,
ఆర్టీసీ కల్యాణమండపం దగ్గర,
హైదరాబాద్‌-20.
అన్న చిరునామాకు పంపవచ్చు.
ప్రొ|| ఎ. రామచంద్రయ్య
సంపాదకులు, చెకుముకి,
జన విజ్ఞాన వేదిక

No comments:

Post a Comment